1, సెప్టెంబర్ 2021, బుధవారం
జీవన మంజూష.. సెప్టెంబర్
నేస్తం,
బంధాలు పలుచన అవడానికి కారణాలు వెదకడంలోనే మన సమయమంతా సరిపోతోంది. ఈ కాలంలో రాహిత్యం కాగితానికి చేరువ కావడంలో వింతేమీ కనబడటం లేదు.మూడుముళ్ళ అనుబంధం అభాసుపాలు కావడంలో లోపాలు వెదుకుతూనే ఉంటున్నాం, కాని సరైన కారణాలు కనిపెట్టలేక పోతున్నాం. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా దగ్గర అనుబంధాలు కూడా దూరదూరంగానే ఉంటున్నాయి నేటి పరిస్థితుల్లో.
ముఖ్యంగా జంట మధ్య అవగాహనా రాహిత్యమెా, లేక అహం అడ్డుగోడగా నిలవడమెా, అదీ కాదంటే సంపాదన వలన కలిగే గర్వమెా కాని యాంత్రికంగా మారిపోతున్న అనుబంధాల్లో ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి ఇంటికో సమస్య తప్పడం లేదు. అది సంపాదన, లేదా అక్రమ సంబంధం లేదా మరేదైనా ఇతర కారణం కావచ్చు. కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఇవి ప్రధాన కారణాలు ఇప్పుడు.
ఒక బంధమంటూ ఏర్పడ్డాక, బాధ్యతను మరిచిపోవడం, అబద్ధపు బతుకు బతకడం చావుతో సమానం. ఈ సాంకేతిక మాధ్యమాలు, అంతర్జాలం వగైరా, వగైరా అందరికి అందుబాటులోనికి వచ్చాక క్రమానుబంధాలు బలహీన పడి, వయసుతో నిమిత్తం లేకుండా అక్రమానుబంధాలు బలపడ్డాయనడంలో సందేహమేమీ లేదు. చదువుకున్న సంస్కారహీనులు ఎందరో ఈ కోవలో నేడు జీవితాలు వెళ్ళదీస్తున్నారు. ఇంట్లోని వారిని మెాసం చేస్తున్నామన్న భ్రమలో తమని తామే మెాసం చేసుకుంటూ, అదే జీవిత పరమార్థమనుకుంటున్నారు.
ప్రేమ రాహిత్యం, బాధ్యతా రాహిత్యం వలన బాధపడే ఎందరో మానసికంగా, శారీరకంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ అనుకున్న వారి నిర్లక్ష్య వైఖరిని భరించలేకపోవడమే ఇందుకు కారణం. దీనికి సరైన మందు మళ్ళింపు(డైవర్షన్). చెప్పడం తేలికే, ఆచరణ కష్టమని మనకు అనిపిస్తుంది. కాని ప్రయత్నం మన విధి. పెద్దలు చెప్పిన మాట " సాధనమున పనులు సమకూరు ధరణిలోన. " అన్న ఆర్యోక్తిని గుర్తు చేసుకుని సమస్యలతో యుద్ధం చేయడం మన పని. అంతేకాని ఉత్తమమైన మానవ జన్మను అర్ధాంతరంగా, అదీ బలవంతంగా ముగించడం తగదు. సమస్యతో పోరాడటమే మన నైతిక విజయం.
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి