27, సెప్టెంబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం.. 73

    మెుదటి పుస్తకంలో కొన్ని కవితలు వేశాను. అప్పటి ముఖపుస్తక పరిచయస్తులు రామకృష్ణ వజ్జా గారు, మరి కొంతమంది పుస్తకం పంపమంటే పంపాను. తర్వాత రామకృష్ణ గారు ఇంటికి వస్తుండేవారు. నన్ను వారింటి ఆడపిల్లగానే చూసేవారు. అప్పటికే హెల్త్ ప్రోబ్లం బాగా ఎక్కువై జాబ్ నుండి ఓ నెల రెస్ట్ తీసుకుంటానని చెప్పి, మెుత్తంగానే మానేసాను. రామకృష్ణ గారు పుస్తకం వేయిస్తానని ముందుకి వచ్చారు. ఈసారి కవితలు కాకుండా వ్యాసాలు వేద్దామని చెప్పి, కొన్ని పుస్తకం కోసమని సెలక్ట్ చేసాను. అవన్నీ కలిమిశ్రీ గారికి పంపేసాను. నా హెల్త్ కూడా రానురానూ బాగా పాడయ్యింది. మా గోపాలరావు అన్నయ్య అమెరికా నుండి వచ్చి, నన్ను చూసి, తనే తన ఫ్రెండ్ కి చెప్పి రుమటాలజి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు. నా హెల్త్ హిస్టరీ మెుత్తం ఆవిడకి చెప్తే, మరికొన్ని టెస్ట్లు రాశారు. చివరికి SLE అని తేలింది. మెడిసిన్స్ వాడుతూనే ఉన్నా బాగా సివియర్ అయ్యి, ప్లేట్ లెట్స్ బాగా తగ్గి, ఓ మూడు నెలలు మంచం దిగలేదు. విజన్ తో సహా బాగా తేడా వచ్చేసింది. ఇక చూడటానికి వచ్చేవాళ్ళతో ఇల్లు సందడిగా ఉండేది. దీని గురించిన వివరాలు నన్ను చూడటానికి వచ్చిన అందరికి చెప్పేదాన్ని ఓపిక లేకున్నా, మనుష్యులు సరిగా కనబడకున్నా. దానికీ కొందరన్నారు.. బానే మాట్లాడుతోందిగా అని. నవ్వుకున్నా ఆ మాటలకు. మా ఊరి జనాల కొందరి మనస్తత్వమది.
          నా పుస్తకం అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు చదివిన సాగర్ శ్రీరామ కవచం గారు టెక్ట్స్ మెసేజ్ తెల్లవారుఝామున 2.45 కి Your poetry is promising అని పెట్టారు. మరుసటి రోజు కాల్ చేసి మాట్లాడాను. రాయడం మానకమ్మా అని చెప్పారు.  ఇంతలో కొందరి ఏక్ తారలతో ఏక్ తారల పుస్తకం వేసి, ఆవిష్కరణ దిగ్విజయంగా హైదరాబాదులో పద్మాశ్రీరాం గారు, వంకాయలపాటి చంద్రశేఖర్ గారు చేసారు. నాకు ఆ పుస్తకం ఇవ్వడానికి ఇంటికి వచ్చారు చంద్రశేఖర్ గారు, మరి కొందరు. తర్వాత నా రెండో పుస్తకం " సడి చేయని (అ)ముద్రితాక్షరాలు "ఆవిష్కరణ జరిగింది. మా విజయనగరం నేస్తాలు మా సీనియర్ ఎర్రయమ్మ, నా ప్రియ నేస్తం రమణి, సాధూరావు, తన ఫ్రెండ్స్, ప్రదీప్ వచ్చారు. ఆ సమయానికి మా గోపాలరావు అన్నయ్య, శిరీష వదిన కూడా అమెరికా నుండి వస్తే, వారిని రమ్మని పిలిస్తే ఏ భేషజాలు లేకుండా వచ్చారు. ప్రెస్ క్లబ్ లో ఫంక్షన్ జరిగింది. నా ఆత్మీయులు బోలెడుమంది, నా అనుంగు బిడ్డలు, బంధువులు అందరు వచ్చారు. రాజశేఖరం అన్నయ్య, రాజకుమారి అక్క వచ్చి కనబడి, ఫంక్షన్ కోసం బొకేలు ఇచ్చి వెళిపోయారు. ఈ పుస్తకం కూడా మండలి బుద్ధప్రసాద్ గారు ఆవిష్కరించారు. మెుదటి పుస్తకం కూడా వారే ఆవిష్కరించారు.    
       షరా మామూలుగానే ముందురోజు బాగా గొడవ పెట్టుకున్నారు మా ఆయన. కనీసం డ్రైవర్ కి డబ్బులు కూడా ఇవ్వలేదు ఫంక్షన్ రోజు. ఓ అజ్ఞాత బంధువు పదివేలు ఫంక్షన్ కోసం ఇచ్చారు. చంద్రశేఖర్ గారు అడిగారు సాయం ఏమైనా కావాలమ్మా అని. అవసరం లేదని చెప్పాను. రాజశేఖరం అన్నయ్య వాళ్ళు డబ్బులు తీసుకోలేదు. క్రాంతి శ్రీనివాసరావు గారు, కొంపెల్ల శర్మ గారు, సాగర్ అంకుల్, కొండ్రెడ్డి అంకుల్, కోసూరి రవి గారి సమీక్ష, హరిశ్చంద్ర పద్యాలు, నఖచిత్రకారులు రామారావు గారు మెుదలైన పెద్దల సమక్షంలో  మెుత్తానికి అలా రెండో పుస్తకం బయటికి వచ్చిందన్న మాట. కొన్ని ముఖపుస్తకపు మెాసపు పరిచయాలను తల్చుకోవడం ఇష్టంలేదు. 
       మూడవ పుస్తకం చెదరని శి(థి)లాక్షరాలు నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ నీరజ, శోభ, అనిత స్పాన్సర్ చేసారు. నాలుగవ పుస్తకం గుప్పెడు గుండె సవ్వడులు నేను, వాణి గారు కలిపి వేసిన కవితా సంకలనం. దీనికి రామకృష్ణ వజ్జా గారు ఆర్థిక సహకారమందించారు. చంద్రశేఖర్ వంకాయలపాటి గారు మరో పుస్తకం వేయిస్తానమ్మా అంటే మరి కొన్ని వ్యాసాలు తీసాను. అనుకోకుండా ప్రసాద్ అన్నయ్య, మెహది ఆలీ గారివి, మరి కొందరివి పుస్తకాలు వేయడంతో నా అంతర్లోచనాలు పుస్తకం ముద్రణ ఆగిపోయింది. తర్వాత నా ఇంజనీరింగ్ క్లాస్మేట్, తమ్ముడు రఘు ఆ పుస్తకం వేయించాడు. మరో పుస్తకం ఏ'కాంతా'క్షరాలు ఏక్ తారలతో ఇంజనీరింగ్ ఫ్రెండ్ అను కోనేరు వేయించింది. మరో కవితా సంపుటి అక్షర స(వి)న్యాసం ఇంజనీరింగ్ నేస్తాలు నీరజ, శోభ, అనిత, మమత, నీలిమ వేయించారు. ఇవి నా పుస్తకాల ముద్రణల కబుర్లు క్లుప్తంగా. ఇవన్నీ మల్లెతీగ పబ్లికేషన్స్ నుండి కలిమిశ్రీ గారు, రాజేశ్వరి గారి చేతుల మీదుగా వచ్చినవే. 

" నటించే నైజం మనదైనప్పుడు ఆ నటన నేర్పిన దేవుని ముందు మన నటన కుప్పిగంతులే అని మరిచిపోవడం హాస్యాస్పదం. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
             
             


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner