5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సత్యారాధేయం..!!

" నేనిప్పుడు మందహాసాల్ని
జారవిడుచుకుని
నిత్యం ప్రశార్థకాల్ని మెాసుకుంటూ
తిరుగుతున్నాను "

       ఇవి డాక్టర్ రాధేయ గారి మనసు మాటలు. సత్యారాధేయం నా చేతికి వచ్చి రెండు రోజులయ్యింది. చదవాలంటే ఒకింత బాధగా అనిపించింది. కనీసం పుస్తకం చేరిందని కూడా రాధేయ గారికి చెప్పలేదు. చదవడం మెుదలు పెట్టిన తర్వాత ఆపకుండా ఈమధ్యన చదివిన రెండో పుస్తకం ఇది. రాధేయ గారికి కవిత్వమంటే ఎంత ఆరాధన ఉందో ఆ ప్రేమంతా సత్యమ్మ గారికి పంచేసారు తన సత్యారాధేయంలో. కవిత్వాన్ని కథలా చెప్పిన రాధేయ గారి మనసుకత ఇది. 
   దగ్గర దగ్గర నాలుగు దశాబ్దాల సహజీవనాన్ని, జీవితపు అనుభవాలను పంచుకోవడంలోని దగ్గరతనాన్ని, బంధం బాధ్యతను, అనుబంధం ఆసరాని, ఇద్దరు కలిసి కడగండ్లు నింపిన కల్లోలాలను దాటిన వైనాలను, సాహిత్య అభిమానాన్ని, కుటుంబం కన్నా మిన్నగా ప్రేమించిన ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం వెనుక, ముందు కారణాలను, బతుకుబాటలో సత్యమ్మ ఇచ్చిన ధైర్యాన్ని...ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవేమెా. 
        సత్యారాధేయం చదువుతుంటే ఏం చెప్పాలనిపించడం లేదు. మీరూ చదవండని చెప్పడం తప్ప. ముడిబడిన బంధం విలువ తెలిసిన అతి కొద్దిమంది జంటలలో సత్యారాధేయం గారు ఒకరు అంతే. వీరు ఇద్దరు కాదు ఒకరే. అర్ధనారీశ్వర తత్వానికి అసలైన ఉదాహరణ. రాధేయ గారి మనసంతా సత్యమ్మే ఉండగా ఇక అక్షరాల్లో ఉండటం వింతేమీ కాదు. చేరలేని దూరాన్ని కూడా సునాయాసంగా చేరగలనన్న ధీమా ఇచ్చిన సత్యమ్మ చేయూతే రాధేయ గారికి కొండంత బలం. శోకం శ్లోకమౌతుందని మరోమారు బుుజువైంది. 

అభిమానంగా " సత్యారాధేయం " ని నాకందించినందుకు రాధేయ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner