25, మే 2023, గురువారం

అవ్యక్తం..!!

అవ్యక్తం:

ఆమె ఒక విలక్షణ రచయిత. సాహితీ ప్రపంచంలో సవ్యసాచి. ఎన్నో సాహితీ ప్రక్రియలను అలవోకగా స్పృశించిన  ప్రజ్ఞాశాలి. అమ్మలాంటి అక్షరమ్మ అండతో తనది కాని రంగంలో అనతికాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన తెలుగింటి ఆడపడుచు...."మంజు యనమదల". 

ఆమె ఏదైనా అనుకుంటే వెంటనే చేయాల్సిందే. అది రచన అయినా మరేదైనా.. ఏదో సినిమాలో ఒక హీరోయిన్ అన్నట్లు "లేకపోతే బరువెక్కుతాన"నే భయం. కష్టపడి నరసింహాపురం నుండి తెచ్చిన మినుములు ఇవ్వడానికి అర్జంటుగా వచ్చేసింది. వాటితో పాటు నేనింకా చదవని ఆమె పుస్తకాలు రెండు..." అవ్యక్తం" "రాతిరి చుక్కలు" లను కూడా ప్రేమతో ఇచ్చింది.   మా అమ్మాయికంటే చిన్నది... మా అబ్బాయి వయసున్న మంజు నన్ను బాబాయ్ అని నోరారా పిలుస్తుంది. 

"నా రాతలు నా కోసమే. నా మనసు తృప్తి కోసం. వాటిని ఎవరెలా తీసుకుంటారన్నది వారిష్టం. దానితో నాకు సంబందం లేదు" అని తెగేసి వ్యక్తం చేసింది" అవ్యక్తం " పుస్తకంలో. 

 మనసులోకి వచ్చిన భావాలను అక్షరీకరణ చేస్తే గాని ఆమెకు నిదుర పట్టదు. అయితే కుండబద్ధలు కొట్టినట్లు నేరుగా సూటిగా నిర్మొహమాటంగా చెప్పే ఆమె మాటలు సానుకూల దృక్పథంతో ఆలోచించే వారికి కరదీపికలు గా దారి చూపిస్తాయి. తప్పుడు ఆలోచనలు ఉన్నవారికి కొరడా దెబ్బలే.

అవ్యక్తం లోని వ్యక్తాక్షరాలలో మెరిసిన కొన్ని మంజు మార్క్ మెరుపుల మరకలు...చురకలు....

"వ్యక్తిగా గుర్తింపు అర్హత తోనే వస్తుంది. ఆ అర్హత ఇప్పుడు ధనం అధికారం అనే వాటితో బలంగా ముడిపడి పోయింది".

"ఎంత చదువుకున్నా, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా మహిళలకు ఇంటా బయటా సమస్యలు తప్పడం లేదు... కొందరికి. ప్రకృతి పరంగా, వ్యక్తుల పరంగా, సమాజ పరంగా వచ్చే సమస్యలు కో కొల్లలు" 

"విమర్శకులు వాక్యానికి  వ్యాఖ్యానానికి తేడా తెలుసుకుంటూ... విమర్శకు అభిప్రాయానికి కూడా తేడా తెలుసుకోండి..."

"పెళ్ళాం బిడ్డల ఉసురు పోసుకున్న ఎవడూ బాగు పడిన దాఖలాలు చరిత్రలో లేవు."

"ఏ అనుబంధమైనా పది కాలాలు నిలబడాలంటే మన ప్రవర్తన ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి."

"మానవత్వం లేకున్నా ఫరవాలేదు, కనీసం  మనిషి గా నైనా బతకండి."

"ఏ అనుబంధం అయినా కలకాలం నిలవాలంటే నమ్మకమనే పునాది గట్టిగా ఉండాలి."

"రాసే అలవాటున్న వారికి కొన్ని పదాలో కొన్ని భావాలో రాసేవరకు వదలవన్నది సత్యం."

"శిక్ష లేదని మానసిక హత్యలకు పాల్పడకండి."

 "రక్త సంబంధాలే అంటరాని బంధాలు గా మారుతున్న ఈ రోజుల్లో మనిషితనం కొరవడటం లో ఆశ్చర్యం లేదు లెండి "

"అధికారానికి డబ్బుకు చట్టం సలాం చేసినంత కాలం సామాన్యులకు న్యాయం అందని ఆకాశమే"

"జీవితములో ప్రతి పరిచయం మనకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది."

"మన ఒంటరి తనం మరొకరికి శాపం కాకూడదు."

ముఖ పుస్తక పరిచయం పేరుతో హద్దులు దాటే వారికి "ఇది రిక్వెస్ట్ అనుకోండి హెచ్చరిక అనుకోండి . ఏదనుకున్నా కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించండి."

"తప్పు చేసిన ఏ ఒక్కరినైనా వెంటనే శిక్షిస్తే , ఆ శిక్ష కూడా మరొకరు తప్పు చేయాలంటే భయపడేలా ఉంటే ఈ ఘోరాలు తగ్గుతాయి."

"ప్రతి కవి, రచయిత తమ రాతలు ఎవరినీ కించ పరచకుండా నిజాయితీగా రాయగలిగినప్పుడే ఆ అక్షరాలకు సార్థకత."

"మానసిక సంతోషానికి మించిన ఆనందం ఈ సృష్టిలో మరేదీ లేదని అనిపించింది."

"అనుక్షణం కావలి కాస్తూ తానే ఓ నిచ్చెన గా మారి నా గెలుపుకు కారణమైన అమ్మకు నేనేమిచ్చినా ఋణం తీరదు."

      ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. వాస్తవానికి ఈ లేఖా వ్యాసాలలో వర్తమాన కాలంలోని అన్ని విషయాలను కుల మత రాజకీయాలతో సహా...

తనదైన మంజు మార్క్ శైలి లో అవ్యక్తం ద్వారా అక్షరీకరించి నిజాయితీగా నిర్మొహమాటంగా వ్యక్తీకరించారు.... వృత్తిరీత్యా ఇంజనీర్ ప్రవృత్తి రీత్యా కవి రచయిత అయిన మంజు యనమదల. ఒక జీవితంలోనే ఎన్నో కష్ట నష్టాల  నెదుర్కొని పది జన్మల అనుభవం పొందిన ఆమె మహిళా సాధికారతకు ప్రతిరూపం. ఎందరికో స్ఫూర్తిప్రదాయిని.

,,,.... డా. డి. ప్రసాద్.


థాంక్యూ సోమచ్ బాబాయ్


12, మే 2023, శుక్రవారం

శతకోటి వందనాలు..!!

నేస్తం,

         మన భారతీయులలో ముఖ్యంగా మన తెలుగువారికి ఉన్నంత విదేశీ మమకారం( వ్యామోహం సరైన పదం కాని మన మనోభావాలు దెబ్బ తింటాయి కదా) మరెవరికి ఉండదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థికంగా ఎంతగా వెనుకబడి ఉన్నా, మన రూపాయితో మారకం వేస్తే అమెరికా డాలర్ రోజు రోజూ పైపైకే పోతోంది తప్ప క్రిందికి దిగడమన్న మాటే కనుచూపు మేరలో లేదు. ఉండదు కూడా.

         పై చదువుల కోసం నలుగురూ పంపుతుంటే మనకూ పంపక తప్పడం లేదు. ఒకప్పుడు అమెరికా చదువుల కోసం వెళ్ళాలంటే సరైన గైడెన్స్ దొరికేది కాదు. ఇప్పుడు పుట్టలు పుట్టలుగా కన్సల్టెన్సీలు పుట్టుకొస్తున్నాయి ప్రతిరోజూ. ఇంకేముంది నాలుగు రోజులలో I 20 తెప్పించేస్తాము అంటే నమ్మేస్తాం. కొందరు మనకు తెలిసిన వాళ్ళని వెళితే కనీసం కాలేజ్ లకు అప్లికేషన్ పెట్టడం కాదు కదా, కట్టిన ఫీజ్ కూడా కాలేజ్ కి సబ్మిట్ చేయడం రాని మహా మహా కన్సల్టెన్సీలు బోలెడు. ఇలా వేలకు వేలు నష్టపోయినవారు బోలెడుమంది.

        సరే I 20 ఎట్టకేలకు వచ్చినా, వీసా స్లాట్ కోసం, వీసాల కోసం, బ్యాంక్ లోన్ల కోసం ఇలా రకరకాల తిప్పలు. బాలారిష్టాలన్నీ దాటుకుని, టికెట్ కొనుక్కుని అమెరికా వెళితే..!

ఇక్కడేమో వీసా ఇచ్చినట్టు ఇచ్చి, అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ పెద్ద ప్రహసనం. ఇక్కడ వీసా ఇచ్చి మన డబ్బులు ఖర్చు పెట్టించి, అక్కడ I 94 ఇవ్వడానికి.నాటకాలు వేస్తారు. రాత్రిపూట ఎక్కడైనా కాలేజ్ లు కాని, కంపెనీలు కాని ఫోన్లకి, మెయిల్స్ కి రెస్పాండ్ అవుతాయా లేదా అన్న కనీస కామన్సెన్స్ లేకుండా(మెదడు ఉండేది అరికాలులో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు), ఇండియాలో అమెరికా వీసా వచ్చిందన్న ఆనందంతో, కొత్తగా కోటి ఆశలతో అమెరికా ఎయిర్పోర్ట్ లలో దిగే చాలామందికి జరిగే చేదు అనుభవాలు వీసా కాన్సిల్ చేసి, డిపోర్టేషన్ చేసి తిరిగి ఇండియా పంపేయడం అన్నది అతి పైశాచికత్వం. ఇదో పెద్ద స్కామ్ కూడా.

           అమెరికాలో మన తెలుగు సంస్థలు, సంస్థానాలు చాలా ఉన్నాయి కాని ఎవరికి వారు, వారి వ్యక్తిగత పేరు ప్రతిష్టల కోసం చూసుకోవడం తప్పించి, ఇలా కొత్తగా వచ్చి, ఇమ్మిగ్రేషన్ లో పలు ఇబ్బందులు పడేవారికి లాయరు కాని, సంస్థలు కాని మాట సాయం కూడా చేయరు. మీ మీ ఓట్ల కోసం, మీ గెలుపు కోసం పరితపిస్తారు కాని నిజమైన సాయం చేయడానికి ముందుకు రారు. దయచేసి మీరు చేసే సాయాల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకండి. యుట్యూబులు ఉన్నాయని మీ మీ తేనేపూతల మాటలు పెట్టకండి. అమెరికా నీ సంస్కారానికి శతకోటి వందనాలు..!!


10, మే 2023, బుధవారం

మే పది (10/05) ప్రపంచ లూపస్ డే

“  “


     లూపస్ గురించి తెలుసుకుంటే వైద్య శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నట్లే అన్న మాట ఇప్పటి వైద్య విద్యార్థులకు చెప్పే మాట. తోడేలు ఎలా మాటు వేసి తన పని తాను చేసుకుపోతుందో అలాగే ఈ లూపస్ కూడా మానవ శరీరానికి తల వెంట్రుక నుండి కాలి గోరు వరకు శరీరంలో ఏ భాగానికైనా హాని చేస్తుంది. మన శరీరాన్ని కాపాడాల్సిన రక్షణ వ్యవస్థే భక్షక వ్యవస్థగా మారడమే SLE ( సిస్టమిక్ లూపస్ ఎరిధమాటోసిస్) లక్షణం. లూపస్ వైద్య పరిభాషలో ఓ రకమైన ఆటో ఇమ్యూనిటి డిసీజ్.

      ఒకప్పుడు ఈ లూపస్ ముఖాన ముక్కుకు ఇరువైపులా సీతాకోకచిలుక ఆకారంలో ఎర్రని, నల్లని మచ్చలుగా ఏర్పడితేనే అది లూపస్ గా నిర్థారణ చేసేవారట. ఇప్పటికీ చాలా మంది తమకు వచ్చింది లూపస్ అని తెలియకుండానే మరణిస్తున్నారు. ఈ మధ్యకాలం వరకు ఈ లూపస్ వ్యాధిపై సరైన అవగాహన ఎవరికి లేదు. అందుకనే అందరికి తెలియాలని “మే పది” ని “ ప్రపంచ లూపస్ డే “ గా ప్రకటించారు. 

       ఇప్పుడు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోనికి వచ్చినా లూపస్ వ్యాధికి సరైన కారణాలు తెలియడం లేదు. పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జన్యు పరంగా, మానసిక అలసట, కొన్ని మందుల వలన ఇలా రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. లూపస్ లక్షణాలు ఇతర కీళ్ళు, కండరాల వ్యాధుల లక్షణాలను పోలి ఉండటంతో వ్యాధి నిర్థారణ ఆలస్యమై ప్రాణాంతకం అవుతోంది. సరైన సమయంలో సరైన వైద్య సహాయం అందితే లూపస్ ప్రాణాంతకం కాదు. కాకపోతే ఈ వ్యాధి ఆడవారిలో ఎక్కువ. ఏ వయసు వారికైనా రావచ్చు. సాధారణంగా 15 - 45 మధ్య వయసు వారిలో కనబడుతుంది. ఏవో మామూలు లక్షణాలని నిర్లక్ష్యం చేయకుండా సరైన వైద్యుని సలహాలు పాటిస్తే సాధారణ జీవితం గడపవచ్చు.

  శాశ్వత పరిష్కారం లేని లూపస్ గురించి ఇలా చెప్పకుంటూ పోతే ఓ మహా సముద్రమే అవుతుంది. 

     ఈ లూపస్ గురించి మరింత వివరణ కొరకు డాక్టర్ పి వి ప్రసన్న గారి వ్యాసం ఈ నెల నవమల్లెతీగలోచదవండి.

8, మే 2023, సోమవారం

జీవన మంజూష మే23

నేస్తం,

       “ తప్పులెన్నువారు తమ తప్పులెరుగరుఅని వేమన చెప్పిన మాట నిజమని మనకు తెలుసు. అయినా మన లోపాలు మనకి తెలిసినా వాటిని దాయాలని యత్నిస్తూ, ఎదుటివారి తప్పులను ఎంచడానికి భలే సరదా పడతాం. మనిషి నైజం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణాలు సవాలక్ష. “ మనంఅన్న పదం మనం మర్చిపోయి రెండు తరాలు కావచ్చిందనుకుంటా. గూడు ఒకటే అయినా గూటిలో గువ్వలు బోలెడు రకాలు. కష్టం నాది కానప్పుడు ఎవరెలా పోతే నాకేంటి? అన్న మనస్తత్వాలు మన చుట్టూనే ఎన్నో తిరుగాడుతున్నాయి. కలికాలం ఇంతేననుకుంటూ సరిపెట్టేసుకు బతికేస్తున్నామిప్పుడు.

          ఎదుటివారిలో లోపాలు ఎత్తి చూపినంత త్వరగా మన తప్పును మాత్రం ఒప్పుకోలేం. మన చూపు ఎంత తీక్షణమంటే తెల్ల కాగితంలో చిన్న నల్ల చుక్కను చూసినంత బాగా కాగితంలో తెలుపు కనబడదు మరి. మనిషన్నాక లోపాలు సహజమే. అసలు లోపం లేకపోతే మనిషే కాడు. మనం చేస్తే ఒప్పు, ఎదుటివాడు అదే పని చేస్తే తప్పు కాదు కాదు భరించరాని నేరమని మనం భావించడంలో అస్సలు మన తప్పే లేదు గాక లేదు. సమస్య తలుపు తట్టని గుమ్మం భూప్రపంచంలోనే ఉండదు. కాకపోతే కాస్త సమయమటూ ఇటూ అవుతుందంతే. కాస్త సమయానికే మన మిడిసిపాటును మనం బయటేసేసుకుంటాం.

            ధనమయినా, పేరయినా మనకు చెప్పి రాదు. చెప్పి పోదు. కర్మానుసారం జరిగే మంచి చెడులకు మనం గొప్పలు చెప్పుకోవడం ఎందుకో! మూలాలను మరిచిపోతున్న మనకు, మన పేక మేడలు కూలిపోవడానికెంత సమయం కావాలో తెలుకోలేక పోవడం విచారకరం. వస్తూ ఏమి తీసుకురాని మనకు పోతూ కూడా ఏమి తీసుకుపోలేమనీ తెలుసు. అయినా మన నైజాలను కాస్తయినా మార్చుకోలేం. ఇది మన బలహీనత కావచ్చు. బంధాలు బలహీనమవడానికి మన ప్రవర్తనే ముఖ్య కారణం. మనం సరిగా ఉంటేనే కదా మన తరువాత తరాలకు మంచేదో, చెడేదో చెప్పగలం. అలా చెప్ప గలిగిన అర్హత మనకు ఉందా! చెప్పాల్సిన అవసరం లేదని మనం వదిలేసినప్పుడు మనమెలా వున్నా తప్పు లేదు. ఎవరెలా పోయినా మనకు సంబంధ బాంధవ్యాలు కూడా ఉండవు

               బంధాన్ని నిలుపుకోవడం చాలా కష్టమైన పని. అదే బంధాన్ని దూరం చేసుకోవడం చిటికెలో అయిపోతుంది. మన అవసరాలకు అనుబంధాలను కలుపుకుంటూ, అవసరం తీరాక అనుబంధమంటే ఏమిటో ఎరగని జీవాలు కోకొల్లలు ఇప్పుడు. వారికి గురుతులంటూ ఏమి ఉండవు, జ్ఞాపకాలసలే ఉండవు. దీనిలో వారిని తప్పు పట్టడానికి కూడా ఏమి లేదు. పాపం వారి సహజ లక్షణమది అని సరిపెట్టేసుకుని మన దారిలో మన ప్రయాణం సాగించడమే నేటి రోజుల్లో మంచి పని





           

7, మే 2023, ఆదివారం

మనమెక్కడ..!!

నేస్తం,

          మనకేమో కులం కార్డు, దానితో వచ్చే పథకాలు, ఉపయోగాలు అన్నీ కావాలి. మన కులం ఇదని ఎలుగెత్తి ఆవేశంగా అరిస్తే, మన చుట్టూ వున్న నలుగురు మేతావులు అబ్బో! చేతులు ఎర్రబడిపోయేంతగా చప్పట్లు కొట్టేస్తారు. అది చూసి మనం ఉప్పొంగిపోతాం. నాకు తెలియకడుగుతున్నా.. మనం చంకలు గుద్దుకుంటూ చెప్పుకునే కులం మన పక్కనోడు చెప్పుకుంటే తప్పేంటి? రిజర్వేషన్లకు పనికొచ్చిన ట్రంప్ కార్డ్ గొప్పదనం మనది కాదా! దాని ఉపయోగాలు మనం అనుభవించడంలేదా!

          సరే ఇవన్నీ పక్కనెడదాం. అక్షరాలకు కులం, మతం ఆపాదించి అవార్డులు, రివార్డులు కొట్టేస్తున్న ఘన చరిత్ర ఎవరికుందంటావ్? మనం రాత రాసే ముందు ఓఁ పాలి ఎనక్కి సూసుకుంటే చరిత్ర కాస్తయినా తెలుస్తుంది కదా! మనకి తెలియని గతమూ కాదది. అయినా మనమేదంటే అదే నిజం. మనమేది రాస్తే అదే చరిత్ర అని మనమనుకుంటే ఎలా! ఎవరికెవరి రాతలు నచ్చుతాయో ఎవరికెరుక. ఒకరి రాతను విమర్శించే సంస్కారం మనదైనప్పుడు అదే సంస్కారం ఎదుటివాడికి ఉంటుందని మరిస్తే ఎలా!

           మనకు తెలిసిన అతి సాధారణ విషయమే అయినా మనం ఒప్పుకోలేని నిజాలను దాచేయాలని చూడటం సబబు కాదు. మన పుట్టుక మన చేతిలో ఉండదన్నది జగమెరిగిన సత్యం. అందాలకు, ఒయ్యారాలకు, వగలుకు పట్టం కడుతున్నారని అనుకోవడం కంటే వారి అవసరాలకు పనికివచ్చే వారిని అందలాలు ఎక్కిస్తున్నారనడం కరక్ట్మీ కులపు పురస్కారాలు మీకే ఇవ్వాలి. అన్య కుల పురస్కారాలు మీకే రావాలి అని అనుకుంటే సరిపోతుందా! మన కులపోడి పేరు మీద అవార్డ్ వేరే కులపోడికి ఇవ్వడమేంటని ప్రశ్నించే మీరు వేరే కులపోడు ఇచ్చే అవార్డులకు అర్హులెలా అవుతారు? ప్రతిభకు సరైన గుర్తింపు లభించడం లేదని గగ్గోలు పెట్టే మీరే మీ అసలు రూపాలను బయటేసుకుంటే ఎవరైనా ఏం చేయగలరు

          ప్రపంచ చరిత్రలోనే నాయకుడు ప్రజా వేదికల మీద ప్రస్తావించని కులాన్ని ప్రస్తావించిన ఘనత మన నాయకులదైనప్పుడు సామాన్యులం మనమెంత? “ యథా రాజా తథా ప్రజాఅన్న పాత సామెతను గుర్తు చేసుకుంటూ, వీలైతే మనమూ కులమత రాతలు రాసేసుకుంటూ, కుల సాహిత్యాలకు, కుల పురస్కారాలకు జై కొడుతూ, జేజేలు పలికేద్దాం..ఏమంటారూ..!!


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner