6, జూన్ 2024, గురువారం

అమరావతి విజయం..!!

    ఆంధ్రప్రదేశ్ కు నిన్ననే స్వతంత్రం వచ్చినట్టుంది. జగన్ గారు అన్నట్టు దేవుడికి అన్నీ తెలిసే కదా స్క్రిప్ట్ రాసింది. పధకాలు, అభివృద్ధితో పాటు మీరు మీ అహంకారం వదిలి, పేటీయం బాచ్ ని కంట్రోల్ లో పెడితే కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కేది. ఆత్మలతో మాట్లాడటం కాదు మీరు చేయాల్సింది. మీకు మీరుగా ఆత్మ విమర్శ చేసుకోండి నిజాయితీగా. తత్వం మీకు బోధపడుతుంది. మేము సామాన్యులం. ఇది సామాన్యుడి విజయం. ఇది ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక్క రాజధాని “అమరావతి” విజయం. 

      పధకాల మత్తులో ప్రజలను ముంచాలనుకున్న నాయకులకు ఆ ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు. ఇది ప్రతి రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది. వ్యక్తిగత కక్ష సాధింపులను మనిషన్నవాడు ఎవడూ హర్షించడు. వంకర నవ్వులు, సంకర బుద్ధులకు ప్రజలిచ్చిన ఈ ప్రజాతీర్పు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్న మాకే, 

గత ఐదేళ్ళ నుండి ఆంధ్రులమని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడే పరిస్థితి మాలాంటి సామాన్యులది. 

       సమర్థతకు, అసమర్థతకు గల తేడాని ప్రజలు ఈ ఐదేళ్ళలో బాగా గుర్తించారు అనడానికి తిరుగులేని సాక్ష్యమే ఈ ప్రజాతీర్పు. మీ వంటి అసామాన్యలకు ఈ తీర్పు ఇలా ఎందుకు వచ్చిందో అర్థం కాకపోవడమేంటండి. ఈ విజయం పూర్తిగా మీకు మీరుగా ఒప్పజెప్పినదే. ఒకందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మనిషన్న వాడు ఎలా ఉండకూడదో మాకు సవివరంగా చూపించారు. థాంక్యూ సో మచ్ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.

వినతి..!!

బాబుగారు ఇకనైనా మారండి. ఎవరి పద్ధతికి తగ్గట్టుగా వారికి సమాధానం చెప్పే అవకాశాన్ని ఉపయోగించండి. ఏ చిన్న విషయాన్ని ఉపేక్షించవద్దు. గత ఐదేళ్ళుగా ఏ సంబంధం లేకుండా పలుమార్లు మానసిక క్షోభలకు గురైన వారికి ఊరట కావాలి. మీ పరిపాలన భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలి. ఏ పని చేసినా మరెవరు దానిని వినాశనం చేయడానికి ఆస్కారమివకుండా చేయండి. పునాదులను నిర్మూలించే అవకాశాన్ని సైకోలకు ఇవ్వద్దు. మీ నలభై పైచిలుకు అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ మాదని సగర్వంగా చెప్పుకునే అవకాశాన్ని మాకివ్వండి. వంకర నవ్వులతో, సంకర బుద్ధులతో హేళన చేసిన వెధవలకు సమాధానంగా, చరిత్రలో “అమరావతి” చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకునే సామాన్య ఆంధ్రులం మేము.

జై అమరావతి..జై జై అమరావతి..!!

అనుసంధానం..!!

దూరమెంతో 

తెలియకున్నా

ఎప్పుడు మెుదలుపెట్టానో

తెలియకుండా 

సాగుతున్న 

పయనమిది


నీతో 

సహవాసం 

మెుదలైనప్పుడు

అనుకోలేదు

మన అడుగులు

తడబడకుండా నడవగలవని


ఏదేమైనా

మనసులు తెలిసిన

నెయ్యమిది

అక్షరానికి 

అమ్మదనానికి 

ముడిబడిన బంధమిది


కొత్తగా నేర్చుకుంటున్నా

సరికొత్తగా

నేర్పును ప్రదర్శించే

చాకచక్యాన్ని

కలానికి కాలానికి

కుదిర్చిన అనుసంధానమిది..!!

వెదుకులాట..!!

ఆకాశం, అవని

అంతటా నీవేనని 

తెలిసినా..

మనసు మాట

వినబడక

నీకై..

వెదుకుతూనే 

ఉంటానిలా..!!

4, మే 2024, శనివారం

జీవన మంజూష మే24


 నేస్తం,

         మాయ తెరలు మనసు పొరలను కమ్మేసినప్పుడు వాస్తవం మనకు కనబడదు. సృష్టిలో ప్రతి జీవి మాయలో పడక తప్పదు. భగవంతునికే తప్పని మాయ, మనిషెంత అని అనుకొని సరిపెట్టుకోక తప్పదు. పాశాల మాయలో మనిషి బలహీనుడో లేదా బలవంతుడో అవడమూ సృష్టి ధర్మమే. కాలాలు మారుతున్నాయి. వాటితోపాటుగా మనిషి అవసరాలు మారిపోతున్నాయి. విషయంలో మనం ఎవరినీ తప్పు పట్టలేం. ఎందుకంటే ఎవరి అవసరం వారిది.

         ఒకప్పుడు చిన్న సాయమైనా మనం పొందితే సాయాన్ని మనమున్నంత వరకు జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళం. ఇప్పుడు మనకెవరైనా సాయం చేసినా అది మనకు వాళ్ళు చేయాల్సిన బాధ్యత అని మన అహం చెబుతోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు పని ఒకటే అయినా మన ఆలోచనా విధానంలోనే తేడా. దీనికి అనేక కారణాలు. ధనపాశాలు బలంగా చుట్టేసుకుంటున్న మన జీవన విధానాలు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. శాశ్వతానికి, అశాశ్వతానికి తేడా ఒక అక్షరమే అయినా అర్థము, పరమార్థము అందరికి అవగతమే. అన్నీ తెలిసినామనకేమీ తెలియదని, నిమిత్తమాత్రులమని మనమనేసుకుంటూ సరిపెట్టేసుకుంటున్నామిప్పుడు.

          వాస్తవానికి, భ్రమకి మధ్యలో బతుతున్నామని తెలిసినా అదే బావుందని, మనమనుకుంటూ మన పిల్లలకు కూడా ఇలాగే బతకాలని నేర్పేస్తున్నాం. మన ప్రవర్తనే రేపటి మన జీవితాన్ని నిర్దేశిస్తుందని తెలుకోలేక పోవడం మన దురదృష్టం. కాలానికి మనం అతీతులం కాదని తెలుసుకున్న రోజు బంధాలు, బంధుత్వాలు మనకు గుర్తుకు వచ్చినా, క్షణం వారికి గుర్తుండక పోవడం అసహజమేమీ కాదు. నటించడం మనకి నేర్పిన కాలమే ఎదుటివారికి ఆస్కార్ తరహాలో నటన నేర్పించగలదు.

         ఎవరినైనా మాట తూలడం గొప్ప కాదు. అదే మాటకి మనం బాధ పడినప్పుడు మనసు క్షోభ అర్థం అవుతుంది. స్థిరత్వం, స్థితప్రజ్ఞత మనం కొనుక్కుంటే దొరకడానికి అంగడి సరుకు కాదు. మన దగ్గర డబ్బులున్నాయని ఏదైనా మన పాదాక్రాంతమౌతుందని అనుకుంటే ప్రపంచంలో మనకన్నా మూర్ఖులు మరెవరూ ఉండరు. ఏది ఎలా ఉన్నా మనం మాత్రమే బావుండాలనుకుంటే మనమేంటో మన మనసుకి తెలుస్తుంది. మనసే లేదంటే మరో మాటే లేదు. అయినా ఈరోజుల్లో కంటికి కనబడని మనసుతో మనకేం పని ఉందంటారా..! అవును కదా ఇదీ నిజమే ఇంగ్లీషులో లేని మనసు గోల మనకెందుకులే అని మనమూ మనసు లేని మనుషుల్లానే ఆధునికంగా, ధనికంగా బతికిద్దాం


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner