31, మార్చి 2014, సోమవారం

సంతోషపు స్వాగతాలు....!!

వసంతమే తరలి వచ్చింది వాసంతాల
ఉషస్సుల ఉగాది కోసం....
ఆ వెలుగుల జిలుగుల కాంతుల కమనీయం
వెళ్లి విరియాలి ప్రతి ఇంటా...
షడ్రుచుల సమ్మేళనం ఈ జీవితం

కొత్త వత్సరాది తేవాలి అందరికి....
సంతోషపు ఆయురారోగ్య ఐశ్వర్యపు
సంపదల ఆనందాల హేలల రాగాలు....

అందరికి మన తెలుగు సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షల సంతోషపు స్వాగతాలు

29, మార్చి 2014, శనివారం

ఈ దృశ్య కావ్యం..!!


ఒడ్డున ఎగసి పడే అలల వెల్లువకు
తీరాన్ని తాకాలన్న తొందర  ఎప్పుడు
పడి లేచే కెరటాలు జీవిత గమనపు
ఆటు పొట్లకు తిరుగులేని ఆదర్శాలు
అందుకోవాలన్న విజయ పధానికి సంకేతాలు
లోపలికి వెళ్ళిన కొద్ది ప్రశాంతంగా అగుపించే
ఈ అంతు తెలియని అద్భుత మహా సాగరం
మనసు సంద్రానికి మౌనగీతం ఈ సాగరం
కల్లోల కడలి ఉప్పొంగే ఉప్పెనల లోగిలి
లోతైన మదికి లోపలి సముద్రమే సాక్ష్యం
మనిషి జీవితానికి అర్ధాన్ని చూపించే
అందమైన సజీవ రూపమే ఈ దృశ్య కావ్యం..!!

నన్ను ఉత్తమ ప్రోత్సాహక విజేతగా నిలిపిన కృష్ణా తరంగాలు సమూహపు బృందానికి నా నమస్సులు... కృతజ్ఞతలు...!!

నాకు సముద్రం అంటే ఏంటో ఎందుకో  చెప్పలేనంత ఇష్టం నిన్న కృష్ణా తరంగాలు సమూహంలో చిత్ర కవితకు పోటిగా ఈ చిత్రాన్ని పెట్టారు....పై భావాలు అప్పటికప్పుడు రాసినవి...అవే నన్ను ఉత్తమ ప్రోత్సాహక విజేతగా నిలిపాయి.... బాగా రాయలేక పోయాను అన్ని భావాలు సముద్రంలో ప్రతి ఒక్కటి  జీవితానికి చక్కని నిదర్శనం... చూడటానికి అద్భుతంగా ఉంటుంది....అలసి పోకుండా ఎప్పుడు పడి లేచే కెరటాలు మన జీవితపు ఆటు పోట్లకు తట్టుకోవాలని చెప్పే చక్కని సందేశం....ఒద్దు నుంచి కనుచూపు మేరకు కనిపించే సాగరం ఎగసి పడే కెరటాలతో ఎంత అందంగా ఉంటుందో.... లోపలి వెళ్ళిన కొద్ది ప్రశాంతంగా ఉంటుంది మన మనసు భావాలకు ప్రతి రూపం...చుట్టూ సముద్రపు నీరున్నా తాగడానికి పనికి రాక పోవడం అన్నది మన వ్యక్తిత్వానికి నిదర్శనం...( మంచి చెడు )...ఒక్కోసారి వచ్చే ఉప్పెనల హోరు సాగర మధనం తట్టుకోలేని మన ఆవేశాన్ని చూపిస్తుంది...ఆకాశం సంద్రం కలిసినట్లుండే చోటు ఎన్నో కలవని మనసుల మమతలకు సంకేతం...!! ఇలా ఎన్నిటినో తనలో ఇముడ్చుకుని కూడా ఇంత చక్కగా కనిపించే సాగరం కన్నా మన జీవితాన్ని దానికి చక్కని అర్ధాన్ని... ఆదర్శాన్ని మరో ప్రకృతి సిద్ధమైన అందమైన దృశ్యకావ్యం చూపగలదంటారా....అందుకే నాకు ఎనలేని ఇష్టం... ఆదర్శం... ఈ సముద్రమంటే...!!

28, మార్చి 2014, శుక్రవారం

ఇలానే నిలిచి పోవాలని....!!

ఈ మధ్య పాడుతా తీయగా చూస్తూ ఉంటే చాలా రోజుల క్రిందట నేను బాలు గారిని వారం వారం విజేతల ఎంపిక విషయంలో కొన్ని వారాలు ఆఖరులో చివరి పోటి నిర్ణయానికి ముందు విమర్శించాను....నాతొ పాటు నన్ను సమర్ధించిన నా సహా బ్లాగర్లను వారు చివరిలో చాలా కోపంగా మాట్లాడారు.....ఇది జరిగి చాలా రోజులు అయ్యిందిలెండి...తరువాతి నుంచి చక్కని వ్యాఖ్యానంతో పాటు పిల్లలకు....పెద్దవారికి చక్కని సలహాలను ఇస్తూ వారి వారి వయసుకు తగిన స్థాయిని గుర్తు చేస్తూ వారికి సూచనలు సలహాలను  అనేది చాలా సంతోషదాయక విషయం నాకైతే...!! ఎప్పుడైనా కాస్త పొరపాటుగా మాట్లాడినా దాన్ని ఒప్పుకుంటూ వారి గౌరవాన్ని మరింత పెంచుకుంటున్నారు...ఈ మధ్య ఒక ఇంటి పేరును పొగిడి మళ్ళి తన మాటను తిరిగి గుర్తు చేసి పొరపాటును ఒప్పుకున్న సహృదయం వారిది...నాకు వీలైనంత వరకు నేను అతి ఇష్టంగా చూసే పాడుతా తీయగాలో బాలు గారు ఇంత మంచి మనసును తీయని గాత్రాన్ని తద్వారా అందరికి మంచి విషయాలను విలువలను అందిస్తున్నందుకు మనఃపూర్వక నమస్సులు...నేను విమర్శించినప్పుడు దానిలో నిజాన్ని అప్పుడు కోపంగా మా మిద మాట్లాడినా తరువాతి నుంచి న్యాయ నిర్ణయాలు చాలా చక్కగా విమర్శలకు తావు లేకుండా ఉంటున్నాయి....అందుకు చాలా సంతోషం...నేను నాతొ పాటు తిట్లు తిన్న చాలా మందిమి ఆయన పాటలకు దాసోహులమే కాని ఆయన ముందు సంగీతంలో సాహిత్యంలో ఓనామాలు తెలియని మేము ఎంత చెప్పండి....!! ఇంట చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ టి వి వారు ఒక్క బ్లాక్ కార్యక్రమం పేరును కూడా అప్పటిలో మార్పు చేసి ఉంటె చాలా బావుండేది..!! పాటల ప్రియుల మనసులు దోచే కార్యక్రమాలు అందిస్తున్న ఈ టి వి వారికి మా ప్రత్యెక అభినందనలు..!! అందరి మనస్సులో బాలు గారు ఇలానే నిలిచి పోవాలని మా అందరి కోరిక కూడా...!!

నాయకులతో పని లేకుండా.....!!

రక్త సంభంధాలే మన అనుకోకుండా నేను నా అన్న ఆలోచనల్లో ఉంటే ఇక మన నాయకుల సంగతి వేరే చెప్పాలా చెప్పండి....వారిని తప్పు అనడానికి కూడా లేదు...ఒక కుటుంబంలోనే బోలెడు స్వార్ధం పేరుకు పోయిన ఈ రోజుల్లో ఏది తప్పుగా అనుకోవడానికి లేకుండా పోతోంది...ఇక అందరు కలసి రాజకీయాలతో పని లేకుండా మన ఊరు మనం అభివృద్ధి చేసుకుందాం అన్న మంచి ఆలోచనలు ఎలా వస్తాయి..?? ఇలా ఒకరిద్దరికి అనిపించినా మరి కొంత మందిలో ఈ మంచి ఆలోచనలు వచ్చి రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని తద్వారా మండలాలను ఇలా అన్నిటిని అభివృద్ధి పధంలో నాయకులతో పని లేకుండా చేసుకోవడం మొదలు పెడితే....!!
మనం ఓటు వేయడానికి డబ్బుకో లేక మరోదానికి అమ్ముడు పోతున్నాము... అదే నేను చూసిన అమెరికాలో ఓటు వేయడానికి డబ్బు కట్టి ఓటు హక్కును వినియోగించుకుంటారు...మన హక్కులతో పాటు మన  కూడా మనం బాధ్యతలను సక్రమంగా పాటించ గలిగితే అన్యాయం అనిపించినప్పుడు వెంటనే స్పందించ గలిగితే నేటి మన రాజకీయాలు కనీసం రాజ్యాంగాన్ని గౌరవించ లేని స్థితిలో ఉండేవా...!! సీట్ల కోసం ఓట్ల కోసం ఈ కుమ్ములాటలకు కుతంత్రాలకు చరమ గీతం ఎప్పుడో మరి...!! మాటల్లో ఆవేశం ఉంటే సరి పోదు.. చేతల్లో ఉండాలి...మన తప్పుని మనం ధైర్యంగా ఒప్పుకోగలిగే స్థితిలో ఉండాలి....మహాత్మునిలో నాకు నచ్చిన అంశాలు ఆయన వయసులో చేసిన తప్పులను ధైర్యంగా చెప్పారు....తరువాత ఆయన ఆచరించి ఎదుటి వారికి చెప్పారు... ఇవి రెండు నాకు చాలా ఇష్టమైన గుణాలు ఆయనలో...!! కర్ణునిలో చనిపోతాను అని తెలిసి కూడా సహజ కవచ కుండలాలు ఇంద్రుడు మారు వేషంలో అడిగినా తెలిసి కూడా దానం చేసిన ఆ గొప్పదనం...తల్లి అడిగినా మిత్ర బంధానికి ప్రాణాన్ని ఒడ్డిన ఆ ధీరత్వం...ఇలా కొందరిలో కొన్ని నచ్చుతాయి... మంచిని తీసుకోగలిగితే చరిత్రలో చిరకాలం నిలిచి పోతారు..!! మాటలేముంది అందరం చెప్పేస్తాం వినే వాళ్ళు మనకు దొరకాలే కాని మనం కూడా ఇప్పటి నాయకులకు తీసి పోవడం లేదు... -:) 

27, మార్చి 2014, గురువారం

నా ఓటు వేస్తాను..!!

మనకు రామ రాజ్యం కావాలా..?? రావణ రాజ్యం కావాలా..?? మనని మనలా బతకనిచ్చే సామాన్య జీవిత రాజ్యంకావాలా..? రామ రాజ్యం లో ప్రజలు బావున్నారు.. కాని సీతమ్మ పడిన కష్టాలు మనకు అందరికి తెలిసినవే...అదే సమయంలో రావణ రాజ్యం లో కూడా మండోదరి భయంతోనే బతికింది ఎప్పుడు ఏమౌతుందో అని...!! మనకు ఇలాంటి రాజ్యాలు అవసరం అంటారా...!! జనం మెప్పు కోసం పేరు కోసం ఆలి బిడ్డలను చూడని నాయకులు గెలిచాక మనని చూస్తారు అన్న నమ్మకం మీలో ఎవరికైనా ఉందా...!! అప్పటి కాలం లో రాముడు రావణుడు ఇద్దదు జనం కోసం మంచి వారే...ఈ రోజుల్లో రామ రావనులు ఇద్దరు లేరు...రాముని పేరు చెప్పుకుంటూ రాక్షస న్యాయాన్ని కూడా మరచి మానవత్వం తెలియని మహా నాయకులు మన డబ్బులు దోచుకుంటూ మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పే మోసపు ప్రకటనలకు...నాయకులు చెప్పే వాగ్దానాలకు మోసపోకుండా మన ప్రజాస్వామ్య విలువలు కనీసం మనమయినా గౌరవించుకుందాం..!! మహానుభావులు మన కోసం రూపొందించిన రాజ్యాంగానికి...దిగజారిన వాటి విలువలు పోకుండా పైన ఉన్న వారి ఆత్మలు ఘోషించకుండా ఉండటానికి భారతీయులుగా మన ప్రయత్నం మనం చేద్దాం..!! ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మన భారతీయతను గౌరవించండి.....భాషలు వేరైనా... దైవ రూపాలు ఎన్నైనా భావాలు ఒక్కటైన... అందరు కలసి ఉన్న మన భరత జాతి గొప్పదనం ఈ నాయకులు వారి వారి స్వలాభాల కోసం విభజించి పాలించే లక్షణాన్ని అందించిన బ్రిటీషు వారి నుంచి ఆ రోజుల నుంచే కొందరు అలవర్చుకున్నారు...అది మన దురదృష్టం...ఎందరో మేధావులకు పుట్టినిల్లు భరతావని ఇప్పటికి...భరతభూమికి భారంగా మారిన మన రాజకీయ నాయకులు ఇన్ని సంవత్సరాలలో కనీసం ఒక్క చోట అయినా ఎన్నికలలో ఇచ్చిన మాటను నిలుపుకుని మన మీద పన్నుల భారాన్ని తగ్గించిన ఒక్క నాయకుని చూపించండి...!! వారికి నా ఓటు వేస్తాను..!!

26, మార్చి 2014, బుధవారం

మోసపోకండి...అమ్ముడు పోకండి...!!

ఇప్పటి తరం అబ్బాయిలు చాలా మంది హైదరాబాదు, విజయవాడల్లో పుట్టిన అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు లేదా బాగా చదువుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారు... అని ఒక నమ్మకంతో పెళ్లి చూపులకు వెళ్ళడం వాళ్ళు పెళ్ళిచూపులకు కూడా అతి సాధారణంగా ఉండటం చూసి అదేంటి ఇలా ఉన్నారు...పల్లెటూరి అమ్మాయిలే చాలా వేగంగా ఉంటున్నారు అని అనడం వింటున్నా ఈ మధ్య....!! అమ్మాయిలయినా అబ్బాయిలయినా చూడటానికి సాధారణంగా ఉన్నారని తక్కువగా చూడకండి...అలా ఉండగలగడంలో ఉన్న వారి వ్యక్తిత్వానికి విలువ ఇవ్వండి...!! ఆ మంచి గుణాన్ని చూసే మనసు అలవాటు చేసుకోండి....అప్పుడు మీ బంధాలు కలకాలం కన్నుల పండుగగా ఉంటాయి ....!! పై పై పెరుగులు చూసి మోసపోకండి...!!
ఈ రోజుల్లో మనం అందరం చూస్తున్న అతి మామూలు సంఘటనలే...పెళ్ళిళ్ళు అయినా వేరే ఏదైనా సందర్భాలయినా బాగా కనిపించే జరీ చీరలకు, నగలతో నిండిన లక్ష్మీదేవిలకు చేసే మర్యాదలు మామూలు చీరలు కట్టుకు వెళ్ళే వాళ్లకు ఎంత తేడా చూపిస్తున్నారో...చూస్తూనే ఉన్నాము కదా...!! అదే అబ్బాయిలయితే పని చేసే కంపెనీలు...సంపాదించే జీతాలు ఇవే చూస్తున్నారు పలకరింపుల్లో కూడా...!! ఏ బంధానికైనా బంధుత్వానికైనా కావాల్సింది సంపదే....అది అందరు ఒప్పుకోవాల్సిన నిజం...!! మరీ కొన్ని విషయాల్లో అయితే రక్త సంభంధాలు కూడా గుర్తురానంతగా ఈ ధనాధికారం పెత్తనం చెలాయిస్తోంది...లక్ష్మీదేవి నిలకడగా ఎక్కడా ఒక చోట ఉండలేదు...ఈ రోజు మన దగ్గర ఉంటె రేపు మరొకరి దగ్గరకు వెళిపోతుంది...మనకు కోట్లు ఉంటే మహా అయితే నాలుగు గంధపు చెక్కలు వేస్తారు చితి మీద....ఏమి లేక పోయినా అలానే కాల్చకుండా ఉంచేయరు కదా...!! ఉన్నవాడు నాలుగు కూరలు తింటే లేని వాడు గంజి తాగి బతుకుతాడు...మన సొమ్ము మనవాళ్ళు చూసినా చూడక పోయినా మనవాళ్ళకే కాని బయటి వాళ్లకు ఇవ్వడానికి మనలో ఎంత మందికి ప్రాణం ఒప్పుతుంది..కనీసం ఒక రూపాయి ఇవ్వగలమా చెప్పండి...అలా ఇచ్చే మహాత్ములు కొందరే.... కాకపొతే అది కూడా అపాత్రదానం అయి పోతోంది ఈ రోజుల్లో...!! మంచిని పెంచండి...మానవత్వానికి... మమతానుబంధాలకు విలువ ఇవ్వండి కాని వాటిని కూడా మీ స్వార్ధానికి వాడుకుంటూ మనిషి అన్న పదానికి మానవ జన్మకు కళంకాన్ని ఆపాదించకండి...!! ధన దాహానికి... నటనలకు మోసపోకండి...అమ్ముడు పోకండి...!!

25, మార్చి 2014, మంగళవారం

అమ్మ...!!

దిగంతాల అంచుల నుంచి దైవత్వపు మనసులను
దోచే కమ్మనైన కమనీయ కావ్యం అమ్మ....
భాషల రూపాలు ఎన్నైనా భావాలు
మారని మధుర పలుకులు అమ్మ...
సృష్టికి మూలం ప్రేమకు మార్పులేని
మార్చలేని నిఘంటువు అమ్మ...
జీవాన్ని నవ్వుతూ వదులుతూ
జీవితాన్ని అందించేది అమ్మ...
మోసం ద్వేషం తెలియని మానవత్వపు
మమకారానికి ప్రతిరూపమే అమ్మ...
కన్నీటిలో సంతోషాన్ని చూపించే
ఒకే ఒక్క అమృతమూర్తి అమ్మ...
అమ్మ పిలుపు అమృత భాండాగారాల
వెలకట్టలేని విలువల సంపదే...
అమ్మ అన్న తలపుల ఆనందమే
చెప్పలేని భావాల అక్షర అనుభూతుల
అనురాగ స్రవంతే అమ్మ...!!

24, మార్చి 2014, సోమవారం

అదే పదివేలు....!!

ఇప్పటి పోటి పరిస్థితులను బట్టి పిల్లలను కార్పోరేట్ స్కూల్స్ లో చదివించక తప్పడం లేదు...కాని అందరు పిల్లలు
ఒకేలా ఉంటున్నారు అని కాదు...వీళ్ళు చదివే ఎనిమిది తొమ్మిదికే బైక్ లు, టాబ్ లు, ఐ పాడ్ లు అది చాలా ఖరీదువి కావాలని గొడవలు... అదిగో వాడికి ఉంది వీడికి ఉంది అని రోజు ఇంట్లో గోలా.... చదువు సంగతి పక్కన పెడితే ఈ ఆధునికత వేగం ముసుగులో పిల్లల మనసులు బంధాలు బంధుత్వాలు కూడా మరచి నాకు కావాల్సింది ఇస్తారా లేదా...!! అన్న అధికార అహంకారం ఎక్కువగా కనిపిస్తోంది...మరి స్కూల్లో చదువుతో పాటు మానవతా విలువలు నేర్పాల్సిన బాధ్యత గురువులకి ఉందని మనం అనుకోవడంలో తప్పేమి  లేదు కదా...!!
మేము చదువుకున్నాము కాని ఇలా లేము...ఇప్పటి తరం మాలా ఉండాలని అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది...మేము ఇంజనీరింగ్  రోజుల్లో అందరూ బాగా ఉన్న వాళ్ళే మరి కర్ణాటకలో అంటే మాటలా చెప్పండి అప్పట్లో.... ఎవరు ఎలా ఉన్నా ఎన్ని అన్నా నన్ను నేను మార్చుకోలేని పల్లె వ్యక్తిత్వం....అందరు ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళే... మనకేమో తెలుగు తప్ప మరో భాష రాదాయే...పల్లెటూరి నించి ఎర్ర బస్ ఎక్కి వెళ్ళిన నేను అందరి మనస్సులో అప్పట్లో మంచిగా నిలిచి పోవడం నా అదృష్టం.... ఇప్పుడంటే అందరు ఎవరిపనుల్లో బాధ్యతల్లో వారు తీరిక లేకుండా ఉంటున్నారు....మనం పలకరించలేదని అనుకోవడం కూడా ఒక్కోసారి తప్పే...!! అయినవారి వద్ద నుంచే ఓ చిన్న పలకరింపుకి నోచుకోలేని రోజులు...కొన్ని బంధాలు అనుబంధాలు కలకాలం మనసుల్లో నిలిచి పోతాయి దురాన ఉన్నా..... దగ్గరగా ఉన్నా దూరంగా అనిపించే అనుబంధాలు ఎక్కువై పోతున్నాయి ఈ రోజుల్లో.... కనీసం పిల్లలకైనా అనుబంధాలు ఆప్యాయతలు కాస్తయినా నేర్పే అదృష్టం దేవుడు మనకు ఇస్తే అదే పదివేలు....!! 

22, మార్చి 2014, శనివారం

క్షమించండి...!!

కవి మిత్రులకి, హితులకి సన్నిహితులకి నా విన్నపం....కొన్ని రోజులు మీ అందరి అమూల్యమైన అక్షర భావనలకు నా స్పందన తెలుపలేని పరిస్థితి...నాకు వీలైనప్పుడు మాత్రం తెలుపుతూ ఉంటాను... నా రాతలు కూడా నా వీలుని బట్టి రాస్తూ ఉంటాను...దయచేసి రాతలు రాసుకున్నప్పుడు స్పందనలు తెలిపే సమయం లేదా అని మీరు అనుకోవచ్చు....నాకు ఏ కాస్త సమయం చిక్కినా తప్పకుండా తెలుపుతాను...కాస్త అనారోగ్య కారణం అంట కన్నా ఏమి లేదు....పెద్ద మనసుతో మన్నించండి మీ అందరి అక్షర భావాలు చూడలేక పోతున్నందుకు....!!

21, మార్చి 2014, శుక్రవారం

ఓ మది మధనం....!!

అమాయకత్వం పోనీ పసితనపు ఛాయలు
అడుగడుగునా అడ్డు తగిలే ఆనవాళ్ళు
వదలకుండా వెంటపడే జ్ఞాపకపు గతాలు
మరచి పోనివ్వని మమతల గురుతులు
ఆప్యాయంగా పలకరించే ఆదరణలు
తొలకరి చినుకుల హర్షాతి వర్షంలో
చేసిన మట్టి బొమ్మల రూపాలు
ఏటి ఇసుకలో ఏరిన గవ్వల ఆల్చిప్పలు
ఓపికగా కట్టుకున్న ఇసుక గుజ్జన గూళ్ళు
ఆతల పాటల అల్లరి చేష్టల ఆ గల గలల గోదారి
ఎర్రగా పండిన గోరింటాకు చేతిని చూసుకుంటూ
ఒయ్యారంగా ఒంకిల పూలజడను తిప్పుకుంటూ
తిరిగిన ఆ బాల్యపు మధురానుభూతులను
నెమరు వేసుకుంటూ ఇప్పటి వాస్తవాల నైజాలతో
రాజి పడలేక మనసును సరిపుచ్చుకోలేక
మౌనంతో సహవాసం చేస్తూ మాటలు
మరచి పోయిన ఓ మది మధనం....!!

ఈ రాజకీయాలు మనకి అవసర మంటారా..!!

కనీసం మనలో ఒక్కరైనా ఎన్నికలను నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా....!! ఇంతా చేసి
మనం డబ్బులు తీసుకునో లేదా మనకు పార్టీల మీద ఉన్న అభిమానంతోనో నాయకులను ఎన్నుకుంటున్నాం....వారు ఊసరవెల్లుల్లా పదవుల కోసమో అధికారం కోసమో పార్టీలు మార్చుతూ మనను మాటలతో మోసం చేస్తూ డబ్బులు అందినంతా దోచుకుంటూ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఓటు వేసిన ఒక్కరినైనా గుర్తు ఉంచుకున్న సంఘటన చరిత్రలో ఉందా...!! మన డబ్బులతో ఎన్నికలు నిర్వహించి గెలుపుని కానుకగా వారికి ఇస్తే వారు అధికారంలో చెలామణి అవుతూ బంగారు సింహాసనాల్లో తులతూగుతూ కనీసం ప్రయాణ సౌకర్యాలు...నడవడానికి సరిగా రోడ్లు కూడా లేని పల్లెలు ఎన్నో..!! ఎన్నికలకు అయ్యే ఖర్చు....గెలుపు ఓటములకు వారు  చెల్లించే మూల్యం అసలు ఎన్నికలు లేకుండా చేసి మన భారతదేశ అభివృద్దికి ఉపయోగిస్తే..!!
కిరణ్ గారు మాటలు లెక్కలు బానే  చెప్తున్నారు..కాని మరో చిరంజీవి కారని నమ్మేదెలా...!! దోచుకున్న ధనం ఏం చేయాలో తెలియక అధికార పీఠాన్ని అధిరోహించాలని ఒకరు...సీట్ల కోసం అందరూ మిత్రులే ఇప్పుడు...భారతీయ జనతా పార్టీ.. తెలుగు దేశం...కొత్తగా వచ్చిన జన సేన...సీట్ల లెక్కల్లో మునిగి తేలుతున్నారు...అక్కడ తెలంగాణాలో కూడా ఇదే తంతు...ఈ కలసికట్టు దేశాన్ని అభివృద్ధి పధంలో నడపడానికి మాత్రం పనికి రాదు...!! ఓటరు అనేవారు కనీసం ప్రతి ఒక్క పార్టీ నేతలు కానివ్వండి..నాయకులు కానివ్వండి చెప్పే మాతలు వింటు కూడా వారు ఒకరి మోసాలు ఒకరు బయట పెడుతున్నా మనం ఎందుకు ఓటు వేయాలి అని ఒక్కసారి ఆలోచించండి...!! ఇలాంటి పార్టీలు...అధికారం కోసం క్షణానికో పార్టీ మార్చే నాయకులు..స్వప్రయొజనాల కోసం అధికారం ఉంది కదా అని నియమ నిబంధనలు లెక్క చేయకుండా నియంత పాలన అమలు చేసే మేడం గారు...దగాకోరులకు పట్టం కట్టి మన జీవితాలకు మనమే చరం గీతాలు పాడుకోవడం అవసరమా...!! ఈ రాజకీయాలు మనకి అవసర మంటారా..!! మీరే ఆలోచించండి....!!

20, మార్చి 2014, గురువారం

మరచి పోగలిగితే.....ఎంత బావుంటుందో....!!

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పలకరించడానికి ఓ నిమిషం సమయం దొరకని జీవితాలా మనవి...?? ఒకప్పుడు ఉత్తరాలు ... అత్యవసర పరిస్థితులలో టెలిగ్రాములు ఉండేవి....ఇప్పుడు చూడాలన్నా మాట్లాడాలన్నా మనసుకు అనిపిస్తే ఒక సెకను సమయం చాలదు....!!
నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అప్పట్లో మనకు అమెరికా అంటే అదో గొప్ప ప్రపంచం..!! పాపం అక్కడి వారికి క్షణం కూడా తీరిక ఉండదు చాలా పనుల్లో ఉంటారు తినడానికి కూడా సమయం లేనంతగా అని...!! నేను అమెరికాలో ఎనిమిది సంవత్సరాలు ఉండి వచ్చాను... అక్కడి జీవితం నాకు తెలుసు... అయిన వాళ్ళు బయటి వాళ్ళు నమ్మిన వాళ్ళు అని లేకుండా సొమ్ము కోసం మోసం చేసిన మహాత్ములు తెలుసు...!! ఆపదలో ఆదుకున్ననేస్తాలు గుర్తే ...!! నేను అమెరికా డాలర్ల డబ్బుల కోసమే వెళ్లాను...జీవితంలో ఎన్నో ఆనందాలు నష్టపోయి పిల్లలకు దూరంగా అయిన వారికి దూరంగా ఉంటూ గంటకు ఆరు డాలర్ల ఉద్యోగం నుంచి నెలకు ఆరువేల డాలర్ల ఉద్యోగం వరకు మాత్రమే చేయగలిగాను...మంచి మనుష్యులు అని నమ్మి పని చేయించుకుని డబ్బులు ఇవ్వని మన భారతీయుల చేతిలోనే మోసపోయాను అని చెప్పడానికి సిగ్గుగా ఉంది...మంచి మనిషి అని ఒక మన భారతీయ కంపెని అమెరికన్ సొల్యూషన్స్ అధికారి సుబ్బరాజు గారు చెప్పిన మాటలు నమ్మి ఇక్కడికి వచ్చి ఎంత జీవితాన్ని నష్ట పోయాను అన్నది నేను తెలిసిన అందరికి తెలుసు...అలా నన్ను నష్ట పెట్టడంలో ఎందరి భాద్యత ఉందో ప్రతి ఒక్కరి పేరు నాకు ఎప్పటికి జ్ఞాపకమే...!!
అమెరికాలో ఉన్నప్పుడు ముక్కు మొహం తెలియని ఎంత మందికి ఎన్ని చేసాను అన్నది ఈ రోజు ఆ పుణ్యాత్ములకు గుర్తు ఉండదు... ఒకేఒక్క కుటుంబానికి ఎప్పటికి గుర్తు ఉంటుంది...ఈ రోజు వారు నాకు దూరంగా ఉండవచ్చు కాని వారి మనస్సులో నా స్థానం ఎప్పటికి పదిలమే...కాని నేను వారికి చేసింది చాలా చిన్న సాయమే... మాల్ లో ఉద్యోగం చూపించాను ఇద్దరికీ అంతే..!! జీవితాలను అందించిన చేతులను కాల్చిన మానవతా మూర్తుల మద్యలో ఇలాంటి వారు చాలా తక్కువే ఉంటారు...!!
అయినా ప్రతి ఒక్కరిని గుర్తు ఉంచుకుని అప్పుడు ఇంత ఆప్యాయతను ఒలకపోశారు...కనీసం ఇప్పుడు ఓ నిమిషం ఎలా ఉన్నావు అని ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా అడిగే సమయం వారికి లేక పోవడం నిజంగా నా దురదృష్టమే...!! పునర్జన్మను పొందిన నేను కూడా ఈ బంధాల అనుబంధాల అనుభూతుల పరిమళాలు మరచి పోగలిగితే.....ఎంత బావుంటుందో....!! మీరంతా చాలా గొప్పవారు...మీకు ఓ సెకను సమయం ఆత్మీయ పలకరింపు కోసం అనవసంగా ఓ డాలరు ఖర్చు అవుతుంది అనుకోకుండా ఓ చిన్న పలకరింపు... ఆ సంతోషం ఎన్ని డాలర్ల బహుమానాలు ఇచ్చినా రాదు అని మీకు చెప్పే అంతటి దాన్ని కాదు....!!

18, మార్చి 2014, మంగళవారం

ఈ జన్మకు ఏం కావాలి...!!

నాకు నన్ను నేను  పరిచయం చేసుకునే  క్రమంలో నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా... ఎందుకో మరి నాకు వింతగానే ఉంది...ఈ పరిచయ ప్రయత్నం... నన్ను నేను నాకు తెలుపు కోవడానికి నా భావాల బంధాలను నాతో పంచుకోవడానికి నాకు నేనుగా నాతో బంధాన్ని పెంచుకునే క్రమంలో వారధుల సాయాన్ని మది తలపుల భావనలను అందుకునే యత్నంలో నా పయనాన్ని సాగిస్తున్నా...!! ఎందుకో ఒక్కోసారి అందరు ఉన్నా మనకి ఎవరు లేరు అన్న ఆలోచనతో దానికి ధీటుగా నాకు నేను ఉన్నా అని అనుకోవడం చాలా బావుంది...!!
ఎవరు లేరని అనుకోవడం కంటే నాకు నేను ఉన్నా అన్న తలపు మనలను చాలా సంతోష పెడుతుంది...అసలు మనకి వేరే ఎవరో ఎందుకు మనకి మనం ఉన్నాం అది చాలు...మనమే వేరొకరికి ఆలంబనగా ఉండాలి...నీకు నువ్వు చాలు ఎన్నో అద్భుతాలు చేయవచ్చు అది ఒక్క డబ్బు, అధికారంతోనే కాదు మాటల చేతలతో ఎన్నో అసాధ్యాలను సాధించి అందరి మనస్సులో పది కాలాలు నిలిచి పోయిన మహానుభావులు స్పూర్తి ప్రధాతలు ఎందరో....!!
కష్టంలో నీకు నువ్వే తోడుఎదుటివాటి కష్టానికి కనీసం మాట సాయం చేయగలిగే మంచి మనసు మనం సంపాదించుకోగలితే అంత కన్నా ఈ జన్మకు ఏం కావాలి...!! మన బంధాలు అనుబంధాలు చాలా వరకు అవసరాల కోసమే ఉంటున్నాయి... నేను అనే కాని మన మనం అన్న మాటను ఇప్పటికే చాలా మంది మరచి పోయారు... అది ఒక కుటుంబం అనే కాదు ప్రపచంచంలో చాలా వరకు ఎక్కువగా ఇలానే ఉంటున్నాయి... వారిని చూస్తూ మనం ఎలా ఉండాలో తెలియని అయోమయంలో జీవితాలను మనకు నచ్చినట్టుగా  మలచుకోలేక....బాధ్యతల నుంచి బయట పడలేక ఎన్ని చేసినా వారి అసంతృప్తిని తొలగించలేక ఆత్మీయతలను కూడా మరచి పోతూ వా వరకు నేను అని చూసుకుంటున్న ఈ చుట్టరికపు పలకరింపులు  ఆఖరికి మనకి మనమే ధైర్యాన్ని చెప్పుకుంటూ బతకాల్సి రావడం ఓ రకంగా మరి అదృష్టమో దురదృష్టమో తెలియని ఈ జీవన ప్రయాణం...!!

గీతాబోధకుడు....!!


గోపాలుని వదనం సుందర సుమధురం
గోపికాలోలుని మురళీగానం ముల్లోకాలకు
పరవశాల ప్రియ నర్తనాల వసంత విలాసం
మన్ను తిన్న చిన్ని కన్నయ్య చూపిన మహార్లోకాలు
 యశోదమ్మ చూడగా అమాయకంగా ఆటలాడిన
వెన్నదొంగ వెన్నెలాటలు వేసిన వేషాల రూపాలు
చిన్ననాటి మిత్రునికి అందించిన ఆపన్న హస్తం
చీరలు దాచిన చిలిపి పాండవ సతి మానం నిలిపి
అష్ట సతుల ఆనందాలలో ఇష్ట సఖుల సరసన
ప్రేమకు ప్రతి రూపాన్ని బోధించిన పెన్నిధి
ధర్మార్దాల కామ మోక్షాల తత్వాన్ని అందించి
కర్త కర్మలకు అతీతుడను కాదని శాపాన్ని
సంతోషంగా స్వీకరించిన గీతాబోధకుడు....!!

17, మార్చి 2014, సోమవారం

స్వాగత సుమాంజలి....!!

వాసంత సమీరాలు వలపుల వాయులీనాలై
రంగుల రసకేళి ఆనందాల ఆటల తన్మయంలో 
పులకరిస్తున్న గోపికలతో గోపికాలోలుడు
పచ్చని చివురుల తొడుగుల పుడమి అందాలు
లేచివురుల రుచులు చవి చూసిన కోయిలమ్మ
క్రొంగొత్త రాగాల స్వర సమ్మేళనాల సమ్మోహనాలు
చీకటి వెలుగుల జతను పరిచయం చేసే జీవితపు
అన్ని వర్ణాల కేరింతల సంబరాల సంతోషపు హేల
భాషలు వేరైనా భావాల కలయిక ఒక్కటైన
ముచ్చటైన మురిపాల సందడి ఈ సంతోషపు
సంబరాల వసంతపు వనరాణి స్వాగత సుమాంజలి

ఈ నా భావాలకు నాకు ప్రధమ బహుమతిని అందించిన గౌరవ న్యాయ నిర్ణేతలకు ... మన తెలుగు మన సంస్కృతి గౌరవ నిర్వాహకులకు నా మనఃపూర్వక కృతజ్ఞతా వందనాలు.... మిత్రులందరికీ వసంతాల హోలీ సంబరాల శుభాకాంక్షలు






15, మార్చి 2014, శనివారం

పూలజడ...!!


 ఒయ్యారాల వాలుజడ ఒద్దికైన ముద్దరాలికి
అలంకారమైన మరుమల్లెల సౌరభాల పూలజడ
సౌకుమార్య లావణ్యానికి చిరునామా ఈ పుత్తడిబొమ్మ
నును సిగ్గుల అందాల మొగ్గల సింధూరపు వర్ణాల
ఛాయల మెరపులు మరిపిస్తూ కనువిందు చేస్తుంటే
పడతి పరువపు సొగసుతో పోటి పడుతూ
పూల విరుల అల్లికలు పోటి పడుతూ
కనువిందుల కమ్మదనాన్ని చూపిస్తుంటే
పూలజడా... పూల విరిబోణా మనసును దోచేది...!!


13, మార్చి 2014, గురువారం

అమ్మలకే అమ్మ...!!

 
అమ్మకు అమ్మని కూర్చిన దైవం
అందరి  అమ్మల ఆంతర్యాన్ని
ఈ అమ్మలో చేర్చి మానవాళికి
అమ్మను అందించిన అద్భుతం
మాతృత్వపు మమకారానికి
ప్రేమించే మనసు ప్రతిరూపానికి

శిధిల శకలాల తనువులకు
చల్లని చేయూత అందించిన
ఓ మానవతా మూర్తి నీ మనసు
కాస్త మాకు ఇచ్చి మమ్ము పునీతులను చెయ్యి

సాక్షాత్కారం...!!

అసంపూర్తి చిత్రానికి భావాన్ని ఇచ్చే యత్నంలో
నా మనసు గీయించిన  రూపం
చిత్రంగా... నువ్వయ్యింది...!!
చూసావా ఎంత వి'చిత్రమో'
మౌనాక్షరాలకు నీ జపమే ఎప్పుడు
మదిలోని తలపులకు అనుక్షణం
నీ భావనా తరంగాల తాకిడే వెల్లువలా... 
చెప్పక పోయినా తెలిసిపోయిన నేను
తెలిసినా తెలియనట్లు నువ్వు నాతో
ఎప్పటిలా మాటల మౌనాలు
జత చేరిన దురాల చేరిక దగ్గరగా
స్వప్నాల చేరువలో మెలకువ వేకువలో
నిజాల జీవితం కళ్ళెదురుగా సాక్షాత్కారం...!!

నేను ఓ పార్టీ పెట్టేస్తే పోలా....!!

మారుతున్న రాజకీయ సమీకరణాలు పార్టీలు మారుతున్న నాయకులు, కొత్త పార్టీలు పుడుతున్న తరుణాలు.... 
చూసారా ఎన్ని జరిగి పోతున్నాయో తెలంగాణా సీమాంధ్ర అనగానే...!! తెలుగువారు అని మర్చిపోయి ప్రతి ఒక్క పార్టీ తెలంగాణా రావడానికి మేమే కారణం... సీమాంధ్రకు వరాల జల్లులు కురిపించే ప్రయత్నాలు చేసింది మేమే అని చెప్పుకుంటున్నారు... కనీసం రేపు రాజధాని ఏదో కూడా చెప్పలేని ఈ నాయకులను నమ్మి మళ్ళి గెలిపించాలో ఓడించాలో మన చేతుల్లోనే ఉంది... ప్రతి ఒక్కరు పార్టీ పెట్టినప్పుడు జనం కోసమే కాని పదవుల కోసం కాదు అని చెప్పినవారే ఇప్పటి వరకు...అది ఎంత వరకు నిజమో మన అందరికి తెలుసు...పార్టి పెట్టి కనీసం చెప్పిన పదాలకు అర్ధాలు కూడా తెలియకుండా కటౌట్లు పెట్టుకున్న ఆ మహనీయులు జనం కోసం ఏం చేసారో కూడా తెలియని మహా నటులు పదవి కోసం ఎంత బాగా మన ముందు నటించి ఇలా అనడం కుడా తప్పేనేమో జీవించి మొత్తానికి ఏదో ఒక మంత్రి పదవి సంపాదించి దానికోసం తనను నమ్మిన జనాన్ని నట్టేట ముంచి...ఏ పార్టీకి ఇప్పటి వరకు రానన్ని డబ్బులు చక్కగా దండుకుని ఈ విభజన విషయంలో కూడా జీవించి ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న మహా మనీషి... నీతులు చెప్పడానికే ఉంది పాటించడానికి కాదని సహ నటుని మరణానికి కారణం అయిన పెద్ద మనిషి ఒకరు..తండ్రి పేరు చెప్పుకుని పదవుల కోసం మరో నాటకాన్ని ఆడుతున్న మరో నాయకురాలు ఒకరు...విభజనకు ఒప్పుకోనప్పుడు బి జె పి లోనికి వెళ్ళడం లో ఆంతర్యం ఈపాటికి అందరికి అవగతమై ఉంటుంది... మాటలు చేతలు ఇప్పటి వరకు బాగానే చెప్పిన చేసిన కిరణంను కూడా నమ్మకపోవడానికి సదరు నటనాగ్రేసరులే కారణం అవుతున్నారు...మరో సింగపూర్ మలేషియాలా చేయనవసరం లేదు ముందు రాజధాని కోసం కుమ్ములాటలు లేకుండా కనీసం ఇప్పుడయినా తెలుగు జాతి అని ఆలోచిస్తే బావుంటుందేమో...!! కొత్త పార్టీలు పెట్టడం కాకుండా జనం కోసం ఆలోచించే నాయకులు ఎక్కడో మరి..!! చివరగా ఓ మాట ఇంత మంది పార్టీలు పెట్టగా లేనిది నేను ఓ పార్టీ పెట్టేస్తే పోలా....-:)

10, మార్చి 2014, సోమవారం

జీవితం బావుంటుంది....!!

మనం ఎప్పుడు మనకు చెడు జరిగిందని బాధ పడుతూ ఉంటాము... కాని అది కూడా మన మంచికే అని మా హింది టీచర్ నాకు చెప్తే ఏదో నన్ను సంతోష పెట్టడానికి ఇలా చెప్తున్నారులే అనుకున్నా... కాని ఆ మాటల్లో ఎంత నిజముందో తరువాత తెలిసింది...అప్పటి నుంచి చెడు జరిగినా కాసేపు బాధ అనిపిస్తుంది వెంటనే ఆవిడ మాటలు గుర్తు తెచ్చుకుంటాను...ఏదో ఒక మంచి ఉంటుందిలే అని దాని నుంచి త్వరగా బయట పడటానికి ప్రయత్నిస్తాను... ఇలానే  చెప్పిన ఒక మంచి మాట కూడా గుర్తు చేసుకుంటాను...ఇప్పటి జనాల సంగతి ఏమో నాకు తెలియదు కాని నేను చదివిన పుస్తకాల్లో మంచిని గుర్తు ఉంచుకుంటాను...వారి విజయానికి ఐదు మెట్లు పుస్తకంలో చెప్పిన ఈ మాట నన్ను చాలా మార్చింది "సమస్య జీవిత కాలం మన జీవిత కాలంతో పోల్చుకుంటే చాలా చిన్నది... " ఎంత నిజం ఉంది చూడండి ఈ మాటలో... ఒకే సమస్య మన జీవితం మొత్తం ఉండదు కదా... ఏదో ఒకటి వస్తు పోతూ ఉంటాయి కాని ఒకటే మన చివరి జీవిత కాలం వరకు ఉండదు... కాకపొతే యండమూరి గారు చెప్పిన ఒక మాటకు మాత్రం నాకు నేను చేసిన పని తప్పో ఒప్పో ఇప్పటికి అర్ధం కాదు... ఒకరి ఇష్టానికి కాకుండా నీకు నచ్చిన పని చెయ్యి అని చెప్పిన మాట... మనకు నచ్చిన పని చేయాలంటే కొందరిని ఇబ్బంది పెట్టక తప్పదు... అది మనం న్యాయం అని నమ్మినప్పుడు ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు అని చూడకుండా మనం నమ్మిన మన మనసు మాట కోసం ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోకుండా నువ్వుగానే ఉండటానికి చూడటం కాస్త కష్టమే....!!
సంతోషం చాలా రకాలుగా ఉండవచ్చు కాని కష్టం ఎవరిదైనా ఒక్కటే...!! వేదన పడే మనసుకి నీతో మేము ఉన్నాము అన్న ఒక చిన్న ఆలంబన ఎంత బలాన్ని ఇస్తుందో...!! ఒకరి సంతోషాన్ని మనం పంచుకోక పోయినా పర్లేదు కాని బాధను పంచుకోగలిగే  సహృదయం కాస్తయినా ఉంటే ఆ ఓదార్పు ఎంతటి శక్తిని ఇస్తుందో....!! పెద్దలు చెప్పినట్టు చీకటి వెలుగుల రంగేళి ఈ జీవితమే ఒక దీపావళి....కష్టాన్ని ఇచ్చిన దేవుడే మనకు దాన్ని తట్టుకునే శక్తిని కూడా ఇస్తాడు...బాబా గారు చెప్పారని మా పిన్ని చెప్పింది ఒక మాట మనం ఒక కష్టం పడాలని ఉన్నప్పుడు అది పడగలిగిన శక్తి ఉన్నప్పుడే దేవుడు మనకు ఆ కష్టాన్ని పెడతాడంట....నిజమే కదా...!! అందుకే కష్టం సుఖం రెండు చూడగలిగినప్పుడే జీవితం బావుంటుంది....!!

8, మార్చి 2014, శనివారం

మధుర జ్ఞాపకమో....!!

హద్దులు లేని మనసు ఒద్దికగా ఉంటే
లెక్కల చుక్కల లెక్కలేని ఇష్టాలు
అంబరాన్ని సోపానాలుగా అధిరోహించి
గుప్పెడు గుండెను గొంతులో చేర్చి
మౌనం చాటున మాటను దాచి
అడ్డుపడుతూ ఆకతాయితనంగా
ఆట పట్టిస్తూ వదలలేని బంధాలుగా
అల్లుకుని పెనవేసుకున్న పాశాలుగా
చుట్టుకుంటుంటే వద్దనుకుంటున్నా
పోలేని మమతానుబంధాలు అనురాగాలుగా
 మరులు గొలుపుతూ ఆత్మీయతా చుట్టాలుగా చేరితే
ఏ జన్మల జత చేరిన చెలిమి కూర్చిన ఈ సంబరాల 
చుట్టరికం మరెన్ని జన్మల మధుర జ్ఞాపకమో....!!

4, మార్చి 2014, మంగళవారం

మరో జన్మగా....!!

మస్థిష్కం నిదురబోయిన క్షణం
మరో లోకం చూడాలన్న ఆత్రుత
పాత బంధాలను వదలలేక
కొత్తదైన మరో ప్రపంచానికి
చేరుకోవాలన్న చిన్న తపన
ఎక్కడో మదిలో దాగున్నట్టుగా
తెలియని నిమిషాల మమతలు
తెలిసిన మనసుల ఆవేదనా
చేరనివ్వని సరి కొత్త ప్రయాణం
అటు ఇటు అన్ని చూసిన
మరో జన్మగా నాకందిన
అద్భుత అలౌకిక దృశ్య కావ్యం
ఈ ముచ్చటైన జీవితం...!!
( నా క్షేమాన్ని కాంక్షించిన ప్రతి ఒక్క ఆత్మీయ బంధానికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు... జీవాన్ని నిలబెట్టిన సన్నిహితులకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను....కృతజ్ఞతా అక్షర కుసుమాలు సమర్పించడం తప్ప...)

3, మార్చి 2014, సోమవారం

మన ప్రజాస్వామ్యం...!!

ప్రజాస్వామ్యమా భరత జన సామ్యవాదమా
నింగినంటిన విజయ జయ కేతనం ఆనాడు
సత్యా హింసల సౌశీల్యాల  పరమత సహనం
శాంతి సౌభాతృత్వాల సహజీవనం సోపానాలుగా
సమతా మమతలతో సాగిన ఆదర్శప్రాయ అనుబంధాలు... 
కలహాల కల్లోలాలు కుటుంబ నియంతల కుతంత్రాలు
కుయుక్తుల కూడికల తీసివేతల హెచ్చవేతలు
నమ్మకంగా ఎన్నుకున్న జనాల నోట్లో మట్టి కొట్టి
పసిడి పునాదుల ప్రాంగణాలు విలాసాల విందులు
ఈ నాటి నవ నాయకుల నిజ రూపాలు
ఇదా మహాత్ములు కలలు గన్న మన ప్రజాస్వామ్యం...!!

వెన్నాడుతూనే ఉంటుంది....!!

ఈ మధ్య రాసిన నా చిరు కవిత ఆంద్రప్రభ అంతర్జాల పత్రికలో
కింది లింకు చూడండి

వెన్నాడుతూనే ఉంటుంది....!!


ధన్యవాదాలతో 
ఆంధ్రప్రభ.కామ్ టీమ్ 

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner