7, ఆగస్టు 2014, గురువారం

సజీవ రూపమే....!!

నిస్తేజమైన ఆ చూపుల వెనుక దాగిన
మనోగతం నాకు తెలుస్తోంది
నిరాసక్త జీవితానికి నాందీవాచకమని....

ఎప్పుడో రాలిపోయిన రెక్కలు
అక్కడక్కడా పడి చెదురుమదురుగా
అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి....

వాలే పొద్దు వర్ణాలతో పోటి పడుతూ
విచ్చుకుంటాయి వాడిపోతామని తెలిసినా
వేవేల వర్ణాల అందాలను అందిస్తూనే....

రేయికి అందే ఆనందాన్ని దూరం చేయని
వేకువని చూస్తూ సందెవేళ సాయంత్రానికి
స్వాగతం పలికే మల్లెల పరిమళాలు....

తొలిఝాము అవుతుందని
మంచుపూల తెరలను ఆహ్వానించే
రాతిరి రెక్కల చాటున దాగిన ఉషోదయం....

వినిపించే మనసు స్వరాలు
కనిపించే మానస సరోవరాలు కలగలిపిన
కమ్మని చీకటి వెలుగుల రంగేళి.....

గాలి గాంధర్వమైనా మౌనం మంత్రమైనా
నీ దరి చేరిన గడ్డిపూవుకైనా
గంధపు సువాసనల తాకిడితో సజీవ రూపమే....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner