1, నవంబర్ 2016, మంగళవారం

తడియారని స్వప్నం ... !! ( పుస్తక సమీక్ష )

ఎందరో మహానుభావులు అందరికి వందనాలు...!!
ముఖ పరిచయం లేని పరిచయాలే అయినా తడియారని స్వప్నం అనే ఓ చక్కని పుస్తకాన్ని అందించిన శ్రీ లోసారి సుధాకర్ గారికి ధన్యవాదాలు.
సుధాకర్ గారి కవిత్వాన్ని విశ్లేషించేంత శక్తి నా దగ్గర లేదు, కానీ పొడిబారిన జీవితాల తడియారని స్వప్నాల గురించి మనసు పొరల్లో ఎక్కడో దాగిన చేతనాన్ని అక్షరాల్లో ఒలికించినట్లుగా అనిపించింది ఈ పుస్తకం చదువుతున్నంతసేపు.
ఓ ఆర్తి గీతంలో మొదలైన ఆవేదన మనిషి మనుగడ కోసం పొడిచిన వేకువ పొద్దు నుంచి వాలే సందె పొద్దు వరకు పిడికెడు ముద్ద కోసం పడే ఆరాటం మనకు కనిపిస్తుంది. అర్ధ నారీశ్వర తత్వాన్ని అద్భుతంగా సగ జీవనంలో చూపించారు. మొలకెత్తని విత్తనాలు ... మట్టిలో కలిసిన స్వప్నాలుగా దీపాలు మునిగే వేళ కవితలో  చరిత్ర కాన్వాసు మీద అంతరించి పోతున్న పల్లెలను, పల్లె జాతుల వర్ణ విబేధాలను వినిపించారు. తడియారని స్వప్నంలో విరహాన్ని, ప్రేమను పొందలేని మనసును నిద్ర పుచ్చడానికి కప్పుకున్న ఊహల దుప్పటి గురించి వివరిస్తారు. అతడో పద్యం లో మాది భావాలను అక్షరాలుగా మార్చడం, భ్రమణంలో గుండె గోడును, వీడేకలవ్యుడులో ఒంటరి పసి ప్రాణం రోడ్డున పడితే ఎన్ని అగచాట్లు పడుతుందో కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. మనం కోల్పోతున్న ప్రకృతి సంపదను, దానికి కారణాలను శ్మశానాలు విస్తరిస్తున్నాయిలో చెప్తారు. వెలుగు ప్రపంచ బావుటా చూపుడువేలే సూర్యుడు కనిపిస్తుంది. అమ్మ గొప్పదనం .. బీదరికాన్ని మరుగున డాచేసి మనకు పంచిన ప్రేమ అంతా అమ్మ దూరమైనా ఆకాశంలా పరచుకున్న అమ్మ పాత చీర మన గుండె లోపలి జ్ఞాపకాలను తట్టి లేపుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అన్నమూ ఆకలి పాటలో యాచకుని ఆకలికి ద్రవించిన మనసు తడి కనిపిస్తుంది. యవ్వనం ఆనందం కలిసిన విషాద కవనం, బ్రతికిన క్షణంలో రాలిన జ్ఞాపకం, వేలాడే కాలంలో రైతు కన్నీటి హృదయ గాధ,యువ ప్రస్థానంలో  యువతకు దిశా నిర్దేశం, ఒక్క వానలో ఎండిన బతుకు నేలలో వాన చినుకు కోసం ఎదురుచూపులు, ఒక జ్ఞాపకం వంద గాయాలు వినిపించే అంతర్మధనం చదివితే తడిగా మారే కళ్ళు, కొత్త పాటలో ఆశల వెలుగు, దగ్ధ నెలవంకలో ఆశల రెక్కలు విరిగిన స్థితి, నిశ్శబ్దపు అలజడి చేసే మనసు చప్పుడు, పదహారేళ్ళు  చెప్పే బాల్యపు సంగతులు, వేదనలో నగర జీవితపు ఇక్కట్లు, కార్పొరేట్ల కాళ్ళ క్రింద నలుగుతున్న పసి మనసుల చదువులు, వెలుగులో మదిలోని బోలెడు కోర్కెల కబుర్లు, మట్టి మనుషులు లో పేరుకు తగినట్టుగా చక్కని అర్ధం చెప్పారు.  చినుకులో ప్రాణాధార నీటి చుక్క కోసం తపనపడే జీవితాలను, ఓ రాత్రి కలలో కిరణ్మయి ఆనందం విషాదం కలిసిన కల, మరో జన్మకు ఎదురుచూపులుగా మిగలడం, అతీతంలో అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దూరమైన మిత్రుని స్మృతి ఒక వీరుని అమరత్వంలో జీవిస్తుంది.  సజల నేత్రాలులో ఎప్పటికి చెరిగిపోని స్వప్నపు ఊహా సౌధాలు, తోలి ప్రేమ స్వచ్చత అంతర్లీనంలో సంఘర్షణ, అరుగు దాచుకున్న అవ్వ జ్ఞాపకాలు, అధికారానికి బలౌతున్న జీవితాలకు కోపం వస్తే ఎలా ఉంటుందో మండే చంద్రుడిలో, మరి నేనెవర్నిలో మనం అన్న మాటకు చక్కని అర్ధం కనిపిస్తుంది. అమ్మ భారతీలో సమాజపు తీరు తెన్నులు, స్విచ్ డౌన్లో మనం దూరమౌతున్న సహజత్వం గురించి చురకలు, ఓ ఆదాము కథలో మనసు చాంచల్యాన్ని, యుద్ధం చేయడం ఖాయం లో అధికారానికి ఓ హెచ్చరిక, పూలూ తిరగబడతాయిలో నిరీక్షణలో ఉదయించే ప్రశ్న, పద్మవ్యూహంలో నిస్సహాయత, కలల పాఠశాలలో తనకున్న ఆశలను, అంతర్ధానమైన మనిషి ఆనవాలు గురించి ది మిస్సింగ్ మ్యాన్లో , కలలా వచ్చి వెళ్ళే ఇష్ట సఖిని నిట్టూర్పులో,  అశ్రురేఖ బతుకు చిత్రం గురించి మట్టి వాక్యంలో, ఆఖరి బహుమానంలో మరణం వరకు చేసిన జీవిత రణాన్ని చెప్పిన తీరు అద్భుతం. సమాజం గురించి ఆలోచన సంఘం శరణం గచ్చామిలో, విలయం,  కరిగిన హరివిల్లు, మొగ్గలా జడ, అక్షర శిల్పి గా మారి ఆనంద విషాదాలను చూపటం, నను నిదురించనీ  అని జతను కోరడం,  నదీమ తల్లీలో దోసెడు నీటి కోసం ఆరాటం, కొత్త సూర్యుడులో దుర్మార్గంపై నిప్పులు చెరగడం,  వర్ణంలో ఏక వర్ణం, అక్షరాలూ ఆయుధాలుగా మారడం, ఈ పాపం ఎవరిది అంటూ మూఢ నమ్మకాలపై అస్త్రం, అశ్రువు పైన ఇష్టాన్ని, అభేదంలో కలసిన మనసులను, నేను నా టెరీకాటన్ చొక్కాలో ఇప్పటి జీవితాలకు గతపు జ్ఞాపకాలు ఇచ్చే ఆనందాన్ని, అయ్యవారులో చదువు నేర్చుకున్న చిన్నతనాన్ని, గురువును, తుఫాను రాత్రిలో అమ్మ దూరమైన క్షణాలు మరువలేని పసి మనసు ఎదురుచూపులు, మరోచరిత్రకు శ్రీకారంలో గెలుపు ఓటములు, కన్నీళ్ళు , నెత్తుటి రాజకీయాలు కాకుండా ప్రేమయం కాబడిన చరిత్రకు శ్రీకారం చుట్టాలన్న పిలుపు, తరాలు అంతరాలు లో అణచివేతకు గురికాబడిన అట్టడుగు వర్గాలపై దాడులను, వాటికి సమాధానం చెప్పమని ఎలుగెత్తి చాటడాన్ని చెప్పారు. నేను వేణువులో చక్కని సున్నితత్వం కనిపిస్తుంది.  వెదురు గాయాలు, మనసు గేయాలుగా   మారడం బావుంది. రాలుతున్న పూలులో ప్రేమ కథలు విషాదం కాకూడదని చరిత్రను మార్చాలని, వార్ అండ్ పీస్, అనివార్య సమయం, శోధన, అంతర్వేదన, మనోనేత్రం, ప్రయాణం, జ్వలన, అతడొడిపోలేదు, ఓ మహా శూన్యం వీటిలో జీవిత పోరాటాలను, కవి దిశా నిర్ధేశాలను చక్కని పదాల్లో అందించారు. చివరిగా మా నాయినలో తనకు ఆరాధ్యుడైన తండ్రి గురించి ఓ కొడుకు చెప్పిన నిజాయితీ చదివే వారి మనసుకు హత్తుకుంటుంది.

చక్కని సున్నిత, సుళువైన పదాలతో రాసిన ఈ తడియారని స్వప్నం ... చదివిన ప్రతి ఒక్కరికి బోలెడు గత జ్ఞాపకాలను అందిస్తుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు.  ఏదో నాకు అనిపించిన నాలుగు మాటలు చెప్పగలిగాను చాలా రోజుల తరువాత.
చక్కని పుస్తకాన్ని అందించిన లోసారి సుధాకర్ గారికి కృతజ్ఞతలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner