1, నవంబర్ 2016, మంగళవారం

ఏ శిక్ష సరిపోతుందో...!!

చాటుమాటు  వ్యవహారాలు సాగించే వారు తమ నైతిక విలువలను కోల్పోతున్నామని గుర్తించడం లేదు. ఒకప్పుడు
ఒకటి అరా ఎక్కడో పల్లెల్లో వినిపించేవి ఇలాంటివి. ఇప్పుడేమో ఈ అంతర్జాలం పుణ్యమా అని గోడల మీద, చాట్ బాక్సుల్లో విచ్చల విడిగా బరితెగిస్తున్నారు. పెళ్ళాం అంటే పనిమనిషిగా చూసే పెద్ద పేరున్న బడా బాబులు, తమ వయసుతో నిమిత్తం లేకుండా ఆడ పేరు కనిపిస్తే చాలు వెంటనే ముద్దు పేర్లు ఖరారు చేస్తున్నారు. ఇంట్లో పెళ్ళాం ఉండగానే వీరి వీధి బాగోతాలు మిన్నంటుతున్నాయి. చదువుకున్న వాళ్ళు  సంస్కారం మరచి ప్రవర్తిస్తుంటే ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఈ రోజుల్లో మన అందరికి తెలిసిన ఈ ముఖ పుస్తకంలో కనిపిస్తోంది. సమాజంలో మంచి హోదా,  పెద్ద పేరున్న ఎంతోమంది ఈ అనైతిక జీవితాల్లో కొట్టుకుంటున్నారు. మరి వారికి ఈ శునకానందం ఏమిటో అర్ధం  కావడం లేదు. అదేమని భార్య నిలదీస్తే  ఏమి ఎరుగని అమాయకత్వంతో ముఖం చూపడం లేదా తగువుకు తయారు కావడం. ప్రేమ కబుర్లు ఒకరు ఇద్దరు కాదు.. లెక్కలకు అందని బంధాలు మరి ఎన్ని జన్మల అనుబంధాలో ఇవి వారికి. పెళ్ళాంతో ఒక్కమాట ప్రేమగా మాట్లాడలేని ప్రబుద్ధులు, పెళ్ళాం పక్కన ఉండగానే ఒళ్ళు తెలియని మైమరపులతో అలుపు సొలుపూ లేకుండా అమ్మాయిలతో (అన్ని వయసుల వారు ఒక్కటే వీరికి ) అక్షరాలతో అంతులేకుండా మనం చదవడానికి సిగ్గు పడే మాటల ప్రవాహాల్లో ఓలలాడడం. జీతం లేని పనిమనిషిగా భార్యను చేసి తన వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ ప్రతి క్షణం మానసిక, శారీరక హింసలకు గురి చేసే ఈ జాతి వెధవలను ఏమని అనాలో తెలియడం లేదు. ఇక్కడ తప్పు ఒక్కరిదే కాదు, బరితెగించిన ఆడవారిది కూడా. వారికి కుటుంబ బంధాలు లేవని ఎదుటివారి కాపురాల్లో నిప్పులు పోసే ఇలాంటి వాళ్ళకు ఏ శిక్ష సరిపోతుందో ఆ భగవంతుడికే తెలియాలి. కొంత మందిని చూస్తుంటే అమ్మతనానికే అర్ధాన్ని మార్చేసారనిపిస్తోంది. ఆడదానికి ఆడదే శత్రువు అని ఋజువు చేస్తున్నారు వాళ్ళ డబ్బు అవసరాలకు. ఈ వెధవలు వయసు పైబడినా ఇంకా 16+ అనుకుంటూ వారి వెనుక పడి చావడం. చూస్తుంటే చాలా రోతగా ఉంటోంది. తాతయ్యలు, బామ్మలు అయినా కూడా ఈ రికార్డు డాన్సులు ఎందుకో. తమ వయసుకు తగ్గట్టుగా, తాము చేసి వృత్తికి హుందాతనాన్ని ఇచ్చే పనులు చేస్తుంటే చూడటానికి నలుగురికి బావుంటుంది. పనికిమాలిన బొమ్మలు పెట్టడం, దానికో పదిమంది అవాకులు చవాకులు పెడుతూ ఆకాశానికి ఎత్తేయడం చూస్తూ తామో పెద్ద ప్రతిభ కలవారిమి అని సంబర పడిపోవడం. పెళ్ళానికి ఆరోగ్యం బాలేకపొతే కనీసం ఒక్క టాబ్లెట్ ఇచ్చే మనసు ఉండదు కానీ ఈ ముఖ పుస్తక అనైతిక స్నేహాలకు, వారి బంధువులకు ఎంత దూరమైనా సరే వెళ్లి, దగ్గర ఉండి సదుపాయాలూ, సాయాలు చేసే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అనుబంధాన్ని తెగే వరకు లాగవద్దు. మీకు ఇచ్చిన విలువను కాపాడుకోండి.పిల్లలకు మార్గదర్శకంగా ఉండండి కానీ వాళ్ళే మిమ్మల్ని అసహ్యించుకునేలా ఉండకండి. ఇంకా చాలానే చెప్పాలని ఉంది కానీ ప్రస్తుతానికి ఇలా... భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని చేజార్చుకుంటే మన ఖర్మ మనతోనే ఉంటుంది. చేస్తున్న తప్పులకు శిక్షకు బాద్యులుగా మిగిలిపోవాలి. 
అబద్దం ఎప్పుడూ బావుంటుంది.. చేదు నిజాన్ని మరిపిస్తూ...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

Described well enough!
Check out web designing firm
Thanks

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యూ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner