హక్కులు, బాధ్యతల నడుమ కొట్టుమిట్టాడుతున్న మధ్యతరగతి జీవితాలు మనవి. పాత కొత్త తరాల మధ్యన నలుగుతూన్న అనుబంధాలకు వారసులం. బాధ్యతలకు కట్టుబడి బంధాలను వదులుకోలేని బాంధవ్యాలకు బానిసలం. దూరమై పోతున్న చుట్టరికాలను చూస్తూ, తరిగిపోతున్న ఆత్మీయతలు కోసం అల్లాడుతు అక్కడక్కడా దొర్లుతున్న మమతలను పదిలంగా దాచుకోవాలని ప్రయత్నిస్తున్న అతి సామాన్యులం. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలకు ప్రతిరూపంగా అరకొరగా మిగిలిన అనుబంధాలు వెలవెల బోతున్నాయి. ఇవి అన్ని చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిలిచిన అస్సహాయులం.
క్రొత్తగా మారిన విలువలతో, వింతైన జీవన విధానాలు మింగుడు పడక అటు పాత తరానికి, ఇటు కొత్త తరానికి మధ్యన మిగిలిన అసంపూర్ణ జీవితాలై పోయాయి. తోడబుట్టిన బంధాలను, తోడుగా వచ్చిన తోడును అపహాస్యం చేస్తూ కాపురాలను, కట్టుబాట్లను నడిరోడ్డున పడేస్తున్న అహంకారపు మదగజాలను భరిస్తున్న ఎందరో అమృతమూర్తులు కన్నీళ్ళను కాననీయక, బడబానలాన్ని దిగమింగుతూ చిరునవ్వుల చాటున వెతలను దాచేస్తూ, అహానికి తలను వంచుతూ బతుకు బండిని వెళ్లదీస్తున్నారు. మానవతా విలువలతో కూడిన క్రొత్త శకానికి నాంది పలికే రోజు కోసం ఎదురుచూస్తూ... !!
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి