10, అక్టోబర్ 2017, మంగళవారం

మార్పు..!!

నేస్తం,
        మనమున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అని అనుకుంటే అది తప్పే అవుతోంది. పాలక పక్షమా,  ప్రతి పక్షమా అని తేడా లేకుండా ఎవరికి వారు న్యాయాన్ని ఉద్దరిస్తున్నారు. చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు అందరు సమానమే.  మనం ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని చూడకుండా పార్టీని బట్టి ఓట్లు వేస్తున్నాం చాలా వరకు, కాని వారు గెలిచాక అది తమ గొప్పతనమని భావిస్తూ అహాన్ని ప్రదర్శిస్తున్నారు.  దీని వలన పార్టీకి లాభనష్టాలు ఎంత అనేది మళ్ళీ ఎన్నికల్లో తేలిపోతుంది. 
ఉదాహరణకు  మా ఊరినే తీసుకుంటే పంచాయితీ స్ధలాన్ని ఆక్రమించిన ఎమ్ పి టి సి మేడం గారిని అడిగినందుకు పంచాయితీ ప్రెసిడెంట్ ముందే సదరు మేడం గారి భర్త గారు నానా రకాలైన తిట్లు తిట్టి రాళ్ళు విసిరి రెండుసార్లు కొట్టి మూడోసారి కూడ రాయి తీస్తే దగ్గరకు వెళ్ళి ఓ దెబ్బ వేసిన పాపానికి వేంటనే ప్రభుత్వ  ఆసుపత్రిలో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని కాసిని కాసులు సమర్పించి దొంగ పత్రాలు తీసుకుని కేసు పెట్టారు. దీనిలో కొస మెరుపు ఏమిటంటే సాక్షులుగా పంచాయితీ ప్రెసిడెంట్ గారే. ఇదండీ మన ప్రజాస్వామ్యం.
మరో మాట ప్రెసిడెంట్ గారిని నాలాంటి వారొకరు మా వీధి రోడ్డు బాగా పోయింది కాస్త దాని సంగతి చూడండి అని అడిగితే వారి సమాధానం " నువ్వు ఎలక్షన్ లో పోటి చేయ్" అని. పార్టీ పేరు చెప్పి ఇలాంటి వారికి పదవులు అపాత్రదానం చేస్తే పార్టీకి పుట్టగతులుండవు. వారం రోజుల నుండి కోతులు ఊరిని అతలాకుతలం చేస్తుంటే ఈ నాయకుల కళ్ళకు కనపడలేదేమెా. పేరుకి మాత్రం అన్ని తమ ప్రతాపమే అని చెప్పుకుంటారు.   మా ఊరనే కాదు అన్ని పల్లెల పరిస్థితి ఇదే.
మరి మార్పు ఎక్కడ మెుదలవ్వాంటారు...?

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner