29, డిసెంబర్ 2018, శనివారం

అమ్మలకే అమ్మ...!!

నవమాసాలు మెాయకున్నా
రక్తం పంచివ్వని బంధమైనా
మమతలకు నెలవై
మానవత్వానికి మరో రూపమై
జీవకారుణ్యమే జీవిత ధ్యేయంగా
ఓరిమికే ఓదార్పుగా
శాంతి సహనాలకు చిరునామాగా
అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా
దివి నుండి భువికి ఏతెంచిన
అమృతమూర్తి ఈ అమ్మ
సకల మానవాళికి ఆదర్శమే...!!

27, డిసెంబర్ 2018, గురువారం

అంతర్లోచనాలు పుస్తక ఆవిష్కరణ...!!


నా అంతర్లోచనాలు పుస్తక ఆవిష్కరణ గురించి ఈ రోజు గోదావరి పత్రికలో...పత్రిక యాజమాన్యానికి, యడవల్లి శ్రీనివాస్ గారికి నా
మనఃపూర్వక ధన్యవాదాలు
అంతర్లోచనాలు పుస్తకంపై అద్భుతమైన సమీక్ష రాసిన కత్తిమండ ప్రతాప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

సోమేపల్లి కథా పురస్కారాలు...!!

                            " చిన్న కథలకు కీర్తి కిరీటం సోమేపల్లి పురస్కారం " 


                                తెలుగు కథ గురజాడ "దిద్దుబాటు" తో ప్రారంభమై అనేక కొత్త పుంతలు తొక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగింది. తెలుగు కథ వందేళ్ళు పూర్తిచేసుకుని దశాబ్దం గడిచినా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన పెను మార్పుల వల్ల పుస్తక పఠనములో ఆసక్తి తగ్గి అంతర్జాలం, సినిమా, దూరదర్శన్ వంటి మీడియాల  ద్వారా గుప్పెట్లో ప్రపంచాన్ని తిలకిస్తున్న రోజులివి. దాదాపు పుస్తకం అన్న పదాన్నే మర్చిపోయే దిశలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెలుగు భాషపైనున్న మక్కువతో సోమేపల్లి సాహితీ కుటుంబం తీసుకున్న "చిన్న కథలకు సోమేపల్లి పురస్కారం " అభినందించదగ్గ విషయం.
                                   తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు రోజూ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రాచీన కాలంలో పద్యం, కావ్యం చాలా ప్రాచుర్యం పొందాయి. తరువాత వచ్చిన నవల, కథ, కధానిక, నాటకాలు కొన్ని దశాబ్దాలు ప్రజలలో మమేకమైపోయాయి. పద్య కవిత్వం తరువాత వచ్చిన వచన కవిత్వం బహుళ జనాదరణ పొందింది. ఇప్పటి ఆధునిక యుగంలో పుస్తకాలు కొని చదవాల్సిన అవసరం లేకుండా గుప్పెట్లో అన్ని దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద నవలలు, పుస్తకాలు, కావ్యాలు చదివే తీరికా ఓపికా ఇప్పటి తరానికి తక్కువనే చెప్పాలి. ఈ అంతర్జాలం అందరికి అందుబాటులోనికి వచ్చాక వచన కవిత్వానికి బాగా ప్రాచుర్యం లభించింది. ఎన్నో సాహితీ సంస్థలు పలు కవితల పోటీలు నిర్వహిస్తూ కవితలను ప్రోత్సహించడం మంచి పరిణామమే.
                                  నవలలు, నాటకాలు, కథలు చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో తెలుగు కథలకు తగిన ప్రోత్సాహాన్నివ్వడానికి పెద్ద  మనసుతో ముందుకు  వచ్చి నిరంతరాయంగా గత దశాబ్ద కాలంగా నగదు పురస్కారాలను అందిస్తూ క్లుప్తంగా, నిడివి తక్కువలో మంచి అంశాలను చిన్న కథలుగా మలిచే రచయితలను ప్రోత్సహించి సోమేపల్లి పురస్కారాన్ని తన తండ్రి " కీ .శే. సోమేపల్లి హనుమంతరావు " పేరు మీదుగా ఇచ్చి గౌరవించడమనే సత్సంప్రదాయాన్ని పాటిస్తున్న సోమేపల్లి వెంకట సుబ్బయ్య అభినందనీయులు.
                            ప్రప్రథమంగా 2007లో నిర్వహించిన చిన్న కథల పోటీకి వచ్చిన అనూహ్యమైన స్పందనకు తార్కాణంగా నిలిచిన కథలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటుగా 8 కథలకు ఉత్తమ సోమేపల్లి పురస్కారం అందజేయడమే. 2007, 2008,2009,2010.... 2018 ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఈ కథా పోటీలునిర్వహిస్తు మొదటి మూడు స్థానాలతో పాటుగా మరికొన్ని ఉత్తమ కథలను నిష్ట్నాతులైన న్యాయ నిర్ణేతల ద్వారా ఎంపిక చేసి ఆ రచయితలను చలపాక ప్రకాష్ సంపాదకులుగానున్న రమ్యభారతి సాహిత్య త్రై మాసపత్రిక ఆధ్వర్యంలో ప్రముఖుల, పేరున్న కథా రచయితల సమక్షంలో ఘనంగా సన్మానించి గౌరవించడమనే సంప్రదాయన్ని పాటిస్తూ, చక్కని ఇతివృత్తాలతోనున్న ఈ చిన్న కథలు అందరికి అందుబాటులో ఉండాలన్న సదుద్దేశ్యంతో రమ్యభారతి చలపాక ప్రకాష్ సహకారంతో ప్రతి నాలుగు సంవత్సరాల పురస్కారాలు పొందిన కథలను " సోమేపల్లి పురస్కార కథలు "  కథల సంకలనాన్ని వేయడం అందరు హర్షించదగ్గ విషయం. ఇప్పటికి రెండు సంకలనాలు అందుబాటులో చదువరులకు ఉన్నాయి. మరో రెండేళ్ళలో మరో సంకలనం రాబోతోంది. స్వప్రయోజానాలకు చూడకుండా తెలుగు కథలకు అదీ చిన్న కథలకు పట్టాభిషేకం చేస్తున్న సాహితీ పిపాసకులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, చలపాక ప్రకాష్ ల కృషికి తెలుగు సాహితీలోకం ముఖ్యంగా కథా సాహిత్యం ఎంతో ఋణపడిఉంది. వీరి సాహితీ పురస్కారాల సంబరాలు ఏ ఆటంకాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  శుభాభినందనలు. 

26, డిసెంబర్ 2018, బుధవారం

పహరా...!!

కాలం పహరా కాస్తూనే ఉంది
కలల చుట్టూ
గాయం రేగుతూనే ఉంది
మనసుని కాల్చేస్తూ
మాట మౌనంగానే ఉంది
పెదవి దాటి రాలేనంటూ
రెప్ప పడలేనంటూనే ఉంది
భారమైన బతుకుని తల్చుకుంటూ
కడలి నిరీక్షిస్తూనే ఉంది
అలల ఆటలను చూడాలంటూ
జ్ఞాపకం గుర్తు చేస్తూనే ఉంది
గతాన్ని వదలలేని క్షణాల్లో మిగిలిపొమ్మంటూ

25, డిసెంబర్ 2018, మంగళవారం

ఉన్నట్టున్నా....!!

తలపులలోనే ఉన్నట్టున్నా
కనురెప్పల మాటున దాగున్నా
కన్నీటిలో చేరి కలత పెడుతున్నా
వలదంటూ వారించలేకున్నా

వెతల వారధి వీగిపోకున్నా
కలతల అలజడి కలవర పెడుతున్నా
చీకటి చుట్టమై చెంతనే ఉన్నా
రేపటిపై ఆశను వదులుకోలేకున్నా

కలల కల'వరాలు కమ్ముకుంటున్నా
తపన పడే మది తల్లడిల్లుతున్నా
ఊరడించే ఓదార్పు వద్ద లేకున్నా
కాలమేఘాల కదలికనాపలేకపోతున్నా

గతమై వెంటబడకున్నా
జ్ఞాపకమై మిగలకున్నా
యుగాల నిరీక్షణ నీదన్నా
క్షణాల సాహచర్యమే మిన్నంటున్నా...!!

24, డిసెంబర్ 2018, సోమవారం

జీవనాదం....!!

కులమెరుగని గుణమున్నది
మతమెరుగని మానవత్వమున్నది
పిండంగా ఊపిరిపోసుకున్ననాడే
ప్రాణాలకు ఊతమై నిలిచి
సమానత్వమే చాటినది
రక్త తర్పణాలు కాదంటూ
రక్తదానమే మిన్నంటూ
రుధిరపు జాడలు చెరిపేసి
బుుణానుబంధంగా మిగలమని
కొడిగట్టే జీవాన్ని నిలబెట్టి
జీవితాల్లో వెలుగులు నింపుతూ
ప్రాణాధారమైన జీవధార
మనలోని ఈ రక్తధార
నలుగురి ప్రాణం నిలబెట్టే
నిత్య అక్షయధార
అమ్మ పంచిన ఈ అమృతం
ఆత్మబంధమై మిగులు మరుజన్మకు...!!

23, డిసెంబర్ 2018, ఆదివారం

ఆనందహేల...!!

సంబరాల సంతోషాలు
అంబరాన్నంటిన వేళ
బీటలు బారిన బంగరు బయళ్ళు
బావురుమంటూ చెమ్మ కోసం
చెమ్మగిల్లిన కనులతో
ప్రాణధారల స్పర్శకై పరితపిస్తూ
తరాలుగా ఎదుచూస్తున్నా
దశాబ్దాలు గడచినా
దరిజేరని కృష్ణమ్మ పరవళ్ళు
అపర భగీరథుని ప్రయత్నంతో
బాలారిష్టాలు దాటి
ఉరుకుల పరుగులతో
దాహార్తిని దీర్చి
మెాడుబారిన జీవితాల్లో
జీవనాడులను పునీతం చేసిన
ఆ క్షణాల సంతసాలకు సాక్ష్యాలు
వెల్లివిరిసిన ఈ రైతన్న నవ్వులే....!!

21, డిసెంబర్ 2018, శుక్రవారం

యాది..!!

పరిచయం పాతదే అయినా
యాదికి రావడం లేదెందుకో
యాంత్రికత మదినాక్రమించేశాక
యంత్రాల్లా బతికేస్తూ
జ్ఞాపకాలను పాతిపెట్టేసిన
అర్ధనగ్నపు బతుకులైపోయాక
చెదిరిపోయిన బంధాల
గుర్తులను గమనించలేక
గతపు రాకపోకలను
గాయాల ఆనవాళ్ళను
కానుకలనుకుంటూ
కాసుల కోసం కుమ్ముక్కైన
నిర్జీవపు తోబుట్టువుల
మనసు ముసుగులను
తొలగించిన క్షణాలను
వల్లె వేసుకుంటూ
మరో మనిషిలా మారిపోతున్నా...!!

19, డిసెంబర్ 2018, బుధవారం

స్థితి...!!

నిశ్శబ్దం
నిష్క్రమించడం మర్చిపోయింది
నీతో నిండిన జ్ఞాపకాల క్షణాలను
కాలానికి అప్పగించలేక

మనసు
మారుమాటాడక మౌనాన్ని ఆశ్రయించింది
మాటలన్నింటా మూటగట్టిన
నీ ఆనవాళ్ళను తుడిచేయలేక

తనువు
పొడిబారిన కలలన్నింటిని వదిలేసింది
జీవచ్ఛవానికి జీవితం లేదన్న
నీ శాసనానికి కట్టుబడి

ఆరాధన
అనంతానికందని ఆర్తిని దాచుకుంది
అక్షరాల ఆలంబనతో
నిన్ను అభిషేకించేస్తూ

గమ్యం
చిరునామ తెలిసిన చిత్తమంది
నా గమనమే నీవైపంటూ
ఆత్మ నివేదన ఈ కవనమైనది...!!

13, డిసెంబర్ 2018, గురువారం

ఆవాజ్ సమీక్ష..!!

                    సహజ భావాల అక్షర గుళికలు - సామాన్యుని శర పరంపర  " ఆవాజ్ "


         స్వతహాగా భౌతిక శాస్త్ర అధ్యాపకులైన బండి చంద్రశేఖర్ కవిని కాదంటూనే చక్కని కవిత్వాన్ని
మనకందించారు. తన చుట్టూ జరుగుతున్న విషయాలపై స్పందిస్తూ ఎదుటివారి మనసులకు హత్తుకునేలా రాయడంలో కవి కృతకృత్యులయ్యారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతీయత మీద ఇష్టాన్ని, తెలంగాణా మాండలీకంపై ఉన్న మక్కువను ఎక్కడా తగ్గనీయకుండా "ఆవాజ్"  కవితా సంపుటి ఆసాంతమూ తెలంగాణా యాసలోనే ఉంటుంది.  
             ఎక్కడో రాతి పొరల్లో చిక్కుకున్న ఆత్మీయ పిలుపులు, ఇప్పటి యాంత్రిక రాక్షసత్వానికి చిక్కుకుని విల విలలాడుతున్నా మానవత్వపు పరిమళాలు విశ్వమంతా వ్యాపించాలన్నకోరికను  "ఎక్కడో చిన్న ఆశ" కవితలో వినిపిస్తారు. ఇది ఇప్పటి విషాదం కవితలో ఒకప్పటి బాల కార్మికులను, చట్టాలు వచ్చిన తరువాతి బాల్యం కార్పొరేట్ చదువుల  కార్కానాలో ఎలా మగ్గిపోతోందో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. సమాజపు గాయాలకు పూత పూసే చల్లటి అమృత స్పర్శ కావాలి.. ఇప్పుడు కావాలీ అంటారు. డబ్బుకు, అధికారానికి అమ్ముడుబోతున్న పత్రికల అనైతికత్వాన్ని పేరున్న దిన పత్రికలా.. మీరు చేస్తున్న పనేంటి అని నిలదీస్తున్నారు. కల్లోల కాశ్మీరాన్ని, కులం, మతం మంటల్లో బతుకుతున్న ఉగ్రవాదపు ఉన్మాదాన్ని చూస్తూ కూడా ఏమి చేయలేని తోలుబొమ్మలం అవుతున్నాం, శాంతి కోసం ఇక ఎలుగెత్తి చాటే గొంతుకగా మారదాం అని పిలుపునిస్తున్నారు. రాజయకీయపు సర్జికల్ ఎటాక్ ను బాగా చెప్పారు. కార్పొరేట్  వైద్యపు కష్ట నష్టాలు చెప్తూ అత్యాశే అయినా కాని, రోగాలు లేని తన దేశాన్ని చూడటం ఎంత బాగుండు అంటారు. బూటకపు ఎన్ కౌంటర్లలో హతమారిన ధీరులకు " అక్షర నివాళి " అర్పిస్తారు. భజనపరులారా..భద్రం అన్న కవితలో విభజన కోసం జరిగిన యుద్దాన్ని, నాయకుల వాగ్దానాలను మరోసారి గుర్తు చేసి, వేటి కోసం పోరాటం చేసామో అవి దక్కాయో లేదో తెలుసుకోమన్నారు. ఉద్యమ పార్టీ పాలనను, దొరల తీరును ఎండగడితే, నోరు మెదిపితే జైళ్ళు కరుస్తయ్ అని వాస్తవాన్ని ఎంత బాగా చెప్పారో. ఇది నాకు బాగా నచ్చిన కవిత కూడానూ. ఉద్యమ గీతాలను, ధిక్కార స్వరాన్ని ఛిద్రం చేయాలని చూస్తున్నారని ధర్నా చౌక్ కవితలో బాగా చెప్పారు. పెద్ద గీత చిన్న గీతల మధ్య తేడాని అంతరాల తరతమ్యాన్ని రెండు గీతలే...నా అయినా ఎంత తేడా ఉందో  అంటారు. మనసు ఆశలను, ఆలోచనలను చెప్తూ మనస్సుకెందుకు..రెక్కలు అంటారు. ఆహా ఏమి అద్భుతం కవిత ఎన్నికల ముందు రాజకీయ నాయకులు విరజిమ్మిన వాగ్దానాలను గుర్తు చేస్తుంది. ప్రశలెన్నింటినో బందించేసినా కవిత ప్రజల పక్షాన నిలబడిన గళాలను బతికించే పని మనదేనని చెప్తూ ధర్నా చౌక్ కోసం అహర్నిశలు పోరాడే ఉద్యమ గళాలకు మద్దతుగా తన అక్షరాలను అందించారు. కాలపు మాయాజాలాన్ని ప్రశ్నిస్తూ కాలానికెందుకో..ఈ మురిపెం అంటారు. ఉద్యమాల కోసం ప్రాణాలొడ్డిన వారికి జేజేలంటారు నింగిన నలచిన తారలకే కవితలో. మూడు గీరెల చెత్త బండీ కవితలో ఓటును నాగరికుడు తన స్వచ్ఛత కోసం సృష్టించిన రక్తం ఓడుతున్న ఓ కొత్త గాయమని ఇప్పటి నాయకుల తీరుని కొత్తగా చెప్తారు. అవుట్ ఆఫ్ ఆర్డర్ కవిత ఏ టి ఎం మెషిన్ల దగ్గర తరచూ దర్శనమిస్తున్న నోటీసుల కథను చెప్తుంది. ఛానళ్లు రేటింగ్ కక్కుర్తికి ఆశపడి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేయడాన్ని నిరశిస్తారు. మాయమవుతున్న మా బడి కవిత అప్పటి చదువుల గుడిని, ఇప్పటి చదువును అమ్ముకుంటున్న బడిని కళ్ళ ముందుకు తెస్తుంది. అధికారం ప్రజా ధనాన్ని తెలియకుండా ఎలా దోచుకుంటుందో కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కవితలో చెప్తారు. కలికాలంలో ద్వాపర యుగాన్ని, గౌరీ లంకేశ్ హత్యను, జ్ఞానం ఎలా వస్తుందనేది, కార్పొరేట్ గోడలను, ఢిల్లోలో కాదు గల్లీలోనే కవితల్లో నాయకుల నటనను,మోసాలను చూపిస్తారు.  వికృత రూపం కవిత రాయడానికి చాలా ధైర్యం కావాలి. ఓ సామాన్యుడు జనాన్ని ఎలా నమ్మించాడు, అడ్డు తగిలిన వాళ్ళని ఎలా తుదముట్టించాడు, చివరకు ఎలా మరణించాడన్నది ఎంత బాగా చెప్పారంటే మాటలు కూడా చాలనంతగా. 
తెలంగాణమా ఊపిరి బిగబట్టినవా, తెలంగాణా మాగాణంలో..ప్రపంచ తెలుగు, పతంగ్ ఉడ్ రహి హై, ఊహల్లో కలం, క్వారీ, రాజు వేట..రాజరికం ఆట, మాట మారింది గాలి మారిందా, ఇంద్రావతి అమరత్వాన్ని ముద్దాడింది వంటి కవితలు నాయకత్వపు పనితనాన్ని ప్రశ్నిస్తున్నవి. ప్రకృతి నిత్యత్వం కవిత బడుగు జీవికి  చుక్కలు నేర్పిన బతుకు పాఠాన్ని చెప్తుంది. నేను మనిషిని కవిత అంగడిబొమ్మగా మారిన ఆడతనపు మనసు గోడుని చెప్తుంది. బాపు..తమాషా కల్ కా, నీ కడుపుల అంబలి పొయ్య కవితలు  ప్రభుత్వ పాలనను అద్దంలో చూపించాయి. అమ్మా... ఓ మారు ప్రత్యక్షం కావా కవిత ప్రతి ఒక్కరి మనసుని తాకుతుంది. ప్రసవ వేదన పడి, జన్మనిచ్చి, దూరమైన తల్లి ఒడికి మళ్ళి చేరాలని ఏ బిడ్డకు ఉండదు చెప్పండి. నీ పాద ముద్ర కవిత కడుపులోనే పిండాలను చిదిమేస్తున్న రాక్షసత్వాలను చూపిస్తుంది. మాస్క్ కవిత నాగరికత చేసే అనాగరిక చర్యలను, పసి పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. విడివడని కొంగు  ముడి కవిత మూడు పదులు దాటినా తమ వివాహ బంధపు పరిమళాల జ్ఞాపకాలను అందంగా అక్షరాల్లో పొడగడం చాలా బావుంది. ఆరు పదులు దాటిన జీవితంలో ఆత్మీయ మిత్రులను, తనతో ముడిబడిన అనుబంధాలను నెమరు వేసుకున్నారు పర్మనెంట్ స్నేహితులు కవితలో. ఊబి కవిత జీవితపు రహదారిలో బాంధవ్యాలను, బాధలను గుర్తు చేస్తుంది.  బాపూ..నువ్వు యాదికి వస్తున్నవ్ కవిత నాన్న పడిన కష్టాన్ని, నాన్నతో అనుబంధాన్ని ప్రతి ఒక్కరికి గుర్తుకు తెస్తుంది. అందనంత ఎత్తులో కవిత మనసు భావాలను కవిత్వంగా మార్చడానికి అక్షరాల సహకారాన్ని తెలుపుతుంది. పుస్తకావిష్కరణ కవిత ఇప్పటి సాహిత్యపు తీరుతెన్నులను, దేశభక్తుని ఎట్లైత, చెదరని స్వప్నం కవితలు కాలపు మార్పులకు మారిపోతూ, జ్ఞాపకాలుగా ద్వాపర యుగాలను చేసుకుంటున్న మనిషి నైజాన్ని ప్రశ్నించడం బావుంది. అక్కింటి గలుమ కవిత అక్కా తమ్ముళ్ళ ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తుంది. బోలెడు జ్ఞాపకాల గులాబీలను మనకు పంచుతుంది. చివరగా ఫట్..ఫట్.. మోటర్ సైకిల్ కవిత ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్న మోటర్ సైకిల్ సంబరాన్ని, దానిపై చేసిన స్వారీని తలుచుంటూ ఆఖరి ఇన్స్టాల్మెంట్ పైసలు కట్టి సొంతం చేసుకున్నప్పటి ఆనందాన్ని మాటల్లో చెప్ప తరమా అంటూ కవితగా మన ముందుకు తీసుకువచ్చారు. చాలామంది మనసులో కూడా ఇదే భావన సొంతమైన మోటార్ సైకిల్ని చూసుకున్నప్పుడు. 
               చక్కటి యాసలో, తేలిక పదాలతో ప్రాంతీయతను ప్రతిబింబిస్తూ, తన జ్ఞాపకాలను, అనుబుభూతులను, అనుభవాలను, అనుబంధాలను, కోపాన్ని, ఆవేశాన్ని, ఆత్మీయతను ఇలా ప్రతి చిన్న స్పందనను చక్కగా 
ఈ " ఆవాజ్ " కవితా సంపుటిలో అక్షరీకరించి కవిని కాదన్న" సుకవి "బండి చంద్రశేఖర్ కు హృదయపూర్వక అభినందనలు. 

విన్నపం....!!

నా ఆత్మీయులు చాలామంది నాకిస్తున్న సలహాలకి నా మనఃపూర్వక కృతజ్ఞతలు...

మీ అందరికి నా సమాధానం... అక్షరాన్ని అక్షరంగా చూడండి... వ్యక్తిగతానికి విలువనివ్వండి..  సంకుచితమైన ఆలోచనలు వద్దు.

నేను రాసే సమీక్షలు కానీ నాకున్న నేస్తాలు కాని అందరు చాలా వరకు తెలంగాణానేనండి. అది అక్షరానికి నేనిచ్చే విలువ. ప్రాంతీయత మీద ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కులానికి,ప్రాంతీయతకు మాత్రమే విలువ ఇచ్చే వాళ్ళ ఇష్టం వాళ్ళది.  నా లిస్ట్ లో ఉండాలా, వద్దా అన్నది వాళ్ళ నిర్ణయం. నేనెప్పుడు ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను ఆక్షేపించలేదు. కులం, ప్రాంతీయత మీద మీ ఇష్టాలను నాపై రుద్దవద్దు. 

ధన్యవాదాలు మీ అభిమానానికి

11, డిసెంబర్ 2018, మంగళవారం

నాయిక....!!

చీకటి జీవితం నాదైనా
మిణుగురునై వెలుగుతూ
నవ్వులు రువ్వే నాయికను

ఒంటరినై నేనున్నా
అనుబంధాలంటూ లేకున్నా
ఆకలి నేస్తానికి చుట్టాన్ని

క్షణానికో పేరు మార్చుకున్నా
అసలు పేరు గుర్తుకే రాని
అభాగ్యపు బాటసారిని

గమ్యమెటుపోతుందో తెలిసినా
కాయం పచ్చిపుండై కలత పెడుతున్నా
గమనాన్ని ఆపలేని నిర్భాగ్యురాలిని

ఎడతెరిపిలేని ఎందరి మెాహాలకో
ఆటవస్తువునై మిగులుతూ
రాతిరి సామ్రాజ్యపు రారాణిని..!!

10, డిసెంబర్ 2018, సోమవారం

రాతిరెటు పోయిందో....!!

కలత నిదురలో
స్వప్నాలన్నీ కలవర పడుతుంటే

రెప్పలెనుక చీకటిలో
రేయినెదుకుతున్న రేపటి కోసం

నింగినంటిన తారకల్లో
అగుపడని నెలపొడుపు జాడకై

వేసారిన ఏకాంతాలు
మౌనాలను ఆశ్రయించినట్టుగా

క్షణాల దొంతర్లు
నిశ్శబ్ధపు  పాతాళంలోనికి జారిపోతున్నా

జీవితాన్ని గెలవాలన్న ఆశ
వెదుకుతోంది రాతిరెటు పోయిందోనని...!!

ఏక్ తారలు...!!

1.   అలుపు లేదు కాలానికెప్పుడు_మనసుతో మమేకమైన నీ జ్ఞాపకాలతో..!!

2.  శేషమలాగే మిగిలిపోయింది_అనుబంధపు గుణకారాలు అర్ధం కానందుకేమెా....!!

3.  కలం ఉలి నా నేస్తమైంది_మనసాక్షరాలతో భావనకి రూపమీయడానికి....!!

4.   అనుబంధం అల్లుకుంది_ఆర్ద్రతకు ఆరాధన తోడై...!!

5.  రాతిరి విరామమీయలేదు_కలల లెక్కలు తేలడం లేదని....!!

6.   మనసు దాగుండిపోయింది_మమతలన్నీ అక్షరాల్లోకి  ఒంపేస్తూ..!!

7.  మరులెరుగని మమతది_అక్షరాలతో మమేకమౌతూ....!!

8.   మనసుని లిఖించేది అక్షరాలే_భావాల బాధ్యతను పంచుకుంటూ...!!

9.    భావ మాలికలు బారులు తీరాయి_అక్షరాల సందడికి అచ్చెరువొందుతూ....!!

10.   చేజార్చుకున్న క్షణాలు కొన్ని_మరలిరాని కాలానికి ఆనవాళ్ళుగా...!!

11.   అంతరాలెరుగని మనసులివి_అంతరంగాలొకటిగా మసలుతూ...!!

12.   కొన్ని భావాలంతే_విశేషాలను వినిపించేస్తుంటాయలా...!!

13.  కొన్ని పలకరింపులంతే_శీతకన్నేస్తాయలా మనపై....!!

14.  అక్షరాలే జీవితం కొందరికి_ఊహలకు ఊపిరిపోస్తూ..!!

15.  లక్షణాలన్నీ అందిపుచ్చుకున్నాయి అక్షరాలు_విలక్షణ భావాలకు నిలయంగా..!!

16.    మార్పు సహజమే_కాలం వేసే మరపు మందుతో.... !!

17.    ఆణిముత్యమే నువ్వు_స్వాతిచినుకు తాకిన క్షణమే...!!

18.   జ్ఞాపకాలు తోడున్నాయి_మాటల్లేని మౌనాన్ని పంచుకోవడానికి....!!

19.  వ్యాపకమే జ్ఞాపకమౌతోంది_మౌనం మన(సు)తోనున్నప్పుడు....!!

20.   కాలాన్ని ఒడిసిపట్టేది కలమే_అక్షరాలు ఆత్రంగా హత్తుకుంటుంటే...!!

21.   మౌనం వీడిన క్షణాలే అన్నీ_మాటలు నిండిన మనసులు మనవైనప్పుడు...!!

22.   మనసు పలికే మౌనమిది_అక్షర భావాలు అలంకారమై మెరిసాక...!!

23.   బాల్యం బతికిపోయింది_త్వరగా బాధ్యతల పెద్దరికాన్ని ఆపాదించుకుని....!!

24.   శూన్యమాలపించేది నిశ్శబ్ధ రాగమే_లయబద్దమైన నీ జ్ఞాపకాలలో చేరి...!!

25.   మౌనరాగం మృదువైనదే_తాళం లయ తడబడినా...!!

26.  కాలానికి జాగరణే_ముగింపెరుగని ముదితల వెతలు చూస్తూ...!!

27.   భావాలకెంత మక్కువో_అక్షరాల్లో అనుక్షణం నిన్నే తలపోస్తానని...!!

28.   బంధాలకు బందీలే అక్షరాలు_భావాలకు గుణింతాలై గుంభనంగా ఇమిడిపోతూ...!!

29.    మనసంతా నీతోనే_శూన్యాన్ని ఆవహించింది నువ్వయినప్పుడు..!!

30.   కాలానికి జాగరణే_ముగింపెరుగని ముదితల వెతలు చూస్తూ...!!

8, డిసెంబర్ 2018, శనివారం

ఓదార్పు...!!

6.12.2018 న "సత్య నీలహంస(మూర్తి)" వాళ్ళ నాన్నగారు అకస్మాత్తుగా కాలం చేసారు. వారికి ఆత్మశాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు ఓదార్పు కలగాలి.

అద్దె ఇంటికి తీసుకురానివ్వని ఔదార్యం ఇంటివాళ్ళది. ఇంత కష్టంలో ఉండి కూడ ఓటు వేయాలని వెళితే ఓటు గల్లంతు.

సత్యా...కొడుకుగా ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఓ పౌరుడిగా ఈ సమాజంలో మీ కర్తవ్యాన్ని మర్చిపోని మీ వ్యక్తిత్వాన్ని అందరు ఆదర్శంగా తీసుకోవాలి.

కష్టంలో కూడా బాధ్యతను మరువని వ్యక్తులు అరుదుగా ఉంటారు. అమ్మని అపురూపంగా చూసుకునే కొడుకుగా నాకెంతో ఇష్టమైన తమ్ముడు "సత్య"ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ....

6, డిసెంబర్ 2018, గురువారం

అందరికి ఆత్మీయ ఆహ్వానం...!!

నా రాతలు కొన్ని "అంతర్లోచనాలు" అన్న పేరుతో పుస్తకంగా 15 డిసెంబర్ 2018 శనివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంధాలయంలో రాబోతోంది.

పిలవలేదని అలగకుండా, నా మతిమరుపును మన్నించి, ఇది నా ఆత్మీయ ఆహ్వానంగా భావించి అందరూ తప్పక రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

మంజు యనమదల

3, డిసెంబర్ 2018, సోమవారం

నిర్జన వారధి కొండపల్లి కోటేశ్వరమ్మ..!!


       చిన్నప్పటి నుంచి పుస్తకాలు, పాటలు బాగా ఇష్టమవడంతో ఆ పుస్తకం ఈ పుస్తకం అని లేకుండా అన్ని చదవడం అలవాటైన నాకు బాలమిత్ర, చందమాలతోనే కాకుండా పీపుల్స్ ఎన్ కౌంటర్, ప్రజాశక్తి వంటివి కూడా వదలకుండా చదవడం అలవాటైపోయింది. మా చిన్నప్పుడు నాకు తెలిసింది రెండు పార్టీలే. ఒకటి కమ్యూనిస్టు పార్టీ, రెండోది కాంగ్రెస్ పార్టీ. పిల్లలందరూ ఒకటి, నేను ఒక్కదాన్నే కత్తి, సుత్తి, నక్షత్రం అనడం నాకింకా గుర్తుంది. సెలవల్లో మా ఊరు వచ్చిన రాడికల్స్ అక్కలు, అన్నలతో నేనూ తిరుగుతూ వాళ్ళ పాటలు నేర్చుకుంటూ ఉండేదాన్ని. అలా విన్న పేర్లలో కొండపల్లి సీతారామయ్యగారి పేరు ఒకటి. కొన్ని రోజుల క్రిందట చదివిన " నిర్జన వారధి " పుస్తకం సమీక్ష కొండపల్లి కోటేశ్వరమ్మ గారి జీవితచరిత్ర.
    బహుశా తన జీవితాన్ని ఈ " నిర్జన వారధి " అన్న పేరు ద్వారానే మనకు పరిచయం చేయాలనేమో తన ఆత్మకథను చాలా వివరంగా, సంయమనంతో ఓ యోగ స్థితిలో రాసినట్టుగా అనిపించింది. నిర్జన వారధి అంటే మనుష్యులు లేని వంతెన. ఈ మాట తల్చుకుంటే మనసు బాధగా ఉంటుంది ఓ విషాద వీచిక తాకుతుంది కాని మనుష్యులు లేనంత మాత్రాన వంతెన కూలిపోదు. స్థిరంగా అలాగే నిలిచి తరువాత రాబోయే వారిని ఆవలి దరి చేర్చడానికి. "విషాదం వారధిది కాదు, వారధిని వాడుకోలేని వారిది." ఎంత నిజం ఈ మాటలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి విషయంలో. నాలుగు తరాలకు ప్రతినిధిగా, మూడు తరాల్లో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిగా, ఆత్మాభిమానమే ఆభరణంగా మొక్కవోని ధైర్యంతో ఎందరున్నా ఎవరూలేక ఒంటరిగా బతికిన ఓ విషాద చరిత కొండపల్లి కోటేశ్వరమ్మ గారిది.  ఓ మనిషి జీవితంలో కాస్తో, కూస్తో విషాదం ఉండటం సహజం. నూరేళ్ళ జీవితంలో ఎన్నో ఉద్యమ చరితలకు ప్రత్యక్ష సాక్షి. ఈ కాలంలో చరిత్రతో పాటు కోటేశ్వరమ్మ గారి జీవితమూ అనేక మలుపులు తిరిగింది. స్వాత్రంత్య, సంస్కరణ, కమ్యూనిస్టు, మహిళా, వ్యక్తిత్వ జాగరణోద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు ఇలా నాలుగు తరాల మనుష్యుల మధ్యే కాకుండా, ఉద్యమాలకు కూడా వారధిగానే మిగిలిపోయారు.
  "  శకలాలుగా మిగిలిన ఙివితం ఒక వెంటాడే జ్ఞాపకమై
     గుండె భళ్ళున పగిలిన అద్దమై పోతుంది
    ఇవిగో, ఆ పెంకులనుంచి పేర్చిన జ్ఞాపకాలే ఇవన్నీ"అంటూ మొదలౌతాయి ఆమె జ్ఞాపకాలు.
      కోటేశ్వరమ్మ కృష్ణాజిల్లా పామర్రులో 5 ఆగస్టు 1918 జన్మించారు. నాలుగైదేళ్ళ వయసులోనే మేనమామతో పెళ్ళి, పెళ్ళైన రెండేళ్లకే వైధవ్యం, తర్వాత చిన్న వయసులోనే జాతీయోద్యమంలో పాల్గొనడం, అమ్మ అండతో సంప్రదాయాలకు, ఊరిలోని వారికి వ్యతిరేకంగా కొండపల్లి సీతారామయ్య గారితో పునర్వివాహం. కమ్యూనిస్టు భావాలతో ఉత్తేజితుడై, దీక్షగా కార్యకర్తగా పని చేస్తున్న భర్త కొండపల్లి సీతారామయ్యతో కలిసి పార్టీ కార్యకర్తగా, సాంస్కృతిక ప్రదర్శకురాలిగా ఎదగడం, జైలుపాలవడం, పార్టీ నిషేధంలో ఉన్నప్పుడు భర్తకు, పిల్లలకు దూరంగా రహస్యంగా ఉంటూ పార్టీకి సాయపడటం ఇదీ పార్టీ కార్యకర్తగా ఆమె పాత్ర.
     ఇంత చేసినా.. కారణమేదైనా కానీ, ఆమెను వదలి భర్త కొండపల్లి సీతారామయ్య పిల్లలతో కలిసి మరొకామెతో సహజీవనం చేయడం, కనీసం హైస్కూల్ చదువు కూడా లేని 35 ఏళ్ళ కోటేశ్వరమ్మకు ఆర్ధికంగా ఏ ఆధారము లేదు. నిషేధకాలంలో పార్టీ అవసరాల కోసం అమ్మిన నగల సొమ్ము విలువను పార్టీ తిరిగి ఇవ్వబోతే సీతారామయ్య తీసుకోనివ్వలేదు. స్వశక్తితో నిలబడాలన్న ధ్యేయంతో ఆ వయసులో హైదరాబాదు ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదవడానికి చేరి, ఫీజులకు ప్రభుత్వ స్టైఫండ్, రేడియో నాటకాలు, కార్యక్రమాల్లో పాల్గొంటూ, కథలు రాస్తూ వచ్చిన డబ్బును స్వంత ఖర్చులకు వాడుకునేవారు. మెట్రిక్ పాసయ్యాక పై చదువులకు వీలుకాక కాకినాడ గవర్నమెంట్  పాలిటెక్నీక్ కళాశాల అమ్మాయిల హాస్టల్లో వార్డెన్ ఉద్యోగంలో చేరి సాహిత్య సభలలో పాల్గొంటూ రచనలు చేయడం మొదలుపెట్టారు.
      వరంగల్ మెడికల్ కాలేజ్ లో చదువుతున్న కూతురు కరుణ తనతో చదువుతుంటున్న కావూరి రమేష్ ను ప్రేమ వివాహం చేసుకున్నా కోటేశ్వరమ్మ గారికి పెళ్ళిపిలుపు లేదు. కొండపల్లి సీతారామయ్య నక్సలైట్ ఉద్యమానికి నాయకుడైన తరువాత వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేేేేజిలో చదువుతున్న కొడుకు  చందు తండ్రిని వ్యక్తిగా గౌరవించక పోయినా ఉద్యమనాయకుడిగా గౌరవించాడు. కేసుల్లో కొంతకాలం జైలులో ఉన్న చందు కనిపించకుండా మాయమయ్యాడు. కొన్నేళ్ళ తరువాత పోలీసులు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంతో కనీసం కొడుకు శవాన్ని కూడా చూడటానికి నోచుకోని తల్లి ఆమె. కేసుల్లో ఉన్నప్పుడు బెయిల్ పై బయటకు వచ్చినప్పుడు తనతో విజయవాడలో గడిపిన ఒక్క సంవత్సర కాలం సంతోషం మాత్రమే ఆ తల్లిది. ఆకస్మిక మరణం అల్లుడిదైతే అది తట్టుకోలేని కూతురు ఆత్మహత్య మరో విషాదం కోటేశ్వరమ్మ గారి జీవితంలో. అండగా నిలబడిన తల్లి తన కూతురుకన్నా ముందే మరణించడంతో ఒంటరిగా మిగిలిపోయిన జీవితం ఓ విషాద సంద్రం.
      సీతారామయ్య గారిని నమ్మిన పార్టీ నట్టేట ముంచింది, ప్రభుత్వం జైల్లో పెట్టినప్పుడు బంధువెవరో వచ్చి నిన్ను చూడాలనుందట అంటే ఆయనకు చూడాలనుంటే నాకు చూడాలని ఉండొద్దా లేదు కాబట్టి రాను అని నిక్కచ్చిగా చెప్పిన నిజాయితీ ఆమెది. జైలు నుంచి విడుదలైన మతి స్థిమితం లేని సీతారామయ్యను మనవరాళ్ళు ఇంటికి తీసుకు వస్తే ముందు చూడటానికి నిరాకరించినా ఆ స్ఠితిలో చూసి బాధగా అనిపించి హైదరాబాదు వెళ్లి అక్కడ చండ్ర  రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో ఉండేవారు. కొన్నాళ్ళకు సీతారామయ్య గారు మరణించినప్పుడు ఎనభై ఏళ్ళ జీవితాన్ని ఉద్యమం కోసం ధారబోసిన మనిషిని చూడటానికి రాని పార్టీ వాళ్ళను తల్చుకుని " కోటేశ్వరమ్మను సీతారామయ్య తనకు అనుకూలంగా లేదని ఆనాడు వదిలేసాడు. ఇప్పుడు పార్టీ వాళ్ళు సీతారామయ్యను వదిలేసారు. ఇదేనా జీవితం..? అనుకున్నారు. రెండేళ్లుగా విశాఖలో మనుమరాళ్ళ దగ్గర ఉంటూ  19 సెప్టెంబరు 2018 న ఎర్రని తారగా ఆకాశంలో నిలిచారు. తన పార్థివ దేహాన్ని కూడా వైద్య విద్యార్థుల పరిశోధనార్థం ఆంధ్ర మెడికల్ కళాశాలకు అప్పగించారు.
    పసితనం నుండి జీవిత చరమాంకం వరకు సమస్యలతో పోరాడిన యోధురాలు తన జీవితాన్ని ఎందరికో స్ఫూర్తిగా మార్చిన సాధకురాలు, నిరంతర జీవితరణంలో అలుపెరుగని సాయుధ శిక్షకురాలు ఎందరికో మార్గ దర్శకం.
" భూత భవిష్యత్తులకు పట్టుకొమ్మగా నిలిచి, అటు తల్లి తరానికి, ఇటు బిడ్డల తరానికి తన బ్రతుకును వారధిగా చేసి దానిపై నుండి అటు ఒకరు, ఇటు ఒకరు వెళిపోతే... కోటేశ్వరమ్మ నిర్జన వారధిగా మిగిలిపోయింది."  అన్న కవి సోమసుందర్ మాటనే ఎందరి బలవంతం చేతనో ఆమె రాసిన ఆత్మకథకు శీర్షికగా ఎంచుకున్నారు. చిన్న చిన్న సమస్యలకే జీవితాల్ని ముగించుకునే ఎంతోమందికి జీవితపు అర్ధాన్ని, బతుకంటే ఏమిటో, సమస్యల వలయాల నడుమ పోరాటం ఎలా చేయాలో, పుట్టుకకు సార్ధకత ఏమిటో చావులో సైతం చూపిన ధీరవనిత కొండపల్లి కోటేశ్వరమ్మ గారు. ముఖ పరిచయం కానీ, పుస్తక పరిచయం కానీ ఆమెతో లేని నేను ఆమె గురించి ఎంతోమంది రాసిన వ్యాసాల నుంచి సేకరించి రాసిన వ్యాసం ఇది. 
      

30, నవంబర్ 2018, శుక్రవారం

ఎదుటివారి రాతలను...!!

నేస్తం,
        ఏ వ్యాపకం ఎలా ఉన్నా, ఏ అనుబంధం ఎటు పోతున్నా మనకంటూ మిగులుతున్న కొన్ని క్షణాలను మనకిష్టమైనట్లు గడపాలనుకోవడం కూడా అత్యాశగానే మిగిలిపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయత. బాధ్యతలు, బంధాలు చివరి క్షణాల వరకు మనతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. పలుకు నేర్వనమ్మకి  మాట కూడా బరువేనన్నట్టుగా అవుతున్న రోజులివి. మనమెవ్వరి జోలికి పోకున్నా పనిగట్టుకుని మనతో కయ్యానికి కాలుదువ్వే నైజాలు అడుగడుగునా ఎదురౌతూనే ఉన్నాయి. ఈ సామాజిక మాధ్యమాల వాడుక పెరిగిన కొలది ఒకరు బావుంటే ఒకరు ఓర్వలేనితనం ఎక్కువై ఎవరికి వారు వారు చెప్పిందే వేదం, వారి ఇష్టాలే గొప్పవి అన్నట్టుగా మరొకరిని ఎద్దేవా చేయడం పరిపాటిగా మారిపోయింది. వ్యక్తి పూజలు, పుల్లవిరుపు మాటలు, ప్రతిదానికి రాజకీయ రంగులు పూలమడాలు, కులం ముసుగు కప్పడాలు బాగా ఎక్కువై పోయాయి. మనం ఎవరిని విమర్శించక పోయినా పనిగట్టుకుని మరి మన గోడలకొచ్చి ఎవరేమిటి అన్నది తెలియకుండా ఎదో ఒక రంగు పులిమేస్తూ హమ్మయ్య అని చంకలు గుద్దుకుంటూ శునకానందం పొందడం నిత్యకృత్యమై పోయింది.
       మన చేతికున్న ఐదు వేళ్ళే ఒకలా ఉండవు అలాంటిది అందరికి ఒకే ఇష్టం ఎలా ఉంటుంది? ఒకరికి ఇగురు ఇష్టమైతే మరొకరికి పులుసు ఇష్టమౌతుంది. నా గోడ మీద కాని, నా బ్లాగులో కాని, నేను పంపే పత్రికలకు కాని ఏమి రాయాలన్నది పూర్తిగా నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులకో, మరోదానికో అమ్ముడుబోయి రాసె రాతలు నావి కాదు. రాయాలనిపించినప్పుడు మాత్రమే రాసే రాతలు నావి. నేనెప్పుడూ ఎవరి రాతలను కాని, ఇష్టాలను కాని విమర్శించలేదు. అలా అని నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను అది ఎవరైనా సరే. ఏం మీకు నచ్చిన పోస్ట్లు మీరు పెట్టుకుంటున్నప్పుడు ఎదుటివారికి అదే వర్తిస్తుందన్న చిన్న ఆలోచన మీకెందుకు లేదు. మీకిష్టమైన వారిని మీరు పొగుడుకోవచ్చు కాని మరొకరు ఎవరినైనా పొగిడితే మాత్రం తట్టుకోలేరు.. ఇదెక్కడి న్యాయం? సమీక్షలు, రాజకీయ విశ్లేషణలు, కవితలు ( ఓ మన్నించండి నేను కవిని కాదు ) కాదు కాదు భావాలు అనాలి కదా ఇలా నాకు నచినవే నేను రాస్తాను. చదివితే చదవండి లేదా నిరభ్యంతరంగా వెళ్లిపొండి, అంతేకాని ఉచిత సలహాలు ఇవ్వకండి. న రాతలు పూర్తిగా నా ఇష్టం. నేనేం ఎవరిని బలవంతపెట్టో, మొహమాటపెట్టో చదివించడం లేదు. అలాగే నేను స్పందించే తీరు కూడా. ఒకరడుగుతారు పూర్తిగా చదివే స్పందించారా అని, మరొకరడుగుతారు ఎన్నిసార్లు స్పందిస్తారు అని... రాతలకు, స్పందనలకు విలువ తెలిసిన వారు అర్ధం చేసుకోండి. కొందరికేమో అసలు అక్షరాల విలువ, స్పందనల విలువ తెలియదు. మీరు గొప్పవారే, మీ రాతలు చాలా గొప్పవే అయ్యుండొచ్చు. మీకు బోలెడు అవార్డులు, రివార్డులు వచ్చి ఉండొచ్చు. స్పందనకు కనీసం ప్రతిస్పందించడం సంస్కారం అని తెలుసుకోండి. మీ రాతలే గొప్పవని, మరెవరూ మీ అంత గొప్పగా రాయలేరని అనుకుంటూ ఓ రకమైన భ్రమలో ఉండిపోతే అది మీకే నష్టం.
ఎదుటివారి రాతలను కించపరచని సంస్కారం అందరు అలవర్చుకోవాలని మనసారా కోరుకుంటూ... 

ఏక్ తారలు...!!

1.   ఆలోచనా ఎక్కువే అక్షరానికి_అర్ధవంతమైన భావమై ఇమడాలని...!!

2.  మనసులో ప్రతిష్టించుకుంది_తలపుల అక్షరాలతో చేరువౌతూ....!!

3.   సుతి మెత్తనిదే అక్షరం_చురకత్తిలా మారినా....!!

4.   వేగుచుక్కగా మారి వెన్ను తట్టింది_ఓదార్పు తానైంది అక్షరం....!!

5.   శాంతి సంద్రాన్ని కానుకిచ్చింది అక్షరం_కల్లోల కడలిని తాను హత్తుకుని..!!

6.   తీరని మెాహమే మరి_అలవాటై అల్లుకున్న అక్షరాలపై...!!

7.  ఊతమై మిగిలింది ఎందరికో_ఒంటరి అక్షరంగా తనుంటూ...!!

8.   భావదాహార్తి తీరడం లేదు_తనివితీరని అక్షరానుబంధం పెనవేసుకుని..!!

9.  రేపటి కోసం ఎదురుచూస్తున్నా_నన్ను వదిలుండలేని నీ రాకకై...!!

10.  కన్నీరు కలత చెందినట్లుంది_చెక్కిలిని అంటిపెట్టుకుని ఉండలేనని...!!

11.  కల కలత పడుతోంది_మన పరిచయం కలవరమౌతోందని...!!

12.   దగ్గర కాలేనప్పుడు తెలుస్తుంది_మనసుల మధ్యన దూరమెంతని....!!

13.   నేల రాలినా నిత్య పరిమళమే_పారిజాతమంటి నెయ్యానికి...!!

14.  మనసే లేదంటే మారాము చేసావుగా_ఇచ్చి పుచ్చుకోవడాలు మనకెందుకంటూ...!!

15.  ఆంతర్యం అలవాటైంది_నజరానాలక్కర్లేని మనసాక్షరానికి...!!

16.   అక్షరాలతో అవధానమే మరి_భావ పూరణాలనంతమైనప్పుడు...!!

17.   గతంగానే మిగిలిపోయా_నువ్వు తిరిగొస్తావన్న ఆశతో...!!

18.  ఎన్ని అక్షరాలు గుమ్మరించాలో_మది మౌనానికి మాటలద్దాలంటే...!!

19.   అక్షరారాధన అనంతమైనది_భావాలక్షయమై పొంగుతుంటే...!!

20.   భావాలన్నీ అక్షరబాట పట్టాయి_నీ మౌనమేమంత్రమేసిందో....!!

21.  గాలమేశాయి అక్షరాలు_నీ చిత్తరువే చిత్తంలో చేరినందుకనుకుంటా..!!

22.   కనికట్టు చేయలేకపోయాయి అక్షరాలు_కంటికెదురుగా నీ రూపుంటే..!!

23.   కాలమేఘం కదులుతూనే ఉంది_జీవితపు రంగులన్నీ మెాసుకెళ్తూ...!!

24.   మనసే అక్షరంగా మారింది_నా భావనలన్నింటా నువ్వేనని గుర్తెరిగి..!!

25.   అక్షర మేఘాలు అలముకున్నాయి_మది అలజడులను చిలకరించడానికి....!!

26.  మానసాలొకటిగా చేసినది ఈ అక్షరాలే_మౌనం మనదైన తరుణాన...!!

27.  సందర్భం రాలేదుగా_మేఘసందేశమివ్వడానికి...!!

28.   బంధం బలమైనదే_బలహీన క్షణాలకు తిలోదకాలిస్తూ...!!

29.  మౌనమూ బావుంది_అలవాటైన జ్ఞాపకాలను కాలంతో కట్టి పడేస్తుంటే...!!

30.   చలించేది నీ చిరునవ్వులకే_మది గాయం మానకున్నా....!!

23, నవంబర్ 2018, శుక్రవారం

అధ్యక్షా...!!

అధ్యక్షా.....!!

ఏ రాష్ట్రానికి ఎవరేం చేసారో చెప్పుకుంటే నాలుగు ఓట్లు పడతాయి, కానీ ఒకే పేరుని పగలనకా రాత్రనకా జపం చేస్తుంటే ఆ నాలుగు ఓట్లు కూడా పడవు. 100 సీట్లు వస్తాయన్న నమ్మకమున్నోడికి 13 సీట్లకు పోటి చేస్తున్నవాడంటే భయమెందుకో మరి..  నలుగురూ జపించే నారాయణ మంత్రమెుకటే....😊

18, నవంబర్ 2018, ఆదివారం

వాణి వెంకట్...!!

                              మనసు గాయాలే ఈ కన్నీటి కావ్యాలు...!! 

             గాయాలను గేయాలుగా మార్చి, గుండె తడిని అక్షరాలకద్ది తన సాహిత్యంతో అందరి మనసులను దోచుకుంటూ, తాను రాసే అక్షరాల్లో విధి దూరం చేసిన బంధాన్ని అనుక్షణం తనతోనే నింపుకున్న వాణి వెంకట్ ముఖపుస్తకంలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కలత పడుతున్న మనసుని కనుల మాటున దాచేస్తూ,  చెమ్మగిల్లిన కన్నులకు బాధను  పంచుకునే  పదాలను పరిచయం చేస్తూ తనదైన భావాలతో, అక్షరాలతో ఊరట పొందుతూ అందరి మనసులను తడుముతున్న కవిత్వం అందిస్తున్న వాణి వెంకట్ అభినందనీయులు. 
         కాలం మాన్పలేని గాయాన్ని కలం ఆసరాతో తనకు తానే ఓదార్చుకుంటూ పదిమందికి చక్కని చిక్కని సాహిత్యాన్ని తెలుగు భాషలో అందిస్తున్న వారిలో వాణి వెంకట్ ఒకరు. ఇప్పటి తెలుగు సాహిత్యంలోనున్న వివిధ ప్రక్రియల్లో అందె వేసిన చేయి వాణి వెంకట్ ది. 28 అక్షరాల్లో అద్భుతమైన భావాలు ఏక్ తారలుగా పొదగాలన్నా, రెండు వాక్యాల్లో ఓ గుండె గాయాన్ని చూపాలన్నా అది వాణి వెంకట్ కే సాధ్యం. చిత్రానికి కవిత రాసినా, గజల్ రాసినా, తేటగీతి పద్యం రాసినా ఆమెదొక ప్రత్యేక శైలి. చాలామంది కవితలకు  అద్భుతమైన విశ్లేషణలు రాసి అందరి మన్ననలు పొందడం వాణి వెంకట్ కే చెల్లింది. నిరాశల్ని నిశిలో దాచేస్తూ అక్షరాలతో కనీళ్ళు తెప్పించడం అలవోకగా చేసేస్తారు. దూరమైన బిడ్డను ఎలా అపురూపంగా ఈ భావంలో దాచుకున్నారో చూడండి. 

చెరిగి పోనివ్వను గుండెల్లో గతానెప్పుడు... 
నీ రూపం అపురూపమై జ్ఞాపకాల్లో మిగిలిపోయిందని..!! 

తన అక్షరాలన్నీ తడివేనంటారు మన గుండెలను కూడా తడి చేస్తూ ... 

తడి అక్షరాలే అన్ని_గాయాలను ఆరబెట్టుకుంటూ..!!
ఎన్ని తిమిరాలను పోగేశానో...బాధలు భావాలౌతున్నాయి..!! ఇలా ఎన్నో భావాలను చక్కని పదాల అల్లికతో అందించడం వాణి వెంకట్ ప్రత్యేకత.
    ఖాళీ అధ్యాయం కవితలో వెలుగు పరదాల మాటున దాగుంటే చీకటి నిండిన వెలితిగా మిగులుతూ జీవితమంతా ఖాళీతనమేనంటారు. బంధాలెన్ని ఉన్నా అనుబంధానికి అర్ధం అర్ధమవని సందిగ్ధమే ఎప్పుడూ .. అని అనడంలో ఎంత లోతైన అర్ధం ఉందో. దుఃఖంతో మౌనం నిండిపోతే, సమాధానం దొరకని మనసుకు అలసిన ఆఖరి దశలో తెలుస్తుంది జీవితమొక ఖాళీ అధ్యాయమని అనడంతో కవితకు ముగింపునిస్తారు. 
కంటిపాప చీకటైనది కాంతి ఏమిటి చేయగలదూ
కలల ఓటమి కావ్యమైనది కాల మేమిటి చేయగలదూ.. !! అంటూ జ్ఞాపకాల దృశ్య కావ్యానికి, ఓడిపోయిన సంతసాల దుఃఖాన్ని,  అమ్మ చెప్పిన భాష్యాన్ని గుండె గుండెను కదిలిస్తూ చక్కని గజల్ లో వినిపిస్తారు. 
             అమ్మ గురించి చెప్పినా, నాన్న అందించిన అక్షరాల ఆసరా గురించి చెప్పినా, మౌనంలో మాటలను, నిశ్శబ్దంలో నిశి రాగాలను, దూరమైన పేగు బంధాన్ని చేరుకోలేని నిస్సహాయతను అక్షరాలతో పంచుకున్నా, చేదోడు వాదోడైన చెలిమికి పెద్ద పీట వేసినా, గాయం చేసిన గతాన్ని జ్ఞాపకంగా మార్చుకున్నా ఇలా ఏది రాసినా అది వాణి వెంకట్ గుప్పెడు గుండెలోని రెప్పల చాటు చప్పుడే. మనసు కడలిలో దాచుకున్న నిప్పును కన్నీటి ఉప్పెనగా చేసి అక్షరాలను కంటతడి పెట్టిస్తున్న వాణి వెంకట్ కవిత్వపు భావజాలం చదివిన ప్రతి ఒక్కరిని కొంత కాలంపాటు వెంటాడుతూనే ఉంటుంది. పదిమంది మెచ్చే కవిత్వం పది కాలాలు పదిలంగా ఉంటుందన్నట్టు వాణి వెంకట్ మనసు కవిత్వం మనల్ని వెన్నాడుతూనే ఉంటుందనడంలో ఎట్టి సందేహమూ లేదు. నొప్పింపక తానొవ్వక అన్నట్టుండే వాణి వెంకట్ తెలుగుసాహిత్యంలో తనదైన ముద్రతో సాగిపోవాలని మనసారా కోరుకుంటూ... అభినందనలు . 
 

14, నవంబర్ 2018, బుధవారం

ఏక్ తారలు...!!

1.   నవ్వులు నటించలేనంటున్నాయి_నీ నిష్క్రమణాన్ని తట్టుకోలేక...!!

2.  చేరువ కాలేని జీవితమిది_తీరమెరిగిన అలల ఆటుపోట్లకు...!!

3.  ఊతమవ్వదా నా చెలిమి_తీరమెుకటైన మన జీవితాలకు...!!

4.  సంద్రమంటి చెలిమి నీదయ్యింది_సెలఏటిని చేరని నీ చింతని మాపడానికి....!!

5.  అక్షయమే జ్ఞాపకాలు_మరుపులేని కాలపు క్షణాలకు...!!

6.   అక్షరాలకే సాధ్యమది_అశ్రువులను సైతం అందమైన భావాలుగా మార్చేస్తూ...!!

7.   పన్నీటి జల్లులుగా మారుతున్నాయి_మనసు భారాన్ని అక్షరాలు మెాస్తూ...!!

8.  లలితమైనదే మనసు సాహిత్యం_లాలిత్యం అక్షరాల సొంతమైతే...!!

9.   ఎడబాటు తప్పని మనసులు_అక్షరాలతో మమేకమౌతూ...!!

10.  సేతువుగా చేరి నిలిచింది భావం_మనసాక్షరాలనొకటిగా చేస్తూ...!!

11.   గెలుపు తథ్యం_భావనాత్మక అక్షరాలకు...!!

12.  మురిసి ముదమందలేనా_పలకరించేవి నీ తలపుల సవ్వడులైతే....!!

13.   మనసైన జీవితమైంది_నా నవ్వులన్నింటా నువ్వున్నావని...!!

14.   అంతర్ముఖీనతను ఆపాదించుకున్నా_అంతర్లోచనాలు నా మనసాక్షరాలని...!!

15.   ఆర్ద్రతకు చోటెక్కడిది_ఆత్మీయత అందరానిదై పోతుంటే...!!

16.    మనసే అక్షరంగా మారింది_వెదికిన పెన్నిధి దొరికినందుకనుకుంటా....!!

17.   గుట్టగా పోసినందుకు కాదట బెట్టు_గుట్టుగా అక్షరాన్ని దాయనందుకట...!!

18.   అక్షరాలన్నీ అక్షయమైన భావాలౌతున్నాయి_గుప్పెడు గుండెలో దాగలేక...!!

19.   మనసు భారాన్నంతా ఒంపేసా_అక్షరాలకు బాధ్యత గుర్తుజేయాలని...!!

20.   మనసు భావాలను క్రమబద్ధం చేస్తున్నా_అక్షరాల అండదండలతో....!!

21.  మౌనమెంత ముగ్ధంగా ఉందో_అలక నేర్చిన మనసు పలుకుల్లో....!!

22.   తడక్షరాలు పొడిబారుతున్నాయి_మనసెడారిగా మారిందనుకుంటా....!!

23.  విలాపమే మిగిలింది వాస్తవానికి_గత గాయాలు మిగిల్చిన ఆనవాళ్ళతో...!!

24.   మనసెప్పుడూ ఒంటరిదే_మనిషిదనపు ముసుగుకు బలౌతూ...!!

25.   అలజడిదెంత ఆరాటమెా_నీ తలపులకు వీడ్కోలివ్వలేక....!!

26.    అంతిమ క్షణాలకు ఆయువు పోస్తాయి_జీవం నింపుకున్న జ్ఞాపకాలైతే...!!

27.   వీడ్కోలుకు విషాదమెందుకట_మరో కలయికకు నాందిగా మారినప్పుడు...!!

28.   మనసు ముచ్చట్లే ఇవి_మౌనముద్రలన్నీ పద మంజీరాలైన వేళ...!! 

29.   ఆలోచనెక్కువే అక్షరానికి_మనసుని పదాల్లో మలిచేందుకు....!!

30.   తీరని దాహమే మరి_నెయ్యపు ఆనవాళ్ళ సామీప్యం...!!

11, నవంబర్ 2018, ఆదివారం

కంటిధార.....!!

పజ్రగిరి జస్టిస్ గారి అద్భుతమైన చిత్రానికి నా చిన్న ప్రయత్నంగా....

ఓపలేని భారాన్ని
వెన్నాడుతున్న గత గాయాలను
జ్ఞాపకాలుగా మార్చుతూ
మూసిన రెప్పల మాటున
వెతల వేదనను దాచేస్తూ
మది నింపుకున్న
కలల కడలి ఒంపిన
కన్నీటి చినుకులకు
తడిసిన చెక్కిలి
చెప్పిన మగువ మానసపు
విగత జీవపు మింటిధార
సెగల పొగల మెుదటిధార
ఈ కలకంఠి కంటిధార...!!

9, నవంబర్ 2018, శుక్రవారం

విధ్వంసానికి విరుగుడు...!!

పరమాణువులతో
ప్రకృతిని పరిహసిస్తూ
మానవ మేధస్సుకు గులామంటూ
అండపిండ బ్రహ్మాండాలను
అతలాకుతలం చేస్తూ
కృత్రిమ జీవితాల్లోబడి
జీవకణాలను నిర్వీర్యంగావిస్తున్న
ఆధునికత ఓ వైపు

పచ్చదనపు పరిచయాన్ని
ప్రాణాధారపు పలకరింతలను
స్వచ్ఛదనపు సాంత్వనను
కనువిందైన జీవితాన్ని
కోల్పోతున్న లోపాలనెత్తి చూపుతూ
మూలాధారాలను మరవద్దని
మాయల మత్తులో తూగొద్దని
పర్యావరణ పరిరక్షణ పరమావధి
సమాజ శ్రేయస్సుగా చెప్పాల్సిన
దుస్థితీనాడు

ఆద్యంతాల సృష్టి నడుమన
అవకతవకల అస్పష్టాకారాలకు
పరిపూర్ణతనందించే దివ్యౌషదం
కల్తీ ఎరుగని ఆకుపచ్చని అవని...!!

7, నవంబర్ 2018, బుధవారం

రెప్ప...!!

కనురెప్ప మూయని జీవితానికి
ఆ రెప్పల మాటున
మెదిలే కలలెన్నో
మదిలో కదలాడే బాసలకు
ఆలంబనగా నిలిచే
అనుబంధపు ఆసరాలెన్నో
వేవేల వర్ణాలద్దిన
ఊహలకు ప్రాణం పోసిన
స్వప్నచిత్రాల సౌందర్యాలెన్నో
గాయాలనోదార్చేందుకు
బతుకు పయనంలో
రాలిన కన్నీళ్ళెన్నో
కాలపు కనికట్టులో
దిగులు దుప్పటి దాచిన
రెప్పల చప్పుళ్ళెన్నో....!! 

6, నవంబర్ 2018, మంగళవారం

జీవన "మంజూ"ష (డిసెంబర్) ..!!

నేస్తం,
        అవసరాలకు అనుగుణంగా మనుష్యులు మారుతున్నారడానికి మనమే ప్రత్యక్ష సాక్షులుగా  మిగిలిపోతున్నాం. రక్త సంబంధాలను కూడా అవసరార్థ అనుబంధాలుగా మార్చేస్తూ ఆదాయపు బంధాలపై మాత్రమే ప్రేమలు ఒలకబోస్తూ బతికేస్తున్నామిప్పుడు. నేను అన్న స్వార్థం ఉండడం మనిషైన ప్రతి ఒక్కరికి సహజమే, కాని ఆ స్వార్థం  ఎంతగా పెరిగిపోయిందో చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే మనం మానవ సమాజంలోనే ఉన్నామా అని ఓ సందేహమూ పొడచూపుతోంది. "మా ఇంటికి వస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు" అన్న మనస్తత్వాలే ఇప్పుడు అన్ని. మన అవసరానికి మనం మారిపోతూ, ఆ మార్పే ఎదుటి వారిలో కలిగితే ఎదుటి వారిని తప్పు పట్టడం. పలకరింపు అనేది మనసు నుండి రావాలి కాని తెచ్చిపెట్టుకుని పలకరించడం కాదు. మనకు పలకరింపు దక్కలేదనో, గుర్తింపు దక్కలేదనో బాధ పడటం కాదు మనం ఇతరులను ఎంత వరకు గుర్తిస్తున్నామన్నది బేరీజు వేసుకోవాలి మనకంటూ ఓ మనస్సాక్షి ఏడిస్తే. మన ఇంటివాళ్ళు చేస్తే సబబు, అదే వేరే ఎవరైనా చేస్తే భరించలేని తప్పుగా చూడటం మానేసి తప్పుని తప్పుగా చెప్పగలిగే మనసు, నడవడి అలవర్చుకోవాలి. సూటిపోటి మాటలు తూలడం, అనుబంధాలను డబ్బు బంధాలుగా చూడటం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. పైకి మాత్రం పూజలు, వ్రతాలు, గుళ్ళు గోపురాలు, భజనలు, సూక్తిసుధలు వినిపిస్తూ తమ లోపాయికారితనాన్ని నలుగురికి తెలియనీయకుండా తేనెల మాటలతో ముసుగులు వేసేస్తూ ఉంటారు. నటన అనేది ఎన్నో రోజులు దాగదు అని తెలిసినా భలే నటించేస్తూ బతికేస్తుంటారు. అనుబంధాలకు విలువలీయని వీళ్ళు ఎంత గొప్పగా నలుగురికి ఆత్మీయ బంధాల గురించి చెప్తారో, వీరిని పుట్టించిన ఆ  బ్రహ్మ కూడా నివ్వెరపోయేలా. కోపం, ఆవేశం వస్తే అమ్మాబాబు, అక్కాచెల్లి ఎవరినైనా ఏకిపారేస్తారు. ఆ సేవలు, ఈ సేవలంటూ దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు. పిల్లలను పట్టించుకోని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు, వెలవెల పోతూ వెలిసిపోతున్న మూడుముళ్ల బంధాలు ఇవే ఇప్పటి కుటుంబ వ్యవస్థలు. దూరం పెరిగిపోతూ బీటలువారుతున్న అనుబంధాలు ఎక్కువైన నేటి ఆధునిక సమాజం మనది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు దిగజారిపోతున్న మానవ అనుబంధాలకు స్వయంకృతాపరాధాలెన్నో, ఇతర కారణాలెన్నో.. మార్పు మంచికో చెడుకో అర్థం కాని ప్రస్తుత వ్యవస్థలో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మారలేని మనసులు కొన్ని.. ఈ జరుగుతున్న సంఘటనలకు సాక్షులుగా మిగిలిపోతూ...

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం... 
    

3, నవంబర్ 2018, శనివారం

సంతోషాల లోగిళ్ళు....!!

వజ్రగిరి జస్టిస్ గారి చిత్రాలకు ఓ చిన్న ప్రయత్నం.... ధన్యవాదాలు అండి మీ చక్కని చిత్రాలకు... 


కనుమరుగౌతున్న
సంప్రదాయపు నిధులు
గత వైభవ చిహ్నాలుగా

భట్రాజు పొగడ్తల
భజనాట్టహాసాల నడుమ
రంగరంగ వైభోగంగా

కాడెద్దుల సేద్యాల
కనువిందైన కర్షకుల హర్షాల
ఆనందాతిశయపు ఆహ్లాదాలుగా

చిరుజల్లుల సందడులు
చిట్టిపొట్టి చిన్నారుల అల్లరులతో
ప్రతి ఇంటి గడప కనుల పండుగగా

నాదస్వరాల ఆలాపనలు
హరిదాసు సంకీర్తనల గానాలతో
సిరుల సంతోషాల లోగిళ్ళు పల్లె జీవితాలు ఆనాడు

బోసిబోయిన ముంగిళ్ళు
బావురుమంటున్న అనుబంధాలతో
అతి అనావృష్టి పాలబడి బిక్కుబిక్కుమంటున్న బతుకులీనాడు...!! 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner