వ్యవస్థలో విలువలు తగ్గుతున్నాయంటే కారణాలు మరెక్కడో వెదుకుతాం కాని వెదుకులాట మనతోనే మొదలు పెట్టం. ఎందుకంటే మన మీద మనకంత నమ్మకం. మనం ఏ తప్పు చేయని ప్రబుద్ధులమని ప్రగాఢ విశ్వాసం కూడాను. పెళ్ళాం / మొగుడు పిల్లల మంచి చెడు అవసరం లేదు. ప్రపంచానికంతా ఆదర్శవంతులమే కాని మన ఇంట్లో మాత్రం ఎవరి అవసరాలు పట్టించుకోము. కుటుంబం మన అలంకారానికనుకుంటూ, బాధ్యతలు పంచుకుని, బంధాలను పెంచుకోవడానికని మాత్రం మర్చిపోతాం. ఆపదల్లో అందరిని ఆదుకోవడానికి మన విశాల హృదయాన్ని చాటుకుంటాం ఎల్లప్పుడూ. మంచితనం ముసుగు మనమే కప్పుకున్నామో, మరెవరయినా మనకు దాన్ని ఆపాదించారో తెలియని స్థితిలో ఆ ముసుగు నుండి బయటకు రావడానికి ఇష్టపడక నటిస్తూనే జీవించేస్తుంటాం.
బాధను సంతోషాన్ని పంచుకోవడానికి మన అన్న వారికి మనం ఎలా లేకుండా ఉంటామో, రేపటి రోజున మనకంటూ ఎవరు ఉండరని తెలుకోలేము. చావు పుట్టుకలు ప్రతి ఇంటిలోనూ సహజమన్నది మరచి, మన అహంకారానికి మనమే మురిసిపోతూ డబ్బు పొగరుతో ఆ డబ్బు జబ్బుని మర్చిపోయి రేపన్నది మనకి ఉంటుందని గుర్తు లేనట్టు ప్రవర్తిస్తాం. విభజించి పాలించడం రాజకీయాల్లోనే పరిమితం కాకుండా మనమూ ఆ లక్షణాలన్నీ అవపోసన పట్టేసి అనుబంధాలను అతలాకుతలం చేస్తూ మన ప్రతిభకు మనమే గర్వపడి పోతున్నాం. ఆ ఇంటి బాధ రేపటి రోజున మన ఇంటిది కాకుండా పోదని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము. వయసు పెరుగుతున్న కొలది మన వ్యక్తిత్వం నలుగురు మెచ్చేదిగా ఉండాలి కాని నలుగురిలో నవ్వులపాలు కాకూడదు. నీతి సూత్రాలు వల్లే వేసి, నాలుగు గుడులు తిరిగినంత మాత్రాన మన సహజ లక్షణం పోయి మనము ఏమి మహాత్ములమైపోము. మనస్సాక్షి ఉంటుంది కదా దాన్ని తరచి చూస్తే తప్పొప్పులు తేటతెల్లమౌతాయి. కాదు కూడదు అహంకారాన్నే ఆభరణంగా అమర్చుకుంటామంటారా అది మీ ఇష్టానికే వదలి నలుగురితోపాటు నారాయణా అనడం మేమూ నేర్చుకుంటాం.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి