1. ప్రణయం..
పరిచయమయ్యాకే తెలుపుతుందనుకుంటా
బంధాల నడుమ బాంధవ్యాన్ని...!!
2. మాయ చేసినా
మరిపించినా
జ్ఞాపకమెప్పుడూ మురిపెమే...!!
3. చిక్కని చీకటి వనంలో
ధవళ వర్ణ శాంతి కపోతం
స్వేచ్ఛా వాయువులకై గగనయానం...!!
4. నిర్భందించే ఆ చేతులు
నిజానికి చేయూతనిస్తే
రాజ్యాంగపు చట్టాలతో పనేముంది..!!
5. రాబడి లేని రాయబారాలెన్నో
మౌనానికి తావీయని
మాటల బడిలో....!!
6. అస్పష్టాన్ని అక్షరీకరించి
సుస్పష్టమైన ఆకృతినివ్వడం
సుసాధ్యమే సంకల్పముంటేే...!!
7. మౌనానికెన్ని భాష్యాలో
అక్షరాలకు ఆయువునిస్తూ
మనసుని లిఖించేస్తూ...!!
8. వల్లెవేయనక్కరలేని పాఠం
తలపుల జ్ఞాపకాల్లో
ఇమడలేని (మ)రణం...!!
9. మరణమెరుగనిది లిపి
మౌన క్షణాలకు మాటలతో
ఊపిరి పోస్తూ...!!
10. మనసు పరదా
తొలగడం లేదెందుకో
తలపులతో నిండుకుందనుకుంటా. ..!!
11. చోద్యమేముంది
స్వప్నమే
నీ కోసమైతేనూ...!!
12. దాటి పోనీయడం లేదు
తడియారని స్వప్నాల్లో
తలమునకలైన జ్ఞాపకాలు...!!
13. భావాల వెల్లువే
మది లోగిలిలో
అక్షరాల ఆలింగనంతో....!!
14. ఉరుకుల పరుగుల
కృష్ణమ్మ వయ్యారాల నడుమ
ఈ అక్షరాల ఆటలింతే మరి...!!
15. మాయలు నేర్చిన మాయావిగా
మనసులను కొల్లగొట్టడం
వెన్నతో పెట్టిన విద్య..!!
16. వార్ధక్యం వరించినా
బాల్యానికి చేరువౌతూ
పై పై ముసుగులు తొలగించుకుంటున్నాయి జ్ఞాపకాలు...!!
17. అక్షరాలింతే
వద్దన్నా వెంటబడుతూ
మౌనాన్ని మాటల్లో పరిచేస్తూ...!!
18. అలుక నేర్చిన బిడ్డకు
అమ్మ అందించే గోరుముద్దే
ఆకాశంలో చందమామ....!!
19. కొన్ని నడకలంతే
గమ్యాన్ని చేరలేవు
ఎంత కాలం గడిచినా..!!
20. కొన్ని మౌనాలింతే
మాటలకు భావాలకు మధ్యన
మనసులను తుంచేస్తూ...!!
21. ఎప్పుడూ ఇంతే
చేజార్చుకున్న జీవితం
చేరలేని గమ్యమై....!!
22. పదబంధాలు వెంటబడుతున్నాయి
ఆలోచనలను అర్ధాంతరంగా
వదలివేయవద్దంటూ...!!
23. కొన్ని మనసులంతే
బంధాలను
ముడిబడనీయవు..వీడనీయవు..!!
24. రాగం...
వినసొంపుగా ఉంది
ఎన్ని గాయాలకు లేపనమైందో..!!
25. అక్షరాల ఆటలన్నీ తనతోనే
పలకరింపుల ప్రహసనాలనన్నింటిని
పదిల పరుస్తూ...!!
26. అందరి బాల్య జ్ఞాపకమిది
నెమలీకల దాగుడుమూతలాట
పుస్తకాల్లో పదిలంగా చేరి...!!
27. దగ్గరగా వచ్చిన కల
తెల్లారి వెలుగులో
దూరంగా జరుగుతూ...!!
28. తెరిపిన పడుతున్నాయి
కొన్ని కలల కన్నీళ్ళు
అరిగిన మెలుకువను బుజ్జగిస్తూ...!!
29. చెప్పినా వినలేని మనసది
చెలిమి విలువ తెలియక
చేయినందుకోలేని బంధమై మిగులుతూ...!!
30. ఉదయానికి తెలియలేదు
శూన్యాన్ని చెరపలేక
హృదయమెంత గాయపడిందో....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి