26, సెప్టెంబర్ 2018, బుధవారం

సినీవాలి..!!

                                 సినీ రంగంలోని చీకటిని చీల్చిన "సినీవాలి"..!!
ప్రముఖ నవలా రచయిత, సినీ దర్శకులు ప్రభాకర్ జైనీ రాసిన "సినీవాలి" నవలా సమీక్ష సంక్షిప్తంగా..
    " ఒక చిన్న స్వప్నం సాకారమౌతుంటే కలిగే ఆ ఆనందమే వేరు . "  అంటూ ప్రభాకర్ జైనీ తన స్వప్న సాకారాన్ని గురించి చెప్పిన ఈ మాటలు నిజంగా అనుభవానికి వస్తేనే ఆ అనుభూతి, ఆస్వాదన తెలుస్తాయి.  'సినీవాలి' అంటే అమావాస్య నాటి తెల్లవారు ఝామున కనిపించే వెలుగు అని అర్ధం. పూర్తిగా సినిమా ప్రపంచానికి సంబంధించిన ఈ నవలా ఇతివృత్తానికి ఈ "సినీవాలి" అన్న పేరు పెట్టడం నూటికి నూరుపాళ్లు సమంజసమే. చీకటిని వెన్నంటే వేకువ ఉందని చెప్పడానికి, మనిషిలో ఆశావహ దృక్పధాన్ని కల్పించడానికి, నమ్మిన నమ్మకాన్ని గెలిపించుకోవడానికి మనిషి నిరంతరం కాలంతో చేసే యుద్ధమే నాకు ఈ "సినీవాలి" లో కనిపించింది. మనకు రోజుకు ఇరవైనాలుగు గంటలు. ఈ ఇరవై నాలుగు గంటలు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మార్పు అనేది మంచికైనా కావచ్చు లేదా ఓ మనిషిని అధఃపాతాళానికి పడదోయవచ్చు.
"లక్ష్యం అనేది ఎప్పుడూ ఎడారిలోని మరీచికే..
ఒక లక్ష్యం చేరిన తరువాత.. అక్కడ ఏముంటుంది? ఏమీ ఉండదు శూన్యం." ఇంత కన్నా బాగా విజయాన్ని, గెలుపుని ఎవరైనా చెప్పగలరా అనిపించింది ఈ నవల చదువుతుంటే.
కథానాయకుడు తను దర్శకత్వం వహించిన సినిమాకు ఆస్కార్ నామినేషన్లలో చోటు దొరికినందుకు ఆ ఫంక్షన్లో పాల్గొనడానికి బయలుదేరడంతో నవల ప్రారంభం అవుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఒక గమ్యం అంటూ ఉండాలన్న సందేశం కనిపించడంతో పాటు, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని కోల్పోవడాన్ని కూడా చూపిస్తుంది. మనిషి భయానికి లొంగితే ఆ భయమే మనల్ని ఎందుకు పనికిరానివాళ్లుగా ఈ సమాజానికి పరిచయం చేస్తుంది. డబ్బుల కోసమో, పేరు, ప్రతిష్టల కోసమో కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, సినిమానే తన ప్రాణంగా బతికే ఓ మధ్యతరగతి సగటు యువకుడు కథానాయకుడు. ఉన్నత చదువును, కుటుంబాన్ని వదిలేసి తనెంతో ప్రేమించి, ఆరాధిస్తూ తన ప్రాణంకన్నా మిన్నగా ఇష్టపడే సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను, కథ, కధనంతో పాటు దర్శకత్వంలో తనదైన ముద్ర వేయాలని తాపత్రయ పడే సినీ ప్రేమికుడిని సంపూర్ణంగా చూపించడంలో రచయిత కృతకృత్యులయ్యారు.

     సినీవాలి నవల పూర్తిగా చిత్రసీమకు సంబంధించినదే అయినా నవలా నాయకుడే మనకు తన కథను చెప్పడం, పేరు ఎక్కడా చెప్పకుండానే నవల ముగించడం నవలా చరిత్రలో కొత్త ప్రయోగమే. సినిమా మీద ఎనలేని ఇష్టంతో, ఆరాధనతో మంచి సినిమా అదీ తాను నమ్ముకున్న విలువలతో, తనకు నచ్చినట్టుగా తీయాలన్న కోరికతో ఏ అండా దండా లేని అతి సామాన్య యువకుడు ఉన్నత చదువును మధ్యలోనే వదిలేసి సినిమా ఫీల్డ్ కి రావడం, తెచ్చుకున్న డబ్బులు అయిపోయాక ఆకలి బాధ, అవకాశాల కోసం ఎందరి చుట్టూ తిరుగుతున్నా ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా చీదరింపులనెదుర్కొవడం, ఆ సమయంలో జరిగిన ఓ జూనియర్ ఆర్టిస్ హత్యతో మలుపు తిరిగిన అతని జీవితం, అధికార బలంతో జరిగిన హత్యని అతనిపైనే రుద్దాలనుకుంటే, అండగా నిలబడిన పోలీస్ అధికారిణి, పోలీసులకు పంపిన సాక్ష్యాల ఆధారంతోనే ముల్లును ముల్లుతోనే తీయాలని ఇరువురి మధ్యన ఒప్పందం చేసి సినిమా తీయాలన్న ఈ యువ దర్శకుడికి చీదరించుకున్న వారితోనే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇప్పించి ఓ కొత్త సినిమా అంకానికి నాంది పలకడం, సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ప్రతి ప్రేమ్ ను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం, తాను తీసే సినిమాలో హీరో, హీరోయిన్ కోసం వెదకడంలో దర్శకుడి తపన, సినిమా తీసేటప్పుడు ప్రతి చిన్న విషయానికి ఆ దర్శకుడి మానసిక, శారీరక స్పందన, ఒత్తిడులు, అవహేళనలు ఇవన్నీ తట్టుకోవడానికి పడిన కష్టనష్టాలూ, వాంఛలకు లొంగిపోవడం, హీరోయిన్ తో ప్రేమలో పడిపోవడం, ఆమె తెర వెనుక కథ విని కూడా ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం, నమ్మిన స్నేహితుని చేతిలో మోసపోవడం, దాని వెనుక కారణాలు అన్వేషించించి సినిమా రిలీజ్ చేయడానికి బాలారిష్టాలన్నీ దాటి ఆస్కార్ నామినేషన్స్ వైపు ప్రయాణించడం, ఆస్కార్ అవార్డ్ ఓ తెలుగు సినిమా గెలుచుకోవడంతో ఈ నవల ముగుస్తుంది.
    సినిమా ప్రపంచానికి వెనుకనున్న చీకటి ప్రపంచాన్ని వెలుగులోనికి తేవడానికి చేసిన రచయిత ప్రయత్నము, తెలుగు సినిమాను అత్యున్నత స్థాయిలో చూడాలన్న రచయిత కోరిక రెండు ఈ నవలలో మనకు కనిపిస్తాయి.
సాధారణంగా మనం చూసే మూడు గంటల నిడివి గల సినిమా మన ముందుకు రావడానికి ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో, ప్రతి ఫ్రేమ్ లోను ప్రతి ఒక్కరి కష్టం ఎంత ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం వెనుక సినిమా మీద రచయితకున్న ఇష్టం కాదు కాదు ఆరాధన అనే చెప్పొచ్చు అది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇరవై నాలుగు గంటల క్రాఫ్ట్ అనేది సినిమా కాదు జీవితానికి సరిపోయే పదం. ప్రతి రంగంలోనూ మంచి చెడు రెండు  ఉంటాయన్నది నిర్వివాదాంశం. మనిషికి రెండు పార్శ్వాలున్నట్లే ఏ రంగానికైనా ఇవి తప్పవు. కాకపొతే ఇంత విపులంగా లోపాలను అదీ తానెంతో ప్రేమించి ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకునే సినిమా గురించి ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడమనేది ఏ కొద్దిమందో చేయగలరు. ఆ కోవలోని వారే ప్రభాకర్ జైనీ అని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు.
       ఇక సినీవాలి గురించి చెప్పాలంటే సాధారణంగా మనకు తెలిసిన మోసాలు, ద్వేషాలే ఇక్కడా ఉంటాయి. సినిమా మీద అపారమైన ఇష్టం ఉన్న యువకుడు అన్ని వదులుకుని ఓ మూసలో కాకుండా ఏ అవార్డులు, రివార్డులు ఆశించకుండా తాను నమ్మిన విలువల కోసం సినిమా తీయడానికి పడిన పాట్లు, సంతోషం, బాధ, ఆకలి, కోపం, ఆవేశం, ఏడుపు ఇలా అన్ని సహజంగా చెప్పడం, మనుష్యుల్లో, మనసుల్లో కలిగే వికారాలు, వికృతాలు అన్ని మనకు కనిపిస్తాయి. చాలా మంది అనుకున్నట్టు దీనిలో శృంగారం, నేరాలు, ఘోరాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. దానికి రచయితను తప్పు పట్టనక్కరలేదు, నిజం చెప్పాలంటే మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. నిక్కచ్చిగా అన్ని నిజాలు రాసినందుకు.
" సినిమా అన్నది రంగుల ప్రపంచమే కానీ ఆ రంగుల ప్రపంచాన్ని సృష్టించడానికి ఎన్ని వందలమంది కృషి చేస్తారన్నది సామాన్య ప్రజల అంచనాకు చిక్కదు."  ఇదే నిజమని మనకూ తెలుసు. ఓ మూడు గంటలు సినిమా చూసేసి మనకిష్టమైనట్లు నాలుగు మాటలు సమీక్షగా రాసేసి చేతులు దులిపేసుకుంటాం. కానీ ఆ సమీక్షలు అనేవి కూడా ఇప్పుడు ఎంత అసహజంగా ఉంటున్నాయో మనందరికీ తెలుసు. మంచి చెడు బేరీజు వేసుకోవడంలో కాస్త నిజాయితీ, నిబద్దత చూపిస్తే చిన్నా, పెద్దా తేడా లేకుండా మన ముందుకు వచ్చే మూడు గంటల సినిమా వెనుక కష్టాన్ని గుర్తిస్తే మాట తూలడం చేయలేము. మన ఆదరణని బట్టే సినిమాలు తీస్తూ నాలుగు డబ్బులు రాబట్టుకోవాలనుకునే వ్యాపారులే ఎక్కువ ఈ రంగంలో కూడా. సగటు ప్రేక్షకుడిగా మనలో మార్పు వస్తే సినీ రంగమే కాదు ఏ రంగమైనా మంచి వైపుకే పయనిస్తుందనడానికి ఈ సినీవాలి ఓ సరికొత్త ఉదాహరణ.
   సినీ రంగంలో వాస్తవాలను ఒక్కటి కూడా వదలకుండా, దేనికి భయపడకుండా మంచి, చెడు ఉన్నదున్నట్టుగా నిజాయితీగా అక్షరీకరించిన ప్రభాకర్ జైనీ గారికి మనఃపూర్వక అభినందనలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner