21, జూన్ 2019, శుక్రవారం

లైఫ్ హాలిడే సమీక్ష...!!

                                  ఆలోచన రేకెత్తించే అక్షరమాలి " లైఫ్ హాలిడే "

                   ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ గత పదేళ్లుగా కవిత్వం రాస్తున్న అక్షరమాలి సురేష్ తన కవితలను ఓ పుస్తకంగా తేవడం అభినందనీయం. పలు సాహితీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తెలుగు సాహిత్యానికి తన వంతుగా సేవ చేస్తూ బాల కవులను తీర్చిదిద్దుతున్న సాహితీ సేవకుడు కొత్తపల్లి సురేష్.
                      అమ్మ కథలను, అమ్మ పాడే శ్రావ్యమైన సుప్రభాతాన్ని, నాన్నపై  అమ్మ అనురాగాన్ని, పూలతోటలో అమ్మ రాణి వాసాన్ని, ఆరుబయట వెన్నెల్లో వెలుగురవ్వై అమ్మలక్కలతో గొంతు కలిపి అమ్మ పాడే పాటను విని ఎన్నిరోజులైందో అమ్మను చూసి అంటూ అమ్మ జ్ఞాపకాలను మనకూ గుర్తుకు తెస్తారు. నెత్తురు దానం చేసినంత సులభంగా నదిని దానం చేశాం అంటూ అదృశ్యమైన నదీప్రవాహంలో మన సంస్కృతి ఒక శిథిలనౌక అంటూ మరో మొహంజోదారో కవితలో వాపోతారు. శ్వేత రుధిరధార కవితలో కంటిలోని చుక్క వేదనను గతం పూసిన జ్ఞాపకాల అంచులలో నుంచి అందరు రాలిపోతుంటే, దుఃఖపరాగం దేహాకాశమంతా పరుచుకున్నాక చిల్లులుగా కురుస్తున్న నెత్తుటి తారల నడుమ రాలక మిగిలిన మింటిచుక్కను నేనంటూ సరికొత్త అభివ్యక్తిని వెలిబుచ్చారు. పల్లెను వాడాలి వచ్చిన పరిస్థితులను, నగర యాంత్రిక జీవితంలో యంత్రాలుగా మారిపోయినా అప్పుడప్పుడు మదిలో మిగిలిన జ్ఞాపకాల శకలాలను శకలాల మూట కవితలో గాయాలను కూడా హృద్యంగా చెప్తారు. ఇప్పటి పల్లెల్లో ఉగాదికి కొత్త నిర్వచనాన్ని ఇన్ క్రెడిబుల్ ఫెస్టివల్ కవితలో చెప్తారు. తరిగిపోతున్న విలువలను పిల్లలకు ఎలా చెప్పాలో తెలియని  స్థితిలో తనలోని స్ఫూర్తి ఓ యానకంగా మారి విజయం గుండెల మీద నవ్వుల జెండాను నాటి వద్దాం అంటూ కొత్తపాఠం కవితలో పిలుపునిస్తారు. రేపటిపొద్దు కవితలో అమ్మ ఒడి లాంటి బడి గురించి అద్భుతంగా చెప్తారు. రాతిరిలో కరువైన నిదురను తల్చుకుంటూ సాగిన ఆలోచనల అనంత ప్రయాణంలో అనుభవాల సారాన్ని చెప్తూ అలవోకగా అనంతసాగరానికి జత చేస్తారు. కనీసం ఒక్క రోజైనా ఆడదానికి, ఆమె కష్టానికి, త్యాగానికి విలువనిద్దాం అని ఆమెకు సెలవిద్దాం కవితలో పిలుపునిస్తారు. పల్లె ఫిలాసఫీని, పల్లె  అందాలను, పల్లె తీర్చిన జనావసరాలను చెప్తూ, ఇప్పటి పల్లె దుస్థితిని కళ్లముందుంచుతూ ఒక కార్పొరేట్ స్మశానవాటికగా మారిపోయి, తిరిగి మొలకెత్తడానికి చోటు దొరకక కుళ్లిపోతున్న శవంగా మారుతున్న రైతు లైఫ్ హాలిడే ప్రకటిస్తున్నాడని వాస్తవాలను కళ్లకుకట్టినట్టుగా ఈ కవితా సంపుటి పేరైన లైఫ్ హాలిడే కవితలో చాలా చక్కగా చెప్తారు. లోకం ఒక దేహాల సంత అంటూ లోకపు తీరును చెప్తారు. పల్లె నుండి బతుకుదెరువుకు పట్నం వచ్చిన వలస కూలీల జీవితాలను ఊరిచివరి ఆకాశం కవితలో మనసుకు హత్తుకునేటట్లు చెప్తారు. ముసుగుల మనుష్యుల మొహాల దేహాల భాషను దేహభాష కవితలో నిర్మొహమాటంగా చెప్తారు. వాన రాకతో రైతు, పంట పొలాల ఆనందాన్ని వానచెట్టు కవితలో చెప్తారు. " నీకు నాకు మధ్య ఎడతెగని చీకటివాగులాగా ఈ రేయి" అంటూ ఘనీభవించిన రేయిలో ఓ దూరమైన జ్ఞాపకాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో నిరీక్షణను అందంగా చూపిస్తారు. పదనిసలు కవిత కొత్తగా ఉంది. కార్పొరేట్ బడి ఒక వింత రాకాసి, కాసులను పీల్చే ప్రైవేటు ప్రేయసి అని చెప్తారు. ఆసుపత్రి గీతం కవిత ప్రతో ఒక్కరి మనసు చప్పుడే అని అనిపించక మానదు. ఆకలి అమ్మ రెప్పలమాటున నొక్కిపట్టిన కన్నీటిచుక్క అంటూ ఆకలి రూపాలను వర్ణిస్తారు హంగ్రీ స్టోన్స్ కవితలో.  నాయిన కవిత ప్రతి ఒక్కరి నాన్నను గుర్తుకు తెస్తుందనడంలో సందేహం లేదు. పఠనకాంతి కవిత తీరని ఆశల కలలను చెప్తూ విలువలను, సిద్ధాంతాలను, వాదాల్ని, నినాదాల్ని నమ్ముకున్న మనిషిని తనకు తననే కాందిశీకుడ్ని చేసిన స్థితిని చెప్తారు. నిద్రఅద్దం పెళ్ళున బద్దలయ్యింది అంటూ చీకటి స్వప్నాల భయాన్ని లిప్త కవితలో చెప్తారు. రకరకాల మనుషుల మనస్తత్వాలను కొందరు మనుషులుంటారు కవిత చెప్తుంది. అతడు - ఆమె కవిత చేజారిన జీవితపు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. కన్నీటి లిపి కవిత మనసు సేద దీరే క్షణాలను తెలుపుతుంది. ఎన్నికల హడావిడి, హంగామాలను నేల నవ్వింది కవిత చూపిస్తుంది. బంతిపూల నవ్వులతో కవితలో ఇల్లాలి త్యాగాన్ని గుర్తుజేసుకుంటారు. పాదప్రమిదలు ప్రేయసి రాకను, కౌముది కవిత నాగేశ్వరాచారి గారిపై తన మనో భావాలను,  నువ్వు విడిచిన వేలు నేను కవిత తన అన్నయ్య  కొత్తపల్లి నరేంద్రబాబు గారి కోసం రాయడం చాలా బావుంది. నది వెళ్ళిపోయింది, నావ వట్టిదేనని తేలిపోయింది అంటూ ఎదురుచూపుల నిరీక్షణను చెప్తారు. పూలవాన ప్రేమను, బహుళం, అతడూ మనిషే, నేలమాలి, పంచకం వంటి  కవితలు పేదోడి బతుకు నిర్వచనాన్ని, త్యాగ గుణాన్ని, కార్పొరేట్ అధికారానికి మోసపోయిన బతుకులను చెప్తాయి. సాయిబాబు గారి కోసం చలి కవిత, ఎ రెయినీ డే కవిత నగరంలో వాన మొహం మొత్తే చేదు గుళిక అని ఆ కారణాలను చూపిస్తారు. సత్యం హత్యకు గురైన సీమ నది అంటూ మరికొన్ని పోలికలను చెప్తారు. నది ఎండిపోయాక కూడా రాజకీయపు అధికారానికి మాత్రమే పచ్చనోట్ల తడితో వాళ్ళ పొలాలు మాత్రమే పచ్చగా ఉంటాయని, మిగిలిన భూములన్నీ మండే ఎండను పండించే ఇసుక గుండెలని, వట్టి కలలే కాని నీళ్ళు అందవని నది వెళ్ళిపోయాక కవితలో సీమ రైతుల అవస్థలను చెప్తారు.
       సామాజిక చైతన్యంతో సీమ రైతుల కష్టాలను, కన్నీళ్ళను, వేదనలను, కలలను, ఆశలను, వ్యవస్థలో లోపాలను, ప్రేమను, విరహాన్ని, నిరీక్షణను, ఇల్లాలి గొప్పదనాన్ని, త్యాగాన్ని, ఆడదాని విలువను, అమ్మానాన్న, పల్లె జ్ఞాపకాలను, కార్పొరేట్ దందాలను ఇలా తాను చూసిన, అనుభవించిన ప్రతి అంశాన్ని చక్కగా అక్షరీకరించి లైఫ్ హాలిడే అంటూ మనకు ఆహ్లాదంతో పాటుగా, మన మనసుల్లో కూడా కాస్తంత ఆలోచనను రేకెత్తించారు అనడంలో అతిశయోక్తి లేదు. చక్కని భావాలను అందించిన " అక్షరమాలి " కొత్తపల్లి సురేష్ కి హృదయపూర్వక అభినందనలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner