21, జూన్ 2019, శుక్రవారం

స్వప్న మేకల..!!

                " ఆనతికాలంలోనే అందరి మనసులను దోచిన స్వప్న మేకల కవిత్వం...!! " 
                     ఏళ్ల తరబడి రాస్తున్నా కొందరికి వారు రాసే దానిపై స్పష్టమైన అవగాహన ఉండదు. అది వ్యాసమో కవిత్వమో కూడా తెలియని పరిస్థితిలో, నేడు ముఖ పుస్తకంలో వస్తున్న పుంఖానుపుంఖాల కవిత్వపు తీరుతెన్నులు మనకు తెలియనివేం కాదు. అతి తక్కువ కాలంలో కవిత్వంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కవయిత్రులలో స్వప్న మేకల ఒకరు. కవిత్వం రాయడం మొదలుబెట్టిన తొలినాళ్ళ నుండే తనదైన శైలితో చదువరులను ఆకట్టుకుంటున్న అతి తక్కువమందిలో స్వప్న మేకల కవిత్వం ఒకటి. చక్కని తేలిక పదాలతో చిక్కని భావాలు అందిస్తూ ఎందరి మనసుల్లోనో తనదైన ముద్రతో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. 
               సమాజంలో సమస్యలు, మన చుట్టూ తిరుగాడుతున్న ఎన్నో సందేహాలు, బంధాలు, అనుబంధాలు, మానవ సంబంధాలు, అమానవీయ కోణాలు ఇలా చెప్పుకుంటూపోతే ప్రపంచంలోని ప్రతి సందర్భమూ ఆమెకు ఓ కవితా వస్తువే. రేయి పగలు నడుమ చెమట చుక్కల లెక్కలు వేసే రైతు శ్రమ, కార్య దీక్ష, పట్టుదల, నిరాశలను వెరసి సగటు రైతు ఆంతర్యాన్ని అద్భుతంగా శ్రమ గీతం కవితలో చూపిస్తూ మనల్ని చివరి వరకు చదివిస్తారు. పరవశం కవితలో వివశత్వానికి, ఎదురుచూపుల నిరీక్షణకు మధ్యలో కొత్త ప్రపంచాన్ని స్వాగతించే ఆశలను అందంగా వినిపిస్తారు. తప్పిపోయిన జీవితం కవిత ఇప్పటి వలసల జీవితాలకు అద్దం పడుతుంది. ఈ కవిత గురించి చెప్పడం కన్నా ప్రతి ఒక్కరు చదివితేనే బావుంటుంది. దూర దేశాలకు వలస పోయిన మనుష్యుల మనసుల మానసిక స్థితి గురించి అద్భుతంగా చెప్పారు. కాలపు నీడకు పుట్టిన నిర్మానుష్య దేహమిది అని ఎడారి వనం కవితలో ప్రకృతి వైపరీత్యాలను, తదనుగుణంగా జరుగుతున్న పరిణామాలను వివరిస్తారు. అమ్మను అమృత వర్షిణిగా అభివర్ణిస్తూ అమ్మ ప్రేమను అక్షరాలతో మనకు అందిస్తారు. వీరి కవిత్వ భావ పఠిమకు ఇవి కొన్ని  ఉదాహరణలు మాత్రమే. 
    మనసులోని భావాలను చెప్పడానికి రచయితలు పలు ప్రక్రియలను ఎంచుకుంటున్నారు నేడు. వాటిలో లఘు కవితలు ఒకటి. వీరు ఈప్రక్రియలో రాయడంలో కూడా దిట్టే. వాక్యం రసాత్మకం కావ్యం అన్న మాట ఎంత నిజమో ఈ చిన్న కవితాత్మక వాక్యం చూస్తే మీకే అర్థం అవుతుంది. 
" నిన్నొదలి వెళ్ళలేకనే...
శిశిరంలో రాలిపోయిన వసంతమల్లె చిగురిస్తుంటాను..!! "
 విభిన్న ప్రక్రియలలో తనదైన భావుకత్వంతో, వాస్తవ పరిస్థితులకు తగినట్టుగా కవితా వస్తువుల ఎంపికలో, లోతైన అభివ్యక్తితో చక్కని చిక్కని కవిత్వాన్ని తేలిక పదాలతో వెలువరిస్తూ అతి కొద్దీ కాలంలోనే ఎందరో అభిమానులను సంపాదించుకున్న భాగ్య నగర వాసి స్వప్న మేకల మరిన్ని కవితా కుసుమాలతో అందరిని అలరించాలని కోరుకుంటూ... వారి తెలుగు సాహితీ వెలుగులకు హృదయపూర్వక అభినందనలు.. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner