5, జూన్ 2019, బుధవారం

ఏక్ తారలు..!!

1.  కొలిమి వాత తప్పదనుకుంటా_మెుద్దుబారిన మనసుకు..!!

2.   వైనమే వడ్డింపులకు_బాధ్యతలకామడ దూరం పోతూ...!!

3.   విషాదమే వెన్నంటి వస్తోంది_గతంతో పాటు భవిష్యత్తును వదలనంటూ...!!

4.   తరగని మమకారమది_తడబాట్లెన్నెదురైనా ముడి వీడని మనసులతో...!!

5.   వద్దని వారిస్తున్నా వినడం లేదు_వెతలన్నీ కతల్లో చేరుతూ. ...!!

6.   ఒడుపు తెలియలేదు_నేర్పుగా బతకడానికి..!!

7.   తప్పుటడుగు  ఒక్కటి చాలు_జీవితకాలం వెలివేతకు...!!

8.   బదులివ్వలేని వృద్ధాప్యం_బాల్యాన్ని నెమరువేసుకుంటూ...!!

9.    అర్థం అయ్యి కాని అయెామయమే_సమ్మతమేదో తెలియక...!!

10.   వెలకట్టలేని సంతసాలే_దశాబ్దాలనాటి బంధాలు దరిజేరితే...!!

11.   మనదాక వస్తే అక్కసు_మనమంటే మాత్రం నిజాయితీ...!!

12.   తట్టుకోవడం కష్టమే మరి_అరవై ఏళ్ళకు సరిపడా ఆరు రోజులకే చేరితే...!!

13.   నిజాలు భలే ఒప్పేసుకుంటాం_నవ్వు ఏడుపు మనకొకటేనని...!!

14.   అక్షరాలతో ఆడుకుంటున్నా_బాల్యాన్ని పుస్తకాల్లో నిక్షిప్తం చేద్దామని...!!

15.   అలుక నేర్చిన అక్షరాలకు తెలుసు_మురిపెంగా భావాలనెలా మాయ చేయాలో..!!

16.    అనునయించే మనసది_అక్షరభావాలను ఓ తాటి మీదకు తెస్తూ..!!

17.    అలసినా ఆనందమే అక్షరాలకు_పదబంధనాల పరిరక్షణలో..!!

18.    నా విజయానికి సారథులు మీరు_తరగని మన చెలిమి సాక్షిగా..!!

19.    అనుబంధానికి అర్థం తెలుసు_ఆర్తినెరిగిన అక్షరానికి...!!

20.   అనుబంధాలు అటకెక్కుతున్నాయి_అక్షరాలకు బాధ్యతలప్పజెప్పేశామంటూ...!!

21.   మనసుని పట్టి తెచ్చేసుకున్నా_నిన్ను వదిలి రాలేనంటుంటే...!!

22.   తరగని మనసు భారం_చెక్కిలిని సముదాయిస్తూ...!!

23.    నిశీధి క్రీనిడలే అన్నీ_మనసుని వశం చేసుకోవాలనుకుంటూ..!!

24.   అమ్మతనమే అక్షరానిది_ఏ భావానికైనా ఆసరానిస్తూ...!!

25.   అక్షరాలకన్నీ అలవాటే_ కలతలను, కలలను ఏమార్చడంలో...!!

26.   మధుర కవనమే జీవన కావ్యం_ఊహలకు వాస్తవికత తోడైతే...!!

27.    భావాలతో బాంధవ్యం పెంచుకున్నా_అక్షరాలను వదిలుండలేక...!!

28.   దాయాదుల పోరిది_దైవమెటు మెుగ్గు చూపనుందో...!!

29.   మహాత్ములే అందరూ_మహోపన్యాస వాక్యలతో...!!

30.   అనుసంధానమెప్పుడూ ఆచరణ యెాగ్యమే_బంధాలను బలోపేతం చేయడంలో...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner