21, జూన్ 2019, శుక్రవారం

మనిషి కనబడుటలేదు పుస్తక సమీక్ష...!!

   
http://m.gotelugu.com/issue318/7974/telugu-columns/book-review/ 

     " సమాజంలో మనిషి కోసం వెదుకులాటే ఈ మనిషి కనబడుటలేదు కవిత్వం..."           
                   బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు భాషాభిమాని, నిరంతర సాహిత్య సేవకులు గుడిమెట్ల చెన్నయ్య గారు రచించిన మనిషి కనబడుటలేదు కవిత్వ సంపుటి నిండా తరిగిపోతున్న మానవత్వపు విలువల కోసం తపిస్తున్న ఓ మనసు కనిపిస్తుంది. అంతరించిపోతున్న తెలుగు బీభత్స కోసం పరాయి రాష్ట్రంలో ఉన్నా మూలలను మరువక, తెలుగు భాషపై మమకారంతో ఎనలేని సేవ చేస్తున్న సాహితీ సంపన్నులు గుడిమెట్ల చెన్నయ్య గారు
                మనిషిలోని అంతర్గత ఆలోచనలను, అంతర్ముఖాన్ని చూపిన కవిత నిన్న అలా... నేడు ఇలా, ఆ క్షణం  కవితలు. ముసుగు వేసుకున్న ఎన్నో మనసులకు సాక్ష్యం ఈ కవిత. పసితనంలో తాతయ్య చెప్పనా సుద్దులు విన్న చిన్నపాప పెద్దదై అందుకున్న విజయాన్ని చూడలేని తాతయ్యను తల్చుకున్న పసి మనసు రాడా నాన్నా కవితలో కనిపిస్తుంది. నిజం కవితలో చెప్పినవన్నీ అబద్ధాలైనా ఈ తనువంతా నీదేనన్న నిజం గుర్తించమంటూకవితాత్మకంగా చెప్పడం చాలా బావుంది.  కవిత్వమంటే ఎలా ఉండాలో చెప్పే కవిత ప్రతిధ్వనించాలి. మంచి, మానవత్వం గురించి నాన్న చెప్పినది ఆచరించిన కొడుకు, సమాజంలో ఎదుర్కున్న అవహేళనలను, మానసిక వేదనను తండ్రికి చెప్పుకోవడం, ప్రశ్నించడం మనకు ఈ సమాజంలో ఎంతోమందిని చూపెడుతుంది. మళ్ళీ రా.. సినారే కవితలో సినారే గారిని గుర్తు చేసుకోవడం చక్కగా ఉంది. కదలిసాగు సోదరా కవిత మనిషి ఎలా ఉండాలో చెబుతుంది కాస్త ఆవేశంగా శ్రీ శ్రీ గారిని గుర్తు చేస్తూ. తరిగిపోతున్న మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ నిరాశ్రయానికి ఆశ్రయమిచ్చిన వల్లకాడుని, నిర్జీవ సమాజాన్ని చాలా బాగా చూపించారు కాస్త చోటివ్వు కవితలో. మామిడిపండు తినాలన్న కోరికతో ముదుసలి చేసిన కసరత్తు, పిల్లవాడు కోసిచ్చిన మామిడిపండు తింటూ ఆ తాతకు గుర్తుకొచ్చిన తన వయసు వయసుడిగిన సంగతి కవిత చెప్తుంది. తెలుగు భాషోద్ధారకులమంటూ విర్రవీగే కొందరికి చెంపపెట్టు పండితులు వీరు, తెలుగు భాషోద్ధారకులు వీరు అన్న కవిత. అంతరించిపోతున్న సంస్కృతులను, పెల్లుబికుతున్న కుల,మత విద్వేషాలను పారద్రోలమని రాబోతున్న వత్సరాన్ని కోరుకుంటూ స్వాగతం మన్మథా..సుస్వాగతం అంటారు.  అతివ సహనానికి ఓ హద్దుంటుందని హద్దు కవిత చదివిన ఎవరికైనా తెలుస్తుంది. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమ దాడులను ప్రశ్నిస్తుంది మానవత్వం - మంచితనం, మానవత్వం, ఉన్మత్తుల మదమణచు, వీడు మారేదెప్పుడు కవితలు. మగువ మనసు ఏమిటో చెప్తుంది నీ హృదిలో " రవ్వంత చోటిస్తే చాలు " మరే కోరికలు లేవు, గువ్వలా ఒదిగిపోతానంటూ పరవశమౌతుంది. మగువను పై పై మాటలకు, చేష్టలకు మోసపోవద్దంటూ ఓ హెచ్చరిక చేస్తారు ఆలోచించు కవితలో. సమాజంలో మనుష్యులలో నశిస్తున్న మానవత్వాన్ని ప్రశిస్తారు దయా రహితులు కవితలో. కనుమరుగైపోయిన రిక్షావాడిని, కష్టాన్ని, డబ్బున్న వాడి మోసాన్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చారు తన అక్షరాలతో రిక్షావాడు కవితతో. సహజత్వాన్ని కోల్పోతున్న మన బతుకులకు అద్దం పట్టారు ఈ సహజమైనదే ముద్దు కవితలో. కపటపు ప్రేమ మాయల, మత్తు గురించి వివరిస్తారు ఎన్నాళ్ళీ మాయమాటలు కవితలో. సహనంతో సాహసాన్ని ఊపిరిగా చేసుకుని ఆయుధాన్ని ఆయుధంగా మార్చుకుంటూ ధైర్యంగా సాగిపొమ్మంటారు అధైర్య పడకు చెల్లీ కవితలో. ప్రతిభను గుర్తించలేని మన భరతావని దుస్థితిని గూర్చి బాధను ఇది నా భారతదేశం కవితలో చెప్తారు. మనసున్న మనిషిని ప్రసాదించమని శ్రీ విరోధికి స్వగతం పలుకుతారు. మనిషిలోని మృగత్వాన్ని ఎత్తి చూపుతూ అంతరించిపోతున్న మానవత్వానికి ఘోషిస్తూ " మనిషి కనబడుటలేదు అన్న కవితలో కవి వాపోతారు. ఈ కవితా సంపుటికి కూడా ఈ కవిత పేరు పెట్టడంలో అంతరార్థం మనకు అర్థం ఆయుతుంది. కవికి సమాజం పట్ల, మానవ సంబంధాలపై ఉన్న ఇష్టాన్ని, తన కళ్ళ ముందు జరిగిన సంఘటనలకు సాక్ష్యాలుగా తన అక్షరాభావాలతో మనతో పంచుకున్న మనసు కనిపించేటట్లు చేయడం, సరళమైన భాషతో, చక్కగా చదువరులకు అర్ధం అయ్యేటట్లుగా రాసిన వచనం అభినందించదగ్గ  విషయం. తలెత్తుకు తిరగాలి అంటూ సాంప్రదాయ వస్త్రధారణ విలువను మహిళలు గుర్తించాలంటూ, అరకొర వేషధారణలను వద్దంటూ హితవు చెప్తారు. మంచితనానికి ఫలితాన్ని, విశ్వాస ఘాతకుడి తీరును, రాతల విషయంలో జరుగుతున్న మోసాలను, నాయకుల కల్లబొల్లి మాటలను, అత్యాశకుబోయి మోసబోయిన జీవితాలను, మగాడి నిరంకుశత్వాన్ని, బతుకుదెరువుకు కొలువు కోసం వెళ్లిన మగువకు ఎదురైన కామాంధుడి కోరికను, పండుగ సందడికి వెచ్చాల కోసం కిరాణాకొట్టుకు వెళ్లిన పసివాడిని చేసిన మోసం, ఆసిఫా కోసం రాసిన విచక్షణ కవిత, మనమెలా బతకాలో చెప్పిన మంచి సుద్దుల కవిత ఆచరించి చూపుటయే మిన్న. తెలుగు భాష కీర్తి కోసం తపన అభిలాషలో చెప్తారు. ఆకాంక్షను, శుభ సందేశ గీతికను చివరిగా వినిపిస్తూ చక్కని భావాలను, వచనాన్ని అందించిన మానవత్వపు విలువల మంచి గంధం ఈ మనిషి కనబడుటలేదు కవితా సంపుటి. తెలుగు భాషపై మక్కువ గలిగిన మానవతావాది గుడిమెట్ల చెన్నయ్య గారు తమ మనసు స్పందనలను, తెలుగు భాషపై మమకారాన్ని, సమాజంలో మనిషి కోల్పోతున్న విలువలను ఈ కవితా సంపుటిలో పొందుపరిచారు. ప్రతి ఒక్కరు చదవదిగిన కవితా కుసుమాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. తేట తెనుగు వచనాన్ని రాసిన గుడిమెట్ల చెన్నయ్య గారికి అభినందనలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner