7, మార్చి 2020, శనివారం

Where is your [Bra]...!!

నేస్తం,
          ఇది జరిగి దాదాపు 31 సంవత్సరాలు అవుతోంది. అవి నేను కర్నాటక బళ్ళారి విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ మెుదటి సంవత్సరం చదువుతున్న కొత్త. మాది D సెక్షన్. నాతోపాటు నలుగురు కన్నడ, తమిళ్ అమ్మాయిలు ఉండేవారు. ఒకమ్మాయికే కాస్త తెలుగు తెలుసు. అబ్బాయిల్లో నార్త్ ఇండియన్స్, కన్నడ, తమిళ్, మళయాళం, తెలుగు..ఇలా అందరు ఉండేవారు. 
        పల్లెటూరు నుండి వచ్చిన నేను కొత్తలో రెండు రోజులు చూడీదార్ వేసుకున్నా, తర్వాత నుండి లంగా ఓణినే వేసుకునేదాన్ని. మెుదటిబెంచ్ లో కూర్చునేవాళ్ళం అందరం. ఒక్కోరోజు క్లాస్ కాస్త ఖాళీగా ఉంటే నేను, తెలుగు కాస్త వచ్చిన హేమలత మెదటి బెంచ్ లో కూర్చుంటుండేవాళ్ళం. అమ్మా నేను కాలేజ్ కి దగ్గరలో రూమ్ లో ఉండేవాళ్ళం. 
        ఓ రోజు మధ్యాహ్నం రెండింటికి క్లాస్ కి వెళ్ళాం ఎప్పటిలానే. అప్పటికే సెకెండ్ బెంచ్ లో మిగతా ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు. నేను, హేమలతా వెళ్ళేసరికి మా బెంచ్ పైన 
" Where is your [ BRA ] " అని రాసుంది. అది చూసి హేమలత ఛీ అనుకుంటూ సెకెండ్ బెంచ్ లో కూర్చుంది. మేం వెళ్ళేటప్పటికే అబ్బాయిలందరూ వచ్చి కూర్చున్నారు. నేను రాసింది చెరిపేసి అక్కడే కూర్చున్నా. వెంటనే సమాధానం బోర్డ్ మీద రాద్దామనుకున్నా "నీ అమ్మని అడగరా"అని. కానీ సర్ క్లాస్ కి వచ్చేసారు. 
   ఆ రాసిన వాడికి ఏం ఒరిగిందో ఇప్పటికి నాకు అర్థం కాదు. వాడి అమ్మ వాడికి నేర్పిన సంస్కారమది అనుకుని ఊరుకున్నా. కాని బాధ కలిగించిన విషయమేమిటంటే అక్కడ క్లాస్ లో 50 మంది అబ్బాయిలయినా ఉండి ఉంటారు కదా.. ఏ ఒక్కడు రాసిన వాడిని ఖండించలేదు, మేము రాకముందే అది చెరపలేదు. అందరికి కొత్తే కదా అనుకోవడానికి ఆడపిల్లని అవమానించిన వాడిని మొత్తం క్లాస్ అబ్బాయిలందరూ సమర్థించినట్లే కదా. మన ఇంటి ఆడపిల్లను కాదు కదా అంది అని ఊరుకోవడం నేను ఇప్పటికి క్షమించలేని విషయం. 
       నాకు ఇద్దరు మగపిల్లలే. వారిని మేము మానవత్వపు విలువలతో, మంచి వ్యక్తిత్వాలతో పెంచుతున్నాం. వ్యక్తులుగా బతకడం కాదు వ్యక్తిత్వపు విలువలతో బతకండి. ఏ ఇంటి ఆడపిల్లను అవమానించకండి. మీ అమ్మాబాబులు మిమ్మల్ని కాలేజ్ కి చదువుకోవడానికి మాత్రమే పంపుతున్నారన్నది గుర్తుంచుకోండి. ఇప్పుడు అంతర్జాలం అందుబాటులోనికి వచ్చాక వావి  వరుసలు, వయసు తారతమ్యాలు కూడా చూడకుండా కొందరు నికృష్టులు దిగజారి ప్రవర్తిస్తుంటారు. మీ అమ్మా ఒక ఆడదేనని, ఆ ఆడదే మీ మగ పుట్టుకలకు కారణమని తెలుసుకుని ఛావండి. 
   మహిళలకూ.. మహరాణులకు...మహిళాదినోత్సవ శుభాకాంక్షలు..

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner