17, మార్చి 2020, మంగళవారం
అక్షర సన్యాసం సమీక్ష..!!
పుట్టపర్తి మల్లికార్జున గారు రాసిన సమీక్షకు
మన:పూర్వక ధన్యవాదాలు..
మంజు యనమదల అమ్మ గారి అక్షర స(వి)న్యాసం పై నా సమీక్ష
**అపసవ్య సమాజంపై
అక్షర తూటాల విన్యాసాలు**
మంజు అమ్మ గారి కవిత్వం అంతరంగాల్ని స్పృశించేలా గాఢమైన పదబంధాలతో బందిస్తూ మనసును హత్తుకునే కవితా వస్తువులతో ప్రతి కవనాన్ని హృదయ స్పందనలకు అనుగుణంగానే శిల్పంగా మలిచారు. భావ వ్యక్తీకరణలో సరైన ఎత్తుగడను ఎంచుకుని ,శీర్షికల ఎంపికలో వైవిధ్యం చూపుతూ,ముగింపులో పదునైన పదజాలంతో మంచి కవితలను అందరికీ అర్థమయ్యేలా అందించారు.సగటు మనిషి జీవన విన్యాసాలే,హృదయాలను తడిమే తరంగాలే,భావావేశ ఉత్ప్రేరకాలే కవయిత్రి అక్షర విన్యాసాలు.సమాజంలోని సంఘర్షణల కింద మగ్గిపోతూ మృత స్థితికి చేరుతున్న అభ్యుదయ భావాలను ఉన్నత ప్రమాణాలతో విరామమెరుగక వెనుదిరిగి చూడని ధీరవనిత కలం నుండి జాలువారిన కలల ప్రవాహాలు.తన మదిలోని స్వప్నాలన్నిటినీ,ఘర్షణలన్నిటినీ అక్షరాలలో నిక్షిప్తం చేసి సమాజ వికాసం కోసం ధారలా నిర్విరామంగా ప్రవహింప చేస్తున్నారు.సమాజంలో త్వరితగతిన మార్పు వచ్చి సమసమాజ సృష్టి జరగాలనే ఆశ ,ఆతృత తన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఒకవైపు ఆత్మీయ ఆనవాళ్ళకై అనుబంధాలకై వెతుకుతూనే మరోవైపు ఎదురుదాడుల్ని తిప్పికొడుతూ సమాధానపు అస్త్రశస్త్రాలను ఎక్కుపెట్టి యుద్ధానికి కలం దువ్వుతూ మనసులో ఏర్పడుతున్న శూన్యత నుండి అక్షర తూటాలను పేల్చుతున్న వీరనారే మంజు అమ్మ గారు.అస్త్ర సన్యాసం తన విధానం కాదనే దానికి తన అంతరంగ భావావేశ ప్రవాహమే నిదర్శనం.నిరంతరం సమీక్షలకై కదులుతున్న కవయిత్రి కలం వర్ధమాన కవులకు దిక్సూచని అనడంలో సందేహం లేదు.రక్తం పంచివ్వని బంధమైతేనేం మానవత్వానికి,మమతలకు నెలవైన అమ్మతనమే కాదు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చే వారిని,సంఘ విద్రోహ శక్తులను చీల్చి చండాడే వీరత్వం కలబోసిన నిండైన రూపం మంజు అమ్మ గారు.
రక్తపాతాలు వద్దంటూ కులమెరుగని గుణాన్ని,మతమెరుగని మానవత్వాన్ని నింపుకున్న రక్తదానమే జీవనాదమని హృద్యంగా ఆవిష్కరించిన తీరు అభినందనీయం మరియు అనుసరణీయం.జీవనదులతో బీటలు వారిన భూములను తడిపితే మోడువారిన రైతుల జీవితాల్లో వెల్లివిరిసే నవ్వుల్ని చెమ్మగిల్లిన కన్నులతో దర్శించమని సేవా హృదయాలతో స్పర్శించి పరితపించాలని రాజకీయ నాయకుల బాధ్యతలను గుర్తు చేసిన విధానం,రైతుల పట్ల తనకున్న ప్రేమను సామాజిక బాధ్యతను అభివ్యక్తీకరించిన తీరు బహుదా ప్రశంసనీయం.పర్యావరణాన్ని అతలాకుతలం చేయడానికా ఆధునిక మానవుని మేధస్సు అంటూ ప్రశ్నిస్తూనే ప్రకృతి తల్లికి పరిపూర్ణతను అందించే దివ్యౌషదమే చెరబట్టని ఆకుపచ్చని అవనేనని తనలోని ప్రకృతి ప్రేమికురాలిని పరిచయం చేస్తారు.
అనుభవాలను అక్షరాలుగా మలచి ,గాయాలను కన్నీటి సిరాగా మార్చి బాంధవ్యాల బంధీఖానాలో మగ్గుతున్న జీవితాలతో నింపిన పేజీలే దర్శనమిచ్చే కవితా సంపుటిని అందరూ చదవాల్సిందే.నైరాశ్యపు నీడ కమ్మని కలల ప్రపంచాన్ని కాల్చేస్తుందని ఉపదేశిస్తూనే ఆగిపోయే ఊపిరులకు ,దగాపడే జీవితాలకు అక్షరాలు ఆసరా కావాలని, సాహితీ ప్రపంచం దన్నుగా నిలవాలని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.ఉనికి కోసం పాకులాడే ఆకారంలేని అర్దనగ్నపు గీతలన్నీ ,వెలవెలబోతూ వలసపోయే అరువు తెచ్చుకున్న నవ్వులన్నీ అర్థం కాని లెక్కలేనని అనుభవాల సారాంశాన్ని చక్కగా వివరించారు .అనుబంధాలను అల్లరి పాలు చేసే వంచకుల,రక్త సంబంధాల రాతలను మార్చేసే మాయగాళ్ళ,రాక్షస క్రీడలాడే రాజకీయ నాయకుల వంకర బుద్ధిని బయటపెట్టే రోజులు ఎంత దూరమని ఆవేదనా భరితమైన, ఆక్రోశం నిండిన కలంతో గర్జిస్తోంది కవయిత్రి.
బంధాలను భారంగా ఎంచి స్వార్థం కోసం బరితెగించే మానసిక రోగుల గుండెల్లోకి కలమనే గునపం దించుతున్నారు మంజు అమ్మ గారు.మనది కాని ప్రయాణానికి ఉసిగొల్పే తప్పటడుగులు మరణశాసనాన్ని లిఖిస్తూ అసమర్థులుగా సంఘంలో నిలబెడతాయని తెలిపే జీవిత మర్మాలెన్నిటినో ఒంపిన కవితా సంపుటి.ఉపన్యాసాలతో ఊదరగొడుతూ,ఉద్యమాలంటూ ఊరేగుతూ నడిబజార్లో సత్యాన్ని సమాధి చేసి సంతాప సభలు పెట్టే ఊసరవెల్లులకు కొమ్ము కాయద్దని సుతిమెత్తగా మేధావులను హెచ్చరించిన తీరు ప్రశంసనీయం.
సంద్రంలోని అలల వలే హృదయాన్ని తాకుతున్న సమాజ సంఘర్షణల్ని, జీవిత అనుభవాల్ని,మదిలో మెదిలే భావాల్ని కవితా ధారలుగా ఒంపారు.సమాజంలోకి పరకాయ ప్రవేశం చేశారో లేక యావత్ సమాజాన్ని తనలోనే బంధించి దర్శించి నిరంతర శోధన చేశారో ప్రతి రుగ్మతను మన ముందుంచారు.ప్రతి కవనంలో సామాజిక స్పృహ గోచరిస్తూ సన్మార్గాల్ని చూపిస్తూ ఎద లోతుల్ని విశాలం చేస్తూ బాధ్యతను గుర్తెరిగేలా నడిపించే భావ తరంగ చైతన్య దీప్తై మనల్ని నడిపిస్తాయనడంలో అతిశయం లేదు.మనసు పడే యాతన నుండి పుట్టిన సంఘర్షణ భావోద్వేగాలను ప్రజ్వలన చేశాయేమో అనేక కోణాల్లో నిర్మింపబడిన సమాజంలోని భిన్నమైన మనస్తత్వాలను వాటి పర్యావసానాలను ప్రతిబింబించిన తీరు అభినందనీయం.చెల్లాచెదురవుతున్న జ్ఞాపకాలను, చెదిరిపోయిన చిన్ననాటి చిత్రాలను,రాలిన కలలను ఒక చోట పేర్చి మనకు అందించారు .అంటీముట్టని ఆప్యాయతల్ని,మకిలి పట్టిన మురికి మనుషుల్ని వెలివేయడమే సబబని నిక్కచ్చిగా చెప్పడం ఆమె అంతరంగ ఆవేదనకు,అంతరిస్తున్న విలువలకు అద్దం పడుతుంది.మండుతున్న గుండెలతో బడుగు రైతులు ఉద్యమాలకు ఉద్యుక్తులైతే ఏ పంట పండించనని ఒక అడుగు ముందుకు వేస్తే మన పరిస్థితేంటని రైతుల గొప్ప మనసును కీర్తిస్తూనే రాజకీయ నాయకుల, కార్పొరేట్ శక్తుల,దళారుల కుటిలత్వాన్ని ఎండగట్టడం చూస్తే రైతుల పట్ల మమకారాన్ని అర్థం చేసుకోవచ్చు.
నిరంతర సంఘర్షణల్లో నుండి ,కోల్పోతున్న బంధాల వేదన నుండి మానవత్వపు వెలుగులు పూయించాలన్న ఆరాటం ఆత్మపరిశీలనై ,అంకురమై మొదలైన అక్షర ప్రయాణంలో నేనొక ప్రయాణికుడను అయినందుకు అదృష్టంగా భావిస్తున్నాను.నిజాలను విన్ననూ అబద్దాలను నమ్ముతూ అరకొర అర్దనగ్న నైతిక విలువలతో విలవిల్లాడుతున్న న్యాయదేవతకే గూడులేదని గోడు వెల్లబోసుకోవడం సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షేనని ఆవేదన చెందడం వారిపట్ల తన నిబద్ధతను చాటి చెబుతారు కవయిత్రి.
అంతర్లీనంగా దాగిన భావావేశపు వెలుగులను మన మనసుల్లో ప్రోది చేస్తూ సమాజ రుగ్మతల సత్వర సన్యాసానికి దూసుకొచ్చిన అక్షర తూటాల విన్యాసమే మంజు యనమదల అమ్మ గారి "అక్షర స(వి)వ్యాసం.అక్షరాల విన్యాసాలను క్రమంగా పదాల పోరాటపు ఆరాటంగా మార్చడం స్పష్టంగా కనిపిస్తుంది.ప్రతి ఒక్కరూ చదవాల్సిన కవితా సంపుటి.చక్కటి కవనాలను అందించిన మంజు యనమదల అమ్మ గారికి హృదయపూర్వక అభినందనలతో....
పుట్టపర్తి మల్లికార్జున
ఉపాధ్యాయుడు
గోరంట్ల
అనంతపురం జిల్లా
9490439029
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి