సహజమైన కవిత్వానికి హంగు, ఆర్భాటాలు అక్కరలేదన్నది వాస్తవం. అంతర్మధనానికి, ఆవేశానికి ఓ సున్నిత రూపాన్నిస్తే అది అనుశ్రీ కవిత్వమవుతుంది. మదిసంద్రంలోని అలజడిని కెరటాలుగా అదేనండి అలల కలల ఆశల విహంగాలను కవితలుగా ఏర్చి కూర్చి తొలి కవితా సంపుటి " కెరటం " గా తెలుగు సాహిత్యానికి అందించడం అభినందించదగ్గ విషయం.
నాన్న తమతో లేకున్నా నాన్నే తన కవిత్వానికి, ఎదుగుదలకు ప్రేరణ అని క్షయంలేని అక్షరాల్లో పదిలం చేసుకున్నారు. అమ్మను గగురించి చెప్పిన భావాల్లో ఇది బాగా నచ్చింది. ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు?
" నిరంతరం మనకై తపించే
నూరేళ్ళ తాపసి అమ్మ "
అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది అది వేరే సంగతి. నేను చదివిన వాటిల్లో అమ్మను గురించిన అద్భుత భావాలివి. మనసులో నుండి వచ్చిన భావాలకు ఏ అలంకరణలు అవసరం లేదనడానికి ఇవే సాక్ష్యాలు. పరకాయ ప్రవేశం చేసి రాసిన కవితలు ఈ సంపుటి నిండా మనల్ని అలలు అలలుగా తాకుతూనే ఉంటాయి చదివినంతసేపూ..
ఇల్లాలి గురించి రాసిన కవిత చదువుతుంటే మన సమాజంలో ఎందరో భార్యల జీవితాలు కళ్ళ ముందుకదలాడక మానవు.
" ఆశలతో బయలుదేరి
నిరాశలు మూటగట్టుకునేకన్నా " (కంచెలే మంచివి కవిత)
కంచెలే మంచివి, పంజరమే సుఖమనిపిస్తుంది అనడంలో ఎంత లోతైన భావన ఇమిడి ఉందో తెలుస్తోంది.
మరో కొత్త కవితా వస్తువు స్వర్ణకారుల గురించి " వెన్నెలకే వన్నెలు అద్దే అసాధ్యులు " అని " స్వర్ణకారులు " కవితలో సరి కొత్తగా ఆవిష్కరించారు. మరెన్నో సమాజపు పోకడలు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ప్రతి అనుభూతి మనకు తనదైన శైలిలో ఆవిష్కృతమౌతాయి. ఇది "అను శ్రీ " తొలి వచన కవిత్వ సంపుటి అన్న భావన మనకు రాదని నొక్కి వక్కాణించగలను.
ఆశలు, ఆశయాలు, ప్రేమాభిమానాలు, ఆక్రొశాలు, ఆప్త వాక్యాలు, అహం, మమతల మణిహారాలు, మహిళల మనోగతాలు, అగచాట్లు ఇలా వైవిధ్యమైన వస్తువులతో కెరటం కవితా సంపుటిని పేరుకు తగ్గట్టుగా చక్కని సరళమైన తెలుగు పదాలతో పరిపుష్టం చేసారు. ఎంత కోపంగా రాయాలనుకున్నా అతివ సహజ లక్షణాన్ని వీడకుండా అహాన్ని, బాధను, కన్నీటిని కూడా అందంగానే చెప్పారు.
ఎంతో అభిమానంతో నన్ను నాలుగు మాటలు రాయమని అడిగినందుకు ధన్యవాదాలు. చక్కని అలతి పదాలతో కెరటాన్ని మనోసంద్రపు భావాల మాయాజాలంతో మనల్ని కట్టిపడేసిన ఈ సాహితీ చైతన్యం " అను శ్రీ " కి హృదయపూర్వక అభినందనలతో....
మంజు యనమదల
విజయవాడ.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి