8, మార్చి 2020, ఆదివారం

ఏక్ తారలు

1.   వెన్నెల సంతకం పెడదామన్న అత్యాశ_చీకటి సిరాతో..!!
2.   పలకరించాలనుకుంటున్నా_మౌన వారధిని మన మధ్య చెరిపేయాలని..!!
3.  గతంతో పనేముంది_వాస్తవమంతా నీతోనే ఉంటే..!!
4.   చెరపలేని గతమే వాస్తవమైంది_కన్నీరు కలత చెందినా..!!
5.   చీకటి మాత్రం నా సొంతమే_వెలుగు అందరికి పంచాలన్న స్వార్థంతో...!!
6.   సంశయమక్కర్లేని చెలిమిది_చీకటి చిరునవ్వుకు తోడంటూ...!!
7.   నిశ్శబ్ధమే నేస్తమెప్పుడూ_చిగురించే చిరునవ్వుల సహవాసానికి..!!
8.   నిందలేయడమే కొందరి నైజం_నెయ్యపు ముసుగులో..!!
9.   వద్దని వారించలేనివే జ్ఞాపకాలన్నీ_కలతపడినా కన్నీరు తెప్పించినా..!!
10.   కోరిక చిన్నదే_ఆశే అలవికానిదైంది..!!
11.  గమ్యాన్ని చేరుకో ఇలా_వెన్నెల పొద్దులో వేకువాక్షరాలతో..!!
12.   అంతిమం గురించి ఆలోచనేల_పరవశించే పదాలు నీ సొంతమైనప్పుడు...!!
13.   ఉదయాక్షరాలే అవి_హృదయానికి ఊపిరిగా మారుతూ..!!
14.   మరో మాటకు తావెక్కడ_మనసే లేనప్పుడు...!!
15.  మనసు ఉంటేనేమి లేకుంటేనేమి_మనిషే ముక్కలయ్యాక..!!
16.  నిష్క్రమణం అనివార్యమని ఎరిగినట్లుంది శూన్యం_మన మధ్యన ఇమడలేక...!!
17.   మాటలవసరం లేదు_మనసుంటే చాలేమెా..!!
18.  ఏళ్ళ తరబడి పరిచయాలక్కర్లేదు_కొన్ని బంధాలకు...!!
19.   అక్షరాలతో కలిసిన ఆత్మబంధమది_పలకరింపులకు పరిమళాలనద్దుతూ...!!
20.    కలానికి కళ్ళిద్దాం_మనం చూడలేని మరో లోకాన్ని పరిచయం చేసుకోవడానికి...!! 
21.  చిరిగిన బతుకుల అతుకులెన్నో_చెరగని నవ్వుల చాటున...!!
22.   ఆంతరంగికం ఆత్మీయులకెరుకే_మౌనం మాటలు నేర్వకున్నా..!!
23.   వెదుకులాటకు ముగింపే లేదు_తట్టి లేపేది జ్ఞాపకమైనప్పుడు..!!
24.   మౌనంతో ఊసులాడేదీ జ్ఞాపకమే_ముగింపు తెలియని జీవితాల్లో...!!
25.   తట్టుకోలేనిదే మనిషి నైజం_ముసుగులు తీసేస్తే...!!
26.   నిర్ణయం నీదేగా_నిరీక్షణకు తెర తీయాలన్నా వేయాలన్నా...!!
27.   దూరమని నువ్వనుకుంటే ఎలా_దగ్గరతనాన్ని గుర్తు చేస్తున్నానంతే..!!
28.  చివరి తేది లెక్కింకా తేలలేదట_దేవుడి జమాఖర్చుల్లో...!!
29.  చీకటి చుట్టేసిన జీవితాలెన్నో_మెలకువ కల కోసం ఎదురుచూస్తూ..!!
30.   వెలుగులు చిమ్ముతూనే ఉంటుంది_కలతకు నెలవైన కన్నీటి చిత్రమైనా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner