25, మార్చి 2020, బుధవారం

మాధవి గోపిశెట్టి గురించి గోదావరి లో...!!

      
 "  పట్టుదలకు సాక్ష్యమే మాధవి గోపిశెట్టి రచనలు " 

      కొన్ని సంవత్సరాలుగా తెలుగు మీద మక్కువతో, తెలుగు సాహిత్యాభివృద్ధికి తనవంతుగా సేవ చేయాలన్న సంకల్పంతో కవిత్వం రాయడం మెుదలుపెట్టిన కవయిత్రి గోపిశెట్టి మాధవి. ద్విపదలు, త్రిపదలు, ఏక్ తారల వంటి లఘు కవిత్వంలో కూడా ప్రవేశముంది. పలు తెలుగు భాషా సాంస్కృతిక సమావేశాల్లో తన వాణి వినిపించడమే కాకుండా పురస్కారాలు, సన్మానాలు కూడా అందుకున్నారు. పుట్టుకతోనే పట్టుదలను ఆభరణంగా అందుకుని ఏదైనా నేర్పుతో సాధించడం ఈమెకున్న గొప్ప లక్షణం. చదువుకుంది పదవ తరగతైనా తెలుగు భాష మీద మమకారంతో, కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే చక్కని కవిత్వాన్ని రాయడం వంటబట్టించుకున్నారు. ఏదైనా త్వరగా నేర్చుకునే లక్షణం ఉండటం వలన అతి కొద్ది కాలంలోనే చిక్కని కవిత్వాన్ని రాస్తున్నారు. 
         జీవితానికి గమ్యం ఉండాలని అలుపెరగక, ధైర్యంతో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిపోవాలని "పదండి ముందుకు "అంటూ జీవిత గమనాన్ని చెప్తారు శ్రీ శ్రీ గారి కవిత " పదండి ముందుకు " ను అనుకరిస్తూ. మనసుతో చూసి, చిరునవ్వుతో పలకరిస్తే మన చుట్టూ అంతా ప్రేమమయమేనంటారు మరో చిరు కవితలో. స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి బాధను వ్యక్తపరుస్తారు ఓ కవితలో. అంతులేని ఆరాధనను, ఆర్తిని చూపిస్తారు తన కవితల్లో చాలా చోట్ల. నిన్ను నీవు మార్చుకో అంటూ వ్యక్తిత్వం ఎలా ఉండాలో తెలుపుతారు. తెలుగుభాష గొప్పదనాన్ని, మహిళ 
ఒౌన్నత్యాన్ని, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను, సమాజ రుగ్మతలపై అక్షరాన్ని ఆయుధంగా తాను ఎలా ఎక్కుపెడుతున్నారో చెప్తారు తనదైన శైలితో. అందరిని వదలి పరాయి దేశ ప్రయాణం చేయడానికి కారణాలను, అప్పటి మానసిక సంఘర్షణలను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు. నాన్న కవితలో నాన్న విలువను తెలియజెప్తారు. ఎంకి నాయుడుమావను గుర్తుకు తెస్తారు ఓ కవితలో.  జీవిత చదరంగంలో మనమందరం దేవుని చేతిలో పావులమని తాత్వికతను బోధిస్తారు. మగువ తాను ఓడి మగని గెలిపించండంలో భార్య గొప్పదనాన్ని, త్యాగాన్ని వివరిస్తారు. కాలుష్యపు కోరల్లో ప్రకృతి ఎలా కలుషితమైపోతోందో వివరిస్తారు మరో కవితలో. 
       మాధవి మధురిమలంటూ చక్కని మంచి మాటలను చెప్తారు. దూరమైన బంధాన్ని గుర్తు చేసుకోవడంలో ప్రేమను అక్షరీకరిస్తారు. భూమిపుత్రుడు రైతుబిడ్డను ఏ చరిత్రా  మరువలేదంటారు. సమెాసా, సున్నుండల గురించిన వర్ణన చదువుతుంటే..వేంటనే తినేయాలనిపించేస్తుంది. దీపం గురించి, అక్షరాల గురించి, జీవితం గురించి, ఆశ, ఆనందం, ఆహ్లాదం, అందం, అభిమానం, స్నేహం, ప్రేమ, విరహం, వేదన, వైరాగ్యం, మానవ సంబంధాలు ఇలా జీవితంలో మనకు తారసపడే విషయాల గురించిన ప్రతి అంశమూ మనకు మాధవి మధురిమల్లో కనిపిస్తాయి. 
      మన విజయమే తమ విజయంగా భావించి సంతోషపడే గురువుల గురించి చాలా బాగా చెప్పారు. జీవిత పుస్తకం ఎలా మలచుకోవాలన్నది మన చేతిలోనే ఉందంటూ సున్నితంగా హెచ్చరిస్తారు. జవాన్ల గొప్పదనాన్ని, చిన్నప్పటి చిలిపి అల్లరులను, రుబ్బరాయితో చేసిన పచ్చడి కమ్మదనాన్ని, బడిని, గుడిని ఇలా తనకు అనిపించిన ప్రతి విషయాన్ని కవితా వస్తువుగా తీసుకుని అలతి పదాలతో అర్థవంతమైన కవితలు అందిస్తున్నారు. 
       ఏక్ తారల్లో చాలా వరకు మహిళ ఒౌన్నత్యాన్ని చూపే తారలే ఎక్కువ. అందుకే 
" అతివకు వందనాలు_ఆత్మాభిమానంతో అందరికి సేవలందిస్తున్నందుకు..!! " అంటూ అక్షరాల్లోనూ అతివనే చూపుతారు. 
    ద్విపదల్లో తీసుకుంటే
 "  అమ్మ పలుకునేగా 
   ఆదిస్వరంగా నేవిన్నది...!! " ఎంత అద్భుతమైన భావన ఇది. నాన్న గురించి, మౌనం, ప్రేమ, బాధ ఇలా అన్నీ అనుభూతులను లఘుకవితలుగా లాఘవంగా మలిచారు. 
    వీరికి లభించిన పురస్కారాలు లెక్కకు మించే ఉన్నాయి. 
సృజన సాహితీ వారి కవిశ్రేష్ఠ ఆత్మీయ పురస్కారం 
కవితాలయం వారి కవితేజం 
ఐ వి యం ఎస్ ఇంటర్నెట్ వాసవి మహిళా సమాఖ్య వారి వైశ్య ముద్దుబిడ్డ మరియు మల్లినాథపీఠం వారు, కవనపూదోట మరి కొందరి నుండి ఆత్మీయ సత్కారాలు, పలు బహుమతులు అందుకున్నారు.
పలు పత్రికలలో కవితలు ప్రచురితమయ్యాయి. 
     సరళమైన భాషలో, సున్నిత భావాలను రాయడంలోనూ, అక్షరాన్ని ఎక్కడ ఎలా పదునుగా వాడాలో, సమాజంలో ఏ ఏ అంశాలపై ఆయుధంగా ప్రయెాగించాలో బాగా తెలిసిన పట్టుదలకు పెట్టని గోడ మన మాధవి గోపిశెట్టి. మరిన్ని సమాజ హితకర కవితలు రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... అభినందనలతో
మంజు యనమదల 
విజయవాడ 

 
       

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner