19, మార్చి 2020, గురువారం

సింహా గారి గురించి..!!

అక్షరాలతోనే తన అనుబంధమంటున్న "సింహా"..!!

" నా ప్రయాణం...
అడుగులతో కాదు అక్షరాలతోనే..!! "
అంటూ తన జీవితంలో అక్షరానికెంత ప్రాముఖ్యత ఉందో చెప్పకనే చెప్పారు యు. లక్ష్మీ నరసింహ గౌడ్ చక్కని లఘు కవితలో.  ఏక్ తారలు, ద్విపదలు, త్రిపదలు అలవోకగా రాయడంలో అందె వేసిన చేయి లక్ష్మీ నరసింహది. కలం పేరు "సింహా"తో ముఖపుస్తకంలో అందరికి సుపరిచితులు. లఘు కవితా ప్రక్రియలే కాకుండా చక్కని కవిత్వం రాయడంలో కూడా నిష్ణాతులే. పలు సామాజిక అంశాలపై తన స్పందనలను కవితలుగా అందించారు. 
           చిన్నతనం నుండి రాయడమంటే మక్కువ ఎక్కువని, 17 ఏళ్ళ వయసులోనే శతకం పూర్తి చేయాలన్న సంకల్పంతో 60 ఆటవెలది పద్యాలు రాసిన దిట్ట. అంతకు ముందే 10వ తరగతిలోనే పాట రాసి, అభినయించి అందరి ప్రశంసలతోబాటు, ప్రధమ బహుమతి కూడా అందుకున్నారు. వృత్తి రీత్యా కాలేజ్ ఇన్ఛార్జ్ గా పని చేస్తూ, కుటుంబ బాధ్యతలతో పాటు సాహిత్యాన్ని కూడా అమితంగా ప్రేమించే వ్యక్తి సింహా. 1000 కి పైగా వచన కవితలు, 5000 వేల పైచిలుకు ద్విపదలు, 2000పైన ఏక వాక్య కవితలు, 500పైగా త్రిపద కవితలు ఇప్పటి వరకు రాశారు. ముద్రితమైన పలు కవితా సంకలనాలలో తాను పాలుపంచుకున్నారు. 
  " అక్షరమై బతికేస్తుంటా...
తానో పుస్తకమై నాలో ఉన్నంతకాలం...!! "  
అక్షరాల్లోనే తన ఆరాధనను, ఆర్తిని ఒలకబోయడం సింహకు వెన్నతో పెట్టిన విద్యగా అనిపిస్తుంది తన కవితలు చదువుతుంటే.
" నీ జ్ఞాపకాల్ని వెంటేసుకున్నానందుకే
భవిష్యత్తులోకి ధైర్యంగా నడవాలనే..!! "...నీవు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు నేను బతికేయడానికి అంటూ దూరమైన తన ప్రేమను అక్షరాల్లో నింపుకోవడంలోనే ఆ అందమైన భావుకత్వానికి మరింత వన్నె తెచ్చింది. 
" తను నవ్వుతుంటే తెలిసింది
నా కన్నులకు పండుగెందుకొచ్చిందో...!! " అనడంలోనే తెలిసిపోతోంది మదిలోని అంతులేని ప్రేమకు ఇదో మచ్చుతునక అని. 
"  అమ్మ దిగులు పట్టుకుందేమెా బ్రహ్మకు
    మా అమ్మను తీసుకెళ్ళి ఆనందిస్తున్నాడు "  అంటూ అమ్మను దూరం చేసిన దైవానికి సున్నితంగా చురక వేయడం వీరికే చెల్లింది. 
" కలం కాలం ఒకటేనేమెా
  కవినొకటి విధాతనొకటి అనుసరిస్తూ..!! " ఎంత గొప్ప మాట ఇది. కలానికి, కాలానికి పొంతన అద్భుతంగా చెప్పారు. 
" కల్పనలో కాలానిదే ముందంజ
  కవులను మించి కథలల్లడంలో..!! " కాలం చతురతను ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు. 
ఇలా మరెన్నో లఘు కవితల్లో అందమైన, అద్భుతమైన భావుకత్వాన్ని సరళమైన పదాలతో అందించే నేర్పు వీరి కలానిది. 
     రైతు గురించి చెప్పినా, బొమ్మా బొరుసు జీవితపు ఆటలో మనిషి పాత్ర గురించి రాసినా, తరిగిపోతున్న మానవ విలువల గురించి బాధను వ్యక్తపరుస్తూ మనిషి మనిషిగా బతికే కాలం ఎప్పుడు వస్తుందో అంటారు ఇంకెప్పుడో మరి కవితలో. పసిబిడ్డలపై జరుగుతున్న అకృత్యాల గురించి మృగా(లు)ళ్లు కవితలో ఆవేదన వ్యక్తం చేస్తారు. అక్షరాల ఆస్తిని అందించిన బ(గు)డిలో దేవుడి గురించి అద్భుతంగా రాశారు. దూరపు కొండలు నునుపనుకునే వారి కోసం గల్ఫ్ కష్టాల గురించి, ఆడపిల్లల భయం గురించి, వాన చినుకు కోసం ఎదురుచూసే రైతు కన్నీటి చినుకులను గోరువెచ్చని చినుకులుగా మలచడంలోనూ, కష్టాలను నవ్వు కన్నీళ్ళ వెనుక దాచుకుని కుటుంబ బాధ్యతలను మెాసే అమ్మానాన్నలను చూసాక జీవితం సంతోషాలమయమని ఎలా భ్రమపడను అని ప్రశ్నించినా, అమ్మ భాష గురించి రాసినా, జ్ఞాపకాల గురించి రాసినా...ఇలా కవితా వస్తువు ఏదైనా తన కలం గళాన్ని మనసుతో వినిపించిన కవి సింహా. 
నానీలలో రైతు గురించి చక్కగా రాశారు. 
         తన కలంతో అక్షర విత్తనాలు చల్లుతూ, సాహిత్య సేద్యం మెండుగా చేస్తున్న ఈ తరం కవులలో సింహా ఒకరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నో కవి సమ్మేళనాల్లో పాల్గొని తన గళాన్ని వినిపించి అందరి మెప్పును అందుకున్నారు. వీరికి లభించిన పలు పురస్కారాలే వీరి ప్రతిభకు తార్కాణం. 
             కవితాలయం (సాహిత్య సామాజిక సేవా సంస్థ) వారు లాస్ట్ 2019కి గాను మొదట దీపావళి పురస్కారం లభించింది, తరువాత ఇదే సంవత్సరంలో వారి ద్వారానే *కవిచక్ర* బిరుదు లభించింది. వసుంధర విజ్ఞాన వికాస మండలి (గోదావరఖని) వారు జరిపిన రాష్ట్ర స్థాయి కవితలు పోటీలో ప్రథమ స్థానం బహుమతి లభించింది.
సృజన సాహితీ సంస్థ వారి ఆత్మీయ పురస్కారం, న్యూ విజన్ సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రైతు ఆత్మహత్యలు నివారణ అంశం మీద జరిగిన పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం.
తెలుగు సాహితీ సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటూ... అక్షరాలను అమితంగా ప్రేమించే సింహా గారికి హృదయపూర్వక అభినందనలు. 
       

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner