మమకారపు ప్రేమలాలసుడు " మా నాయన "..!!
ఎన్నో ముఖ పుస్తక సమూహాల్లో కవితాలయం సమూహానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఒక సమూహంలో ఉన్నప్పుడు నలుగురు రాయడం, వాటికి స్పందనలు, అందరు కలవడం సహజం. ఓ ప్రత్యేక సందర్భానికి చిరపరిచితమైన అంశం మీద కవితా పోటీ నిర్వహించడమే కాకుండా ఆ పోటీలోని ఉత్తమ కవితలను సంకలనంగా తేవడానికి చేసిన ప్రయత్నం మనస్ఫూర్తిగా అభినందించదగ్గ విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మానాన్న లేకుండా ఙివితం లేదన్నది నిర్వివాదాంశం. ఆ ఇద్దరిలో ఎక్కువగా అమ్మను గురించిన ఎన్నో కవితలు, కథలు, నవలలు, సినిమా పాటల్లాంటి పలు సాహితీ ప్రక్రియలు వచ్చాయి. నాన్న మీద వచ్చినవి వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలా ఇరవై ముగ్గురు కవితాలయం సమూహపు కవులతో వచ్చిన కవితా సంకలనమే " మా నాయన " కవితా సంకలనం.
నాన్న తన కోసం ఏమీ చేయలేడట, కానీ తనకోసం ఆటబొమ్మగా మారి తన జీవితానికి పునాది వేసి ఉన్నత స్థానంలో నిలిపారని, విలువలు నేర్పారని చక్కని భావాలను నాన్న కవితలో డాక్టర్ పాణిగ్రహి చెప్పారు. మరపురాని నాన్న జ్ఞాపకంగా మారితే, తన కలలకు కదిలే రూపమైన కొడుకు ఇంట బిడ్డగా మళ్ళీ పాడాడిన క్షణాలను నమ్మకుండా ఉండలేనంటూ నాన్న మళ్ళీ పుట్టాడంటారు యు ఎల్ నరసింహ గౌడ్. కష్టాలకు తాను
కుంగిపోతున్నా, బిడ్డ ఎదుగుదలకు ఊతంగా మారినందుకు పొంగిపోతుంది తండ్రి మనసు అంటారు ఊతకర్ర కవితలో నాగ్రాజ్. అపురూపంగా, అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చెప్పకుండా గడప దాటితే, విధి వంచనంటూ విలవిలలాడిన ఆ తండ్రి ప్రాణం గుండె మంట తీర్చుకోవడానికి చితి మంటలు చేరిందని మామిళ్ళపల్లి కృష్ణ కిశోర్ అంబరాన్నంటిన సంబరం కవితలో చెప్తారు. నా చిన్నతనంలో అర్థం కాని విలన్, నడివయసులో ఊతంగా మారి, తర్వాత కనిపించే దేవుడయిన నాన్న గురించి అతనంతే ముళ్ల దారిలో కవితలో జాకిర్ షేక్ కొత్తగా చెప్తారు. అహర్నిశలూ కుటుంబం కోసం శ్రమించే నిస్వార్థజీవి, నాన్న రెండక్షరాల పదం కాదు అని సానా సాంబమూర్తి అంటారు. అమ్మ ప్రాణం పోస్తే, ఊపిరి తానందించి నడత, నడక నేర్పే అనుబంధాల పందిరి నాన్నఅంటారు డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి. కాలాలు మూడే కావచ్చు కానీ కాలాలకతీతంగా నీవు ఎప్పటికీ మాతోనే ఉన్నావంటారు జ్ఞాపకంగా మారిన నాన్న గురించి నాన్నే నా సైన్యం కవితలో దేవపట్ల పవన్ కుమార్. నాన్న గొప్పదనాన్ని అల్పాక్షరాల్లో వర్ణించలేనంటారు వేంపల్లి రెడ్డినాగరాజు. విధిరాత విధాత రాస్తే, విశ్వాన్ని పరిచయం చేసేది, బాసట, భరోసా అయ్యేది నాన్న ఒక్కరే అంటారు దిక్సూచి కవితలో నామని సుజనాదేవి.
అప్పుడు కఠినంగా ఉన్న నాన్న, ఇప్పుడు కన్నీళ్ళ జ్ఞాపకాల పాలపుంతగా మారిపోయాడు. చిట్టిపొట్టి వాక్యాలకే కవయిత్రైపోయానని పొంగిపోయిన నాన్ననాకెప్పుడూ అర్థం కాని అపురూపమేనంటారు శ్రీమతి శాంతి కృష్ణ. అనుక్షణం బిడ్డల గురించి తపన పడే నాన్నకు పలకరింపులు చివరి క్షణాల్లోనయినా దగ్గర చేయండని వేడుకుంటున్నారు సుకన్య వేదం. నాన్నంటే అమ్మకు ప్రతిరూపమని చాలా చక్కగా ఆశాదీపం కవితలో స్వర్గీయ సత్య రామాల్కర్ చెప్పారు.
కమ్యూనిష్ట్ పార్టీ సిద్దాంతాలకు జీవితాంతం కట్టుబడి, మంచికి మారుపేరైన నాన్న అపురూపమై, ప్రత్యక్ష దైవమైనారని సంధ్యాకుమారి యేరుసుఅంటారు. ఫాదర్ మూడక్షరాల పదం కాదు, నవనాగరిక సమాజంలో సమున్నతంగా నడిపించే లేజర్ అని, జీవితాంతం పహరా కాసే సోల్జర్ అని, తన శక్తిని స్వేదంగా మార్చి పరిమళమద్దే వారియర్ అంటారు రామచంద్ర పల్లం. అన్నీ తానైన నాన్నకు వెన్నంటి నడిచే నీడనవుతానంటారు నాన్నతో నేను కవితలో విహారి బీరే వేణుగోపాల్. నాన్న కళ్ళలో నరకం ఉన్నా నిజంలో నవ్వుతూ ఉండే మామూలు మనిషంటారు డి ఎం మహాశివ. అమ్మే మరో రూపంలో నాన్నంటారు అనలకుమారి. నాన్నంటే నిస్వార్థ రూపమంటూ, విశ్వాత్ముడని విశ్వానికే చాటుతానంటారు సావిత్రి రవి దేశాయి. కొడుకుకే కొడుకుగా పుట్టాలనుకునేంత ప్రేమ గల తండ్రిని పితృదేవోభవ అంటారు జానపాటి మహాలక్ష్మి. కుల,0మత, వర్గ విభేదాలు వద్దని సంతృప్తిని మించిన సుఖము లేదంటూ, స్నేహం విలువ తెలిపిన అన్నను అమ్మాయిలో చూసుకున్న నాన్నవంటార చావలి బాల కృష్ణవేణి. అభిమానానికి ఆద్యుడు, జీవితానికి మార్గదర్శి అంటారు ఎల్ వెంకటేశ్వర్లు. అన్నీ తానైఞ పిల్లల జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయే ఓ మధురకావ్యం నాన్నంటారు చేబ్రోలు యజ్ఞనారాయణ.
అక్షరం కోసం నిరంతరం శ్రమిస్తూ, సాహిత్యానికి, సాహిత్యాభిలాషులకు చేదోడుగా ఉంటూ, అందరి అభ్యున్నతికి పాటుపడే పిన్న వయస్కుడు దేవపట్ల పవన్ కుమార్. కవితాలయం సముహంతో నిరంతరాయంగా తెలుగు సాహితీ మూర్తులను గౌరవిస్తూ, కొత్తగా రాసే వారికి సహాయ సహకారాలందిస్తూ అక్షరయానం చేస్తున్న పవన్, మా నాయన కవితా సంకలనం వేయడం ఎందరికో స్పూర్తివంతం. ఇంత మంచి పుస్తకం వేయాలన్న పవన్ ఆలోచనకు అభినందనలు.
ఈ సంకలనంలో నాన్న గురించి రాసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులే. తీసుకున్న వస్తువు ఒకటే అయినా విభిన్న అభివ్యక్తులతో, సున్నింంగా నాన్న ప్రేమను అక్షరాల్లో అందించినందుకు అందరికి హృదయపూర్వక అభినందనలు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి