28, మార్చి 2020, శనివారం

భూతల స్వర్గమేనా...!! 3

వర్షంలో ఇంటి నుండి బయలుదేరి పినాకినిలో మద్రాస్ చేరుకున్నాము. మద్రాస్ ఎయిర్ పోర్ట్ లోనికి వెళ్ళగానే ముందు బాగేజ్ అంతా స్కాన్ చేసాక, రూపాయలను డాలర్లుగా మార్చుకుని, అది పాస్పోర్ట్ లో ఎంటర్ చేయించుకున్నా. మనం లగేజ్ సర్దుకునేటప్పుడే మన టికెట్ వెనుక ఇన్స్ట్రక్షన్స్ చదువుకుని మన లగేజ్ సర్దుకోవాలి. మనం బాగేజ్ లో ఏం లగేజ్ పెట్టుకోవాలి, హాండ్ లగేజ్ లో ఏం తీసుకువెళ్ళాలన్నది, ఎంత వెయిట్ తీసుకువెళ్ళాలన్నది క్లియర్ గా రాసి ఉంటుంది. నిబంధనలకు మించి ఉన్న లగేజ్ కాని, తీసుకు వెళ్ళకూడని వస్తువులు కాని తీసేస్తారు. మనం టెన్షన్ పడకుండా ఉండాలంటే కాస్త తక్కువ వెయిట్ తో సర్దుకోవాలి. మెుదటిసారి కదా..నాకు కాస్త భయం అనిపించినా అన్ని సరిగానే ఉండటంతో లగేజ్ తీయాల్సిన ఇబ్బంది రాలేదు. మనం వాటర్ బాటిల్స్ తీసుకు వెళ్ళనక్కరలేదు.

       బ్రిటీష్ ఎయిర్ వేస్ లో బాగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుని, చివరిసారి అందరికి వీడ్కోలు చెప్పి ఇమ్మిగ్రేషన్ చెక్ పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళడం, బోర్డింగ్ పాస్ లో గేట్ నెంబర్ చూసుకుని లాంజ్ లో కూర్చున్నా. మా హాస్టల్ అమ్మాయి కనబడితే పలకరించా.  తను కూడా అదే ఫ్లయిట్ లో లండన్ వరకు అంది. కాస్త ఎగ్జయిట్ మెంట్, కొద్దిగా బెరుకుతో, అందరిని వదిలి వెళుతున్న దిగులుతో చిన్నప్పుడు ఆకాశంలో, హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లో చూసిన విమానం నేనూ ఎక్కబోతున్నానన్న ఆనందం కాస్త...ఇలా ఆలోచిస్తుండగానే ఎనౌన్స్ మెంట్ వినబడింది.. గేట్ లో నుండి లోపలికి వెళ్ళడం, కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళగానే ఫ్లైట్ లోపలకి చేరడం..ఎయిర్ హోస్టెస్ స్వాగతంతో అప్పుడే ఫ్లైట్ లోనికి తెలియకుండానే వచ్చేసాన్న సంబరం. సీట్ చూపెట్టడం, హాండ్ లగేజ్ పైన సర్ది, కూర్చోవడం జరిగిపోయాయి. టేకాఫ్ ముందు జాగ్రత్తలు చెప్తూ, సీట్ బెల్ట్ పెట్టుకోమనడం చకచక జరిగిపోయాయి. నా పక్కన ఓ వైపు తమిళ్ అమ్మాయనుకుంటా..తను కూడా నేను వెళ్ళాల్సిన వాషింగ్టన్ డిసి కే అని చెప్పింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. మరోవైపు ఎవరో పలకరించారు.. ఆ అబ్బాయి లండన్ అని చెప్పాడు.  నార్త్ ఇండియన్ అనుకుంటా.  

       కాసేపయ్యాక ముందు నాకు టిఫిన్ తెచ్చింది ఎయిర్ హోస్టెస్. అదేంటబ్బా ఎవరికి పెట్టకుండా నాకే ముందు పెడుతోంది అనుకున్నా. సగం కాలిన ఆమ్లెట్ ,అది చూడగానే నచ్చలేదు...టిఫిన్ మార్చమంటే మార్చి, తర్వాత చెప్పింది "మీరు హిందూ మీల్ అని పెట్టారు, ఈసారి నుండి ఇండియన్ మీల్ అని పెట్టండి". నాకు విండో పక్క సీట్ రాలేదు.. ఆకాశంలో వెళుతూ ఆకాశాన్ని, కింద సముద్రాన్ని చూడలేకపోయానే అనుకున్నా.. ఏదో కాస్త అప్పుడప్పుడూ దూరంగా పక్కవాళ్ళ విండోలో నుండి చూసేసాను. నా సంతోషాన్ని చూసి పక్కమ్మాయి...ఫస్ట్ టైమ్ కదా ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎగ్జైట్మెంట్ అని నవ్వింది.  నేనూ నవ్వేసి తెచ్చుకున్న పుస్తకం " ది ఫ్యూచర్ "  నవల్లో తలదూర్చాను కాసేపు. తర్వాత నిద్రపోయా.  మధ్యలో లంచ్ అదీ నచ్చలేదు హాఫ్ బాయిల్డ్ చికెన్.. ఏదో కాస్త తిన్నాననిపించి జూస్ తాగేసా.  తర్వాత లండన్ ఎయిర్ పోర్ట్ లో దిగడము, ఫ్లైట్ క్లీనింగ్, మళ్ళీ విమాన ప్రయాణం. అమెరికాలో లాండ్ అయ్యే ముందు ఫ్లైట్ లో ఓ ఫామ్ ఇచ్చారు. అది ఫుల్ చేసి ఉంచుకోవాలి. తెలియకపోతే పక్కవారిని, లేదా ఎయిర్హోస్టెస్ ని అడిగితే చాలు. దానిని I -94 అంటారు. మెుత్తానికి భూతల స్వర్గమనే అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో దిగడం, అందరితోపాటు నేనూ బస్ ఎక్కడం, ఇమ్మిగ్రేషన్ చెక్ లో I -94 మీద, మన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి ఇవ్వడంతో,  హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని,  అక్కడి నుండి బయటబడి, లగేజ్ ఎక్కడా అని వెదుక్కుంటూ, నా లగేజ్ గుర్తు పట్టగలనో, లేదో అనుకుంటూ, అయినా పెద్ద అక్షరాలతో ప్రింట్ తీసి మరీ అంటించిన నా లగేజ్ గుర్తు పట్టేసా. మెుత్తానికి నా 2 సూట్కేస్ లు, హాండ్ లగేజ్ తో బయటకు రాగానే అమ్మాయ్ మంజూ అంటూ చిరపరిచితమైన అన్నయ్య పిలుపు. గుర్తు పడతావో లేదో అనుకున్నానన్నయ్యా అంటే.. నన్ను నువ్వు గుర్తు పట్టకుండా ఉంటావా అని అన్నయ్య అనడం..నేనెందుకు గుర్తు పట్టనూ అంటే.. నేను అంతేనమ్మూయ్ అని కార్ దగ్గరకు తీసుకువెళ్ళి లగేజ్ కార్ లో సర్ది, ముందు సీట్ లో కూర్చున్న తర్వాత ముందుగా కార్ లో కూర్చున్న వెంటనే చేయాల్సిన పని సీట్ బెల్ట్ పెట్టుకోవడం అని చెప్పి చూపించాడు. సిరివెన్నెల పాటలు పెట్టి, నేనేమి మారలేదమ్మాయ్, మీరెందుకలా అనుకున్నారని అంటూ, అందరి కబుర్లు అడుగుతూ, తనూ కబుర్లు చెప్తూ, మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కి తీసుకువెళ్ళి, తిన్న తర్వాత చేయి కడుక్కోవడానికి వాష్ రూమ్ లో వేడి, చన్నీళ్ళు ఎలా వస్తాయెా
చూపించాడు. తర్వాత ఇంటికి వచ్చాం. రాగానే వదిన అలసిపోయి ఉంటారు ముందు స్నానం చేసి రెస్ట్ తీసుకోమని, బాత్ టబ్ అవి చూపించి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి రూమ్ చూపించి నిద్ర పొమ్మంది. వాళ్ళిద్దరు బాగా బిజీ డాక్టర్స్. పిల్లలు చదువుకుంటున్నారప్పుడు. 


మళ్ళీ కలుద్దాం

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner