3, ఆగస్టు 2020, సోమవారం

కాలం వెంబడి కలం.. 13

        సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా బాచ్ వాళ్ళలో నాకు తెలిసిన కొందరితో ఆటోగ్రాఫ్లు రాయించడానికి భాస్కర్ కి ఆటోగ్రాఫ్ బుక్ ఇచ్చాను,  మన వాళ్ళందరితో రాయించి నువ్వు రాయి అని. భాస్కర్ ఫస్ట్ ఇయర్ లో మా సెక్షన్ కాకపోయినా, నీలిమ ద్వారా బాగా పరిచయం. రఘుతో కలిసి ఉండేవాడు. అలా బాగా దగ్గరైన మరో తమ్ముడు అప్పట్లో. తర్వాత కృష్ణకాంత్, రామకృష్ణ, గోపి, శ్రీను, రాంమెాహన్, రాంప్రసాద్ వాళ్ళతో కలిసి ఉండేవాడు. మేమంతా ఎలక్ట్రానిక్స్ కదా మరి అందుకన్న మాట. ఆటోగ్రాఫ్లు రాయించిన తర్వాత పుస్తకం చూస్తే, వీళ్ళందరి ఆటోగ్రాఫ్లతో పాటుగా అంజయ్య చౌదరి ఆటోగ్రాఫ్ కూడా ఉంది. ఏంటి భాస్కర్ అంటే.. మనవాళ్ళందరితో రాయించమన్నావుగా, అందుకే రాయించాను అని చెప్పాడు.
" ఈ తప్త హృదయంపై 
నీ స్నేహ నీహారికా బిందువు వాలితే
వీచే పరిమళం గొప్ప అనుభూతి " అని ఉంది. నిజంగా చెప్పు ఇది ఎవరు రాశారంటే కంప్యూటర్ సైన్స్ లో వేణు అని మా దూరపుబంధువు తను రాశాడు అని చెప్పాడు. రాయమంటే ఇలా రాయిస్తారా, అర్థం తెలుసా అసలు అని కాసేపు పోట్లాడాను కూడా సరదాగానే. చూపించే రాశాడులే అని చెప్పాడు. భాస్కర్ ఏమెా మనం విడిపోవడమే లేదు కదా మన మధ్య ఈ ఆటోగ్రాఫ్లు అవసరం లేదని, కృష్ణకాంత్ ఏ అవసరమున్నా సాయం చేస్తానని ఇలా బోలెడు ఆటోగ్రాఫ్లతో ఇంటరు నుండి ఓ 6 ఆటోగ్రాఫ్ పుస్తకాలు నా దగ్గర ఉండేవి. మా షర్మిల ఇంగ్లీష్ లో ఓ కవిత రాస్తే వాళ్ళ అమ్మగారు అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాశారు. అది డబుల్ ధమాకా నాకు. శ్రీధర్ అని నా ఫస్ట్ ఇయర్ క్లాస్మేట్ స్నేహం గురించి రాశాడు. వెంట నారాయణ అయితే ఓ లంగా ఓణి అమ్మాయి చేతిలో పుస్తకాలు పట్టుకుని, బస్ స్టాప్ లో నిలబడి ఉండటం, అదీ 2020లో. నేను అస్సలు మారనని మావాళ్ళకి ఎంత నమ్మకమెా చూసారా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి వచ్చినా, ఎవరు ఏమన్నా నేను ఇప్పటికి నేనుగానే ఉన్నాను. హేళనలు, వెకిలి నవ్వులు నా పట్టుదలను పెంచేవి గాని, ఏమాత్రం వెనకడుగు వేయనిచ్చేవి కావు. మా సీనియర్స్ వసుంధర, శృతి వాళ్ళు హాస్టల్ లో నీ వస్తువులు మర్చిపోకుండా జాగ్రత్త చేసుకున్నట్లే మమ్మల్ని గుర్తుంచుకో అని రాశారు..
            ఉత్తరాల ఫ్రెండ్స్ లిస్ట్ అలా అలా పెరిగిపోయింది. శలవల్లో నా ఫ్రెండ్ రాసిన ఉత్తరం గుడివాడ దగ్గర కోడూరులో లలిత అనే అమ్మాయికి వెళ్ళిందట.  ఆ అమ్మాయి లెటర్ చదివి మళ్ళీ నా లెటర్ తోపాటు తనూ ఓ లెటర్ రాసి నాకు పోస్ట్ చేసింది. తర్వాత తనని విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద కలిసాను. మా పొడుగు, పొట్టి వాళ్ళు నవ్వేవారు..బస్, ట్రైన్ ఫ్రెండ్సే కాకుండా ఇలా కూడా వదలవా అని. మా పిన్ని వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ కి వెళ్ళే పిల్లలు పరమేష్ వాళ్ళు, జాబ్ చేసే కేశవ కూడా లెటర్స్ రాస్తుండేవారు. మా వాసు ఫ్రెండ్ బాలు, బాలు ఫ్రెండ్ సురేష్ కూడా లెటర్స్ రాస్తుండేవారు. నాకు కాస్త కమ్యూనిజం భావాలు ఎక్కువ అప్పట్లో. చదువైపోయాక పెళ్ళి చేసుకోకుండా నక్సలైట్లలోకి వెళిపోతాననేదాన్ని. అందరికి అదో భయం ఎక్కడ అలా వెళిపోతానోనని. 
      మా ఇంట్లో చాలా స్వేచ్ఛగా పెంచారు చిన్నప్పటి నుండి. విచ్చలవిడితనానికి, స్వేచ్ఛకు తేడా తెలిసే విధంగా అన్నమాట. చిన్నప్పటి నుండి నాకు మెదటి ఫ్రెండ్స్ మా నాన్న, అమ్మ. వాళ్ళ తర్వాతే ఎవరైనా. ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళతో పంచుకోవడం నా అలవాటు. ఏది చేసినా ఇంట్లో చెప్పేయడం, లేదా చెప్పి చేయడం అలవాటు. నాన్న ఏది నాకు అడిగే అవసరం రానీయలేదు ఎప్పుడూ. అడగకుండానే అన్ని ఇచ్చేవారు. అందుకేనేమెా నాకు ఏదీ అడగడం అలవాటు కాలేదు ఇప్పటికి. మా నాన్న నాగపూర్ లో బి ఎస్ సి చదువుకునేటప్పుడు తన రూమ్మేట్, ఫ్రెండ్ అయిన నరసరాజు అంకుల్ అమెరికాలో తానా ప్రెసిడెంట్ గా చేస్తున్నప్పుడు, నాన్నకు ఓ ఉత్తరం తెలుగులో టైప్ చేసి పంపారు. ఆ ఉత్తరం చదివి నీకు భలే మంచి ఫ్రెండ్ ఉన్నారు నాన్నా అన్నాను. తర్వాత అంకుల్ ఇండియా వచ్చినప్పుడు మా ఊరు కూడా వచ్చారు. నాన్న వాళ్ళు అంకుల్ కి సన్మానం కూడా చేసారు. నాతో అంకుల్ మాట్లాడుతూ మళ్ళీ అమెరికాలో కలుద్దామమ్మా అన్నారు. 
       
వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner