21, సెప్టెంబర్ 2020, సోమవారం
అరుదైన అవకాశం...!!
ఏ పుస్తకానికైనా నాలుగు మనవైన మాటలు రాసే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టమనే చెప్పాలి. అలాంటి అవకాశాలను నాకు ఇస్తున్న అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు.
ఓ రోజు లక్ష్మీ రాఘవ గారు ఫోన్ చేసి నా రాతల గురించి చెప్తూ... తన 6వ కథల సంపుటికి ముందు మాటలు రాయమని అడిగితే...చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పుస్తకం చదివితే మీ అర్థం అవుతుంది..
ఇంతటి సదవకాశాన్నిచ్చిన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో..
అందరి మనసులకు తన కథామాత్రలిచ్చి " మనసుకు చికిత్స " చేసిన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి శుభాభినందనలు...
నాలుగు మాటలు...
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డా. లక్ష్మీ రాఘవ గారితో స్వర పరిచయమే కాని ముఖ పరిచయం లేదు. అక్షరాలతో అల్లుకున్న మా ఇరువురి అనుబంధం ముఖపుస్తకంతోనే మెుదలైంది. కథనాలను అద్భుతమైన కథలుగా మలచడంలో అందె వేసిన చేయి డా. లక్ష్మీ రాఘవ గారిది. మన చుట్టూ వున్న సమస్యలను తనదైన కోణంలో చూపిస్తూ, వాటికి చక్కని పరిష్కారాలను కూడా సూచిస్తారు తన కథలలో. దాదాపుగా 150 పై చిలుకే కథలను రాసి, 5 కథల పుస్తకాలు వేసి, ఆరవ కథా సంపుటిగా "మనసుకు చికిత్స" కథా సంపుటిని తీసుకురావడం, దానికి ముందు మాటలు రాసే అదృష్టం నాకు కలగడం చాలా సంతోషంగా ఉంది.
డా. లక్ష్మీ రాఘవ గారి కథలన్నీ మన చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ సమాజంలో బ్రతుకుతున్న అన్ని వయసుల వారి మనసు సంఘర్షణలను, తన మనసుతో చూసి రాసినట్లుగా అనిపిస్తాయి. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూసి భయపడే ఎందరికో డా. లక్ష్మీ రాఘవ గారి కథలు పరిష్కారం చూపించడమే కాకుండా, మనోధైర్యాన్ని కూడా ఇస్తాయనడంలో ఎట్టి సందేహమూ లేదు. జీవితాన్ని విభిన్న పార్శ్వాలలో చూసిన సంపూర్ణ అనుభవశాలి డా. లక్ష్మీ రాఘవ గారు. ఆ అనుభవ సారమంతా ఈవిడ కథలలో మనకు గోచరమవుతుంది.
చదువుకునే పిల్లల మనస్తత్వం, వారి ఇష్టాయిష్టాలపై తల్లిదండ్రుల ప్రభావము, దాని వలన పిల్లల్లో కలిగే మానసిక ఒత్తిడి, దాని పరిణామాల గురించి చక్కని కథలు. వయసు మీరిన తరువాత పెద్దలపై పిల్లల ప్రవర్తన, పెద్దల మనోభావాలు, మానసిక ఇబ్బందులు, పిల్లల కోసం వారి సర్ధుబాట్లు, వారి కోరికల గురించి కొన్ని కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. వయసుడిగిన తల్లిని వదిలించునే కొడుకుని, ఆ కొడుకుని అమితంగా ప్రేమించే తల్లి మనసుని ఎంతో హృద్యంగా చూపించారు ‘ఎంతైనా అమ్మ’ కథలో. కరోనా కష్టాలను, నష్టాలను, దాని ప్రభావం కుటుంబ అనుబంధాలపై ఎలా ఉంటుంది, ధనిక, పేద, వైద్యులు అన్న తేడా లేకుండా కరోనా మూలంగా జనం పడుతున్న అగచాట్లు, ఇరుగు పొరుగుతో ఇక్కట్లు, ప్రయాణాల పాట్లు, డబ్బు అవసరాల స్వార్థపు అనుబంధాలు, యువత ఆశయాలు,దూరపు కొండలు నునుపనుకునే వారికి అమెరికా ఉద్యోగంలో కష్టాలు, మన లెక్క సరి చూసే విధి విలాసాన్ని ఇలా ఎన్నో సమస్యలను, వాటికి చక్కని పరిష్కారాలను అందించారు ఈ "మనసుకు చికిత్స" కథా సంపుటిలో.
కరోనా మెాడల్ తయారిలో తన అగచాట్లు చెప్పడం, అత్తగారికి చెప్పాలనుకున్న విషయాన్ని సున్నితం గా చెప్పడం, కుటుంబ సమస్యలనే అందమైన లేఖలుగా అందించడం హర్షనీయం.
భేషజాలు లేకుండా సరళంగా, సున్నితంగా రచనలు చేయడం కూడా ఓ కళే. ఎక్కువగా వర్ణనలు, ఉపోద్ఘాతాలు ఉంటేనే కథలు అనుకునే చాలామందికి డా. లక్ష్మీ రాఘవ గారి కథా సంపుటాలు సూటిగా సమాధానం చెప్తాయి. మనం కష్టమైన పదాలు, సమాసాలు ఎన్ని వాడామని కాదు. మన రచన ఎందరి హృదయాలను కదిలించింది అన్నది లెక్క. పాఠకుల మనసులను తాకేది, నలుగురు మెచ్చేది ఉత్తమ రచన అన్నది నా అభిప్రాయం. దీనికి ఏ విధమైన అవార్డులు, రివార్డులు అవసరం లేదు. సూటిగా, క్లుప్తంగా విషయాన్ని చెప్పడమే పాఠకులు ఇష్టపడుతున్నారిప్పుడు. ఈ లక్షణాలన్నీ మెండుగా ఉన్న డా. లక్ష్మీ రాఘవ గారి ఇంతకు ముందు కథా సంపుటాలకు ధీటుగా ఈ "మనసుకు చికిత్స" కూడా అందరిని అలరిస్తుందని ఆశిస్తూ... హృదయపూర్వక అభినందనలు.
నా మీద అభిమానంతో నాలుగు మాటలు రాసే అవకాశం నాకిచ్చినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.
మీ కథలను అభిమానించే
మంజు యనమదల
విజయవాడ
వర్గము
ముందు మాటలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
డాక్టరు గారికి అభినందనలు.
మీరు కూడా కథలు, కవితలు బాగానే వ్రాస్తారు. భారతీయ జనతా యువమోర్చా వారి కరోనా కథలు & కవితల పోటీలో మీ కవిత “మృత్యుహేల” ఎంపికైందని “వసుంధర అక్షరజాలం” బ్లాగులో చూశాను. అభినందనలు.
ధన్యవాదాలు అండి మీ ఆత్మీయ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి