28, సెప్టెంబర్ 2020, సోమవారం
కాలం వెంబడి కలం..21
బస్ లో ఆ రాత్రి నిద్ర పోలేదు. మరుసటి రోజు పొద్దున్నే హైదరాబాదులో బస్ దిగాను. హాస్టల్ కి వెళ్ళేసరికి ఇంకా గేట్ తీయలేదు. నా ఫ్రెండ్స్ ఉషని, విని ని పిలిస్తే వచ్చి గేట్ తీస్తూ, ఏమైంది అలా అయిపోయావేమిటని అడిగారు. తర్వాత చెప్తానని చెప్పి, ముందు ఫోన్ చేసిరావాలి వెళదాం పదమన్నాను. రాఘవేంద్ర వాళ్ళ అక్క కి ఫోన్ చేసి, నిన్న మామయ్య ఇంటికి వచ్చి ఏం మాట్లాడారో తెలియదు. మా నాన్న నన్ను ఇంట్లో నుండి పంపేసారని చెప్పాను. మీరు ఎవరు నా దగ్గరకి రావద్దు. మా నాన్న ఇష్టపడి చేసినప్పుడే చేసుకుంటాను అని చెప్పి హాస్టల్ కి వచ్చేసాను. నా ఫ్రెండ్స్ కి జరిగిన విషయం చెప్పాను. ముందు జాబ్ చూసుకోవాలని కూడా చెప్పాను. ఉష ఫ్రెండ్స్ అంతకు ముందే మా హాస్టల్ కి దగ్గరలో కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసారు. నాకు ఇష్టమైతే వచ్చి జాయిన్ అవమన్నారు. సరేనని జాయిన్ అయ్యాను.
రాఘవేంద్ర వాళ్ళ అక్క మరుసటి రోజు నా దగ్గరకి వచ్చింది. మళ్ళీ అదే మాట చెప్పాను. ఆ రాత్రికే తను వెళిపోయింది. తర్వాత పెద్దవాళ్ళం చెప్తున్నాం విను అని, పెళ్ళికి ముహూర్తం పెట్టించారు. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ శ్రీధర్ నన్ను కలవడానికి హాస్టల్ కి వస్తే తనకి ఇంట్లోనుండి నన్ను పంపేసారని చెప్పాను. తను బాలానగర్ లోని విజయ ఎలక్ట్రికల్స్ లో ఇంటర్వ్యూకి తీసుకువెళ్ళాడు, తెలిసినవాళ్ళు ఉన్నారని. అప్పటికే నా అమెరికా సన్నాహాలు సాగుతున్నాయి కదా. వివరాలు అడిగితే చెప్పాను. ఎప్పుడు జాయిన్ అవుతారంటే పెళ్ళి డేట్ చెప్పి తర్వాత ఓ 15 రోజులకి జాయిన్ అవుతానని చెప్పాను.
నా ఫ్రెండ్స్ ఉష, విని నేను వెళిపోతానని, కాస్త నా దిగులు మర్చిపోతానని బాగా బయట తిప్పేవారు. కోచింగ్ సెంటర్ వాళ్ళు మేము మీ బ్రదర్స్ అండి. కార్డ్స్ మేము ప్రింట్ చేయిస్తామని చెప్పి అంతా వాళ్ళే చూసుకున్నారు. 800 రూపాయలు పెట్టి అప్పట్లో ఓ ప్యూర్ సిల్క్ చీర రాఘవేంద్ర వాళ్ళ అక్కకని తీసుకున్నాను.
అమ్మానాన్నకు నా పెళ్ళి కార్డ్ పోస్ట్ చేస్తూ లెటర్ కూడా రాశాను. లెటర్ రాసేటప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లు కారిపోయాయి. అది వేరే సంగతనుకోండి. అదృష్టమెా దురదృష్టమెా తెలియదు కాని ఎవరు ఇలా తమ పెళ్ళికి అమ్మానాన్నను పిలిచి ఉండరు కదా. నా చిన్నప్పటి విజయనగరం ఫ్రెండ్స్ ని, వాసు ఫ్రెండ్ నా పెన్ ఫ్రెండ్ బాలుని, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ని కొందరిని మాత్రమే పిలిచాను. మా పొట్టికి కూడా చెప్పాను. చిన్నప్పటినుండి నేను పెళ్ళి చేసుకోను అనేదాన్ని. చేసుకున్నా ఎవరిని పిలువను అని అనేదాన్ని.
మా నాన్న చేసిన పని తప్పు అని అనను. ఆయన తన కూతురు బావుండాలనే కోరుకున్నారు. అలా అని అమ్మది కూడా తప్పు కాదు. ఏ తల్లిదండ్రులయినా తమ పిల్లలు తమకన్నా బావుండాలనే కోరుకుంటారు. బాధ్యత తెలియనివాడని నాన్న భయం అంతే. అనుకోని పరిస్థితుల మూలంగా అలా చేయాల్సి వచ్చింది. నా అభిప్రాయానికి విలువనిచ్చి, నాన్న నన్ను ఇంటి నుండి పంపేసారు.
మా ఊరిలో అందరిని రాఘవేంద్ర పిలిచాడు. రాఘవేంద్ర అక్కాబావా పిలవడానికి మా ఇంటికి వెళితే, నాన్న వెళిపొమ్మన్నారట. నాంచారయ్య బాబాయి వెళ్ళి చెప్పబోతే ఏం చెప్పవద్దు అన్నారట. మా రాధ పెదనాన్నకి విషయం తెలిసాక, నేను చూసుకుంటాను అంటే నేను పోయాకా చూద్దువులే అన్నారట. పసి అక్క అని మా ఇంటి పక్కన ఉండేది. ఆ అక్కకి నా విషయాలన్నీ తెలుసు. అమ్మతో, నాతో బాగా దగ్గరగా ఉండేది. పెళ్ళికి రెండు రోజుల ముందు రాఘవేంద్ర హైదరాబాదు వచ్చి, పెళ్ళి ముందు రోజు నన్ను రావివారిపాలెం తీసుకువచ్చాడు. విని చీర పెట్టి హాస్టల్ నుండి సాగనంపింది. రాఘవేంద్ర తమ్ముడు, చెల్లెలు, మా ఫ్రెండ్స్ అందరు వచ్చి బస్ ఎక్కించారు. మా హాస్టల్ ఆంటి అనేది. అమ్మాయ్ రాఘవేంద్ర జాతకుడు అని. ఆవిడ కూడా హాస్టల్ నుండి వచ్చేటప్పుడు నీ పుట్టిల్లు అనుకో. ఎప్పుడయినా రావచ్చు నువ్వు ఇక్కడికి అని చెప్పి పంపింది.
బాధ, భయం, సందిగ్ధం, సందేహాలతో రేపేంటి అన్న ప్రశ్నలతో, సమాధానాల కొరకు అన్వేషించడం మెుదలైంది.
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి