1, సెప్టెంబర్ 2020, మంగళవారం
కాలం వెంబడి కలం..17
మా పొడుగు పెళ్ళికి కడప వెళ్ళడం, అదీ ఎలక్షన్ టైమ్ లో ఓ మంచి అనుభూతి. గొడవలు జరుగుతాయి వెళ్ళొద్దని అందరు భయపెట్టారు. అయినా వెళ్ళాను. మనం టీవీల్లో, సినిమాల్లో చూసినట్లుగా కొట్లాటలు, బాంబుల గోలేం లేదు. చాలా ప్రశాంతంగా ఉందప్పుడు. మా పొట్టి, లత కూడా వచ్చారు పెళ్ళికి. మా క్లాస్మేట్ శ్రీధర్ కూడా పెళ్ళికి వచ్చాడు. వాళ్ళది కూడా కడపే. పెళ్ళి అయ్యాక మమ్మల్ని వాళ్ళింటికి తీసుకువెళ్ళి, తర్వాత బస్ స్టాండ్ లో డ్రాప్ చేసాడు వాళ్ళ చెల్లితో కూడా వచ్చి.
అమ్మమ్మ వాళ్ళ ఊరు జయపురం వదిలి నాయనమ్మ వాళ్ళ ఊరు నరశింహాపురం వచ్చేసాక ఓ మూడేళ్ళు అద్దె ఇంట్లోనే ఉన్నాము. నేను బయటకు వెళ్ళనని నాన్న అప్పట్లోనే డిష్ పెట్టించారు. అమెరికా వెళ్ళి ఎమ్ ఎస్ చదవాలన్న కోరిక బలంగా ఉండేది. దానితో జి ఆర్ ఈ, టోఫెల్ రాయాలని అనుకున్నాను. ముందు జి ఆర్ ఈ రాయడానికి ఒకే ఒక పుస్తకం కొనుక్కున్నాను. ఎగ్జామ్ ఫీజ్ 2800 రూపాయలు అప్పట్లో. హైదరాబాద్ సెంటర్ తీసుకున్నా. తీరా ఎగ్జామ్ టైమ్ కి బాగా హై ఫీవర్. అమ్మ ఇంత జ్వరం పెట్టుకుని అంత దూరం వెళ్ళి ఎగ్జామ్ రాయనక్కర్లేదు. మరోసారి రాద్దువులే అంటే కాదుకూడదని నాన్న, నేను హైదరాబాదు శ్రీకృష్ణ ఏసి బస్ లో బయలుదేరాం. అదే మెుదటిసారి ఏసి బస్ ఎక్కడం. ఆరోజు ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. 60 ఏళ్ళ తర్వాత అంత ఎండ ఉందట. మా వెంకయ్య పెదనాన్న కూతురు రావమ్మ అక్క వాళ్ళ ఇల్లు ఎగ్దామ్ సెంటర్ కి దగ్గర. అందుకని వాళ్ళంటికి వెళ్ళి, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను.
మూడు గంటలు ఎగ్జామ్. ఆరు సెక్షన్స్ ఉంటాయి. 2 మాథ్స్ సెక్షన్స్. మిగతావి ఇంగ్లీష్. నాకిప్పటికి ఆ ఎగ్జామ్ బాగా గుర్తు. రెండు మాథ్స్ సెక్షన్స్ కలిపి 50 బిట్స్ ఉంటాయి. గంట టైమ్. ఆ పేపర్ రాసేటప్పుడు నాకు భలే నవ్వు వచ్చింది. ఎందుకంటే గుణకారాలు, భాగహారాలు చాలా పెద్ద లెక్కలిచ్చి ఆన్సర్ మాత్రం మల్టిపుల్ ఛాయిస్ లో సెలక్ట్ చేయాలి. ఆన్సర్స్ అన్నీ దగ్గరగానే ఉంటాయి. కరక్ట్ ఆన్సర్ గెస్ చేయడం చాలా కష్టం.
23.98×0.0836×795.963/45.321×5210.632×54.96×639.0859=? ఇలా అన్న మాట. అలాగే ఓ రెండు బిట్స్ గ్రాఫ్ మీద ఉన్నాయి. నాకు ఆ గ్రాఫ్ వి రావు. అవి దైవాధీనం కింద పెట్టేసాను. మిగతావన్నీ దగ్గర దగ్గర నంబర్ చూసుకుని సింప్లిఫికేషన్ చేసి పెట్టేసాను. మరో మాట కాలిక్యులేటర్ వాడకూడదు. నాకు నోటి లెక్కలు బాగా అలవాటు. పేకాటలో కూడా నోటితోనే పాయింట్స్ చెప్పేసేదాన్ని. ఇంజనీరింగ్ లో కూడా పెద్దగా కాలిక్యులేటర్ వాడేదాన్ని కాదు. అది బాగా పనికి వచ్చిందన్న మాట జి ఆర్ ఈ రాయడానికి. అది గుర్తు వచ్చి నవ్వు వచ్చిందన్న మాట. మాథ్స్ రెండు సెక్షన్స్ కలిపి 48 బిట్స్ కరక్ట్ గా వచ్చేస్తాయని ఫిక్స్ అయిపోయాను. మిగతావి ఎంతయితే అంత వస్తాయని పట్టించుకోలేదు. మళ్ళీ ఆ రాత్రికే ఇంటికి బయలుదేరాము. పొడుగు పెళ్ళి అయ్యాక హైదరాబాదు లో కాపురం. తనకి, కృష్ణకాంత్, రాంప్రసాద్, భాస్కర్, గోపి వాళ్ళకి చెప్పాను వెళిపోతున్నానని. వాళ్ళంతా బస్ స్టేషన్ కి వచ్చారు. అలా మళ్ళీ వాళ్ళందరిని కలిసాను. మెుత్తానికి లెక్కల్లో ఆ గ్రాఫ్ రెండు బిట్లు తప్ప మిగతావన్నీ నేననుకున్నట్లుగా కరక్టే అయ్యి 50 కి 48 అవి వచ్చి, మిగతావన్నీ కలిపి 2400 కి 1050 జి ఆర్ ఈ స్కోర్ వచ్చి, అమెరికాలోని నాలుగు యూనివర్శిటీల్లో ఎడ్మిషన్ కి సెలక్ట్ అయినట్లు స్కోర్ కార్డ్ వచ్చింది. ఇక టోఫెల్ ఎగ్జామ్ రాయాలి.
ఇంటివాళ్ళు ఖాళీ చేయమంటే అప్పటికప్పుడు ఇల్లు కట్టడం మెుదలు పెట్టారు. స్లాబ్ పడిన వెంటనే మా ఇంటికి వచ్చేసాము. మిగతా పనులు తర్వాత మెల్లగా చేయించుకోవచ్చులే అని. అప్పటికి ఇంకా తలుపులు కూడా పెట్టలేదు. ఆ టైమ్ లోనే నేను టోఫెల్ ఎగ్జామ్ రాయడానికి 1500 వందలు ఫీజ్ కట్టడానికి, సమయానికి నాన్న దగ్గర లేకపోతే మా ఎదురిల్లు సుజాతక్క వాళ్ళింట్లో ఉండే రాఘవేంద్ర ఇచ్చాడు. హియరింగ్ బావుండకపోతే సరిగా రాయలేమని మద్రాస్ లో మంచి కాలేజ్ సెంటర్ గా పెట్టాను. జయపురం చిన్న బాబాయ్ మద్రాస్ లోనే ఉండేవారు. బాబాయే చెప్పారు ఆ కాలేజ్ పెట్టమని. కాకపోతే చాలా ముందు పెట్టుకోవాలది, సెంటర్ వస్తుందో రాదో తెలియదు, చూద్దామన్నారు. అనుకున్న కాలేజ్ సెంటర్ గా వచ్చింది. నేను, నాన్న మద్రాస్ చిన్న బాబాయి వాళ్ళింటికి వెళ్ళి, ఎగ్జామ్ రాసి వచ్చేసాము. 600 కి 485 స్కోర్ వచ్చింది. అమెరికాలో ఉన్న గోపాలరావు అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా వచ్చాయని చెప్పాను. కుదిరితే టోఫెల్ మరోసారి రాయమన్నాడు. కాలేజ్ లకి అప్లికేషన్స్ తెప్పించుకుని, అప్లై చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అప్పట్లో అప్లికేషన్ కి 25 డాలర్లు కట్టి తెప్పించుకోవాలి. అన్నయ్యను 3,4 కాలేజ్ లను అప్లికేషన్స్ పంపమంటే అమెరికాలోని కాలేజ్ ల కేటలాగ్ పంపించాడు.
అప్పుడే కాస్త అప్పులు తీరి ప్రశాంతంగా ఉన్నాము. నరశింహాపురం వచ్చాక కూడా అమరనేని సత్యం తెలిసినతనని, తనతో కలిసి రొయ్యల వ్యాపారం చేస్తే, తప్పు లెక్కలు రాసి మెాసం చేసాడు. మా నాన్నకు ఇలా మెాసపోవడం బాగా అలవాటైపోయింది. తర్వాత ముమ్మనేని ప్రకాశరావు, రమేష్ అనుకుంటా వాళ్ళిద్దరు అడిగితే వాళ్ళతో కలిసి వ్యాపారం చేసారు. ఓ సంవత్సరం బానే చేసారు. వ్యాపారం తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటామని, నాన్నను వద్దని లెక్కలు చూసి డబ్బులిచ్చేసారు. వాటితోనే ఇల్లు మెుదలు పెట్టారు. మా మామయ్య, నాన్న ఇక వాళ్ళు, వీళ్ళు ఎందుకు, మన వ్యాపారం మనమే చేసుకుందామని, చేయడం మెుదలు పెట్టారు.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో..
.
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి