1, నవంబర్ 2020, ఆదివారం

కాలం వెంబడి కలం..26

కాలం వెంబడి కలం..26
    మద్రాస్ లో నీళ్ళ కొరత అందరికి తెలిసిందే కదా. మాకూ రెండురోజులకోసారి నీళ్ళు పొద్దున్నే వచ్చేవి. నాకేమెా ఆఫీస్ టైమ్. అమ్మ ఒక్కటి పట్టలేదు. కింద మెారిలో దిగి పట్టాలి. మా రూమ్ పైన. నీళ్ళు పైకి పట్టుకువెళ్ళాలి. అమ్మకు బాగా మెాకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. నేను నీళ్ళు పట్టి గట్టు మీద పెడితే అమ్మ పైకి తీసుకువెళ్ళేది. ఏడవ నెలలో కూడా ఈయన వచ్చే వరకు అలాగే పట్టేదాన్ని. మా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు లాస్ట్ లో రోడ్డు క్రాస్ చేయాలి. చిన్నదే కాని బాగా రద్దీగా ఉండేది ఆ రోడ్డు. అమ్మకు టైమ్ కి ఇంటికి రాకపోతే భయం. ఓ రోజు నాకు సాయంత్రం అయిపోయింది ఆఫీస్ లో పని ఉండి. అంతకు ముందే మా వీధిలో ఒకాయన యాక్సిడెంట్ లో చనిపోయారు. పాపం అమ్మకేమెా కంగారు. ఎవరినైనా అడుగుదామంటే భాష రాదు. ఆఫీస్ కి రావడం తెలియదు. బాగా కంగారు పడిపోయింది. ఇంటికి వచ్చాక బాగా తిట్టేసి, వెళిపోదాం పదా, ఉద్యోగం వద్దు, ఏం వద్దు, వాళ్ళు పెడితే తిను లేకపోతే లేదు అని పాపం కంగారు పడిపోయింది ఆరోజు. నన్ను చూడటానికి మా ఊరు నుండి పసి అక్క, వాళ్ళ చిన్నోడిని తీసుకువచ్చి, నాలుగు రోజులుండి వెళ్ళింది.  తనకి అప్పుడు చెప్పాను రాఘవేంద్రని డబ్బులు అడగకు, నీకు  డబ్బులు ఇస్తే తీసుకో, లేదంటే వడ్డీతో సహా నేను ఇస్తానని చెప్పాను. 
    ఈయన మద్రాస్ రాకముందే నా ఫ్రెండ్ వినీత నన్ను చూడటానికి వచ్చి వెళ్ళింది. నా దగ్గరకి వచ్చివెళ్ళిన వెంటనే తనకి పెళ్ళి కుదిరింది. తన పెళ్ళికి ఒంగోలు వెళ్ళాను ఒక్కదాన్నే. అప్పటికి ఎనిమిదో నెల వచ్చేసింది. అమ్మ భయపడింది వెళతుంటే. డాక్టరేమెా బేబి పెరగలేదు. పుట్టే సరికి రెండు కేజీలు కూడా ఉండదేమెా, ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది సెలైన్ ద్వారా అని చెప్పారు. నేను ట్రైన్ లో కూర్చోవడానికి సీట్ లేక  తిప్పలు పడి విని వాళ్ళింటికి వెళ్ళేసరికి ఉష కూడా వచ్చి ఉంది. మా హాస్టల్ ఆంటీ మా ముగ్గురిని చూసి చాలా సంతోషంగా పలకరించింది. పెళ్ళి అయ్యాక నేను, ఉష మద్రాస్ వచ్చాము. నేను ఆరోజు మధ్యాహ్నం షిఫ్ట్ కి మార్చుకున్నా. ఆఫీస్ కి వెళిపోయాను. వచ్చేసరికి రాఘవేంద్ర వాళ్ల బావగారు వచ్చారు. మేము వచ్చిన ట్రైన్ లోనే ఆయనా వచ్చారట. ఆయన వెళుతూ నాకు డబ్బులు ఇచ్చి, ఇవి నీ దగ్గర ఉంచుకో. నువ్వు ఇబ్బంది పడటం, ఎవరినైనా అడగడం నాకు ఇష్టం లేదు. నీ డెలివరికి వాడుకో అని చెప్పి, వద్దంటున్నా చేతిలో పెట్టి వెళ్ళారు. మా క్లాస్మేట్ శ్రీధర్ కూడా మధ్యలో ఆఫీస్ లో కలిసి,  ఇంటికి వచ్చివెళ్ళాడు. 
           మేము డెలివరీకి కూడా మద్రాస్ లోనే ఉందామనుకున్నాము. రాఘవేంద్ర వాళ్ల అక్కా వాళ్ళింటికి రావివారిపాలెం వెళదామన్నాడు. వైజాగ్ లో నాన్న ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు. ఆయనకు బేబి పెరగని విషయం చెబితే వైజాగ్ వచ్చేయమన్నారు. తర్వాత చూద్దాంలే అని 8వ నెల కూడా సగం రోజులు ఆఫీస్ కి వెళ్ళి, లీవ్ పెట్టి అన్ని సర్దుకుని, ఇల్లు ఖాళీ చేసి ఊరికి వెళ్ళాం. ఆఫీస్ కొలీగ్ పృద్వీ వాళ్ళ అన్నయ్య సింగపూర్ నుండి తెచ్చిన బేబి కిట్ చిన్న మంజుకి అని ఆప్యాయంగా ఇచ్చాడు. అమ్మా, అమ్మమ్మ వాళ్ళు 9వ నెలలో వచ్చి శ్రీమంతం చేసి ఇంటికి తీసుకువెళ్ళారు. అప్పుడు కూడా అన్నీ రెండో ఆడపడుచుతోనే చేయించింది పెద్దావిడ. తర్వాత చల్లపల్లి పద్మానతి గారి హాస్పిటల్ లో చూపించుకున్నాను. స్కాన్ చేసి చూసి అంతా బానే ఉందన్నారు. మద్రాస్ డాక్టర్ చెప్పింది చెప్తే ఏం పర్లేదు నేను చూసుకుంటానని చెప్పారీవిడ. కొన్ని రోజులు అమ్మా వాళ్ళింట్లో ఉండి చెకప్ కి వెళ్ళి,అమ్మతో  కలిసి మళ్లీ రావివారిపాలెంలో కొన్ని రోజులున్నాను. సోదమ్మ వస్తే అమ్మ పిలిచి సోది అడిగింది.నాయనమ్మ వచ్చి పుట్టేది అబ్బాయేనని చెప్పి. మా నాయనమ్మ పేరు పెట్టమని చెప్పింది.  తన పేరు ఎవరికుందో కూడా చెప్పింది. నేనన్నాను అప్పుడు...నాకుంది కదా ఇంకా నీ పేరు పెట్టమంటావేంటని? కనీసం ఓ అక్షరమైనా కలిసేట్టు పెట్టమని చెప్పింది.  
      చెకప్ కి వెళితే టైమ్ దగ్గరకి వచ్చింది కదా అని డాక్టర్ గారు చల్లపల్లిలోనే ఉండమంటే మా పిన్ని వాళ్ళింట్లో ఉన్నాము. మా పెద్దాడపడుచుకి కోపం వచ్చింది దానికి కూడా. పాపం నన్ను పిల్లల కోసం ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిప్పాల్సి వస్తుందో అనుకున్నానని అందరుండగానే అంది. పాపం ఆవిడకి ఎంత అభిమానమెా నాపై. డెలివరి డేట్ కి ఓ వారం ముందు రాత్రిపూట బాగా నొప్పులు వస్తే, కాసేపు నేను ఎవరిని లేపలేదు. తర్వాత తట్టుకోలేక అమ్మను లేపాను. ఆరోజు మా భారతి అమ్మమ్మ కూడా అక్కడే ఉంది. జిలేబి తినాలనుందంటే ఈయన తెచ్చాడు కూడా. అందరం కబుర్లు చెప్పుకుంటూ లేట్ గా పడుకున్నాం. అప్పుడే కదా పడుకున్నారని లేవలేదు నేను చాలాసేపు. తర్వాత లేపక తప్పలేదు. అందరం రడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళేసరికి నొప్పులు తగ్గిపోయాయి. మళ్ళీ వస్తే వెంటనే రండి లేట్ చేయకుండా అని చెప్పి పంపేసారు. తర్వాత డెలివరి డేట్ కి వెళ్ళాం హస్పిటల్కి.

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner