29, మార్చి 2021, సోమవారం

కాలం వెంబడి కలం...47

               డెట్రాయిట్ లో శ్రీనివాసరెడ్డి వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళు ముగ్గురుంటున్నారు. చంద్రశేఖర్, ఇంకో అతను. వీళ్ళిద్దరు మాల్ లో సెల్ఫోన్ షాప్లో పని చేసేవారు. నాకు ఏదైనా జాబ్ చూడమని చెప్పాను. బోలెడు ఫ్రూట్స్ అవి తెచ్చి ఫప6్రిజ్ లో పెట్టి తినమనేవారు. వాళ్ళతో ఉన్న ఇరవై రోజులు చాలా బాగా చూసుకున్నారు. నేను వేరే జాబ్ కి ట్రై చేసుకున్నాను. అంతకు ముందు మాల్ లో వచ్చిన జాబ్ కి రమ్మన్నారు. అది ఉష చేసే చోటనే. మధు వాళ్ళు కాస్త దూరంలో. 
              చికాగోలో ఉన్నప్పుడు మా ఆయనకు తెలిసిన మా ఊరి దగ్గరలోని పిల్లలు విష్ణు, శ్రీను కూడా అమెరికాలో ఉంటున్నారు. శ్రీనుతో ఎప్పుడన్నా మాట్లాడేదాన్ని. ఈయన ఇండియా వెళ్ళిన తర్వాత ఓ రోజు విష్ణుకి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుండి ఇంట్లో పిల్లాడిలా ఉండేవాడు నాతో. నేను డెట్రాయిట్ వెళుతున్నానని చెప్తే తన ఫ్రెండ్ సింధు అక్కడే ఉంటోందని, వెళ్ళి కలవమని చెప్పాడు. డెట్రాయిట్ వెళ్ళిన కొత్తలో ఓరోజు వెళ్ళి వచ్చాను. తర్వాత నేను కెంటకీ లోని ఫ్లోరెన్స్ లో జాబ్ కి వెళ్ళాలని చెప్తే సింధు, వాళ్ళాయన ఫ్లోరెన్స్ కి కార్ లో పంపిస్తామని చెప్పారు. ఓ రెండు రోజులు సింధు వాళ్ళింట్లో ఉండి, ఫ్లోరెన్స్  వెళ్ళాము. నేను మధు వాళ్ళున్న సిన్సినాటి వెళ్ళలేదు. ఏదో మనకు హెల్ప్ చేయడానికి సింధు వాళ్ళు వస్తే, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని. కాని మధు వాళ్ళకి ఎందుకో కోపం వచ్చి మాట్లాడటం మానేసారు. సింధు వాళ్ళు ఉన్నప్పుడే అపార్ట్మెంట్ వెదికాము. దొరకలేదు. మాల్ కి వెళ్ళడానికి బస్ ఫెసిలిటి చూసుకోవాలి కదా. తర్వాత అపార్ట్మెంట్ దొరికింది. నేను, ఉష అవసరాలకి కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. మెుత్తానికి ఫ్లోరెన్స్ మాల్ లో కళ్ళజోడు షాప్ లో నా మరో ఉద్యోగం మెుదలైంది. పొద్దున 10 కి మాల్ లో షాప్ ఓపెన్ చేస్తే రాత్రి 9 కి క్లోజ్ చేయాలి. పొద్దుటే వంట చేసుకుని లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయేది. 10,10.30 అయిపోయేది. బస్ లో అప్పుడప్పుడూ కొందరు నల్లవాళ్ళని చూసి మేం సరదాగా నవ్వుకునేవాళ్ళం. రకరకాల హెయిర్ స్టైల్స్ తో వింతగా అనిపించేవారు నాకయితే. ఓ రకమయిన వాసన వచ్చేది వాళ్ళ దగ్గర. నాకసలే వాసనలు చాలా త్వరగా తెలుస్తాయి. వేసిన హెయిర్ స్టైల్ వారం, పది రోజుల వరకు తీయరట. ఆ వాసన వెనుక కత అదన్నమాట. ఉష కార్ట్ (కళ్ళజోళ్ళ షాప్)పై ఫ్లోర్లో, నాది కింది ఫ్లోర్లో. ఒక్కోరోజు నాకు సేల్ తక్కువ ఉంటే ఉష హెల్ప్ చేసేది. అలా ఇద్దరం నెట్టుకొని వచ్చేవారం. శ్రీను నిమ్మకాయ పచ్చడి, ఇంకో పచ్చడి పార్సిల్ చేసాడు నాకోసమని. అప్పటికే ఆరోగ్యం అస్సలు బాలేదు. రాత్రి పూట విపరీతమైన ఒళ్ళు నొప్పులుండేవి. మా ఉష కాస్త గట్టిగానే గురక పెడుతుండేది. నాకు పుట్టబోయేది అమ్మాయేనని మేము పని చేసే మాల్ లోనే షాపింగ్ చేసి ఓ రెండు డ్రసెస్ పాపకని తీసుకున్నాను. అప్పటికింకా స్కానింగ్ చేయించుకోలేదు. అమెరికాలో 20 వారాలకే అబ్బాయెా, అమ్మాయెా చెప్తారు. 
రోనెక్ లో డాక్టర్ దగ్గరకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడా చూపించుకోలేదు. ఫ్లోరెన్స్ లో వెదుక్కుని డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. అబ్బాయెా, అమ్మాయెా చెప్తారని. ఆ డాక్టర్ స్కాన్ చేయకుండానే హార్ట్ బీట్ చూసి అబ్బాయని చెప్పింది. స్కాన్ కి డేట్ ఇచ్చారు. ఆరోజు వెళితే స్కాన్ చేసి అబ్బాయంది సిస్టర్. మరోసారి చెక్ చేయమన్నాను. తను నవ్వి డాక్టర్ ముందే చెప్పారు కదా, హండ్రెడ్ పర్సంట్ అబ్బాయేనంది. జనరల్ టెస్ట్లన్నీ చేస్తే షుగర్ ఎక్కువగా ఉందని వచ్చింది. మరోరోజు ఫోర్ అవర్ షుగర్ టెస్ట్ చేయాలి. పొద్దుటే ఏం తినకుండా, తాగకుండా రమ్మని చెప్పారు. బాగ్ లో ఓ ఆపిల్, వాటర్ బాటిల్ పెట్టుకుని 2 బస్ లు మారి హాస్పిటల్ కి వెళ్ళి ఫోర్ అవర్ షుగర్ టెస్ట్ చేయించుకుని బస్ మారడానికి ఇంక ఓపిక చాల్లేదు. రెండో బస్ ఎలా ఎక్కానో తెలియదు. బాగ్ లో వాటర్ బాటిల్ తీసుకునే ఓపిక కూడా లేదు. అయినా మెల్లగా వాటర్ తాగాక కాస్త ఓపిక వచ్చింది. మా అపార్ట్మెంట్ దగ్గర బస్ దిగి లోపలికి ఎలా వెళ్ళానో కూడా తెలియదు. ఏం తినలేదు కదా బాగా నీర్సం వచ్చింది. సాయంత్రానికి కాస్త ఓపిక వచ్చింది. ఈ ఫోర్ అవర్ షుగర్ టెస్ట్ లో నాకు షుగర్ లేదని తెలిసింది. ఆరోజు షుగర్ ఎక్కువ ఉండటానికి కారణమేంటంటే అంతకు ముందు రోజు నాకు పూర్ణాలు తినాలనిపించి పూర్ణాలు లోపలి పప్పు చేసుకున్నా. పూర్ణాలు వండే ఓపిక లేక ఆ స్వీట్ పప్పు తినేసాను. అదన్నమాట అసలు సంగతి. ఏడవ నెలలో ఓరోజు మాల్ లో కాలు జారి పడిపోయాను. ఏమి కాలేదు. 
చికాగో లో ఉన్నప్పటి బాబీ కాల్ చేసి వాణి అని ఒకావిడ రామస్వామి దగ్గర ఉంది. ఆవిడని బాగా ఇబ్బంది పెడుతున్నారు. తన హజ్బెండ్ చనిపోయారు. బాబు ఇండియాలో ఉన్నాడు. బాగా ఇబ్బంది పడుతోంది. ఏదైనా జాబ్ చూడమని చెప్పి ఆవిడ నెంబర్ ఇచ్చాడు. ఆవిడకి కాల్ చేసి మాట్లాడి, మా దగ్గరకి వచ్చేయమని చెప్పాను. ఉషకి చెప్పాను. మన అవర్స్ లో కొన్ని తనకి ఇద్దాము. మనతో ఉంచుకుందామని అంటేే, ఉష కూడా సరేనంది. వాణి వచ్చింది. మాతోనే తను ఉంటోంది. కొన్ని రోజులు పోయాక మా రాంకుమార్ గారు వాళ్ళు సబ్ వే లో వాణికి జాబ్ ఉందంటే అక్కడికి పంపాను. 
             చికాగో బాబన్నయ్య ఇండియా వెళ్ళినప్పుడు ఇచ్చిన డబ్బులు కావాలని అడిగారు. వాళ్ళింట్లో ఉన్న నా లగేజ్ అంతా ఫ్లోరెన్స్ పార్శిల్ చేసారు. ఈలోపల నాకు 8వ నెల వచ్చేసింది. మా చిన్న ఆడపడుచు పెళ్ళి అయ్యింది. మధు వాళ్ళు చెప్పారో, మరెవరు చెప్పారో తెలియదు కాని మా షాప్ ఓనర్ సడన్ గా ఓ రోజు మనిషిని పంపి షాప్ హాండోవర్ చేసుకుని మా జాబ్ అయిపోయిందని చెప్పాడు. వీడి పేరు కూడా బాబినే. విష్ణుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. అపార్ట్మెంట్ తీసుకుంటాను హంట్స్విల్ వచ్చేయండి అన్నాడు. అది అలబామా స్టేట్. మా ఆయన కూడా ఇండియా నుండి వస్తుంటే, తనని హంట్స్విల్ వచ్చేయమని, ఆయన వచ్చే రోజుకి మేము హంట్స్విల్ వెళ్ళాము. హంట్స్విల్ వెళ్ళేముందే బాబన్నయ్య,జలజ వదిన వాళ్ళకు ఇవ్వాల్సిన 2850 డాలర్లు ఇచ్చేసి హమ్మయ్య అప్పు తీర్చేసాను అనుకున్నాను. అమ్మావాళ్ళకు వీసా మూడు నెలలకు ఇచ్చారు. అప్పుడే నాకు చిన్న క్రెడిట్ కార్డ్ వచ్చింది. అంతకు ముందు చికాగోలో ఉన్నప్పుడు తెలియక యాన్యువల్ ఫీ ఉండే కార్డ్ ఒకటి తీసుకున్నా డబ్బులు కట్టి మరీ. నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ రాధ వాళ్ళ తమ్మడు రాము మాకు జూనియర్. తను యు ఎస్ వచ్చాడు. నేను ఇండియానా లో టెర్రాహట్ లో ఉన్నప్పటి నుండి మాట్లాడేవాడు. చికాగోలో ఉన్నప్పుడు నాకు 500 డాలర్లు పంపాడు. అవి ఈ కార్డ్ కి కొన్ని వాడాను. బాబీ తీసుకున్నాడు మిగిలినవి. నేను ఇండియా వెళ్ళేటప్పుడు రాధ వాళ్ళకి ముత్యాలు, పచ్చలు తీసుకు వెళ్ళమని రాము చెప్తే అవి తీసుకుని రాధకి ఇచ్చాను. తర్వాత రాముకి ఆ ముత్యాలు, పచ్చలకి పోను మిగిలిన డబ్బులు ఇచ్చేసాను. ఆ తర్వాత నుండి రాము మాట్లాడలేదనుకుంటా నాతో. బహుశా డబ్బులు తీసుకున్నాననేమెా అని ఇప్పుడు అనిపించింది. ఇన్నాళ్లు అంత బావుండేవాడు, ఎందుకు మాట్లాడటం మానేసాడా అని అనుకునేదాన్ని. తప్పదులెండి జీవితంలో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. 
           "  జీవితంలో కొన్ని పరిచయాలు మంచిని, మరికొన్ని చేదు అనుభవాలను మిగులుస్తాయి. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 

28, మార్చి 2021, ఆదివారం

ఆ కబురూ... ఈ కబురూ...!!

నేస్తం, 
        పలకరించాలని చాలా కాలంగా అనుకుంటున్నా కానీ ఏదో సందిగ్ధం. చెప్పని మాటలు బోలెడు మిగిలున్నా చెప్పలేని నిస్సహాయత వెంటాడుతోంది. జీవితంలో సర్వసాధారణమైనవి జ్ఞాపకాలు. అవి లేని మనిషి ప్రాణమున్న యంత్రం. నిజమే మనమిప్పుడు యాంత్రికంగానే బతికేస్తున్నాం. కాదని అనలేను కాని కొన్ని గురుతులనైనా మనతో ఉంచుకుంటున్నాం. 
        జీవితం అందరికి ఒకేలా సాగదు. కాని ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగానే బాధలు, సంతోషాలు ఉంటాయి. కాకపోతే మన మనస్తత్వమేంటంటే ఈ ప్రపంచంలో మనము మాత్రమే బాగా బాధ పడిపోతున్నాం, మిగతా అందరు సంతోషంగా ఉన్నారనుకుంటాం. కష్టం, సుఖం మన ఆలోచనని బట్టి ఉంటాయి. మనకు నవ్వుతూ కనిపించే వాళ్ళందరికి కన్నీళ్ళతో పనిలేదని అనుకుంటే అది పొరబాటే. ఆ చిరునవ్వుల వెనుక దాచిన దిగులు వెతలెన్నో. 
         మనకు లేనిదే కావాలని అనిపించడం సహజమే. చిన్నప్పుడు అమ్మ దగ్గర అందని చందమామ కోసం మారాము చేసినప్పటి నుండి మనకది అలవాటే కదా. ఓ క్రమ పద్ధతిలో జీవితం సాగాలనే అందరు కోరుకుంటారు. కాని అవాంతరాలు చెప్పి రావు కదా. అవి వచ్చినప్పుడు సంయమనంతో వాటిని అధిగమించడంలోనే మన నేర్పు బయటబడుతుంది. 
    మనకు నచ్చిన వారు మనల్ని పట్టించుకోవడం లేదని బాధ పడతాం. ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వడం మనం మర్చిపోయామని గ్రహించం. ఇష్టపడి భరించే కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది. ఇష్టంలేని సంతోషం తెచ్చిపెట్టుకున్న పెట్టుడు నగల్లానే మిగిలిపోతుంది.
    ఏ అనుబంధమైనా కలకాలం నిలవాలంటే నమ్మకమనే పునాది గట్టిగా ఉండాలి. బయట వల్లమాలిన ప్రేమలు కురిపిస్తూ, లోపల విషపు సెగలు విరజిమ్మే నైజాలిప్పుడు మన చుట్టూ చాలా ఎక్కువే ఉన్నాయి. మనమే జాగ్రత్తగా మసలుకోవాలి. ఇంటా బయటా కూడా ఈ నటనలే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. చూసి చూసి మనకూ నటన అలవాటై పోతుందేమెానన్న భయమూ వేస్తోంది ఓ పక్కన. 
    రెప్పపాటు ఈ జీవితానికి ఎన్ని రెప్పల కింద కన్నీటిని పారించాలో మరి. శత్రువును తలుచుకున్నంతగా మిత్రులను కూడా తల్చుకోము. భార్య/భర్త పట్టించుకోవడం లేదన్న విషయం ప్రపంచంలో అతి పెద్ద కష్టంగా అనుకుంటారు కొందరు. కొన్ని బాధ్యతల నడుమ బంధాలకు చోటు తక్కువే మరి. వారి వారి మనస్థితిని బట్టి అవి ఆధారపడి ఉంటాయి. కొందరు ఇంట్లో పట్టించుకోరు, బయటివారికి ఏ చిన్న కష్టమెాచ్చినా అబ్బో తెగ బాధ పడిపోయి, క్షేమ సమాచారాలు కనుక్కుంటూనే ఉంటారు. తన పక్కనుండే భార్య/భర్త ను తిన్నావా అని అడగడానికి కూడా నోరు రాదు. మరి కొందరేమెా ఇల్లు తప్ప మరో ప్రపంచంతో పని లేదన్నట్లుగా ఉంటారు. 
         ఏదో చెబ్దామని ఏదేదో చెప్పేస్తున్నానేంటి? రాసి చాలా రోజులైంది కదా, అలవాటు పోయింది మరి. ఏమనుకోకండి. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే నాలుగు వాక్యాలు, నాలుగు పదాలు రాసేసే ప్రతివారూ రచయితలు/రచయిత్రులు కాదన్నారు కొందరు. వాక్యం రసాత్మకం కావ్యం అన్నది కూడా మన పెద్దలేనండోయ్. అందుకే నాలుగు వాక్యాలు కాకుండా బోలెడు రాసేసానన్న మాట. ఏంటో ఈమధ్య ముందుచూపు ఎక్కువై పోయింది నాకు కూడా... నేను ఎవరిని ఏమి అనలేదండోయ్. 

25, మార్చి 2021, గురువారం

కాలం వెంబడి కలం...46


             నేను రోనెక్ సిటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత నుండి, ఇది మూడు వారాల ప్రాజెక్టే కదా అని నా ప్రయత్నాలు నేను చేసుకోవడం మెుదలుబెట్టాను. ప్రాజెక్ట్ వారం వారం ఎక్స్టెెండ్ అవుతూ ఉంది.  మెాటల్ లో ఉంటుంటే ఎక్కువ ఖర్చు అవుతోంది. మా ప్రాజెక్ట్ మేనేజర్ టీనాని ఎప్పుడు పంపించేస్తావు నన్ను, అని అడుగుతుంటే, తను నవ్వేస్తూ..ఏం ఇక్కడ నచ్చలేదా అనేది. నాకేమెా వర్క్ లేకుండా ఖాళీగా కూర్చుంటే అస్సలు తోచేది కాదు. అప్పుడప్పుడు జలజ వదినతో, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండేదాన్ని ఆఫీస్ ఫోన్ నుండి. ఓ రోజు టీనా మా టీమ్ అందరిని లంచ్ కి ఔటింగ్ కి తీసుకువెళ్ళింది. నాకేమెా ఏ ఫుడ్ పడేది కాదు. వెజ్ శాండ్విచ్ తిన్నాను. తర్వాత ఇండోర్ గేమ్స్ ఆడారు అందరు. అప్పటి వరకు సినిమాల్లో చూడటమే తప్ప, రియల్ గా చూడని బ్రిలియర్డ్స్ అందరు ఆడుతూ నన్నూ ట్రై చేయమన్నారు. సరదాగా ఓసారి ట్రై చేసా రాదంటూనే. 
      మా టెస్టింగ్ టీమ్ దగ్గరే ఆఫీస్ వర్క్ స్టాఫ్ డస్క్ ఉండేది. శాండి ఆఫీస్ వర్క్ చూసేది. అప్పుడప్పుడు నాకు లంచ్ తెచ్చిపెట్టేది. ఉండటానికి రూమ్ కావాలని అడిగితే చూస్తానని చెప్పి, 2 డేస్ లో నా దగ్గరకు వచ్చి, ఇష్టమైతే తన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండమని అంది. మరి ట్రాన్స్ పోర్టేషన్ ఎలా అని అడిగితే తను రైడ్ ఇస్తానంది. సరేనని శాండి ఇంటికి షిప్ట్ అయ్యాను. అంతవరకు చూడని కొత్త ఎన్విరాన్మెంట్. అది మెాబైల్ హౌస్. నేను అప్పటి వరకు వినను కూడా లేదు. ఈ మెాబైల్ హౌస్ ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి షిప్ట్ చేసుకోవచ్చు. ఈ మెాబైల్ హౌస్ సెట్ చేసుకునే ప్లేస్ కి రెంట్ కట్టుకోవాలి. 2 బెడ్ రూమ్స్, బాత్ టబ్, కిచెన్ సింపుల్ గా బావుంది. తనకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయింది. చిన్నమ్మాయి చదువుకుంటోంది. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంది. శాండికి హజ్బెండ్ తో డైవోర్స్ అయ్యి, మరొకతనితో రిలేషన్ షిప్. అతను అప్పుడప్పుడు వచ్చివెళతాడు. మనకి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న సహజీవనమన్న మాట.  ఓ రెండు పెద్ద పిల్లులు కూడా ఉన్నాయి. మామూలుగా నాకు పిల్లులంటే భయం లేదు. కాని వీటిని చూస్తే ముందు ఏం అనిపించలేదు కాని తర్వాత తర్వాత చాలా భయం వేసేది. రూమ్ డోర్ లాక్ చేసుకుంటే డోర్ గీరుతూనే ఉండేవి. హాల్లో కూర్చుంటే వచ్చి పక్కన లేదా ఒళ్ళో పడుకునేవి. తోస్తే వాటికెంత కోపమెా. అరిచేవి బాగా. ఆ చూపులకు, అరుపులకి బాగా భయం వేసేది. శాండితో చెప్తే ఏం చేయవులే భయపడకు అనేది. తర్వాత అలవాటై పోయాయి. రోనెక్ సిటి పుణ్యమా అని నాకు తిండి విలువ బాగా తెలిసిందని చెప్పాను కదా. అమెరికన్ ఫుడ్ తినలేనని శాండి నన్ను 45 మినిట్స్ డ్రైవ్ లో ఉన్న ఇండియన్ గ్రాసరిస్టోర్ కి తీసుకువెళ్ళింది. అది చాలా చిన్న గాస్ స్టేషన్. దానిలోనే ఇండియన్ గ్రాసరీ ఉంది. ఎప్పుడూ తినని మాగీ నూడిల్స్ తీసుకున్నాను మిగతా సరుకులతో పాటు. శాండికి ఇండియన్ ఫుడ్, అదీ సెనగపప్పు, కొబ్బరి కూర చాలా ఇష్టం. నా వంటలు రుచి చూస్తూ ఉండేది తన బాయ్ ఫ్రెండ్ తో కలిపి. 
             అప్పటికే నాకు ఫోర్త్ మంత్ వచ్చేసింది. ఏం తిన్నా, తాగినా వామిటింగ్స్ అయిపోయేవి. బాగా నీర్సంగా ఉండేది. డాక్టర్ చెక్ అప్ కి వెళ్ళడానికి ముందుగా మన హెల్త్ ఇన్ష్యూరెన్స్ ప్రొవైడర్ ఎవరో చూసుకుని, ఏ హాస్పిటల్ ఎవైలబుల్ ఉందో చెక్ చేసుకుని, ముందుగా ఫోన్ చేసి అప్పాయింట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు ఫలానా డేట్ అని, టైమ్ చెప్తారు. ఆ టైమ్ కి డాక్టర్ ఆఫీస్ కి వెళ్ళాలి. అమెరికాలో హాస్పిటల్స్ వేరు, డాక్టర్ ఆఫీస్ వేరుగా ఉంటాయి. నా అప్పాయింట్మెంట్ రోజు శాండి, నేను బయలుదేరాం. ఎందుకో తెలియదు ఆరోజు పొద్దుటి నుండి బాలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. కాఫీ పెట్టుకుని కూడా తాగలేక మళ్ళీ వచ్చి పడుకున్నా. తర్వాత శాండి ఆఫీస్ కి రడి అయ్యాక, తను కప్ కేక్స్ చేసి ఆఫీస్ కి తీసుకుని బయలుదేరింది. ఆ కేక్స్ నేను పట్టుకుని మెట్లు దిగబోయి నాలుగు మెట్ల మీద నుండి  జారిపోయాను. శాండి కంగారు పడుతుంటే ఏం కాలేదని చెప్పాను. తర్వాత శాండి నన్ను డాక్టర్ ఆఫీస్ వద్ద డ్రాప్ చేసి వెళిపోయింది. చెక్ అప్ అయ్యాక కాబ్ లో వస్తానని చెప్పాను. టీనాకు ముందే ఇన్ఫామ్ చేసాను లేట్ గా వస్తానని. కొత్తగా డాక్టర్ అప్పాయింట్మెంట్ తీసుకుంటే ఓ త్రీ అవర్స్ ఎగ్జామ్ రాసినట్టుగా పెద్ద బుక్ లెట్ ఫిల్ చేయాలి మన హెల్త్ హిస్టరీ గురించి. అంతా అయ్యాక ఎనిమిక్ గా ఉన్నానని చెప్పి రెగ్యులర్ టాబ్లెట్స్ తో పాటు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. వామిటింగ్ అప్పుడు ముక్కు, నోటి వెంట కూడా బ్లడ్ పడేది. దానితో బాగా వీక్ అయ్యాను. 
      నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ జ్యోతి అప్సానీ కూడా వర్జీనియాలోనే కాస్త నాకు దగ్గరలోనే ఉంది. ఫోన్ లో తనతో కూడా మాట్లాడుతుండేదాన్ని. అప్పటికి తనకి చిన్న బాబు. వీలైతే నేనే చూడటానికి వస్తానని చెప్పాను. శిరీష వదిన కూడ కుదిరితే నా దగ్గరకు వస్తామని చెప్పింది.
            మూడు వారాలు అన్న ప్రాజెక్ట్ అలా అలా  గడిచిపోతూ ఉంది. శాండి మెాబైల్ హౌస్ లో రోనెక్ సిటీ జీవితం బాగానే జరుగుతోంది. అమ్మానాన్నకు, మౌర్యకు అమెరికా రావడానికి పేపర్స్ పంపాను. ఆ పేపర్స్ నోటరి చేయించి పంపడంలో శాండి చాలా హెల్ప్ చేసింది. శాండి ఇంట్లో ఉండగానే మా చిన్న ఆడపడుచుకి పెళ్ళి సంబంధం అనుకోకుండా AMSOLరవి మూలంగా కుదిరింది. నేను ఇండియా వెళ్ళినప్పుడు మా పెద్దాడపడుచు వాళ్ళాయన కాస్త సూటిపోటి మాటలన్నారు. ఏదో మాటల మీద రవి ఈ సంబంధం గురించి చెప్తే, ఆ పిల్లకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఫోటో పంపించి, చదువు, మిగతా వివరాలు చెప్పి నీకు నచ్చితేనే మాట్లాడతాను అని చెప్పాను. వాళ్ళ అక్కాబావ ఇష్టం అంది. అమ్మానాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారు. తర్వాత వాళ్ళతో మాట్లాడితే సంబంధం మాట్లాడమన్నారు. అబ్బాయి జీతం గురించి అడిగితే 4000, 5000 నాకు తెలియదు అని ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకేం అనుమానాలున్నా మాట్లాడండి అని నెంబర్ ఇచ్చాను. నాకుగా వాళ్ళు మాట్లాడిన వివరాలేం చెప్పలేదు. మా ఆయన అప్పుడు ఇండియాలోనే ఉన్నారుగా. మెుత్తానికి మాట్లాడి సంబంధం కుదిర్చారు. పెళ్ళికొడుకు..మరి పెళ్ళి ఖర్చులు ఏం ఇవ్వరా అంటే వాళ్ళేం ఇవ్వలేరండి. నేనే ఇవ్వాలి అంటే నవ్వేసి ఊరుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయ్యింది. ఓ రోజు మా మరిది ఫోన్ చేసి పిల్లకి ఇష్టం లేదని చెప్పాడు. ఆయన అప్పుడు అక్కాబావతో మాట్లాడడు. నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, ఆమెకు ఇష్టం లేకపోతే మానేయండి, ఆవిడ సంగతి మీకు బాగా తెలుసు కదా, చదువు ఏం చేసిందో గుర్తు చేసుకోండి. వాళ్ళకి నేను ఏదోకటి చెప్పుకుంటాను అని అంటే, మేం మాట్లాడతాం అని చెప్పారు. 
       ఇదంతా శాండి వింటూనే ఉంది. విషయం ఏంటని అడిగితే ఇలా ఇలా అని వివరంగా చెప్పాను. మీకు ఇంత ప్రాసెస్ ఉంటుందా పెళ్ళికి అని ఆశ్చర్యపోయింది. ఈలోపల మా టెస్టింగ్ టీమ్  పుణ్యమా అని, నేను ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నానన్న కంప్లైంట్ తో, మా టీనాకి ఎగైనెస్ట్ గా, నా జాబ్ తీసేయించారు. టీనాకి తన పనిలో కూడా చాలా హెల్ప్ చేసేదాన్ని. టెస్టింగ్ చేయమంటే, బగ్స్ తో పాటు, కోడింగ్ ఏం చేయాలో, ఎక్కడ ఛేంజ్ చేయాలో చెప్తుండేదాన్ని. టీనానేమెా మంజూ మనం బగ్స్ ఐడెంటిఫై చేయాలంతే అని నవ్వేది. రామస్వామి నన్ను బెదిరిస్తే ఆ విషయం కూడా టీనాకి తెలుసు. చాలా సపోర్టివ్ గా ఉండేది నాతో. అది మిగతావాళ్ళకి కంటగింపు. నాకు పని లేకపోతే ఏం చేయాలో తెలియక ఫోన్ మాట్లాడేదాన్ని జలజ వదినతో, చికాగోలో కొందరితో. ఆఫీస్ వాళ్ళు నేను ఫోన్ మాట్లాడిన అవర్స్ లెక్కబెట్టుకున్నారు కాని నేను పని చేసిన టైమింగ్స్ గుర్తుంచుకోలేదు. అవి అన్ని మా టీమ్ లో అందరికి తెలుసు. ఎక్స్ట్రా అవర్స్ పే చేయరు. అయినా వర్క్ చేసేదాన్ని. ఎప్పుడైనా స్నో పడి లేట్ అవుతుంది రావడానికంటే, టీనా లీవ్ తీసుకోమనేది. తర్వాత టైమ్ షీట్ ఫిల్ చేసేటప్పుడు లీవ్ ది కూడా టైమ్ వేసుకో, నీకెలాగు మేం ఎక్స్ట్రా అవర్స్ పే చేయడం లేదు. నువ్వు లంచ్ టైమ్ కూడా తీసుకోవు అనేది. ఎంతయినా అందరు అమెరికన్స్ మధ్యన టీనా నాకు ఫేవర్ గా ఉండటం వారికి నచ్చలేదు. మెుత్తానికి నా మూడు వారాల ప్రాజెక్ట్ మూడు నెలలతో ఇలా ముగిసిందన్న మాట. అన్నట్టు చెప్పడం మరిచా మా శాండి వాళ్ళ ఫాదర్ మంచి కార్ రేసర్ అంట. నాకు శాండి డ్రైవింగ్ చూసి అనుమానమెుచ్చి అడిగితే ఆ విషయం చెప్పింది. అక్కడే ఓ రెండు రోజులుండి తర్వాత నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాస్మేట్ శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఏదైనా జాబ్ చూద్దాం, డెట్రాయిట్ వచ్చేయమంటే డెట్రాయిట్ బయలుదేరాను. 

     " జీవితంలో ప్రతి అనుభవమూ ఓ పాఠమే. నేర్చుకునే ఓపిక మనకుండాలంతే. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 


24, మార్చి 2021, బుధవారం

జీవన 'మంజూ'ష.. ఏప్రిల్

      సాహిత్యానికి షష్టిపూర్తి, స్వాతంత్ర్యానికి డెబ్భై ఐదు వసంతాలంటూ పండుగలు చేసుకుంటున్నాం కాని ఏం సాధించామని ఈ ఉత్సవాలు చేసుకుంటున్నామని ఓ క్షణమైనా ఆలోచిస్తున్నామా? 
       జీవితం సప్త సాగర గీతం అన్న సినీ కవి మాటలు ఓసారి గుర్తు చేసుకుంటే కాస్తయినా జీవితపు విలువలు తెలుస్తాయి. కాదేది కవిత్వానికి అనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ. ప్రతి రాతా పురస్కారానికి అర్హమే అంటున్నాయి ఈనాటి సాహితీ విలువలు. కేంద్రమూ లేదు, రాష్ట్రమూ లేదు అన్నీ ఒకేలా వ్యవహరిస్తున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఎన్నో సాహితీ సంస్థలు పురస్కారాలను డబ్బులతో జత చేసి ఇబ్బడిముబ్బడిగా అవార్డులిచ్చేస్తూ, అవార్డులంటే నలుగురు నవ్వుకునేటట్లు చేసేస్తూ, తెలుగు సాహిత్యాన్ని నవ్వులపాలు చేసేస్తున్నాయి. 
      మందు పార్టీలకు, మతలబు రాజకీయాలకు సాహిత్యం కూడా అమ్ముడుబోయినందుకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించేసి మనమూ చేతులు దులిపేసుకుందాం. ఎన్నో గొప్ప గొప్ప రాతలు ఎవరికి తెలియకుండా పోతున్నాయంటే దీనికి కారణాలు మనందరికి తెలిసినా గొంతు విప్పి ఓ మాట మాట్లాడం. కాపీ రాతలకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలిచ్చి చేతులు దులిపేసుకుంటాం. కులమతాలను హేళన చేసే రాతలకు గొప్ప శిల్పం, చట్టుబండలు ఉన్నాయని అందలం ఎక్కించేస్తాం. 
      పురస్కారం అందుకునే సాహిత్యానికి మాత్రమే అర్హత ఉంటే సరిపోదు. ఆ పురస్కారం అందుకునే రచయిత వ్యక్తిత్వం కూడా అందుకు సరిపోయి ఉండాలి. ఏ ప్రాతిపదికన ఈ పురస్కారాలు పంచుతున్నారో వివరాలు చెప్పరెవరూ. కమిటిలో ఉన్న నలుగురికి నాలుగు మందు బాటిళ్ళు, నాలుగు మిడ్ నైట్ పార్టీలు ఇస్తే చాలు అవార్డ్ గారంటీ అన్న నమ్మకం అందరి మనసుల్లో లో వేళ్ళూరుకు పోయిందిప్పుడు. సమాజానికి హితం చేసేది సాహిత్యం అన్నది ఒకప్పటి మాట. మందు పార్టీలలో మునిగి తేలుతోంది అక్షరం అన్నది ఇప్పటి సత్యం. సరసమైన ధరలకు డాక్టరేట్ లు అంగడి సరుకులుగా దొరుకుతున్నాయిప్పుడు. పురస్కారాలకు, షష్టి డాక్టరేట్ లకు నియమ, నిబంధనలు ఏమీ లేవిప్పుడు.
        తెలుగు సాహిత్యం పరువు ఏమిటన్నది సాహితీ పెద్దలకే తెలియాలి మరి. ప్రపంచ సాహిత్యంలో మనమెక్కడున్నామెా ఓసారి ఆలోచించండి సాహితీ మేధావుల్లారా!  

22, మార్చి 2021, సోమవారం

ఏక్ తారలు..!!

1.  ఎగసిపడుతున్న అలలేగా మనసు రొదలన్నీ_కనిపించే కడలి సాక్షిగా...!!
2.  అక్షరం తూటాగా మారక తప్పని స్థితి_భారమైన మది బరువుకాక మునుపే..!!
3.  గారడీలు తెలియని మనసిది_గాయాలను జ్ఞాపకాలతో ఓదార్చుతూ...!!
4.  బతుకు భారాన్నంతా అక్షరాలకు పంచేయడమే_మనసు మాట వినబడాలంటే...!!
5.   అసూయకు అనుబంధంతో పని లేదు_అమ్మయినా అక్షరమయినా దానికొక్కటే...!!
6.  గంపెడు భారం దిగిపోయింది_గుప్పెడు గుండె విదిల్చేసిన మౌనానికి..!!
7.  అవగతం కానివే_అక్షరాల అనులోమానుపాతాలు...!!
8.  జ్వలిస్తున్నాయి అక్షరాలు నిప్పు కణికెల్లా_మనసు సెగలను పంచుకుంటూ..!!
9.  విరామం కోరుకోవడం అత్యాశేనేమెా_విశ్రాంతి ఎరుగని జీవితాలకు...!!
10.   మనమేంటో మనకి బాగా తెలుసు_అబద్ధమెంత బావున్నా...!!
11.   వర్ణనదేముంది మనసుతో పలికిస్తే చాలు_అక్షరాలలా అమరిపోతాయంతే...!!
12.   హృదయానికి తపన పడటమే తెలుసు_అవి గాయాలైనా గేయాలైనా..!!5
13.  ఆలకిస్తూనే ఉంది మనసు_అక్షర నివేదనలోని వేదనను...!!
14.   గాత్రం వినసొంపుగానే ఉంటుంది_గాయం నాది కానప్పుడు..!!
15.   బాంధవ్యం బలపడింది అక్షరాలతోనే_ఓదార్పు కోరుకునే మనసులకు...!!
16.   నడుస్తున్న చరిత్రే ఇది_తప్పుల భారం తమది కాదంటూ...!!
17.   క్షరం కానివే అక్షరాలు_రాహిత్యానికి సాహిత్యానికి మధ్యన వారధిగా...!!
18. శూన్యాన్ని నింపేయాలన్న కోరికే అక్షరాలకి_మనసుల వెలితిని పూడ్చుతూ...!!
19.   యాగ ఫలం అందరిదీ_అక్షర సంచారం విశ్వాన్ని చుట్టినా...!!
20.   వదల్లేనంటోందో పాశం_విషాదం నింపుకున్న కన్నీటిచుక్కతో చేరి..!!
21.   ఘర్షణల మెరుపులే ఈ అక్షరాలు_చీకటికి వెలుగునందిస్తూ...!!
22.  శబ్దంతో పనేముంది_మనసు పోరాటానికి, ఆరాటానికి...!!
23.   వ్యక్తిత్వం వద్దనే ఉంది_అహానికి అనుబంధానికి మధ్యన...!!
24.   కాలానికి కలాన్ని అప్పజెప్పేసా_అంతరంగాన్ని అక్షరాల్లో ఒంపేయమంటూ...!!
25.  మనసులను కదిలించే నేర్పు అక్షరాలదే_మనిషిగా మనం మనగలిగితే...!!
26.  బుజ్జగింపులు అవసరమే_వెలుతురు వాకిలి కనబడాలంటే...!!
27.   కల'వరాల కాలమిది_గాయమే గతానిదైనా...!!
28.   ఊరడించే ప్రయత్నమే ఇది_జ్ఞాపకాలుగా మిగుల్చుకుంటూ...!!
29.   చీకటి చుట్టమే మెరుగు_వెలిసిన మనసుల రంగుల వెలుగులకన్నా...!!
30.   బదులిస్తూనే ఉంది కాలం_కలలింకిన కనులకు కావలినంటూ..!!

21, మార్చి 2021, ఆదివారం

మెాహన సమీక్ష..!!

తెలుగు సాహిత్యంలో నుడి గుడి వంటి పరిశోధనాత్మక గ్రంథం రచించిన రాజావాసిరెడ్డి మల్లీశ్వరి తెలియనివారు లేరంటే అతిశయెాక్తి కాదు. తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి, తెలుగులో ఎన్నో ప్రక్రియల్లో ఆరితేరిన వారి కలం నుండి తెలుగువారికి అందున ఆణిముత్యం " మెాహన "  గజళ్ల సంపుటి. 
        తన మెాహన పుస్తకంలో ఏముందో మెదటి గజల్ లో సంక్షిప్తంగా చెప్తారు. ప్రేమారాధన, విరహ వియెాగాలను, వర్ణ శోభితాలను అక్షరాల్లో రంగరించి హృద్యంగా తీర్చిదిద్దారు. ప్రేమబంధమై ఒదగాలని ఉంది అంటూ అక్షరమై లక్షణంగా మదిని తాకుతుంది ఈ గజల్. ఎందుకు అంటూ విరహంలో బాధను తెలుపుతారు. గరిక పూవై గిరి శిఖరాన విరిశానిలా  నీ కోసం అంటూ అంతులేని ఆరాధనను కొన్ని గజళ్లలో తెలుపుతారు. కాలం వలలో భావానుభూతుల చిత్రాలు ఎన్నో తెలుసా అంటారు మరోచోట. నైతికత లేకపోతే ఏమౌతుందో చెప్తారు ఒక గజల్ లో. మనసు మాటలను, బాధల గాథలను, గొప్పదనం అంటే ఏమిటో,  నీ కోసం నేను ఏమైపోయానో తెలుసా అంటూ తన మదిలోని ఆర్తిని, చీకటి తెరలు తొలిగి వేకువ వెలుగులు వచ్చేదెన్నడో అన్న సందేహాన్ని, చెప్పను చెప్పనంటూనే బోలెడు భావాలను విప్పి చెప్తారు. ఎవరికెరుక లేకున్నా అందమైన జ్ఞాపకంగా నిలిచిపోమ్మంటారు. 
   ప్రకృతి పరిణామక్రమం గురించి, ఎడబాటులోని వేదనను, తనలోని ప్రేమను, కాలం మెాసుకెళుతున్న అనుభవాలను, బతకడమంటే ఏమిటో, ప్రేమారాధనకు పరిపూర్ణతను, వెన్నెల రాతిరి మనసులో ఉన్నది ఏమిటో, స్వార్థ ప్రపంచంలో న్యాయ విలువలు వెలిసేది ఎప్పుడోనన్న మీమాంస, అందాన్ని ఆస్వాదించడం, కోరికల చిట్టా, కొన్ని ప్రశ్నలను, మరికొన్ని సందేహాలను, కొన్ని సందేశాలను, మరికొన్ని సమన్వయాలను, సర్ధుకుపోవడాలను, లోకం పోకడలను, వెన్నెల వలపుఝల్లులను, చీకటి కోపతాపాలను, పరితాపాలను, పరివేదనలను, జ్ఞాపకాల గుభాళింపులను, గోధూళివేళ గోప్యతల గుట్టులను...ఇలా ప్రతి చిన్న అనుభూతిని మనం ఈ " మెాహన " లో చూడవచ్చు.
           మృదు పద మంజరి ఈ " మెాహన ". మురిసి మెరిసిన అక్షర మంజీరాలే అన్నీ. ప్రముఖుడు ప్రశంసలు అందుకుని, గజల్ లక్షణాలన్నీ మెండుగా, నిండైన భావాలతో, వజ్రగిరి జస్టిస్ గారి గజల్ భావాలకు ధీటైన చిత్రాలతో, గజల్ లోగిలి వ్యవస్థాపకులు, ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాసిన రోచిష్మాన్ గారు అభినందించిన " మెాహన "  
మరింతగా పాఠకులకు చేరువకావాలని కోరుకుంటూ... తెలుగు భాషా గని శ్రీమతి రాజావాసిరెడ్డి మల్లీశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు. 

15, మార్చి 2021, సోమవారం

కాలం వెంబడి కలం.. 45

         పినాకిని మమ్మల్ని విజయవాడ చేర్చింది. అక్కడి నుండి ఇంటికి చేరాము. నా కొడుకు నన్ను గుర్తు పట్టలేదు కాని నా గొంతు గుర్తు పట్టాడు. హమ్మయ్య నా ఫోన్ ఖర్చు వేస్ట్ కాలేదన్న ఆనందం నాలో. ఎందుకంటే తిన్నా తినకపోయినా వీలయినంత వరకు రోజూ ఫోన్ చేసేదాన్ని. కనీసం 5 నిమిషాలయినా వాడితో మాట్లాడేదాన్ని. వాడి మూడో పుట్టినరోజుకి ఇంటికి వచ్చాను. వాళ్ళ నాన్న ఇల్లంతా పూలతో డెకరేషన్ చేయించారు. ఊరిలో పిల్లలందరిని పిలిచి పుట్టినరోజు వేడుక బాగా చేసాము. అప్పటికి మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు. మా మామయ్య కూతురు ప్రియ, మావాడు మౌర్య. ఎవరి పుట్టినరోజయినా ఇద్దరు పిల్లలు కేక్ కట్ చేసేవారు. అమెరికా నుండి వచ్చాక, గతంలో నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు, అమెరికా వెళ్ళేటప్పుడు కనబడని బంధువులందరు కనిపించారు. మౌర్య డాబా పైనుంచి పడిపోయినప్పుడు అమ్మ తిరుపతి వెంకన్నకు ఏడూళ్ళు జోగి, నిలువుదోపు ఇస్తానని మెుక్కుకుందట. ఇంట్లో పూజ చేసుకుని,  అయినవాళ్ళందరితో తిరుపతి మెుక్కు తీర్చుకున్నాం. నేను అమెరికాలో ఉన్నప్పుడు మా పెద్దాడపడుచుకి ఆపరేషన్ చేస్తే అమ్మా అమ్మమ్మ వెళ్ళి చూసి వచ్చారు. మౌర్య డాబా మీద నుండి కింద పడినప్పుడు కూడా వాళ్ళెవరూ చూడటానికి కూడా రాలేదు. అయినా కూడా మౌర్యని తీసుకుని నేనే ఆవిడని చూడటానికి వెళ్ళాను. కార్డ్ లెస్ ఫోన్ ఇచ్చానని, ఆ బాకీ తీర్చడానికేమెా ఓ వెయ్యి రూపాయలు నాకు ఇచ్చింది. భోజనం చేసి, చల్లపల్లి హస్పిటల్ లో పంటికి సిమ్మెంట్ పెట్టించుకుని ఇంటికి వస్తూ, దారిలో అవనిగడ్డలో గోవర్థన్ వాళ్ళింటికి వెళ్ళి ఆంటిని కూడా చూసి వచ్చాను.  
      నా పాస్పోర్ట్, మా ఆయన పాస్పోర్ట్ కలిపి, డాక్యుమెంట్స్ అన్ని పెట్టి వీసా స్టాంపిగ్ కి పంపించాము. అప్పుడు పోస్ట్ లో పంపించడమే. అమెరికా వాళ్ళు ఒక్కోసారి ఒక్కో రూల్ పెడతారు. మళ్ళీ 2 ఇయర్స్ కి వీసా స్టాంపిగ్ అయ్యింది ఇద్దరికి.  రోజులు తొందరగా గడిచిపోయి, తిరుగు ప్రయాణం దగ్గరకి వచ్చేసింది. విజయవాడలో షాపింగ్, పచ్చళ్ళు, కారాలు సర్దుకుని అమెరికా తిరిగి బయలుదేరాను. 
         చికాగో ఎయిర్ పోర్ట్ కి బాబి వచ్చి పికప్ చేసుకున్నాడు. మరుసటి రోజు రెస్టారెంట్ కి వెళ్ళేసరికి కవితక్క వాళ్ళు లేరు. బిగ్ ఆపిల్ బేగిల్స్ లో వినోద్ ఉన్నాడు. మా కిరణ్ కి జాబ్ కావాలని అడిగితే రామస్వామి గారు రమ్మని చెప్పారు. వాడు వేరే చోట ఏదో మెాటల్ లో చేస్తున్నాడు అప్పుడు. MS చదువుకునే మనవాళ్ళందరు హాలిడేస్ లో ఇలా జాబ్ లు చేయడం మామూలే. కిరణ్ బాబీ వాళ్ళతో ఉండేవాడు. క్షణం కూడా ఖాళీ లేకుండా పని సరిపోయేది. బేగిల్స్ లో బేగిల్స్ బేక్ చేసే అతన్ని కూడా మానిపించేసారు. బేక్ చేయడానికి ఓ మెక్సికన్ వచ్చేవాడు. వింటర్ లో హెవీ స్నో  పడుతున్నా కూడా నేను తెల్లవారు ఝామున రెండింటికి వెళిపోయేదాన్ని బేగిల్స్ షాప్ కి. కొన్ని రోజుల తర్వాత వినోద్, వెంకటేశ్వరరావు కూడా మానేసారు. తర్వాత మా ఆయన కజిన్ రమణ గారు కొన్ని రోజులు చేసి ఆయనా మానేసారు. తర్వాత కిరణ్ వాళ్ళ బంధువు భాను గారు చేసారు. ఆయనా సాఫ్ట్ వేరే కాని అప్పటి పరిస్థితి అలాంటిది మరి. ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. రామస్వామి గారు నన్ను డ్రైవింగ్ నేర్చుకోమని అంటూ, కాస్త పెడసరంగా మాట్లాడటం మెుదలుబెట్టారు. డ్రైవింగ్ నేర్చుకునే టైమ్ ఇవ్వాలి కదా. ఆ గోల పడలేక ఓ రోజు వెళ్ళి లెర్నర్ పర్మిట్ తెచ్చుకున్నాను. అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందు లెర్నర్ పర్మిట్ రిటెన్ టెస్ట్ రాసి తెచ్చుకోవాలి. ఈ రిటెన్ టెస్ట్ ఏ స్టేట్ కి ఆ స్టేట్ కే సపరేట్ గా ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ రోడ్ టెస్ట్ ఇవ్వాలన్నమాట. లెర్నర్ పర్మిట్ ఉంటేనే రోడ్ టెస్ట్ ఇవ్వాలి. అప్పుడప్పుడూ మధు, సంధ్యా వాళ్ళు నేర్పించేవారు వాళ్ళ కార్ తో. 
        నేను హైదరాబాదు హాస్టల్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వినితో పాటు ఉషామాధవి అని మరో ఫ్రెండ్ ఉండేది. తను MSC కెమిస్ట్రీ చేసింది. నేను అమెరికా రాకముందే తనకి అమెరికా రావడానికి రాజగోపాల్ వాళ్ళ అన్నయ్య ద్వారా H1B వీసా కోసం మద్రాస్ వెళ్ళి డబ్బులు కట్టి పేపర్స్ ఫైల్ చేయించాము. పేపర్స్ రావడం, స్టాంపిగ్ కావడం అయ్యింది. కాని జాబ్ మార్కెట్ అప్పటికే అమెరికాలో బాలేదు. అందుకని వాళ్ళ ఎంప్లాయర్ రిస్క్ తీసుకోను, మీరు కావాలంటే మా ఆఫీస్ ఉన్న శాన్ఫ్రాన్సిస్కో వచ్చి తర్వాత మీకు కావాల్సిన చోటికి వెళ్ళండి. అలా అయితేనే పేపర్స్ ఇస్తాను అన్నాడు. అందుకని ఉషకి శాన్ఫ్రాన్సిస్కో నుండి చికాగోకి టికెట్ బుక్ చేసాను. తనని జలజ వదిన వాళ్ళు పిక్ చేసుకున్నారు. నాతోపాటు రామస్వామి గారింట్లోనే ఉండేది. అప్పుడప్పుడూ మాతో ఇండియన్ గ్రాసరిస్టోర్ లో ఉంటూ వుండేది. మా సీనియర్ రాంకుమార్ గారు సెయింట్ లూయీస్ లో సబ్ వే లో పని చేసేవారు. తన రూంమేట్ సతీష్ కూడా సబ్ వే లోనే.  వాళ్ళిద్దరు నువ్వే వేరేవాళ్ళింట్లో ఉంటున్నావు. ఉషని మా దగ్గరకి పంపు అని చెప్పారు. నచ్చితే సబ్ వే లో చేస్తుంది లేదా జాబ్ ట్రయల్స్ వేసుకుంటుంది అని అంటే ఉషని సెయింట్ లూయిస్ పంపించాను. ఉష వచ్చిన టైమ్ లోనే మా ఆయన కూడా అమెరికా వచ్చారు. మా ఆయన అమెరికా వచ్చినప్పుడు జలజ వదిన, అన్నయ్య చికాగో ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటే, బాబీ వెళ్ళి  తీసుకువచ్చాడు. రెస్టారెంట్ లో పని చేస్తూ ఉండేవారు. పెరుగన్నం మాత్రమే తిన్నారు ఉన్నన్ని రోజులు. ఓ ఆరు నెలలు ఉండి ఉండలేక ఇండియా వెళతానని అన్నారు. రామస్వామి గారికి చెప్పాను. అప్పటికే నేను రామస్వామి గారితో సరిగా మాట్లాడటం లేదు, మాధవి అక్కని వేరే వారి దగ్గర చాలా తేడాగా మాట్లాడారని. నా పని నేను చేసుకుంటున్నాను. మీ ఆయనకు డబ్బులు ఏమి ఇవ్వను, నీకు కూడా రోజుకి ఎనిమిది గంటలకు మాత్రమే ఇస్తాను అని అంటే నేను పని చేయను వెళిపోతానని చెప్పాను. రోజుకి 20, 22 గంటలు 10 నెలలు పని చేసాను. మూడు చోట్లా మెుత్తం పని చేసేదాన్ని. ఇలా అంటారని ఊహించలేదు. ఆడపిల్ల సొమ్ము తిని బాగుపడిందెవరులే అనుకున్నాను. ఓ 30 వేల డాలర్లు ఎగ్గొట్టారు. మాధవక్క నన్ను చాలా బాగా చూసుకుంది. మాధవి అక్క మాత్రం వెళిపోతున్నానంటే బాగా ఏడిచింది. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది. నువ్వు నీ జాబ్ చూసుకునే ఇక్కడనుండి వెళ్ళు అంది. ఎక్కడికి వెళతావు అంటే జలజ వదిన వాళ్ళింటికి వెళతాను అన్నాను. నా సంగతి అక్కకు బాగా తెలుసు. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళింటికి వెళ్ళావో నాకు తెలుసు. నీకు జాబ్ వచ్చేవరకు ఇక్కడే ఉండు. ఏ పని చేయనక్కర్లేదు అంది. లేదక్కా ఉండలేను, వెళిపోతానన్నాను. వెంటనే నేను, మావారు మధు వాళ్ళింటికి వెళ్ళాము. రెండు రోజులు అక్కడే ఉన్నాము. మధు వాళ్ళింటికి వచ్చిన మరుసటి రోజు పొద్దున్నే బాబి వచ్చాడు మా దగ్గరకు. తర్వాత మేము జలజ వదిన వాళ్ళింటికి వెళ్ళాము. మావారికి నాకు ప్రెగ్నెన్సీ అని అనుమానమని చెప్పాను. మావారు ఇండియా వెళ్ళారు 20 రోజులలో వచ్చేస్తానని. నేను జాబ్ వెదుకులాటలో పడ్డాను. రాంకుమార్ వాళ్ళు నన్ను కూడా సెయింట్ లూయీస్ వచ్చేయమంటే మిగతా లగేజ్ అంతా వదిన వాళ్ళింట్లో వదిలేసి, బట్టలు మాత్రం తీసుకుని సెయింట్ లూయీస్ ట్రైన్ లో వెళ్ళాను. చాలా బావుంది ట్రైన్ జర్నీ. అప్పటికే నాకు ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయ్యింది. సబ్ వే లో చేయలేనని చెప్పాను. నేను సెయింట్ లూయీస్ వచ్చిన 4,5 రోజులలోనే మధు వాళ్ళు వచ్చారు. వాళ్ళతో చికాగో వచ్చేసాను. 
       మధు వాళ్ళింట్లో ఉన్నప్పుడే 2, 3 ఇంటర్వ్యూలు ఫోన్లోనే ఎటెండ్ అయ్యాను. జనరల్ గా అమెరికన్స్ ఇంటర్వ్యూ చేస్తే మాగ్జిమమ్ 20 మినిట్స్ ఉంటుంది. మన ఇండియన్స్ మాత్రం మనకు రాదనే వరకు చేసి వారి ఇగో శాటిస్ఫై చేసుకుంటారు. నేను ఎటెండ్ చేసిన కాల్స్ ఒకటి సైన్ ఆన్ మీద. అది నాకు రాదు కాని వేరే ఎవరో ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూ  ఎటెండ్ చేసాను. బానే చెప్పాను కూడా. మరొకటి AS/400 టెస్టింగ్ మీద. ఇంటర్వ్యూ చేసింది అమెరికన్. 45 మినిట్స్ చేసింది. బానే చెప్పాను కాని అంతసేపు చేసేసరికి డౌట్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూ ఎరేంజ్ చేసింది వర్మ గారు. మధ్యలో 4 లేయర్స్. మా ఎంప్లాయర్ తో కలిపి ఐదన్న మాట. 
        సరే మార్కెట్ బాలేదు కదా అని వేరే జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను. మధు, సంధ్య వాళ్ళు కూడా బయట జాబ్స్ ట్రై చేస్తున్నారు. మాల్ లో కళ్ళజోళ్ళు అమ్మే జాబ్ దొరికింది ఒహాయెా, సిన్ సినాటిలో నాకు, ఉషకు కూడా కలిపి. వెళదామని డిసైడ్ అయ్యాము అందరం. నేను, మధు, సంధ్య చికాగో నుండి, ఉష సెయింట్ లూయీస్ నుండి బయలుదేరడానికి రడి అయ్యాము. రేపు బయలుదేరాలనగా ఈరోజు నాకు AS/400 టెస్టింగ్ జాబ్ రోనెక్ సిటీ, వర్జీనియా స్టేట్ లో వచ్చింది. అందరికి పోనూ నాకు అవర్ కి 20 డాలర్స్ వస్తాయి. మళ్ళీ దానిలోనే కంపెనీ టాక్స్ కట్టాలి. అసలు 80 డాలర్స్ బిల్లింగ్ ప్రాజెక్ట్. కాని 3 వీక్స్ ప్రాజెక్ట్ అన్నారు. మా AMSOL సుబ్బరాజు కి చెప్తే ప్రాజెక్ట్ కి వెళ్ళండి. మీకు గ్రీన్కార్డ్ కి లేబర్ ఫైల్ చేస్తాను అన్నారు. 3 వారాలే కదా అని వెళదామని డిసైడ్ అయ్యాను. మధు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఓ 250 డాలర్స్ ఉంటే వాటిలో 150 డాలర్లు వాళ్ళకు  ఇచ్చి నేను రోనెక్ సిటీ కి బయలుదేరాను. 
            రోనెక్ సిటిలో AMSOL రవి ముదునూరు బుక్ చేసిన హోటల్కి వెళ్ళాను. పొద్దున్నే నన్ను అంతకు ముందు ఇంటర్వూ చేసినామెకి కాల్ చేసాను. తను 11 కి వచ్చి పిక్ చేసుకుంటానని చెప్పింది. సరిగ్గా 11 కి మా టెస్టింగ్ మేనేజర్ టీనా ఫీల్డ్స్ ఓ పెద్ద కార్ లో వచ్చి కంపెనీకి తీసుకువెళ్ళింది. కార్ లో తనతో మాట్లాడుతూ నా టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రాజెక్ట్ వివరాలడిగాను. అప్పటికి నాకు మాన్యువల్ టెస్టింగ్ వచ్చు కాని ఆటోమేషన్ టెస్టింగ్ రాదు. ఈ ప్రాజెక్ట్ లో ఏ టెస్టింగ్ వాడుతున్నారని అడిగితే మాన్యువల్ అని చెప్పింది. అప్పుడు హమ్మయ్య అనుకున్నాను. టీనా చాలా చాలా మంచిది. నేను ఈ ప్రాజెక్ట్ కి వచ్చేసరికి దగ్గర దగ్గర 7, 8 నెలల నుండి వర్క్ పెండింగ్ ఉండిపోయింది. మెుదటిరోజు సిస్టమ్ అంతా సెట్ చేయడము, నేను వర్క్ ప్లాన్ చేసుకోవడంతో కాస్త పనే చేయగలిగాను. వంచిన కల ఎత్తకుండా ఓ 10, 12 రోజులు పని చేసి పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంతకీ కంపెనీ పేరు చెప్పలేదు కదా అడ్వాన్స్ ఆటో పార్ట్స్. అమెరికాలో చాలా పెద్ద పేరున్న కంపెనీ. ఈ కంపెనీలో ఇండియన్స్ చాలా తక్కువ మంది. ఓ ఐదారుగురు వచ్చి పరిచయం చేసుకున్నారు. కొసమెరుపేంటంటే తెలుగువారు ఒక్కరూ లేదన్న మాట. తమిళ్, మళయాళీ, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఇలా ఇండియన్స్ ఎవరు వచ్చినా అందరు కలిసి ఒకరింట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారట. నన్నూ అలాగే ఇన్వైట్ చేసారు. 
ఆఫీస్ వర్క్ అయ్యాక ఈవెనింగ్ నన్ను పిక్ చేసుకుని తీసుకువెళ్ళారు. అందరం చక్కగా పలకరించుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసాం. తర్వాత మైల్డ్ లేడీస్ డ్రింక్ వైన్ ఆఫర్ చేసారు. అలవాటు లేదని చెప్తే, ఏం కాదు తాగమవ్నారు. నేను ప్రెగ్నెంట్ అని చెప్తూ, ఏదీ పడదని నా కండిషన్ గురించి చెప్పాను. ఆఫీస్ లో పని చేసే తమిళాయన వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పింది. గెట్ టుగెదర్ బాగా జరిగింది. 
వర్క్ లో పడి తిండి కూడా సరిగా తినేదాన్ని కాదు. ఓ వేళ తిందామన్నా, కనీసం మంచినీళ్ళు కూడా పొట్టలో ఉండేవి కాదు. వామిటింగ్ అయిపోయేవి. ఆకలికి పేగులు మెలితిరిగి పోయేవి. ఆఫీస్ కాంటిన్ లో అప్పుడప్పుడూ తింటూ, మా టెస్టింగ్ టీమ్ కొలీగ్స్ లంచ్ కి బయటకెళుతూ ఏమైనా కావాలా అని అడిగితే మెక్ డోనాల్డ్స్ డాలర్ చికెన్ శాండ్ విచ్ తెమ్మని చెప్పేదాన్ని. అమెరికన్ గ్రాసరిస్టోర్ లో వేయించిన వేరుశనగపప్పు, ఎగ్స్, పాలు, ఏవో కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకునేదాన్ని. ఇంటి దగ్గర నుండి తెచ్చిన వాటిలో నల్లకారం, శనగపప్పు కారం నాతో రోనెక్ తెచ్చుకున్నా. మిగిలినవన్నీ జలజ వదిన వాళ్ళింట్లోనే వదిలేసాను త్రీ వీక్స్ ప్రాజెక్టే కదా అని. అప్పటి వరకు తిండి విలువ తెలియలేదు. రోనెక్ పుణ్యమా అని తిండి విలువ బాగా తెలిసింది. మూడు వారాలే కదా అని హోటల్ లోనే ఉంటానని రవికి చెప్పాను. నా దగ్గర డబ్బులు లేవని కూడా చెప్పాను. 1000 డాలర్స్ అకౌంట్ లో వేశారు. 
ఆఫీస్ లో ఉన్నంతసేపు నా సెల్ సిగ్నల్ వచ్చేది కాదు. చాలా దూరం బయటకు రావాల్సి వచ్చేది బ్రేక్ టైమ్ లో. అందరూ సిగిరెట్లు కాల్చుకుంటుంటే నేను ఫోన్ మాట్లాడుకునేదాన్ని. కాని నా ఫోన్ ప్లాన్ లో డే మినిట్స్ ఎక్కువ ఉండేవి కాదప్పుడు. అందుకని ఆఫీస్ లాండ్ లైన్ అదీ లంచ్ టైమ్ లోనో, ఈవెనింగ్ ఆఫీస్ అవర్స్ అయిపోయాకో వాడేదాన్ని. మధ్య మధ్యలో మరో జాబ్ కోసం ఆఫీస్ లాండ్ లైన్, ఈమెయిల్ వాడాల్సి వచ్చేది రెజ్యూమ్ పంపడానికి.ఈ ప్రాజెక్ట్ ఉండేది మూడు వారాలే కదా అని. ఆఫీస్ కి మార్నింగ్ నడుచుకుంటూ వచ్చేదాన్ని. సాయంత్రం ఎవరో ఒకరు హోటల్ దగ్గర డ్రాప్ చేసేవారు. స్నో బాగా పడినప్పుడు కాబ్ బుక్ చేసుకునేదాన్ని. కాబ్  రానప్పుడు టీనాకి రావడం లేటవుతుందని ఫోన్ చేసి చెప్తే, రావద్దులే రెస్ట్ తీసుకో అని చెప్పేది. మాకు ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. నేను ముందే టీనాకి వివరమంతా చెప్పేసేదాన్ని నేను చేసిన వాటి గురించి. మీటింగ్ లో తను నా గురించి కూడా బాగా మెచ్చుకుంటూ చెప్పేది. అది కొందరికి నచ్చలేదు. మా టెస్టింగ్ టీమ్ లో అందరు అమెరికన్సేనండోయ్. మా గోపాలరావు అన్నయ్య,శిరీష వదిన వాళ్ళు, జలజ వదిన వాళ్ళు, ఉమ, మధు, సంధ్య, ఉష ఇలా అందరు ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేవారు. అలా మూడు వారాలు గడిచిపోయాయి. 

    " కాలమెప్పుడూ ఒకేలా ఉండదు. జీవితాన్ని సమన్వయం చేయడానికి మంచి చెడులను మనకు రుచి చూపిస్తూ బతుకు విలువ, మనిషి ఆసరా గురించి తెలియజెప్తుంది. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

12, మార్చి 2021, శుక్రవారం

చితికిన బతుకులు..!!

ఇనుప పాదాల కింద పడి
నలిగిన మనసులు 
స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని
శత విధాలా ప్రయత్నిస్తున్నాయి 

శూన్యంలో  ఏమి లేదనుకుంటూనే
ఎందుకనో ఆ చుట్టరికాన్నే
ఇష్టపడటం మెుదలైన క్షణాలను
వదల్లేని స్థితిలో ఉండిపోతున్నాయి

జీవం లేని నవ్వులు 
పెదవులపై కనిపిస్తూనే ఉన్నా
రెప్పల మాటున దాగిన వేదనలు
ఉప్పెన కెరటాలై ఉవ్వెత్తున ఎగసి పడుతూనే ఉన్నాయి

నియంత్రించలేని నిట్టూర్పులను
రంగులు వెలసిన ముఖాలను భరించనలవికాక వెలుతురు నక్షత్రాలను చూడొద్దనుకుంటూ
చీకటి సంతకానికి సన్నద్ధమయ్యాయి..!!
 

8, మార్చి 2021, సోమవారం

కాలం వెంబడి కలం..44

         మెుదటిసారి చికాగోలో ఉన్నప్పుడు మా కిరణ్ ఫ్రెండ్ అశ్విన్ ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఎయిర్ పోర్ట్ లో వాడు అమెరికాలో MS చేయడానికి వచ్చేటప్పుడు చాలా మంది ఏడవడం చూసి అక్క ఎలా వెళ్ళిందో అనుకున్నాడట. ఆ మాటే చెప్పి నీకు చాలా ధైర్యమక్కా అని అంటూ, అప్పుడప్పుడూ మాట్లాడుతుండేవాడు. అశ్విన్ కిరణ్ కి అమెరికాలో MS చేయడానికి హెల్ప్ చేసాడు ప్రాసెసింగ్, యూనివర్శిటీ సెలక్షన్ వగైరాలలో. నేను రామస్వామి గారి దగ్గరకు వచ్చేసరికి కిరణ్ కి ఓ సెమిస్టర్ అయ్యింది. హాలిడేస్ లో ఎక్కడో మెాటల్ లో క్లీనింగ్ జాబ్ లో చేరాడు. అమెరికాలో మన ఇండియన్ స్టూడెంట్స్ ఫ్రీ టైమ్ లో ఇలా జాబ్ లు చేసుకోవడం మామూలే. 
             ఇక నా విషయానికి వస్తే..రామస్వామి గారు ఇండియన్ గ్రాసరిస్టోర్, చైనీస్ ఇండియన్ రెస్టారెంట్ కాకుండా బిగ్ ఆపిల్ బేగిల్స్ అని అమెరికన్ ఫుడ్ స్టోర్ ఓ నార్త్ ఇండియన్ దగ్గర కొన్నారు. దానిలో అంతకు ముందు వర్క్ చేసేవాళ్ళే ఉన్నారు. ప్రకాష్ అన్నాయన త్వరలో మానేస్తానన్నాడట. ఇండియన్ రెస్టారెంట్లో వెంకటేశ్వరరావు, శేషయ్య ఆంధ్రావాళ్ళు,  విక్రమ్ అనే నార్త్ ఇండియన్ ఉండేవారు. బేగిల్స్ షాప్ పొద్దున 6 నుండి మధ్యాహ్నం 2 వరకు ఉండేది. నేను, నాతోపాటు వినోద్ అని తను ఇంజనీరింగ్ చేసి H1B వీసాతో వచ్చినవాడే. సాఫ్ట్ వేర్ జాబ్స్ రెసిషన్ లో ఈ జాబ్ చేయక తప్పలేదు తనకి కూడా. ఇలా చాలామంది ఈ విధమైన చాలా రకాల జాబ్స్ చేస్తున్నవాళ్ళే. వినోద్ వెంకటేశ్వరరావు తోడల్లుడు. ప్రకాష్, శేషయ్య, వెంకటేశ్వరరావు, శరత్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్. నాకసలు అమెరికన్ ఫుడ్ గురించి ఏమీ తెలియదు. ప్రకాష్ 6 నుండి 9 వరకు ఉండేవారనుకుంటా. ప్రకాష్ నాకు వర్క్ ఏం నేర్పించేవారు కాదు, నేను వినోద్ కి పోటి వస్తాననేమెా. కాష్ కౌంటర్ దగ్గర ఉండేదాన్ని. ప్రకాష్ నా మీద సెటైర్లు వేసేవారు. కాష్ కౌంటర్ దగ్గర వుంటే వర్క్ రాదని. నేర్పించనప్పుడు వస్తే, రాకపోతే నీకెందుకులే అని మనసులో అనుకుని ఊరుకునేదాన్ని. నాకేం రాదని మళ్ళీ అందరికి చెప్పేవాడు. మెక్సికన్ అమ్మాయి, వాళ్ళ అన్నయ్య మాతోపాటుగా వర్క్ చేసేవాళ్ళు. ఆ అమ్మాయి దగ్గర వర్క్ నేర్చుకునేదాన్ని. తను ప్రెగ్నెంట్ అప్పుడు. కొన్ని రోజులలో వర్క్ మానేస్తుంది. వాళ్ళ అన్నయ్య బేగిల్స్ చేసి, బేక్ చేసి మార్నింగ్ కొన్ని ఆర్డర్స్ ఇవ్వాల్సినవి ఇచ్చేసి వెళిపోతాడు. సిట్టింగ్, టేక్ అవుట్ ఆర్డర్స్ మిగతా వాళ్ళందం చూసుకోవాలి. 10, 12 రకాల బేగిల్స్, 7, 8 రకాల చీజ్ లు చేసి ఆర్డర్ ప్రకారం ఎవరికి కావాల్సింది వారికి ఇవ్వాలి. షాప్ క్లోజ్ చేసేటప్పుడు మిగిలిన బేగిల్స్ డస్ట్బిన్ లో పడేసి, షాప్ క్లీన్ చేసి, కౌంటర్ క్లోజ్ చేయాలి. ఇది బేగిల్స్ షాప్ లో పని. 
         ఓ వారం అయ్యాక ప్రకాష్ మానేసాడు. వినోద్, నేను, మెక్సికన్ అమ్మాయి చూసుకునేవారం. వినోద్, నేను క్లోజింగ్ వరకు ఉండేవారం. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు కూడా లిమిటెడ్ అవర్స్ చేసి వెళిపోయేవారు. నాకు వర్క్ రాదని ప్రకాష్ చెప్పడంతో, రామస్వామి గారు పొద్దున్నే నన్ను షాప్ లో డ్రాప్ చేసి కాసేపు నేను కష్టమర్స్ తో ఎలా డీల్ చేస్తున్నానో చూసేవారు. మధ్యాహ్నం బేగిల్స్ లో వర్క్ అయ్యాక, భారత్ మేళా ఇండియన్ గ్రాసరిస్టోర్ లో సాయంత్రం వరకు ఉండేదాన్ని. తర్వాత సాయంత్రం చైనీస్ ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళేదాన్ని. ఇలా రోజు పొద్దున్నే 6 నుండి నైట్ 9 వరకు వీక్ డేస్ లో, వీకెండ్స్ 11, 12 వరకు వర్క్ ఉండేది. 
           AMSOL కంపెనీ H1B పేపర్స్ వచ్చాయి. మా వారికి వీసా పేపర్స్ పంపాలంటే ఏం కావాలని AMSOL లో వీసా పేపర్స్ వర్క్ చూసే బాల ఇటికిరాలను అడిగితే మీ H1B వీసా పేపర్స్ తో కంపెనీ నుండి ఓ లెటర్ చాలండి, బాంక్ స్టేట్మెంట్స్, మీ పే చెక్స్, మారేజ్ సర్టిఫికేట్, పెళ్ళి ఫోటోలు కొన్ని పంపండి, సరిపోతాయి అన్నారు. రామస్వామి గారు ఎకౌంట్ లో డబ్బులు వేస్తే శరత్ గారు బాంక్ స్టేట్మెంట్ తీసుకోవడంలో హెల్ప్ చేసారు. మా పెళ్ళి సంతకాల  పెళ్ళిలా జరిగింది. ఆ ఫోటోలు, పేపర్స్ అన్నీ తీసుకుని మా వారు వీసా స్టాంపిగ్ కి వెళితే, ఎంగేజ్మెంట్ ఫోటోలు కాదు, పెళ్ళి ఫోటోలు తీసుకురండి అన్నారట. అది సంగతి. 
             గోవర్ధన్ ఇండియా వెళుతున్నానంటే నా కొడుకుని చూసిరా అని చెప్పాను. ఓరోజు ఫోన్ చేసి అర్జంట్ గా ఫోన్ చేయమన్నాడు. వెంటనే ఫోన్ చేసా ఏమయ్యిందోనని. నీ కొడుకు నాలుగు మెట్ల మీద నుండి కాదు పడింది. మీ డాబా పోర్టికో పైనుండి దూకేసాడు. అమ్మావాళ్ళు చూపించారు ఎక్కడ నుండి దూకాడో. అది చూసాకా నాకు ఇప్పటికి వణుకు తగ్గలేదు అని చెప్పాడు. అప్పటికి వాడికి సరిగ్గా 2వ పుట్టినరోజు అయ్యి 2 నెలలు. విషయం తెలిసాక వెంటనే ఇండియా వెళిపోవాలనిపించింది. కాని అన్ని మనకనుకూలంగా ఉండవు కదా. ఈయనకు వీసా క్వరీ పెళ్ళి ఫోటోలు కావాలని పడింది కదా. నాకేమెా ఊపిరి సలపని పని. దానికి తోడు రామస్వామి గారు డ్రైవింగ్ నేర్చుకోమనడం. కాస్త విసుక్కోవడం మెుదలైంది. రోజూ నన్ను డ్రాప్ చేయాలి కదా అందుకు. అప్పుడప్పుడూ విక్రమ్ కాస్త నేర్పేవాడు ఇంటికి వచ్చేటప్పుడు. విక్రమ్ పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదు. నాతో మాట్లాడతాడని దానికి కూడా జోకులు వేస్తుండేవారు శేషయ్య, రామస్వామి బాచ్.  
        మధు, సంధ్య అని ఓ ఫామిలి పరిచయం అయ్యారు. మధు రామస్వామి గారికి బేగిల్స్ అమ్మిన నార్త్ ఇండియన్ మరో షాప్ లో చేసేవాడు. సంధ్యను కూడా ఇండియన్ గ్రాసరిస్టోర్ లో పెడదామని రామస్వామి గారి ఆలోచన. అలా నాకు పరిచయమై బాగా దగ్గరయ్యారు. బాబీ, రీనా వాళ్ళు మాధవి అక్కకు చుట్టాలు. విజయ్ బాబీ రూమ్మేట్స్. బాబీ, విజయ్ కూడా రెస్టారెంట్ కి వచ్చేవాళ్ళు. రామస్వామి గారి ఇంట్లో బేస్మెంట్ లో కంప్యూటర్ ఉండేది. వీళ్ళకు తెలిసిన అబ్బాయి అక్కడ ఉండేవాడు. కొన్ని రోజులకు వాళ్ళ చెల్లి MS చేయడానికి వచ్చింది. కొన్ని రోజులుండి ఆ అమ్మాయి వెళిపోయింది. నేను ఈమెయిల్స్ చెక్ చేసుకోవడానికి టైమ్ కుదిరినప్పుడు బేస్మెంట్ లో చూసుకునేదాన్ని. మాధవి అక్క కూతురు వందన నాలుగో, ఐదో చదువుతుండేది అప్పుడు. రకరకాల జడలు వేసుకుంటూ ఉండేది. కుక్కీస్ వెరైటీస్ చేస్తూ ఉండేది. అప్పుడప్పుడూ బేగిల్స్ షాప్ లో నాకూడా ఉండేది తన స్కూల్ అయ్యాక బోర్ కొడితే. మా ఆయన చుట్టాలు జలజ వదిన వాళ్ళాయన బాబన్నయ్య అమెరికన్ సిటిజన్. అన్నయ్య నన్ను కలవడానికి నా వర్క్ అయ్యే టైమ్ లో వచ్చేవారు. చాలా మంచివారు అన్నయ్య. నేను ఇండియా వెళదామనుకుంటున్నానని అన్నయ్యకు చెప్తే వెంటనే నాకు డబ్బులు అకౌంట్ లో వేసారు. జలజ వదిన అప్పుడు ఇండియాలోనే ఉంది. 
          నేను ఇండియా వెళతానని మాధవి అక్కకు కూడా చెప్పాను. అప్పటికి నేను అమెరికా వచ్చి సంవత్సరం నర్ర అయ్యింది. మౌర్య మూడో పుట్టినరోజుకి ఇండియా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా. పిల్లాడికి మాజిక్ స్లేట్, కొన్ని బొమ్మలు మాధవి అక్క కొనిపెట్టింది. నా క్లాస్మేట్ శేఖర్ బాబు ఉండేది చికాగోలోనే. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడేవాడు. కాలేజ్ లో మేమిద్దరం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఇండియా వెళుతున్నానంటే తను వచ్చి దీవాన్ స్ట్రీట్ కి తీసుకువెళ్ళాడు.అక్కడ ముత్యాలు, పచ్చలు తనకు తెలిసిన షాప్లో తీసుకున్నా. నా చిన్నప్పటి ఫ్రెండ్ రాధ తమ్ముడు రాము కూడా అమెరికా వచ్చాడు నా తర్వాత. పిట్స్ బర్గ్ లో ఉన్నప్పటి నుండి మాట్లాడేవాడు. మా సీనియర్ రాంకుమార్ కూడా నేను పిట్స్ బర్గ్ లో ఉన్నప్పుడు అమెరికా వచ్చారు. రవీంద్ర ప్రసాద్ గారు రాంకుమార్ ని ఎయిర్ పోర్ట్ లో పిక్ చేసుకుని అక్కడే నాతో మాట్లాడించారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో మా సీనియర్లు వీళ్ళు. రవీంద్ర ప్రసాద్ గారు బాగా కేర్ తీసుకునే వారు కాలేజ్ లో. రాంకుమార్ నన్ను కలవడానికి చికాగో వచ్చివెళ్ళారు. బాబీ నాకు షాపింగ్ లో చాలా హెల్ప్ చేసాడు. పిల్లలకు చాక్లెట్స్, బట్టలు, గిఫ్ట్ బొమ్మలు, ఓ కామ్ కాడర్ మాత్రం తీసుకున్నాను. 
             డబ్బులు కావాలని రామస్వామి గారిని అడిగితే అప్పటి వరకు ఏం లెక్కలు చూసారో నాకు తెలియదు. నేను ఇవ్వాల్సిన డబ్బులు మినాయించుకుని ఓ లక్ష ఇండియాలో తీసుకోమన్నారు. సరేనని ఇండియా బయలుదేరా. ఎయిర్ పోర్ట్ లో బాబీ దించాడు. దుబాయ్ మీదుగా మద్రాస్ వచ్చాను. రోజుకి 18, 20 గంటల పని చేసానేమెా ఫ్లైట్ లో ఒకటే నిద్ర. ఎయిర్ హోస్టెస్ నిద్ర లేపి తినడానికి ఇచ్చేది. మా మామయ్య, మావారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. హోటల్ రూమ్ కి రాజగోపాల్, వాళ్ళ కాబోయే ఆవిడ, మా కిరణ్ చేసుకుందామనుకున్న అమ్మాయి వచ్చారు. కాసేపు వాళ్ళతో మాట్లాడి, మధ్యాహ్నం రెండింటికి పినాకినిలో విజయవాడ బయలుదేరాం. 

"   పని ఏదైనా సరే మనకు రానిది నేర్చుకోవడంలో తప్పులేదు. కాని మనం ఏ పని చేయకుండా ఎదుటివారి పనిలో లోపాలు వెదకడం మన నికృష్టపు బుద్ధిని బయటేసుకోవడం అవుతుంది. "


వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

1, మార్చి 2021, సోమవారం

రెక్కలు

1.   ఎన్నో
సర్దుబాట్లు 
మరెన్నో
సంవేదనలు

పంచుకున్నది మనసని
తెలుపుతున్నది అక్షరం...!!

2.  ఎడతెగని
ఆలోచనలు
ఎటూ కాదనుకోలేని
అనుబంధాలు

మనసో
మౌన ముని..!!

3.   తడబడేవి
అడుగులయినా
తత్తర పడనిది
మనసు

ఆత్మస్థైర్యం 
పెట్టని ఆభరణం...!!

4.   కాలంతో 
కలిసి నడవాలి
చరిత్రలో
మనకో పేజి ఉండాలి

జీవిత కావ్యం
వేవేల వర్ణాల మయం..!! 

5.   కాలానికి
కదిలిపోడం అలవాటు
కన్నీటికి
జారిపోవడం తెలుసు

అక్షరానికి
ఆత్మ నివేదన ఎరుకే..!!

6.   చెదపురుగుల దాడి
నివాసాలపై
సాహితీ ఆవాసాలపైనా 
చీడల క్రీనీడలే

మనసులను తొలిచే క్రిములను 
మందులు తొలగించలేవు..!!

7.   ముగింపు 
మన చేతిలో లేదు
ఆట మెుదలెట్టడం వరకే
మన పని

ఆడించడమంతా
ఆ పైవాడి చతురత..!!

8.   అనుబంధాలను
వదులుకోలేని నిస్సహాయత
బాధ్యతలను 
మరువలేని బేలతనము

పండ్లున్న చెట్టుకే
రాళ్ళ దెబ్బలు...!!

9.   మనసు 
గురుతులు
మనిషితనపు
ఆనవాళ్ళు

ముద్రించిన
జీవితపు చిహ్నాలు...!!

10.   అక్షరాల
అమరిక
భావాల
పరకాయ ప్రవేశం

ప్రసవ వేదనే
జననానికి...!!

11.   ఉప్పెనా
నీరే
కన్నీరు
ఉప్పనే

ఏదోక రకంగా
జీవితానికి ఉప్పదనం తప్పదు..!!

12.   పాతదనాన్ని
వద్దంటున్నాం
కొత్తదనాన్ని
ఆహ్వానిస్తున్నాం

మార్పులు చేర్పులు
అవసరమే జీవితానికి...!!

13.  పయనం
తప్పదు
శబ్దాలను నిశ్శబ్దాలను
మెాసుకుంటూ

అక్షరబద్దం చేయగలిగే నేర్పు 
కొందరికే సొంతం...!!

14.  గతం
బాధిస్తేనేం
గమనం
తెలుపుతుంది

గమ్యం 
అక్షర నీరాజనం అందుకుంటుంది...!!

15.   వసి వాడని
జ్ఞాపకమది
ఓ క్షణమైనా 
మరుపు రాదు

మానస సంచారమే 
అనునిత్యం ఆటవిడుపుగా...!!

16.  కంట నీరు
ఒలుకుతూనే ఉంది
గుండెకలవి కాని
గాయాలతో

సముద్రమింకని
నిజం తనలో దాగినందుకు..!!

17.   అలసట 
శరీరానికి
ఆలోచన
మనసుకి

సమన్వయంతో సాంత్వన
అక్షరాలతో...!!

18.   అక్షరాలు 
కావివి
మనసు
గాయాలు

కలం
విదిల్చిన కాలం...!!

19.   మస్తిష్కం
ఆలోచన మానదు
మస్తకం
మాట వినదు

అక్షరం
గాయానికి లేపనం...!!

20.   గాయం
పాతదే
మనసు
మర్చిపోలేదు

భరించడం
అలవాటు చేసుకోవాలంతే...!!

21.   అక్షరం
అలవాటైన స్నేహం
భావం
మనసుకి చేరికైనది

భాష 
మనిషి వ్యక్తిత్వం...!!

22.    మనసు
చూపించలేనిది
అద్దంలో
ప్రతిబింబం

నిజం
జీవితం...!!

23.   వెలుతురు 
అనివార్యం
చీకటి
చుట్టమైనా

నిమిత్తమాత్రుడు
కర్మసాక్షి..!!

24.   అద్దంలో
ప్రతిబింబం
అందమెా
అనాకారితనమెా

బిడ్డ
అమ్మకెపుడూ అందాలరేడే..!!

25.  రక్షణ 
వలయాలు
ఛేదన
ఆగదు

ఏ తనమయినా
తలవంచక తప్పదు...!!

26.   ఏ ఆటైనా
ఆడాలంటే
కాలం కర్మం
కలిసి రావాలి

బాగా ఆడటం వచ్చని
మనం అనుకుంటే సరిపోదు...!!

27.   అలికిడి 
చేయదు
వినికిడి
తెలియదు

మనసంతా
మరో శబ్దమే మరి..!!

28.   ఎడద
పంచింది
ఈ జన్మకు 
తోడుండమంటూ

ఎండమావిని
అప్పగించింది కాలం..!!

29.   ప్రదర్శించాల్సింది
మన పాడింత్యాన్ని కాదు
నలుగురి మనసులను 
కదిలించడంలో 

ప్రతిభ 
కృతకృత్యమయ్యేదప్పుడే.. !!

30.   మనసు
భారాన్ని ఒంపేస్తూ
మనిషి
బాధ్యతను గుర్తుజేస్తూ 

మార్పు
సహజమన్న ఆశ..!!






ఏక్ తారలు...!!

1.  నెమలీకలు దాచుకున్న జ్ఞాపకమిది_చెలిమి గతమైనా ఘనమైనదేనంటూ...!!
2.  కాలంతోనే కలిసుంటాను ఎప్పటికీ_ఓ కొలిక్కి రాని జీవనకావ్యాన్నైనా...!!
3.  ఆశావాదం తనదని అర్థం చేసుకో నెచ్చెలీ_మార్పుకి ఓ అవకాశం ఇస్తున్నట్టుగా...!!
4.   ఎగసిపడుతున్న అంతరంగం_తీరాన్ని తాకలేని అలలా...!!
5.  మనసుని ఖాళీ  చేద్దామనుకుంటున్నా_మని'షిగా బతకాలని..!!
6.  చెప్పు'కో చరిత్ర_గతంగానో, భవితగానో...!!
7.   మాటకో రత్నం_రాలిపడుతూనో, రాక్షసానందం పొందుతూనో...!!
8.  వీధి వీధికో చిల్లరగోల_దద్దరిల్లుతున్న అభివృద్ధంట...!!
9.  విరచించటం విధాత పని_తెలిసో తెలియకో పరుగుల ఆరాటం మనిషిదై...!!
10.   తప్పించుకోలేని గాయాలవి_విరించి విసుగుతో రాసిన రాతలైనప్పుడు..!!
11.   అల్లరి చేస్తేనేం_మనసు వాకిలి తెరుచుని పక్కున నవ్వేస్తుంటే..!!
12.  నటనలో జీవించడం కొత్తేమి కాదుగా_మని'షిగా పుట్టింది మెుదలు...!!
13.  వెంటాడుతునే ఉంటుంది బంధం_పాశం పలకరించక మౌనం వహించినా...!!
14.   తెరచాటు బతుకులేగా అన్నీ_చితికిన మనసులను మరింతగా చిదిమేస్తూ...!!
15.  బతకడానికెన్ని రంగులు పులమాలో_నిజాలను అబద్ధాలుగా మార్చుతూ...!!
16.  తలుపు వేసినంత సుళువు కాదు_తలపులకు తావీయకుండా ఉండటం...!!
17.  అప్పుడప్పుడూ తడబాటు తప్పదు_తట్టుకుని నిలబడి గెలవడమే...!!
18.   ఛాయ చెదిరిపోనంటోంది_వెన్నుదన్నుగా వెన్నంటే నడుస్తూ..!!
19.   గతాన్ని మరిచిపోనివ్విలా_అక్షరాలకు గమనాన్ని అప్పజెప్పేస్తూ...!!
20.   చరిత్రలో చరితగా నిలిచి పొమ్మంటోంది అక్షరం_ఊపిరై తానుండి పోతానంటూ..!!
21.   సర్వం తెలిసిన సత్యాక్షరమది_ఏ కాలాన్నైనా జీవంతో నింపగలిగే నేర్పుతో...!! 
22.  మనసు బంధమై అల్లుకున్నా_భావమై మిగిలిపోకున్నా...!!
23.   నిదురమ్మ ఒడిలో ప్రశాంతమే_చీకటి చిక్కుముడులెన్ని విప్పలేకున్నా..!!
24.   పాదముద్రలు పడుతూనే ఉన్నాయి_అనుభవాల లోతును చూడమంటూ...!!
25.   భారమంతా భరించేది అక్షరాలే_మనసును తేలిక చేస్తూ...!!
26.   సంద్రమెప్పుడూ నిండుకుండే_ఎన్ని బడబాగ్నులు తనలో దాగున్నా...!!
27.   మౌనం మాట్లాడటమంటే ఇదే కాబోలు_గుండె గదులను అక్షరాలతో నింపేస్తూ...!!
28.   అక్షరాలకూ అనుభవమైంది_భావాల భారాన్ని భరించడమెలాగో..!!
29.   మలుపులు అలవాటైన బతుకులు మనవి_మాటల అవసరాన్ని గుర్తుజేస్తూ...!!
30.  గుచ్చుకున్న గునపాలు లెక్కెడుతున్నా_అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుంటూ...!!

కాలం వెంబడి కలం..43

             అనోన్య స్కూల్ లో నోటీస్ బోర్డ్ మీద ఓ స్లోగన్ రాసుండేది. అది నాకు బాగా నచ్చింది కూడా... 
" No one can do everything 
   But Every men can do something "...నిజమే కదా  ఇది. 

         రోజులు గడిచిపోతున్నాయి మామూలుగానే. నాకు పిల్లల పని, అప్పుడప్పుడు వంట, ఫోన్లు ఇలా జరిగిపోతోంది. డాక్టర్ గారు మూడ్ బావుంటే బానే ఉండేవారు, లేదంటే అప్పుడప్పుడూ ఏదోకటి అనేవారు. నా టైమ్ బాలేదులే అని సరిపెట్టుకునేదాన్ని.  ఓ రోజు డాక్టర్ గారికి వాళ్ళాయన ఫోన్ చేస్తే, ఆవిడ తీయలేదు. అందుకని ఇంటికి చేసారు. నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఆ సాయంత్రం డాక్టర్ గారు నన్ను ఫోన్ ఎక్కువ వాడవద్దని చెప్పారు. నాకు వేరే ఫోన్ లేదు. ఆరోజు చాలా బాధనిపించింది. నాకేదయినా బాధనిపిస్తే పుస్తకంలో రాసుకునేదాన్ని అప్పుడు. పెళ్ళైనప్పటి నుండి ఇలా ఎవరితో ఒకరితో మాటలు పడాల్సి వస్తోందని దిగులు వేసింది. నాకంటూ ఏమి లేకపోబట్టే కదా ఇలా జరుగుతోందనిపించింది. ఇలా బాధ పడిన క్షణాలెన్నో. ఉమకి విషయం చెప్పాను. నాకు చెప్పకుండానే ఉమ సెల్ ఫోన్ బుక్ చేసింది. అది వచ్చే ముందు చెప్పింది.  మెుత్తానికి నా మెుదటి సెల్ ఫోన్ రావడమూ, దానిని యాక్టివేట్ చేయడమూ జరిగిపోయింది. స్ప్రింట్ నెట్ వర్క్ అన్నమాట. అప్పటి నుండి అమెరికా వదలి వచ్చే వరకు అదే నెట్ వర్క్ వాడాను. 
       నా H1B పేపర్స్ అమెరికన్ సొల్యూషన్స్ ఫైల్ చేయడము, LIN నెంబర్ రావడమూ జరిగింది. ఓ రోజు సుబ్బరాజు ఇందుకూరి కాల్ చేసి త్రీవీక్స్ జాబ్ ఉంది. వెంటనే జాయిన్ కావాలి వెళతారా అన్నారు. మరి డాక్టర్ గారు నేను సడన్ గా వెళిపోతే ఇబ్బంది పడతారు కదా, అదీనూ 3 వారాలే అంటున్నారు, మీ ఇష్టం వెళ్ళమంటే వెళతాను అన్నాను. ఏ విషయం మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు. ఇదంతా డాక్టర్ గారు ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది. మరుసటి రోజు సుబ్బరాజు ఫోన్ చేసి మరేదైనా జాబ్ చూద్దాంలెండి అన్నారు. అప్పటి నుండి డాక్టర్ గారు బావుండేవారు నాతో. నాకు ఫోటోలు తీయడం, అందరివి కలక్ట్ చేయడం బాగా ఇష్టం చిన్నప్పటి నుండి. అమెరికా వచ్చాక కెమేరా కొనలేదు. పిట్స్ బర్గ్ వచ్చాక 10 డాలర్లకు కెమేరా షాప్ లో చూసి, అది కొన్నాను. దానితో నాకు వచ్చినట్టు ఫోటోలు తీసేదాన్ని. 
            మధ్యలో క్రిస్మస్ కి హాలిడేస్ వచ్చాయి. డాక్టర్ గారి హజ్బెండ్ పిట్స్ బర్గ్ వస్తానన్నారు. డాక్టర్ గారికి కూడా శలవలే. బాల్టిమెార్ లో ఉండే శిరీష వాళ్ళు డెల్లాస్ వెళిపోయారు. తనేమెా వాళ్ళింటికి రమ్మని, నా ఫ్రెండ్ వెంకట రమణ కాలిఫోర్నియా రమ్మంటే, డాక్టర్ గారు వెళ్ళిరా ఓ 4, 5 రోజులు, నేను చూసుకుంటాను పిల్లలని, ప్రసాద్ కూడా వస్తారు కదా  అన్నారు. సరేనని రానుపోనూ ఫ్లైట్ టికెట్ రమణతో బుక్ చేయించుకున్నా నా డబ్బులతోనే. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ కి. మెర్సీ గారి హజ్బెండ్ నన్ను ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేస్తూ, పాస్ పోర్ట్ బయటకు తీయకండి, స్టేటస్ ఇబ్బంది అవుతుందేమెా, డ్రైవర్ లైసెన్స్ ఇవ్వండి ఐడి ప్రూఫ్ కి అంటే లైసెన్స్ లేదండి, స్టేట్ ఐడి ఉంది అంటే, అది చూపించండి చాలు అన్నారు. మెుత్తానికి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో దిగాను. లగేజ్ తీసుకుంటుంటే వెంకట రమణ ఫోన్, ఎక్కడ ఉన్నావని, నన్ను చూడలేదు కదా గుర్తు పట్టడానికి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నా ఫ్రెండ్ శోభ, అబ్బు కూడా కాలిఫోర్నియాలోనే ఉన్నారు. వాళ్ళకు ఫోన్ చేసాను. అబ్బు వాళ్ళ అన్నయ్య వాళ్ళింట్లో ఉంటున్నాడు. రమణ వాళ్ళింటికి దగ్గరలోనే. ఓ రోజు భోజనానికి కూడా వెళ్ళాం. శోభ వచ్చి వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. బోలెడు మా కాలేజ్  కబుర్లు చెప్పుకుని, హైదరాబాదులోని శ్రీదేవికి ఫోన్ చేసాము. ఇద్దరం మాట్లాడుతుంటే తనకి నేను అమెరికాలోనే ఉన్నానా అని డౌట్. నువ్వు కూడా అమెరికా వెళ్ళావా అంది. ఏం వెళ్ళలేననుకున్నావా అన్నాను. అలా కాసేపు తనని ఏడిపించాం. నన్ను షాప్ కి తీసుకువెళ్ళి, నా ఫోటోల పిచ్చి తెలుసు కనుక, నాకు ఓ ఆల్బం కొనిపెట్టి, మళ్ళీ రమణ వాళ్ళింట్లో వదిలేసింది. వాళ్ళు ముగ్గురు రూమ్మేట్స్. ఇద్జరు తెలుగు, మరొకరు కన్నడ. నాకు కన్నడ వచ్చుగా, చాలా రోజుల తర్వాత కన్నడ మాట్లాడాను ఈ రూపంగా. మెుత్తానికి పుస్తకాల్లో చదివిన గోల్డెన్ గేట్ చూడటం ఓ థ్రిల్. పోర్ట్ కూడా చూసాను. వెస్ట్ సముద్రం వర్షంలో చూడటమెా మంచి అనుభూతి. మెుత్తానికి కాలిఫోర్నియా ట్రిప్ బాగా జరిగింది నా కెమేరాతో ఫోటోలు తీసుకోవడంతో సహా. 
         అలా ఓ ఆరు నెలలు పిట్స్ బర్గ్ లో గడిచిపోయాయి. ఆ టైమ్ లోనే ఓ అమెరికన్ లాయర్ తో చికాగో బాబ్ గురించి మాట్లాడాను. బాబ్ కి మెయిల్ కూడా పెట్టాను. నాకు బాకీ ఏది ఉంచుకోవడం ఇష్టం ఉండదు. కుక్కకయినా జాబ్ వస్తుంది, నాకు రాదన్నాడు కదా, డాలర్ కూడా ఇవ్వనన్నాడు. అది గుర్తు చేస్తూ, అవును కుక్కకి వస్తుంది, నాకు వస్తుంది జాబ్. కాని నీకు రాదు అని వాడికి మెయిల్ పెట్టాను. వినయ్ గుమ్మడి గారు ఫోన్ చేసి HNC బాబ్ మీద కేస్ ఫైల్ చేద్దామన్నారు. అనవసరమండి అంటే కాదు ఇద్దరం కలిపి వేద్దామన్నారు. 1500 డాలర్లు పంపండి, నేను తర్వాత ఇస్తాను లెక్కలు చూసి అన్నారు. సరేనని పంపించాను. లాయర్ బాబ్ కి నోటీస్ పంపాడు. లాయర్ తో కపుల్ ఆఫ్ డాలర్స్ ఇస్తాను సరి చేయమన్నాడట. నవ్వుకున్నా.. నాకు రావాల్సినవి ఇమ్మనండి చాలన్నాను. మన లాయర్సే కాదు అక్కడి లాయర్స్ కూడా అంతే. వినయ్ గారు కొన్ని రోజులు ఫాలోఅప్ చేసి, లాయర్ కి తలో 2, 3 వేల డాలర్లు సమర్పించి, బాబ్ మాకు ఇవ్వాల్సిన వాటికి ఇవి మేం కట్టిన వడ్డీ అని సరిపెట్టేసుకుని ఓ దణ్ణం పెట్టి వదిలేసా వినయ్ గారు పట్టించుకోకపోతే. తర్వాత నా పుట్టినరోజుకి డాక్టర్ గారు పట్టుచీర ఇచ్చి, కేక్ కట్ చేయించారు. మెర్సీ గారు కూడా వచ్చారు. 
         ఇంతలో నాకు H1B కి డబ్బులు కట్టిన రామస్వామి యనమదల గారికి మనుషులు కావాల్సివచ్చారు. ఇంటికి ఫోన్ చేసినప్పుడు మా ఆయన చికాగో రామస్వామి గారి దగ్గరకు వెళ్ళు, అన్ని వాళ్ళు చూసుకుంటారని చెప్పాడు. రామస్వామి గారికి ఫోన్ చేసి మాట్లాడితే చికాగో వచ్చేయమన్నారు. ఓ వారం, పది రోజులు టైమ్ కావాలని చెప్పాను. డాక్టర్ గారికి మరో మనిషి దొరికి ఆమెకు పిల్లలను, పనిని అలవాటు చేసి, చికాగో బయలుదేరాను. అనోన్య బాగా ఏడిచింది, నాకూ బాధనిపించింది. నేను వెళిపోతున్నానని డాక్టర్ గారి ఫ్రెండ్ మెర్సీ వాళ్ళు వచ్చి నాకో 25 డాలర్లు కూడా ఇచ్చారు. అభీని స్కూల్లో దించేటప్పుడు నాకో అమెరికన్ మంచి ఫ్రెండ్ అయ్యిందని చెప్పాను కదా. తను ఓసారి ఇంటికి కూడా వచ్చింది, నన్ను డ్రాప్ చేయడానికి. చికాగో వెళడానికి బస్ టికెట్ తీసుకున్నా. నన్ను డ్రాప్ చేయడానికి అమెరికన్ ఫ్రెండ్ వస్తానంది. తనకి నేను కొన్న కెమేరా ఇచ్చేసాను అప్పటికే. తను వాళ్ళింటికి తీసుకువెళ్ళి డిన్నర్ పెట్టి, బస్ స్టేషన్ లో బస్ ఎక్కించి, జాగ్రత్తలు చెప్పి,గిఫ్ట్ ఇచ్చింది. అది 35 డాలర్స్ గిఫ్ట్ కార్డ్. వద్దంటే వినలేదు. అలా మరోసారి చికాగో బయలుదేరాను బస్ లో.

      పొద్దున్నే బస్ చికాగో మెయిన్ బస్ స్టేషన్ లో ఆగింది. నేను దిగాల్సింది అరోరా బస్ స్టేషన్లో. సెంట్రల్ స్టేషన్ లో బస్ క్లీనింగ్ కోసం ఆపారు. నేను కిందకి దిగి కాస్త అవతలగా కూర్చున్నాను. బయలుదేరేటప్పుడు ఎనౌన్స్ చేస్తారు కదా అని. నన్ను అరోరాలో రిసీవ్ చేసుకోవడానికి శరత్ గారు వస్తారని, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేసి ఇక్కడ బస్ ఆపారని చెప్పాను. తర్వాత చూస్తే బస్ లేదు. కంగారేసి ఎంక్వైరీలో అడిగితే బస్ వెళిపోయిందని చెప్పారు. నా లగేజ్ మెుత్తం బస్ లోనే ఉండిపోయింది. రెండు పెద్ద సూట్కేస్లు, ఒక చిన్న సూట్కేస్. దానిలోనే నా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ఈ బస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసాను. నా లగేజ్ అరోరా బస్ స్టేషన్ లో దింపమని  చెప్పాను. శరత్ గారికి, రామస్వామి గారికి ఫోన్ చేసి చెప్తే, కాబ్ వేసుకుని అరోరా బస్ స్టేషన్ కి వచ్చేయమన్నారు. 150 డాలర్లు దండగన్నమాట. ఏం చేస్తాం తప్పదు కదా మరి, మన అజాగ్రత్తకి మూల్యం చెల్లించాలి కదా. ఇంకా నయం బస్ వాళ్ళు నా లగేజ్ జాగ్రత్తగా దించి వెళ్ళారు. నేను బస్ స్టేషన్ కి వెళ్ళేసరికి లగేజ్ దించి బస్ అప్పుడే వెళిపోయింది. శరత్ గారు నన్ను లగేజ్ తో సహా వాళ్ళింటికి తీసుకువెళ్ళారు. శరత్ గారి వైఫ్ కవితక్క చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు రడీ అయ్యారు. నేను ఫ్రెష్ అయ్యి,  రడీ అయ్యాను. కవితక్క ఆరంజ్ జూస్ ఇచ్చింది. తాగేసి ముగ్గురం రామస్వామి గారిని కలవడానికి వారి చైనీస్ రెస్టారెంట్ హ్యూనాన్ ఇన్ కి బయలుదేరాం. 
           రెస్టారెంట్ మేనేజ్మెంట్, మెంటెనెస్స్ అంతా కవితక్క చూసుకునేది. రామస్వామి గారి వైఫ్ మాధవి గారు బయట జాబ్ చేసుకుంటూనే వీటిని కూడా చూసుకునేవారు. రామస్వామి గారు అప్పటికే భారత్ మేళా అని ఇండియన్ గ్రాసరిస్టోర్ కూడా తీసుకున్నారు. శరత్ గారు అక్కడ, ఇక్కడ కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్ని తేవడం చూసుకునేవారు. ఆరోజంతా కవితక్క వెనుకే ఉంటూ తను చేసేదంతా చూస్తూ వున్నాను. ఆ నైట్ కి నన్ను నేపర్ విల్ లో రామస్వామి గారింటికి తీసుకువెళ్ళారు. చాలా  పెద్ద ఇల్లు. నా లగేజ్ కూడా వచ్చేసింది. వాషింగ్ మెషీన్ ఉన్న రూమ్ లో బెడ్ ఉంది. ఆ రూమ్ నాకు ఇచ్చారు. తర్వాత 4, 5 రోజులనుకుంటా నన్ను రామస్వామి గారు పొద్దున్నే ఎనిమిదింటికంతా రెస్టారెంట్ కి తీసుకువెళ్ళేవారు. కవితక్క, శరత్ గారు కూడా ఆ టైమ్ కి వచ్చేసేవారు. కవితక్క నాకు అక్కడ చేయాల్సిన పనులు బాత్ రూమ్లు కడగడం, కూరగాయలు కోయడం, టేక్ అవుట్ల ఆర్డర్ తీసుకోవడం, ఇవ్వడం మెుదలైనవి నేర్పేది. లంచ్ బఫే ఉండేది. సాయంత్రం టేక్ అవుట్లు, డిన్నర్ ఉండేది. మరో పక్క ఇండియన్ ఫుడ్ టిఫిన్స్ , డిన్నర్ కూడా సాయంత్రం పూట మెుదలు పెట్టారు. వీకెండ్ బాగా బిజీగా ఉండేది. చైనీస్ కుక్ లు, వెయిటర్స్ కూడా ఉండేవారు. హోమె చైనీస్ వెయిటర్ సరదాగా మాట్లాడేది. చిన్న చిన్న చైనీస్ పదాలు కూడా అప్పుడప్పుడూ నేర్పేది. కొన్ని రోజుల తర్వాత జాబ్ మార్కెట్ అప్పటికే బాలేని కారణంగా మాధవి గారి జాబ్ కాంట్రాక్ కూడా అయిపోయింది. ఆవిడా ఫుల్ టైమ్ ఇక్కడే వర్క్ చేసేవారు.  మా వారి ఫ్రెండ్ మాధవి గారి తమ్ముడు. అలా వీళ్ళు నాకు పరిచయమన్న మాట. 
         తర్వాత ఓ రోజు మాధవి గారు, నేను రడీ అయ్యి రెస్టారెంట్ కి కవితక్క వాళ్ళతో బయలుదేరుతుంటే నేను తీసుకువెళతానులే నిన్ను, మనిద్దరం కలిసి కాసేపాగి వెళదామంటే సరేనని ఆగాను. వీళ్ళకి ఓ పాప, బాబు. పాప అప్పుడు ఐదో, ఆరో చదువుతుండేదనుకుంటా. బాబు బయట ఉండేవాడు అండర్ గ్రాడ్యుయేషన్ అనుకుంటా. కాఫీ తాగుతూ ఆ కబురు, ఈ కబురు చెప్తూ నేనేం చేస్తున్నానో అన్నీ కనుక్కుంది. చాలా ప్రేమగా ఉండేది నాతో అప్పటి నుండి. నా గురించి బాగా కేర్ తీసుకునేది కూడా. అప్పుడప్పుడూ ఇండియన్ గ్రాసరిస్టోర్ కి కూడా తీసుకువెళ్ళే వారు శరత్ గారు. అక్కడ విజయ అని ఒకావిడ పని చేసేవారు. వాళ్ళాయన జాబ్. ఈవిడ ఇక్కడ పని చేసేవారు. నాకేమెా ఖాళీగా కూర్చోవడం రాదు. షాప్ నీటుగా లేదని క్లీనింగ్ మెుదలుపెట్టాను. నాకు వచ్చినట్టుగా అన్నీ సర్దేసాను. బాత్ రూమ్ కూడా నీట్ గా క్లీన్ చేసాను. కవితక్క నాకు రెస్టారెంట్ లో చెప్పిన పనే ఇక్కడా చేసి విజయతో అన్నానేమెా మనమే క్లీన్ చేయాలని. నాకు సరిగా గుర్తు లేదు. ఆవిడ మరి ఎవరికి చెప్పుకుందో, ఏం చెప్పుకుందో నాకు తెలియదు. ఆరోజో, మరుసటి రోజో రామస్వామి గారు మీటింగ్ ఉందన్నారు. అందరు ఏదేదో మాట్లాడారు. చివరికి నాకర్థమైందేంటంటే నన్ను విజయకు సారి చెప్పమన్నారని. సారి చెప్పేసాను. కాని నా తప్పు లేకుండా సారి చెప్పడమంటే నాకు చచ్చిపోవడంతో సమానం. మాధవి అక్క తన కార్ లో ఇంటికి తీసుకువచ్చారు. తనకి నా సంగతి బాగా తెలుసు అప్పటికి. నాతోపాటే రూమ్ కి వచ్చి బాధపడవద్దని చెప్పి సముదాయించింది. చాలా సేపు బాధనిపించింది. అప్పటినుండి కాస్త మనుషుల నైజాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. నాకేమెా కాస్త ఆత్మాభిమానం ఎక్కువ. ఏదీ తొందరగా రాజీ పడలేను. ఈ విషయం నుండి బయటపడటానికి నాకు చాలా సమయమే పట్టింది. 

 "  ముక్కు సూటిగా మన పని మనం చేసుకుపోవడమే కాకుండా అప్పుడప్పుడైనా చుట్టుపక్కల గమనించి ప్రవర్తించడం నేర్చుకోవాలి. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 


-
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner