1, మార్చి 2021, సోమవారం
ఏక్ తారలు...!!
1. నెమలీకలు దాచుకున్న జ్ఞాపకమిది_చెలిమి గతమైనా ఘనమైనదేనంటూ...!!
2. కాలంతోనే కలిసుంటాను ఎప్పటికీ_ఓ కొలిక్కి రాని జీవనకావ్యాన్నైనా...!!
3. ఆశావాదం తనదని అర్థం చేసుకో నెచ్చెలీ_మార్పుకి ఓ అవకాశం ఇస్తున్నట్టుగా...!!
4. ఎగసిపడుతున్న అంతరంగం_తీరాన్ని తాకలేని అలలా...!!
5. మనసుని ఖాళీ చేద్దామనుకుంటున్నా_మని'షిగా బతకాలని..!!
6. చెప్పు'కో చరిత్ర_గతంగానో, భవితగానో...!!
7. మాటకో రత్నం_రాలిపడుతూనో, రాక్షసానందం పొందుతూనో...!!
8. వీధి వీధికో చిల్లరగోల_దద్దరిల్లుతున్న అభివృద్ధంట...!!
9. విరచించటం విధాత పని_తెలిసో తెలియకో పరుగుల ఆరాటం మనిషిదై...!!
10. తప్పించుకోలేని గాయాలవి_విరించి విసుగుతో రాసిన రాతలైనప్పుడు..!!
11. అల్లరి చేస్తేనేం_మనసు వాకిలి తెరుచుని పక్కున నవ్వేస్తుంటే..!!
12. నటనలో జీవించడం కొత్తేమి కాదుగా_మని'షిగా పుట్టింది మెుదలు...!!
13. వెంటాడుతునే ఉంటుంది బంధం_పాశం పలకరించక మౌనం వహించినా...!!
14. తెరచాటు బతుకులేగా అన్నీ_చితికిన మనసులను మరింతగా చిదిమేస్తూ...!!
15. బతకడానికెన్ని రంగులు పులమాలో_నిజాలను అబద్ధాలుగా మార్చుతూ...!!
16. తలుపు వేసినంత సుళువు కాదు_తలపులకు తావీయకుండా ఉండటం...!!
17. అప్పుడప్పుడూ తడబాటు తప్పదు_తట్టుకుని నిలబడి గెలవడమే...!!
18. ఛాయ చెదిరిపోనంటోంది_వెన్నుదన్నుగా వెన్నంటే నడుస్తూ..!!
19. గతాన్ని మరిచిపోనివ్విలా_అక్షరాలకు గమనాన్ని అప్పజెప్పేస్తూ...!!
20. చరిత్రలో చరితగా నిలిచి పొమ్మంటోంది అక్షరం_ఊపిరై తానుండి పోతానంటూ..!!
21. సర్వం తెలిసిన సత్యాక్షరమది_ఏ కాలాన్నైనా జీవంతో నింపగలిగే నేర్పుతో...!!
22. మనసు బంధమై అల్లుకున్నా_భావమై మిగిలిపోకున్నా...!!
23. నిదురమ్మ ఒడిలో ప్రశాంతమే_చీకటి చిక్కుముడులెన్ని విప్పలేకున్నా..!!
24. పాదముద్రలు పడుతూనే ఉన్నాయి_అనుభవాల లోతును చూడమంటూ...!!
25. భారమంతా భరించేది అక్షరాలే_మనసును తేలిక చేస్తూ...!!
26. సంద్రమెప్పుడూ నిండుకుండే_ఎన్ని బడబాగ్నులు తనలో దాగున్నా...!!
27. మౌనం మాట్లాడటమంటే ఇదే కాబోలు_గుండె గదులను అక్షరాలతో నింపేస్తూ...!!
28. అక్షరాలకూ అనుభవమైంది_భావాల భారాన్ని భరించడమెలాగో..!!
29. మలుపులు అలవాటైన బతుకులు మనవి_మాటల అవసరాన్ని గుర్తుజేస్తూ...!!
30. గుచ్చుకున్న గునపాలు లెక్కెడుతున్నా_అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుంటూ...!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి