28, మార్చి 2021, ఆదివారం

ఆ కబురూ... ఈ కబురూ...!!

నేస్తం, 
        పలకరించాలని చాలా కాలంగా అనుకుంటున్నా కానీ ఏదో సందిగ్ధం. చెప్పని మాటలు బోలెడు మిగిలున్నా చెప్పలేని నిస్సహాయత వెంటాడుతోంది. జీవితంలో సర్వసాధారణమైనవి జ్ఞాపకాలు. అవి లేని మనిషి ప్రాణమున్న యంత్రం. నిజమే మనమిప్పుడు యాంత్రికంగానే బతికేస్తున్నాం. కాదని అనలేను కాని కొన్ని గురుతులనైనా మనతో ఉంచుకుంటున్నాం. 
        జీవితం అందరికి ఒకేలా సాగదు. కాని ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగానే బాధలు, సంతోషాలు ఉంటాయి. కాకపోతే మన మనస్తత్వమేంటంటే ఈ ప్రపంచంలో మనము మాత్రమే బాగా బాధ పడిపోతున్నాం, మిగతా అందరు సంతోషంగా ఉన్నారనుకుంటాం. కష్టం, సుఖం మన ఆలోచనని బట్టి ఉంటాయి. మనకు నవ్వుతూ కనిపించే వాళ్ళందరికి కన్నీళ్ళతో పనిలేదని అనుకుంటే అది పొరబాటే. ఆ చిరునవ్వుల వెనుక దాచిన దిగులు వెతలెన్నో. 
         మనకు లేనిదే కావాలని అనిపించడం సహజమే. చిన్నప్పుడు అమ్మ దగ్గర అందని చందమామ కోసం మారాము చేసినప్పటి నుండి మనకది అలవాటే కదా. ఓ క్రమ పద్ధతిలో జీవితం సాగాలనే అందరు కోరుకుంటారు. కాని అవాంతరాలు చెప్పి రావు కదా. అవి వచ్చినప్పుడు సంయమనంతో వాటిని అధిగమించడంలోనే మన నేర్పు బయటబడుతుంది. 
    మనకు నచ్చిన వారు మనల్ని పట్టించుకోవడం లేదని బాధ పడతాం. ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వడం మనం మర్చిపోయామని గ్రహించం. ఇష్టపడి భరించే కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది. ఇష్టంలేని సంతోషం తెచ్చిపెట్టుకున్న పెట్టుడు నగల్లానే మిగిలిపోతుంది.
    ఏ అనుబంధమైనా కలకాలం నిలవాలంటే నమ్మకమనే పునాది గట్టిగా ఉండాలి. బయట వల్లమాలిన ప్రేమలు కురిపిస్తూ, లోపల విషపు సెగలు విరజిమ్మే నైజాలిప్పుడు మన చుట్టూ చాలా ఎక్కువే ఉన్నాయి. మనమే జాగ్రత్తగా మసలుకోవాలి. ఇంటా బయటా కూడా ఈ నటనలే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. చూసి చూసి మనకూ నటన అలవాటై పోతుందేమెానన్న భయమూ వేస్తోంది ఓ పక్కన. 
    రెప్పపాటు ఈ జీవితానికి ఎన్ని రెప్పల కింద కన్నీటిని పారించాలో మరి. శత్రువును తలుచుకున్నంతగా మిత్రులను కూడా తల్చుకోము. భార్య/భర్త పట్టించుకోవడం లేదన్న విషయం ప్రపంచంలో అతి పెద్ద కష్టంగా అనుకుంటారు కొందరు. కొన్ని బాధ్యతల నడుమ బంధాలకు చోటు తక్కువే మరి. వారి వారి మనస్థితిని బట్టి అవి ఆధారపడి ఉంటాయి. కొందరు ఇంట్లో పట్టించుకోరు, బయటివారికి ఏ చిన్న కష్టమెాచ్చినా అబ్బో తెగ బాధ పడిపోయి, క్షేమ సమాచారాలు కనుక్కుంటూనే ఉంటారు. తన పక్కనుండే భార్య/భర్త ను తిన్నావా అని అడగడానికి కూడా నోరు రాదు. మరి కొందరేమెా ఇల్లు తప్ప మరో ప్రపంచంతో పని లేదన్నట్లుగా ఉంటారు. 
         ఏదో చెబ్దామని ఏదేదో చెప్పేస్తున్నానేంటి? రాసి చాలా రోజులైంది కదా, అలవాటు పోయింది మరి. ఏమనుకోకండి. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే నాలుగు వాక్యాలు, నాలుగు పదాలు రాసేసే ప్రతివారూ రచయితలు/రచయిత్రులు కాదన్నారు కొందరు. వాక్యం రసాత్మకం కావ్యం అన్నది కూడా మన పెద్దలేనండోయ్. అందుకే నాలుగు వాక్యాలు కాకుండా బోలెడు రాసేసానన్న మాట. ఏంటో ఈమధ్య ముందుచూపు ఎక్కువై పోయింది నాకు కూడా... నేను ఎవరిని ఏమి అనలేదండోయ్. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner