1, మార్చి 2021, సోమవారం
రెక్కలు
1. ఎన్నో
సర్దుబాట్లు
మరెన్నో
సంవేదనలు
పంచుకున్నది మనసని
తెలుపుతున్నది అక్షరం...!!
2. ఎడతెగని
ఆలోచనలు
ఎటూ కాదనుకోలేని
అనుబంధాలు
మనసో
మౌన ముని..!!
3. తడబడేవి
అడుగులయినా
తత్తర పడనిది
మనసు
ఆత్మస్థైర్యం
పెట్టని ఆభరణం...!!
4. కాలంతో
కలిసి నడవాలి
చరిత్రలో
మనకో పేజి ఉండాలి
జీవిత కావ్యం
వేవేల వర్ణాల మయం..!!
5. కాలానికి
కదిలిపోడం అలవాటు
కన్నీటికి
జారిపోవడం తెలుసు
అక్షరానికి
ఆత్మ నివేదన ఎరుకే..!!
6. చెదపురుగుల దాడి
నివాసాలపై
సాహితీ ఆవాసాలపైనా
చీడల క్రీనీడలే
మనసులను తొలిచే క్రిములను
మందులు తొలగించలేవు..!!
7. ముగింపు
మన చేతిలో లేదు
ఆట మెుదలెట్టడం వరకే
మన పని
ఆడించడమంతా
ఆ పైవాడి చతురత..!!
8. అనుబంధాలను
వదులుకోలేని నిస్సహాయత
బాధ్యతలను
మరువలేని బేలతనము
పండ్లున్న చెట్టుకే
రాళ్ళ దెబ్బలు...!!
9. మనసు
గురుతులు
మనిషితనపు
ఆనవాళ్ళు
ముద్రించిన
జీవితపు చిహ్నాలు...!!
10. అక్షరాల
అమరిక
భావాల
పరకాయ ప్రవేశం
ప్రసవ వేదనే
జననానికి...!!
11. ఉప్పెనా
నీరే
కన్నీరు
ఉప్పనే
ఏదోక రకంగా
జీవితానికి ఉప్పదనం తప్పదు..!!
12. పాతదనాన్ని
వద్దంటున్నాం
కొత్తదనాన్ని
ఆహ్వానిస్తున్నాం
మార్పులు చేర్పులు
అవసరమే జీవితానికి...!!
13. పయనం
తప్పదు
శబ్దాలను నిశ్శబ్దాలను
మెాసుకుంటూ
అక్షరబద్దం చేయగలిగే నేర్పు
కొందరికే సొంతం...!!
14. గతం
బాధిస్తేనేం
గమనం
తెలుపుతుంది
గమ్యం
అక్షర నీరాజనం అందుకుంటుంది...!!
15. వసి వాడని
జ్ఞాపకమది
ఓ క్షణమైనా
మరుపు రాదు
మానస సంచారమే
అనునిత్యం ఆటవిడుపుగా...!!
16. కంట నీరు
ఒలుకుతూనే ఉంది
గుండెకలవి కాని
గాయాలతో
సముద్రమింకని
నిజం తనలో దాగినందుకు..!!
17. అలసట
శరీరానికి
ఆలోచన
మనసుకి
సమన్వయంతో సాంత్వన
అక్షరాలతో...!!
18. అక్షరాలు
కావివి
మనసు
గాయాలు
కలం
విదిల్చిన కాలం...!!
19. మస్తిష్కం
ఆలోచన మానదు
మస్తకం
మాట వినదు
అక్షరం
గాయానికి లేపనం...!!
20. గాయం
పాతదే
మనసు
మర్చిపోలేదు
భరించడం
అలవాటు చేసుకోవాలంతే...!!
21. అక్షరం
అలవాటైన స్నేహం
భావం
మనసుకి చేరికైనది
భాష
మనిషి వ్యక్తిత్వం...!!
22. మనసు
చూపించలేనిది
అద్దంలో
ప్రతిబింబం
నిజం
జీవితం...!!
23. వెలుతురు
అనివార్యం
చీకటి
చుట్టమైనా
నిమిత్తమాత్రుడు
కర్మసాక్షి..!!
24. అద్దంలో
ప్రతిబింబం
అందమెా
అనాకారితనమెా
బిడ్డ
అమ్మకెపుడూ అందాలరేడే..!!
25. రక్షణ
వలయాలు
ఛేదన
ఆగదు
ఏ తనమయినా
తలవంచక తప్పదు...!!
26. ఏ ఆటైనా
ఆడాలంటే
కాలం కర్మం
కలిసి రావాలి
బాగా ఆడటం వచ్చని
మనం అనుకుంటే సరిపోదు...!!
27. అలికిడి
చేయదు
వినికిడి
తెలియదు
మనసంతా
మరో శబ్దమే మరి..!!
28. ఎడద
పంచింది
ఈ జన్మకు
తోడుండమంటూ
ఎండమావిని
అప్పగించింది కాలం..!!
29. ప్రదర్శించాల్సింది
మన పాడింత్యాన్ని కాదు
నలుగురి మనసులను
కదిలించడంలో
ప్రతిభ
కృతకృత్యమయ్యేదప్పుడే.. !!
30. మనసు
భారాన్ని ఒంపేస్తూ
మనిషి
బాధ్యతను గుర్తుజేస్తూ
మార్పు
సహజమన్న ఆశ..!!
వర్గము
రెక్కలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి