1, మార్చి 2021, సోమవారం
కాలం వెంబడి కలం..43
" No one can do everything
But Every men can do something "...నిజమే కదా ఇది.
రోజులు గడిచిపోతున్నాయి మామూలుగానే. నాకు పిల్లల పని, అప్పుడప్పుడు వంట, ఫోన్లు ఇలా జరిగిపోతోంది. డాక్టర్ గారు మూడ్ బావుంటే బానే ఉండేవారు, లేదంటే అప్పుడప్పుడూ ఏదోకటి అనేవారు. నా టైమ్ బాలేదులే అని సరిపెట్టుకునేదాన్ని. ఓ రోజు డాక్టర్ గారికి వాళ్ళాయన ఫోన్ చేస్తే, ఆవిడ తీయలేదు. అందుకని ఇంటికి చేసారు. నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఆ సాయంత్రం డాక్టర్ గారు నన్ను ఫోన్ ఎక్కువ వాడవద్దని చెప్పారు. నాకు వేరే ఫోన్ లేదు. ఆరోజు చాలా బాధనిపించింది. నాకేదయినా బాధనిపిస్తే పుస్తకంలో రాసుకునేదాన్ని అప్పుడు. పెళ్ళైనప్పటి నుండి ఇలా ఎవరితో ఒకరితో మాటలు పడాల్సి వస్తోందని దిగులు వేసింది. నాకంటూ ఏమి లేకపోబట్టే కదా ఇలా జరుగుతోందనిపించింది. ఇలా బాధ పడిన క్షణాలెన్నో. ఉమకి విషయం చెప్పాను. నాకు చెప్పకుండానే ఉమ సెల్ ఫోన్ బుక్ చేసింది. అది వచ్చే ముందు చెప్పింది. మెుత్తానికి నా మెుదటి సెల్ ఫోన్ రావడమూ, దానిని యాక్టివేట్ చేయడమూ జరిగిపోయింది. స్ప్రింట్ నెట్ వర్క్ అన్నమాట. అప్పటి నుండి అమెరికా వదలి వచ్చే వరకు అదే నెట్ వర్క్ వాడాను.
నా H1B పేపర్స్ అమెరికన్ సొల్యూషన్స్ ఫైల్ చేయడము, LIN నెంబర్ రావడమూ జరిగింది. ఓ రోజు సుబ్బరాజు ఇందుకూరి కాల్ చేసి త్రీవీక్స్ జాబ్ ఉంది. వెంటనే జాయిన్ కావాలి వెళతారా అన్నారు. మరి డాక్టర్ గారు నేను సడన్ గా వెళిపోతే ఇబ్బంది పడతారు కదా, అదీనూ 3 వారాలే అంటున్నారు, మీ ఇష్టం వెళ్ళమంటే వెళతాను అన్నాను. ఏ విషయం మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు. ఇదంతా డాక్టర్ గారు ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది. మరుసటి రోజు సుబ్బరాజు ఫోన్ చేసి మరేదైనా జాబ్ చూద్దాంలెండి అన్నారు. అప్పటి నుండి డాక్టర్ గారు బావుండేవారు నాతో. నాకు ఫోటోలు తీయడం, అందరివి కలక్ట్ చేయడం బాగా ఇష్టం చిన్నప్పటి నుండి. అమెరికా వచ్చాక కెమేరా కొనలేదు. పిట్స్ బర్గ్ వచ్చాక 10 డాలర్లకు కెమేరా షాప్ లో చూసి, అది కొన్నాను. దానితో నాకు వచ్చినట్టు ఫోటోలు తీసేదాన్ని.
మధ్యలో క్రిస్మస్ కి హాలిడేస్ వచ్చాయి. డాక్టర్ గారి హజ్బెండ్ పిట్స్ బర్గ్ వస్తానన్నారు. డాక్టర్ గారికి కూడా శలవలే. బాల్టిమెార్ లో ఉండే శిరీష వాళ్ళు డెల్లాస్ వెళిపోయారు. తనేమెా వాళ్ళింటికి రమ్మని, నా ఫ్రెండ్ వెంకట రమణ కాలిఫోర్నియా రమ్మంటే, డాక్టర్ గారు వెళ్ళిరా ఓ 4, 5 రోజులు, నేను చూసుకుంటాను పిల్లలని, ప్రసాద్ కూడా వస్తారు కదా అన్నారు. సరేనని రానుపోనూ ఫ్లైట్ టికెట్ రమణతో బుక్ చేయించుకున్నా నా డబ్బులతోనే. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ కి. మెర్సీ గారి హజ్బెండ్ నన్ను ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేస్తూ, పాస్ పోర్ట్ బయటకు తీయకండి, స్టేటస్ ఇబ్బంది అవుతుందేమెా, డ్రైవర్ లైసెన్స్ ఇవ్వండి ఐడి ప్రూఫ్ కి అంటే లైసెన్స్ లేదండి, స్టేట్ ఐడి ఉంది అంటే, అది చూపించండి చాలు అన్నారు. మెుత్తానికి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో దిగాను. లగేజ్ తీసుకుంటుంటే వెంకట రమణ ఫోన్, ఎక్కడ ఉన్నావని, నన్ను చూడలేదు కదా గుర్తు పట్టడానికి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నా ఫ్రెండ్ శోభ, అబ్బు కూడా కాలిఫోర్నియాలోనే ఉన్నారు. వాళ్ళకు ఫోన్ చేసాను. అబ్బు వాళ్ళ అన్నయ్య వాళ్ళింట్లో ఉంటున్నాడు. రమణ వాళ్ళింటికి దగ్గరలోనే. ఓ రోజు భోజనానికి కూడా వెళ్ళాం. శోభ వచ్చి వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. బోలెడు మా కాలేజ్ కబుర్లు చెప్పుకుని, హైదరాబాదులోని శ్రీదేవికి ఫోన్ చేసాము. ఇద్దరం మాట్లాడుతుంటే తనకి నేను అమెరికాలోనే ఉన్నానా అని డౌట్. నువ్వు కూడా అమెరికా వెళ్ళావా అంది. ఏం వెళ్ళలేననుకున్నావా అన్నాను. అలా కాసేపు తనని ఏడిపించాం. నన్ను షాప్ కి తీసుకువెళ్ళి, నా ఫోటోల పిచ్చి తెలుసు కనుక, నాకు ఓ ఆల్బం కొనిపెట్టి, మళ్ళీ రమణ వాళ్ళింట్లో వదిలేసింది. వాళ్ళు ముగ్గురు రూమ్మేట్స్. ఇద్జరు తెలుగు, మరొకరు కన్నడ. నాకు కన్నడ వచ్చుగా, చాలా రోజుల తర్వాత కన్నడ మాట్లాడాను ఈ రూపంగా. మెుత్తానికి పుస్తకాల్లో చదివిన గోల్డెన్ గేట్ చూడటం ఓ థ్రిల్. పోర్ట్ కూడా చూసాను. వెస్ట్ సముద్రం వర్షంలో చూడటమెా మంచి అనుభూతి. మెుత్తానికి కాలిఫోర్నియా ట్రిప్ బాగా జరిగింది నా కెమేరాతో ఫోటోలు తీసుకోవడంతో సహా.
అలా ఓ ఆరు నెలలు పిట్స్ బర్గ్ లో గడిచిపోయాయి. ఆ టైమ్ లోనే ఓ అమెరికన్ లాయర్ తో చికాగో బాబ్ గురించి మాట్లాడాను. బాబ్ కి మెయిల్ కూడా పెట్టాను. నాకు బాకీ ఏది ఉంచుకోవడం ఇష్టం ఉండదు. కుక్కకయినా జాబ్ వస్తుంది, నాకు రాదన్నాడు కదా, డాలర్ కూడా ఇవ్వనన్నాడు. అది గుర్తు చేస్తూ, అవును కుక్కకి వస్తుంది, నాకు వస్తుంది జాబ్. కాని నీకు రాదు అని వాడికి మెయిల్ పెట్టాను. వినయ్ గుమ్మడి గారు ఫోన్ చేసి HNC బాబ్ మీద కేస్ ఫైల్ చేద్దామన్నారు. అనవసరమండి అంటే కాదు ఇద్దరం కలిపి వేద్దామన్నారు. 1500 డాలర్లు పంపండి, నేను తర్వాత ఇస్తాను లెక్కలు చూసి అన్నారు. సరేనని పంపించాను. లాయర్ బాబ్ కి నోటీస్ పంపాడు. లాయర్ తో కపుల్ ఆఫ్ డాలర్స్ ఇస్తాను సరి చేయమన్నాడట. నవ్వుకున్నా.. నాకు రావాల్సినవి ఇమ్మనండి చాలన్నాను. మన లాయర్సే కాదు అక్కడి లాయర్స్ కూడా అంతే. వినయ్ గారు కొన్ని రోజులు ఫాలోఅప్ చేసి, లాయర్ కి తలో 2, 3 వేల డాలర్లు సమర్పించి, బాబ్ మాకు ఇవ్వాల్సిన వాటికి ఇవి మేం కట్టిన వడ్డీ అని సరిపెట్టేసుకుని ఓ దణ్ణం పెట్టి వదిలేసా వినయ్ గారు పట్టించుకోకపోతే. తర్వాత నా పుట్టినరోజుకి డాక్టర్ గారు పట్టుచీర ఇచ్చి, కేక్ కట్ చేయించారు. మెర్సీ గారు కూడా వచ్చారు.
ఇంతలో నాకు H1B కి డబ్బులు కట్టిన రామస్వామి యనమదల గారికి మనుషులు కావాల్సివచ్చారు. ఇంటికి ఫోన్ చేసినప్పుడు మా ఆయన చికాగో రామస్వామి గారి దగ్గరకు వెళ్ళు, అన్ని వాళ్ళు చూసుకుంటారని చెప్పాడు. రామస్వామి గారికి ఫోన్ చేసి మాట్లాడితే చికాగో వచ్చేయమన్నారు. ఓ వారం, పది రోజులు టైమ్ కావాలని చెప్పాను. డాక్టర్ గారికి మరో మనిషి దొరికి ఆమెకు పిల్లలను, పనిని అలవాటు చేసి, చికాగో బయలుదేరాను. అనోన్య బాగా ఏడిచింది, నాకూ బాధనిపించింది. నేను వెళిపోతున్నానని డాక్టర్ గారి ఫ్రెండ్ మెర్సీ వాళ్ళు వచ్చి నాకో 25 డాలర్లు కూడా ఇచ్చారు. అభీని స్కూల్లో దించేటప్పుడు నాకో అమెరికన్ మంచి ఫ్రెండ్ అయ్యిందని చెప్పాను కదా. తను ఓసారి ఇంటికి కూడా వచ్చింది, నన్ను డ్రాప్ చేయడానికి. చికాగో వెళడానికి బస్ టికెట్ తీసుకున్నా. నన్ను డ్రాప్ చేయడానికి అమెరికన్ ఫ్రెండ్ వస్తానంది. తనకి నేను కొన్న కెమేరా ఇచ్చేసాను అప్పటికే. తను వాళ్ళింటికి తీసుకువెళ్ళి డిన్నర్ పెట్టి, బస్ స్టేషన్ లో బస్ ఎక్కించి, జాగ్రత్తలు చెప్పి,గిఫ్ట్ ఇచ్చింది. అది 35 డాలర్స్ గిఫ్ట్ కార్డ్. వద్దంటే వినలేదు. అలా మరోసారి చికాగో బయలుదేరాను బస్ లో.
పొద్దున్నే బస్ చికాగో మెయిన్ బస్ స్టేషన్ లో ఆగింది. నేను దిగాల్సింది అరోరా బస్ స్టేషన్లో. సెంట్రల్ స్టేషన్ లో బస్ క్లీనింగ్ కోసం ఆపారు. నేను కిందకి దిగి కాస్త అవతలగా కూర్చున్నాను. బయలుదేరేటప్పుడు ఎనౌన్స్ చేస్తారు కదా అని. నన్ను అరోరాలో రిసీవ్ చేసుకోవడానికి శరత్ గారు వస్తారని, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేసి ఇక్కడ బస్ ఆపారని చెప్పాను. తర్వాత చూస్తే బస్ లేదు. కంగారేసి ఎంక్వైరీలో అడిగితే బస్ వెళిపోయిందని చెప్పారు. నా లగేజ్ మెుత్తం బస్ లోనే ఉండిపోయింది. రెండు పెద్ద సూట్కేస్లు, ఒక చిన్న సూట్కేస్. దానిలోనే నా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ఈ బస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసాను. నా లగేజ్ అరోరా బస్ స్టేషన్ లో దింపమని చెప్పాను. శరత్ గారికి, రామస్వామి గారికి ఫోన్ చేసి చెప్తే, కాబ్ వేసుకుని అరోరా బస్ స్టేషన్ కి వచ్చేయమన్నారు. 150 డాలర్లు దండగన్నమాట. ఏం చేస్తాం తప్పదు కదా మరి, మన అజాగ్రత్తకి మూల్యం చెల్లించాలి కదా. ఇంకా నయం బస్ వాళ్ళు నా లగేజ్ జాగ్రత్తగా దించి వెళ్ళారు. నేను బస్ స్టేషన్ కి వెళ్ళేసరికి లగేజ్ దించి బస్ అప్పుడే వెళిపోయింది. శరత్ గారు నన్ను లగేజ్ తో సహా వాళ్ళింటికి తీసుకువెళ్ళారు. శరత్ గారి వైఫ్ కవితక్క చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు రడీ అయ్యారు. నేను ఫ్రెష్ అయ్యి, రడీ అయ్యాను. కవితక్క ఆరంజ్ జూస్ ఇచ్చింది. తాగేసి ముగ్గురం రామస్వామి గారిని కలవడానికి వారి చైనీస్ రెస్టారెంట్ హ్యూనాన్ ఇన్ కి బయలుదేరాం.
రెస్టారెంట్ మేనేజ్మెంట్, మెంటెనెస్స్ అంతా కవితక్క చూసుకునేది. రామస్వామి గారి వైఫ్ మాధవి గారు బయట జాబ్ చేసుకుంటూనే వీటిని కూడా చూసుకునేవారు. రామస్వామి గారు అప్పటికే భారత్ మేళా అని ఇండియన్ గ్రాసరిస్టోర్ కూడా తీసుకున్నారు. శరత్ గారు అక్కడ, ఇక్కడ కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్ని తేవడం చూసుకునేవారు. ఆరోజంతా కవితక్క వెనుకే ఉంటూ తను చేసేదంతా చూస్తూ వున్నాను. ఆ నైట్ కి నన్ను నేపర్ విల్ లో రామస్వామి గారింటికి తీసుకువెళ్ళారు. చాలా పెద్ద ఇల్లు. నా లగేజ్ కూడా వచ్చేసింది. వాషింగ్ మెషీన్ ఉన్న రూమ్ లో బెడ్ ఉంది. ఆ రూమ్ నాకు ఇచ్చారు. తర్వాత 4, 5 రోజులనుకుంటా నన్ను రామస్వామి గారు పొద్దున్నే ఎనిమిదింటికంతా రెస్టారెంట్ కి తీసుకువెళ్ళేవారు. కవితక్క, శరత్ గారు కూడా ఆ టైమ్ కి వచ్చేసేవారు. కవితక్క నాకు అక్కడ చేయాల్సిన పనులు బాత్ రూమ్లు కడగడం, కూరగాయలు కోయడం, టేక్ అవుట్ల ఆర్డర్ తీసుకోవడం, ఇవ్వడం మెుదలైనవి నేర్పేది. లంచ్ బఫే ఉండేది. సాయంత్రం టేక్ అవుట్లు, డిన్నర్ ఉండేది. మరో పక్క ఇండియన్ ఫుడ్ టిఫిన్స్ , డిన్నర్ కూడా సాయంత్రం పూట మెుదలు పెట్టారు. వీకెండ్ బాగా బిజీగా ఉండేది. చైనీస్ కుక్ లు, వెయిటర్స్ కూడా ఉండేవారు. హోమె చైనీస్ వెయిటర్ సరదాగా మాట్లాడేది. చిన్న చిన్న చైనీస్ పదాలు కూడా అప్పుడప్పుడూ నేర్పేది. కొన్ని రోజుల తర్వాత జాబ్ మార్కెట్ అప్పటికే బాలేని కారణంగా మాధవి గారి జాబ్ కాంట్రాక్ కూడా అయిపోయింది. ఆవిడా ఫుల్ టైమ్ ఇక్కడే వర్క్ చేసేవారు. మా వారి ఫ్రెండ్ మాధవి గారి తమ్ముడు. అలా వీళ్ళు నాకు పరిచయమన్న మాట.
తర్వాత ఓ రోజు మాధవి గారు, నేను రడీ అయ్యి రెస్టారెంట్ కి కవితక్క వాళ్ళతో బయలుదేరుతుంటే నేను తీసుకువెళతానులే నిన్ను, మనిద్దరం కలిసి కాసేపాగి వెళదామంటే సరేనని ఆగాను. వీళ్ళకి ఓ పాప, బాబు. పాప అప్పుడు ఐదో, ఆరో చదువుతుండేదనుకుంటా. బాబు బయట ఉండేవాడు అండర్ గ్రాడ్యుయేషన్ అనుకుంటా. కాఫీ తాగుతూ ఆ కబురు, ఈ కబురు చెప్తూ నేనేం చేస్తున్నానో అన్నీ కనుక్కుంది. చాలా ప్రేమగా ఉండేది నాతో అప్పటి నుండి. నా గురించి బాగా కేర్ తీసుకునేది కూడా. అప్పుడప్పుడూ ఇండియన్ గ్రాసరిస్టోర్ కి కూడా తీసుకువెళ్ళే వారు శరత్ గారు. అక్కడ విజయ అని ఒకావిడ పని చేసేవారు. వాళ్ళాయన జాబ్. ఈవిడ ఇక్కడ పని చేసేవారు. నాకేమెా ఖాళీగా కూర్చోవడం రాదు. షాప్ నీటుగా లేదని క్లీనింగ్ మెుదలుపెట్టాను. నాకు వచ్చినట్టుగా అన్నీ సర్దేసాను. బాత్ రూమ్ కూడా నీట్ గా క్లీన్ చేసాను. కవితక్క నాకు రెస్టారెంట్ లో చెప్పిన పనే ఇక్కడా చేసి విజయతో అన్నానేమెా మనమే క్లీన్ చేయాలని. నాకు సరిగా గుర్తు లేదు. ఆవిడ మరి ఎవరికి చెప్పుకుందో, ఏం చెప్పుకుందో నాకు తెలియదు. ఆరోజో, మరుసటి రోజో రామస్వామి గారు మీటింగ్ ఉందన్నారు. అందరు ఏదేదో మాట్లాడారు. చివరికి నాకర్థమైందేంటంటే నన్ను విజయకు సారి చెప్పమన్నారని. సారి చెప్పేసాను. కాని నా తప్పు లేకుండా సారి చెప్పడమంటే నాకు చచ్చిపోవడంతో సమానం. మాధవి అక్క తన కార్ లో ఇంటికి తీసుకువచ్చారు. తనకి నా సంగతి బాగా తెలుసు అప్పటికి. నాతోపాటే రూమ్ కి వచ్చి బాధపడవద్దని చెప్పి సముదాయించింది. చాలా సేపు బాధనిపించింది. అప్పటినుండి కాస్త మనుషుల నైజాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. నాకేమెా కాస్త ఆత్మాభిమానం ఎక్కువ. ఏదీ తొందరగా రాజీ పడలేను. ఈ విషయం నుండి బయటపడటానికి నాకు చాలా సమయమే పట్టింది.
" ముక్కు సూటిగా మన పని మనం చేసుకుపోవడమే కాకుండా అప్పుడప్పుడైనా చుట్టుపక్కల గమనించి ప్రవర్తించడం నేర్చుకోవాలి. "
వచ్చే వారం మరిన్ని కబుర్లతో..
-
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి