21, మార్చి 2021, ఆదివారం
మెాహన సమీక్ష..!!
తెలుగు సాహిత్యంలో నుడి గుడి వంటి పరిశోధనాత్మక గ్రంథం రచించిన రాజావాసిరెడ్డి మల్లీశ్వరి తెలియనివారు లేరంటే అతిశయెాక్తి కాదు. తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి, తెలుగులో ఎన్నో ప్రక్రియల్లో ఆరితేరిన వారి కలం నుండి తెలుగువారికి అందున ఆణిముత్యం " మెాహన " గజళ్ల సంపుటి.
తన మెాహన పుస్తకంలో ఏముందో మెదటి గజల్ లో సంక్షిప్తంగా చెప్తారు. ప్రేమారాధన, విరహ వియెాగాలను, వర్ణ శోభితాలను అక్షరాల్లో రంగరించి హృద్యంగా తీర్చిదిద్దారు. ప్రేమబంధమై ఒదగాలని ఉంది అంటూ అక్షరమై లక్షణంగా మదిని తాకుతుంది ఈ గజల్. ఎందుకు అంటూ విరహంలో బాధను తెలుపుతారు. గరిక పూవై గిరి శిఖరాన విరిశానిలా నీ కోసం అంటూ అంతులేని ఆరాధనను కొన్ని గజళ్లలో తెలుపుతారు. కాలం వలలో భావానుభూతుల చిత్రాలు ఎన్నో తెలుసా అంటారు మరోచోట. నైతికత లేకపోతే ఏమౌతుందో చెప్తారు ఒక గజల్ లో. మనసు మాటలను, బాధల గాథలను, గొప్పదనం అంటే ఏమిటో, నీ కోసం నేను ఏమైపోయానో తెలుసా అంటూ తన మదిలోని ఆర్తిని, చీకటి తెరలు తొలిగి వేకువ వెలుగులు వచ్చేదెన్నడో అన్న సందేహాన్ని, చెప్పను చెప్పనంటూనే బోలెడు భావాలను విప్పి చెప్తారు. ఎవరికెరుక లేకున్నా అందమైన జ్ఞాపకంగా నిలిచిపోమ్మంటారు.
ప్రకృతి పరిణామక్రమం గురించి, ఎడబాటులోని వేదనను, తనలోని ప్రేమను, కాలం మెాసుకెళుతున్న అనుభవాలను, బతకడమంటే ఏమిటో, ప్రేమారాధనకు పరిపూర్ణతను, వెన్నెల రాతిరి మనసులో ఉన్నది ఏమిటో, స్వార్థ ప్రపంచంలో న్యాయ విలువలు వెలిసేది ఎప్పుడోనన్న మీమాంస, అందాన్ని ఆస్వాదించడం, కోరికల చిట్టా, కొన్ని ప్రశ్నలను, మరికొన్ని సందేహాలను, కొన్ని సందేశాలను, మరికొన్ని సమన్వయాలను, సర్ధుకుపోవడాలను, లోకం పోకడలను, వెన్నెల వలపుఝల్లులను, చీకటి కోపతాపాలను, పరితాపాలను, పరివేదనలను, జ్ఞాపకాల గుభాళింపులను, గోధూళివేళ గోప్యతల గుట్టులను...ఇలా ప్రతి చిన్న అనుభూతిని మనం ఈ " మెాహన " లో చూడవచ్చు.
మృదు పద మంజరి ఈ " మెాహన ". మురిసి మెరిసిన అక్షర మంజీరాలే అన్నీ. ప్రముఖుడు ప్రశంసలు అందుకుని, గజల్ లక్షణాలన్నీ మెండుగా, నిండైన భావాలతో, వజ్రగిరి జస్టిస్ గారి గజల్ భావాలకు ధీటైన చిత్రాలతో, గజల్ లోగిలి వ్యవస్థాపకులు, ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాసిన రోచిష్మాన్ గారు అభినందించిన " మెాహన "
మరింతగా పాఠకులకు చేరువకావాలని కోరుకుంటూ... తెలుగు భాషా గని శ్రీమతి రాజావాసిరెడ్డి మల్లీశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు.
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి