22, మార్చి 2021, సోమవారం
ఏక్ తారలు..!!
1. ఎగసిపడుతున్న అలలేగా మనసు రొదలన్నీ_కనిపించే కడలి సాక్షిగా...!!
2. అక్షరం తూటాగా మారక తప్పని స్థితి_భారమైన మది బరువుకాక మునుపే..!!
3. గారడీలు తెలియని మనసిది_గాయాలను జ్ఞాపకాలతో ఓదార్చుతూ...!!
4. బతుకు భారాన్నంతా అక్షరాలకు పంచేయడమే_మనసు మాట వినబడాలంటే...!!
5. అసూయకు అనుబంధంతో పని లేదు_అమ్మయినా అక్షరమయినా దానికొక్కటే...!!
6. గంపెడు భారం దిగిపోయింది_గుప్పెడు గుండె విదిల్చేసిన మౌనానికి..!!
7. అవగతం కానివే_అక్షరాల అనులోమానుపాతాలు...!!
8. జ్వలిస్తున్నాయి అక్షరాలు నిప్పు కణికెల్లా_మనసు సెగలను పంచుకుంటూ..!!
9. విరామం కోరుకోవడం అత్యాశేనేమెా_విశ్రాంతి ఎరుగని జీవితాలకు...!!
10. మనమేంటో మనకి బాగా తెలుసు_అబద్ధమెంత బావున్నా...!!
11. వర్ణనదేముంది మనసుతో పలికిస్తే చాలు_అక్షరాలలా అమరిపోతాయంతే...!!
12. హృదయానికి తపన పడటమే తెలుసు_అవి గాయాలైనా గేయాలైనా..!!5
13. ఆలకిస్తూనే ఉంది మనసు_అక్షర నివేదనలోని వేదనను...!!
14. గాత్రం వినసొంపుగానే ఉంటుంది_గాయం నాది కానప్పుడు..!!
15. బాంధవ్యం బలపడింది అక్షరాలతోనే_ఓదార్పు కోరుకునే మనసులకు...!!
16. నడుస్తున్న చరిత్రే ఇది_తప్పుల భారం తమది కాదంటూ...!!
17. క్షరం కానివే అక్షరాలు_రాహిత్యానికి సాహిత్యానికి మధ్యన వారధిగా...!!
18. శూన్యాన్ని నింపేయాలన్న కోరికే అక్షరాలకి_మనసుల వెలితిని పూడ్చుతూ...!!
19. యాగ ఫలం అందరిదీ_అక్షర సంచారం విశ్వాన్ని చుట్టినా...!!
20. వదల్లేనంటోందో పాశం_విషాదం నింపుకున్న కన్నీటిచుక్కతో చేరి..!!
21. ఘర్షణల మెరుపులే ఈ అక్షరాలు_చీకటికి వెలుగునందిస్తూ...!!
22. శబ్దంతో పనేముంది_మనసు పోరాటానికి, ఆరాటానికి...!!
23. వ్యక్తిత్వం వద్దనే ఉంది_అహానికి అనుబంధానికి మధ్యన...!!
24. కాలానికి కలాన్ని అప్పజెప్పేసా_అంతరంగాన్ని అక్షరాల్లో ఒంపేయమంటూ...!!
25. మనసులను కదిలించే నేర్పు అక్షరాలదే_మనిషిగా మనం మనగలిగితే...!!
26. బుజ్జగింపులు అవసరమే_వెలుతురు వాకిలి కనబడాలంటే...!!
27. కల'వరాల కాలమిది_గాయమే గతానిదైనా...!!
28. ఊరడించే ప్రయత్నమే ఇది_జ్ఞాపకాలుగా మిగుల్చుకుంటూ...!!
29. చీకటి చుట్టమే మెరుగు_వెలిసిన మనసుల రంగుల వెలుగులకన్నా...!!
30. బదులిస్తూనే ఉంది కాలం_కలలింకిన కనులకు కావలినంటూ..!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి