6, ఆగస్టు 2021, శుక్రవారం
జీవన 'మంజూ'ష..(ఆగష్టు )
నేస్తం,
ప్రతి మనిషి జీవితంలో చావు పుట్టుకలన్నవి సహజం. ఒక ఐదారేళ్ళ నుండి చూస్తున్నా...దగ్గర బంధువులని, రక్త సంబంధీకులని కూడా లేకుండా కనీసం ఆఖరి చూపులకు కూడా దూరంగా ఉంటున్న మన కుటుంబ బాధవ్యాలను చూసి గర్వపడాలేమెా. కనీసం మనిషి బతికున్నప్పుడు ఓ ముద్ద అన్నం ప్రేమగా పెట్టనివారు, చావుబతుకుల మధ్యన మనిషుంటే ఆస్తి కోసం వెంపర్లాటలు కొందరు, తన అహమే నెగ్గాలని మరి కొందరు, పై పై ప్రేమలు ఒలకబోసేవారు మరికొందరు...ఇవి నేటి మన నైజాలు.
పన్నెండేళ్ళకోమారు వచ్చే పుష్కరాలకు ఇంటి మనుషులకు పుష్కరాలు పెట్టడం కూడా అశుభమని భావించేవారు ఏవో కుంటి సాకులు చెప్పడం, ఆ కార్యాలకు పుట్టింటివారు జరపాల్సిన పెట్టుపోతలు ఏ సాకు చెప్పి తప్పించుకోవాలా అని చూసేవారు, మా ఇల్లు పెళ్ళిల్లు, మా ఇంట్లో చూలింత ఉంది, చనిపోయినవారిని చూడలేము, చూస్తే భయం.. ఇలా సవాలక్ష కారణాలు చెప్పి తప్పించుకోవడం ఫాషన్ అయిపోయింది. మంచి, చెడు ప్రతి
ఒక్క ఇంటిలోనూ జరుగుతాయి. ఈరోజు గడిచిపోయింది లెక్క కాదు, రేపనేది ఒకటుంటుందని మర్చిపోతే ఎలా?
మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ పలకరించలేదని, పరామర్శించలేదని బాధ పడితే సరిపోదు. మనమెంతవరకు ఆ పని చేస్తున్నామని మన మనస్సాక్షిని అడిగితే చాలు, సమాధానం దొరుకుతుంది. మాటయినా, మంచయినా ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది. పిండం పెట్టడమనేది పవిత్ర కార్యం. చెడు కార్యక్రమం అని మనం అనుకుంటే రేపటి రోజున మనకూ, లేదా మన ఇంటిలో చావనేది రాకుండా ఉంటుందా..! చావును ఆపగలిగే శక్తి మనకుందో లేదో తెలుసుకుంటే చావును గురించి ఇలా మాట్లాడం. మన మంచి చెడులు బేరీజు వేసేవాడు పైన ఒకడున్నాడు. వడ్డీతో సహా మన లెక్కలు సరి చూస్తాడు. మనం చేసే ప్రతి పనికి కాస్త కూడా అటు ఇటు కాకుండా మెుత్తం తిరిగి మనకే ఇచ్చేస్తాడు వాడు. ఏమీ ఉంచుకోడు. మనకేంటి అందరు ఉన్నారు, అన్ని ఉన్నాయన్న అహంతో ఉంటే వాడికి ఓ క్షణం చాలు..మనం చేసిన వాటికి మూల్యం చెల్లించడానికి. కనీసం కాస్త కూడా పాపభీతి లేకుండా పోయింది చాలామందికి. ఎందుకో ఈ బతుకులు మరి?
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి