1, ఆగస్టు 2021, ఆదివారం

మాట సమీక్ష

మాటే మనిషికి వరమూ..శాపమూ..!! 

       మాట రెండు అక్షరాలే కాని ఆ మాటలో దాగున్న జీవిత సత్యాలెన్నో. మన పంచమ వేదమైన మహాభారతంలోని పదునెనిమిది పర్వాలకూ ఉన్న విశిష్టత చిన్ని నారాయణ రావు గారు రాసిన "మాట" దీర్ఘ కవితకు ఉందనడంలో అసత్యమేమీ లేదని ఈ "మాట"ను చదివిన నాకనిపించడంలో విడ్డూరమేమి లేదు. పలుమార్లు సాహితీ వేదికల మీద చిన్ని నారాయణ రావు గారిని చూడటం, నేస్తం వారి మాటలు వినడం జరిగింది. నాకు అప్పుడు తెలియదు వారి మాటలు ఎందుకు అంత ఆచితూచినట్లుగా ఉంటాయెా. ఈ " మాట " దీర్ఘ కవిత చదివిన తర్వాతే మాటలోని మర్మం తెలిసింది.    
          మహభారతంలోని ఆది పర్వంలో చెప్పబడినట్లుగానే "మాట" పూర్వాపరాల గురించి, మాట ఔచిత్యం గురించి వివరిస్తూ పలువురు పెద్దలను, న్యాయస్థానములో మాట విలువను సూఛాయగా చెప్పడంతో మాట మెుదటి భాగం మెుదలౌతుంది. 

"మౌనం విజయానికి కాబోదు 
సంకేతం...
మాటే గురి పెట్టి నడిపే
మహోన్నత మార్గం "  
మాట విజయానికి సంకేతంగా మారడాన్ని, కొందరి కంచు కంఠాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతునే ఉన్నాయని, కళారంగంలో మాట ప్రాముఖ్యతను గుర్తు చేసారు. మాటే అన్నింటికి మూలమని మాటలోని గుట్టును కాస్త చెప్పారు.  
          కాలజ్ఞానం అందరికి చేరినా, మనకు వినోదాన్నిచ్చే చలనచిత్ర, నాటక రంగాలలో మాట వాడి, వేడి గురించి చెప్తూ, మాటలే మనసులను దోచే పాటలుగా మారడం, మాటే మన మిత్రుడు, శత్రువు కూడా అని చెప్తూ, మన తోడూనీడా మాటేనంటారు. మాట భావ ప్రకటన మాత్రమే కాదు మన వ్యక్తిత్వానికి ప్రతీక అంటారు. నిజమే కదా అది. మాట మనసు గాయాలను మాన్పే ఔషదమౌతుంది. కొడిగట్టిన ప్రాణాలను నిల్పే శక్తి మాటకు మాత్రమే ఉందంటూ, బతుకు చిరుగులను దాచే దివ్య ఔషదం మాటనడం చాలా బాగా నచ్చింది. 
          మాటే లోకం, మాటే మనిషిని నడిపించే యంత్రం, మాటే అన్నింటికి మూలమంటూ, మాటే మనిషిని అందలాలు ఎక్కిస్తుంది. ఆ మాటే మనిషిని అధఃపాతాళానికి తోసేస్తుందన్న హెచ్చరిక కూడా అంతర్లీనంగా చేస్తారు. 
         మట్టిభాష నుండి మహాభారతంలోని శ్రీమద్భగవద్గీత వరకు మాట గొప్పదనం గురించి గుర్తు చేస్తారు. అమ్మ మాటలోని ఆనందాన్ని, నాన్న పలుకులోని బాధ్యతను మనకు తెలియజేస్తూ, గురువు నేర్పిన చదువుతో.. బంధాలను, అనుబంధాలను అల్లుకున్న మాట మనిషికి జీవనాడిగా మిగిలిందంటారు. 
   ప్రేమ, ద్వేషం, బాధ, సంతోషం, కోపం ఇలా ప్రతి దానికి కారణమైన మాట మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. న్యాయాన్యాయాలను బేరీజు వేయడానికి, అమాయకత్వానికి, విరుచుకు పడే కడలి కెరటంలా మారడానికి మాటే కారణమంటారు. 
   మాట నిలబెట్టుకోవడం, మాట దాటటం వలను కలిగిన ఇబ్బందుల గురించి మనకు మరోమారు శ్రీరాముడి నుండి లక్ష్మణరేఖ దాటిన సీత, తదుపరి పరిస్థితులను ఒక్కమాటలో గుర్తు చేస్తారు. 
     పురాణ, ఇతిహాసాల నుండి మనిషి మనుగడకు మూలాధారమైన " మాట " ముత్యంలా మెరవాలన్నా, మురికి కూపంలో పడిపోవాలన్నా మాటే కారణమంటారు. 
         చక్కని అలతి పదాలతో రెండక్షరాల "మాట"ని పదునెనిమిది భాగాలుగా వివరించడం చాలా కష్టమైన పని. ఇంత కష్టమైన పనిని సుళువుగా చేసేసిన చిన్ని నారాయణ రావు గారికి హృదయపూర్వక అభినందనలు. 


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner