2, ఆగస్టు 2021, సోమవారం

కాలం వెంబడి కలం..65

      నేను ఆఫీస్ లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే హెచ్ ఆర్ మానేజర్ మిలి వెళిపోయింది. జయ హెచ్ ఆర్ మానేజర్ అయ్యింది. రిసెప్షనిస్ట్ జ్యోతి బాగా క్లోజ్ అయ్యింది నాకు. కబుర్లు చెప్పినా వర్క్ చేయిస్తున్నానని నాకు బోలెడు నిక్ నేమ్స్ కూడా పెట్టేసారు. వెనుక తిట్టుకున్నా నాతో అందరు బానే ఉండేవారు. సుబ్బలక్ష్మి బాగా క్లోజ్ గా ఉండేది. ఆఫీస్ రాజకీయాలు షరా మామూలే. అనురాధ నాతో బావుంటూనే తన అవసరం కోసం నామీద చెప్పడం చేసి మెుత్తానికి తన సాలరీ పెంచించుకుంది. నాముందు అరి కేసరి కూడా ఆవిడతో చాలా ఆత్మీయంగా మాట్లాడం చేసేవారు. మా సీనియర్ చెల్లెలు ఈవిడ. అరి కేసరికి గ్రీన్ కార్డ్ రావడం, అది నాకు చూపించడం, CMMi సర్టిఫికేషన్ కోసం ప్రయత్నాలు మెుదలు కావడం జరిగాయి. ఓ రెండు రోజులు ట్రైనింగ్ క్లాసులతో మెుదలుబెట్టి ఆ CMMi Level 3 సర్టిఫికేషన్ కోసం టీమ్ ఏర్పాటు చేసి, డాక్యుమెంటేషన్ మెుదలుబెట్టారు. విక్రమ్, ఆనంద్ డాక్యుమెంట్ రైటర్స్ గా వచ్చారు. అప్పుడే వాణి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆవిడ బిజినెస్ టీమ్ లో ఉండేవారు. మెుత్తానికి APSPD  sale ప్రాజెక్ట్ సంపాదించి, ఆ ప్రాజెక్టు కోసం విజయవాడ నేను, వాణి గారు, విక్రమ్, ఆనంద్ వచ్చాము. నాకు TA, DAల గురించి ఏమి తెలియదు. వాళ్ళు హోటల్ లో ఉన్నారు. నేను సాయంత్రం వరకు అన్ని పనులు చేసి ఇంటికి వచ్చేసాను ఆ రెండు రోజులు. నాకు అప్పగించిన పని నేను కరక్ట్ గానే చేసాను. అందరితో అప్లికేషన్స్ ఫిల్ చేయించి, అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకోవడం. అవన్నీ నా వంతు నేను చేసాను. తర్వాత వాళ్ళు లెక్కలేవో చూసుకుని నాకు ఓ 1000 రూపాయలు మాత్రం ఇచ్చినట్టు గుర్తు. 
           తర్వాత వైజాగ్ EPD sale ISO quality ఇన్స్పెక్షన్  కోసం అనూరాధ, నేను, విక్రమ్, ఆనంద్ వెళ్ళామనుకుంటా. వైజాగ్ నుండి విజయవాడ వరకు చూసుకుంటూ వచ్చాము. విజయవాడలో ఇంటికి తీసుకువచ్చి, ఆవిడని హైదరాబాదు బస్ ఎక్కించాను. ఆ తర్వాత ఆవిడ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎందుకులే అని నేను కాస్త దూరంగా ఉండేదాన్ని. CMMi కోసం నేను, అనూరాధ అన్ని చూసేవాళ్ళం. తర్వాత ప్రాజెక్ట్ మానేజర్ గా దుర్గ గారిని తీసుకున్నారు. మెుత్తానికి కష్టపడి cmmi Level 3 సర్టిఫికేట్ సంపాదించారు. తర్వాత పార్టీ కూడా ఇచ్చారు. ఆ పార్టీ లో మాకందరికి సర్టిఫికేట్స్ ఇచ్చారు. అప్పుడు సుబ్బరాజు ఇండియా వచ్చారు. నాకు స్టేజ్ మీద సర్టిఫికేట్ ఇస్తూ, మీతో మాట్లాడాలి తర్వాత కలవండి అని చెప్పారు. తర్వాత మాట్లాడినప్పుడు ఆఫీస్ విషయాలు అడిగితే జరిగిన విషయాలు చెప్పి, మీ జాగ్రత్తలో మీరుండండి అని చెప్పాను. నాకు సాలరీ చాలా తక్కువే ఇచ్చేవారు. సాలరీ విషయం నేను చూసుకుంటాను, మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి. అక్కడి నుండి నేను పంపిస్తాను అని చెప్పారు. కాని ఒక్క రూపాయి కూడా పంపలేదు ఎప్పుడూ.
         అమెరికాలో మా ఇంటి పక్కన ఉండే రెడ్డి అంకుల్ ఇండియా వచ్చి, నన్ను కలిసి తన ఇల్లు శ్రీనగర్ కాలనీలో ఉందని, అక్కడికి రమ్మని బలవంత పెట్టి, ఆ భూత్ బంగళాకు నా మకాం మార్చారు. వాణి గారి అపార్ట్మెంట్ కు దగ్గర అది. అప్పుడప్పుడూ నేను, వాణి గారు, జ్యోతి కొత్త సినిమాలకు వెళుతూ ఉండేవాళ్ళం. 
         అంకుల్ భూత్ బంగళాలో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉండేది. అయినా ఉండటానికి అలవాటు పడ్డాను. తర్వాత తర్వాత అంకుల్ అసలు రూపం తెలిసింది. హంట్స్ విల్ లో అందరు ఈయన గురించి చెప్పినవి నిజమని, ఆంటీ చెప్పిన ప్రతి మాటా నిజమని, ఈయన మూలంగానే ఆవిడ మైండ్ అలా అయ్యిందని, ఈయనే ఆవిడకు ట్రీట్మెంట్ చేయించకుండా అలా చేసారని అర్థం అయ్యింది. నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. 
     పిల్లల అల్లరి తట్టుకోలేక సరదాగా సమ్మర్ హాలిడేస్ లో విజయవాడ లో స్కేటింగ్ లో జాయిన్ చేస్తే  మౌర్య బాగా చేసేవాడు. శౌర్య అల్లరోడుగా, ఆటగా చేసేవాడు.  స్కేటింగ్ లో జాయిన్ చేసిన మూడు నెలలకే స్టేట్ కాంపిటీషన్ కి సెలక్ట్ అయ్యాడు మౌర్య. హైదరాబాదు అందరు సరదాగా వచ్చారు. అమ్మమ్మ, తాతయ్య కూడా వచ్చారు. మా పిన్ని వాళ్ళు BHEL దగ్గరలోఉండేవారు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు వీడి స్కేటింగ్ తోనే సరిపోయేది. వెళ్ళడానికి కుదరక తనను రమ్మంటే, తను, వాళ్ళ తోడికోడలు రాధక్క స్టేడియం దగ్గరకు వచ్చారు. దానికి ఆవిడ ఇప్పటికి దెప్పుతూనే ఉంటుంది వాళ్ళింటికి రాలేదని. తర్వాత వెళ్ళలేని పరిస్థితిలో కూడా కొత్తింటి ఫంక్షన్ కి అమ్మమ్మని తీసుకువెళ్ళినా అది గుర్తులేదావిడకు. చెప్తే చాలా ఉన్నాయి. ఎందుకులే అని ఊరుకోవడమే. మాటల్లో ప్రేమ చూపించడం కాదు చేతల్లో ఉండాలి.

" దూరం అనేది ఎవరికయినా ఒకటే. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యన  దూరం సమానమే. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 
    

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner