14, ఆగస్టు 2021, శనివారం

రెక్కలు

1.   ఏ ఆటైనా
ఆడేది
గెలవాలన్న 
కోరికతోనే

చావు పుట్టుకల సయ్యాటలో
గెలుపెవరిదన్నది తెలియక..!!

2.   వాస్తవానికి
అబద్ధం చేరికైంది
కాలంతో పాటుగా
నిజం కదులుతుంది

నాటకాలకు 
చివరి అంకం ఏమిటో..!!

3.   యుగాంతమౌతున్నా
మారని నైజాలే
క్షణాల మాయలో
మగ్గుతూ

కాలాతీతం 
కారణజన్ములకెరుక..!!

4.  చిరునవ్వుతో 
సమాధానం
మనసులోని 
మధనానికి ముసుగు

అంతర్నేత్రం
అందరికి ఉండదు..!!

5.  అబద్ధం
అందమైనదే
నిజం
భరించలేనిదే

సత్యాసత్యాల నడుమ
ఓ అక్షరమే తేడా...!!

6.   అంబరమూ
అనంతమైనదే
సంద్రమూ
అంతుచిక్కనిదే

ఏ ఆడంబరమూ
అక్కర్లేదు ఆత్మసౌందర్యముంటే..!!

7.  కాలానికి
తెలిసిన కబుర్లే అన్నీ
కలంతో
పని లేకుండా

మనసు చెప్పే
నిజాలవి...!!

8.   నిజమెప్పుడూ 
నిష్టూరమే
అబద్దమెప్పడూ
అందమైనదే

వాస్తవాన్ని ఒప్పుకునే నైజం
కొందరికే సొంతం..!!

9.  కొందరితో
అనుబంధమంతే
మరి కొందరితో
దగ్గర కాలేనంతగా

ఏ బంధానికి
ఏ వెసులుబాటో..!!

10.  అర్థమంతా
అందులోనే
మాటయినా
మనసయినా

తీరానిదే బంధమైనా
తీర్చుకునే బుుణానుబంధమై..!!

11.   ఎదను తడిమేవి
కొన్ని 
ఎదుట నిలిచేవి
ఎన్నో

సాధ్యాసాధ్యాలను
తెలిపేది కాలం..!!

12.   విరక్తి పెంచేవి
కొన్ని 
అనురక్తిని పంచేవి
మరికొన్ని 

జీవిత పుస్తకంలోని
పరిచయాల పుటలు..!!

13.   జవాబు తెలిసిన
ప్రశ్నలే అన్నీ
పరీక్ష రాయడం
అయిపోయాక

కడలి లోపల
ప్రశాంతత తెలిస్తే..!!

14.  వ్యక్తిగతం
జీవితం
వ్యక్తిత్వం
సహజ లక్షణం

సమాంతర రేఖల 
సారమే గమ్యం..!!

15.   విజయం
గుర్తింపునిస్తుంది
అపజయం
నీవారెవరో తెలుపుతుంది

జయాపజయాలు
దైవాధీనాలు..!!

16.   శిలగా మిగిలింది
మనిషే
మనసుని రాయిగా
మార్చేస్తూ

కదలికలు రావాలిక
అక్షర ఉలి స్పర్శతో..!!

17.   లెక్క
మారదెప్పడూ
మారేది
జవాబే

జీవితపు లెక్కల చిట్టా
అంతు చిక్కదెప్పుడూ..!! 

18.   తప్పటడుగులు
ఆనందం
తప్పుటడుగులు
వేదనాభరితం

తడబాటుల దిద్దుబాటే
జీవితం..!!

19.   రాయడం తెలియని
కలమూ కాదు
అమరికనెరుగని
అక్షరాలు కావు

మనసును సాంత్వన పరిచే
మనో విహంగాలివి..!!

20.  గాయం
మనసుకి
గురుతులు
కాయానికి

కాలం
నిమిత్తమాత్రం..!!

21.  నేర్చుకోవాల్సిన
అవసరమూ లేదు
తెలియజెప్పాలన్న 
కోరికా లేదు

కాలం విసిరిన క్షణాలు
కలం అందుకుందంతే..!!

22.   ఆడించేవాడు
ఆ పైవాడు
ఆడేది
జీవుడు

కాలం నేర్పే
వింత అనుభూతి..!!

23.  వెగటు పుట్టించేవి
కొన్ని 
వేదన మిగిల్చేవి
మరికొన్ని 

జీవితంలో
కొన్ని పరిచయాలంతేనేమెా..!!

24.   వదిలించుకోవాల్సినవి
బోలెడు
విదిలించాల్సినవి
మరిన్ని

మెుహమాటం 
మంచిది కాదు అన్నివేళలా..!!

25.   గొంతు 
పెగలినివి
మనసు
మెాయలేనివి

అక్షరాలకు మాత్రమే తెలిసిన
అద్భుత విద్యలు..!!

26.   పరిచయం
పాత బంధమనిపించాలి
విరక్తిని 
పెంచకూడదు

సమయం 
విలువైనదని గుర్తించాలి..!!

27.  అనుభవసారమే
అన్నింటికి మూలం
అమృతమేదో
విషమేదో తెలుసుకోవడానికి

ఈ జీవితం
షడ్రుచుల సమ్మేళనం..!!

28.   రాతి దెబ్బలు
మనసుకైన గాయాలు
వెంటాడే 
నిజాల నీడలు

మసక చీకటిలో
వెలుగు రవ్వలు అక్షరాలు..!!

29.   అపహాస్యాలు
వినబడినా
అవరోధాలు
వెన్నంటినా 

వెరవని మెుండితనం
ఈ అక్షరాలది...!!

30.   పంచుకునే
ఆత్మీయతలు
పెంచుకునే 
అనుబంధాలు 

అక్షరాలకు
తెలిసిన మక్కువ మరి..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner