16, ఆగస్టు 2021, సోమవారం

కాలం వెంబడి కలం..67


    నేను హైదరాబాదులో AMSOL లో వర్క్ చేసేటప్పుడే నాన్న శబరిమలై నడిచివెళుతుంటే యాక్సిడెంట్ అయ్యి, కాలు విరిగింది. NRI లో నరసరాజు అంకుల్ ఉన్నారని, అక్కడ ఆపరేషన్ చేయిస్తే, అది సెట్ అవక రెండుసార్లు చేయాల్సి వచ్చింది. అయినా సరిగా సెట్ కాకపోవడంతో మూడవసారి కూడా చేయాలంటే వద్దని, తునిలో నాన్న ఫ్రెండ్ కొడుకు ఉంటే అక్కడికి తీసుకువెళ్ళాం. ఆయన ఆపరేషన్ వద్దని చెప్పారు. అప్పట్లో ఓ నెల సెలవు పెట్టేసాను ఆఫీస్ కి. ఆరు నెలలు అమ్మ నాన్నని కాలు కింద పెట్టకుండా చూసుకుంది. తర్వాత అమ్మకి తేడా చేస్తే తనకి ఆపరేషన్ జరిగింది NRI హాస్పిటల్ లోనే. చిన్నప్పటి నేస్తం వాసు అనుకోకుండా స్వైన్ ఫ్లూ తో చనిపోవడమెా నమ్మశక్యం కాని విషాదం. అప్పటికే మౌర్యని గుడివాడ కే కే ఆర్ గౌతమ్ స్కూల్ లో 7 లో హాస్టల్ లో జాయిన్ చేసాము. ఎలాగూ జాబ్ మానేసానని శౌర్యని కూడా ఆ స్కూల్ లో జాయిన్ చేసి విజయవాడలో ఇల్లు రెంట్ కి ఇచ్చేసి గుడివాడ మారిపోయాము. 
             AMSOL లో జాబ్ మానేసే ముందే మా చిన్నప్పటి శిశువిద్యామందిరం అవనిగడ్డ బాచ్ అందరం కలవాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసారు. హైదరాబాదు వచ్చాకే చాలామంది చిన్నప్పటి ఫ్రెండ్స్ కలిసారు. అందరికి నేను గుర్తున్నాను కాని వసంతకి మాత్రం గుర్తులేను. లలిత, హైమ, అనురాధ, సాయి, చిట్టిబాబు, సత్యనారాయణ, రామకృష్ణ వీళ్ళంతా హైదరాబాదు లోనే ఉండేవారు. మిగతా వారంతా ఎక్కువగా అవనిగడ్డ, ఆ పరిసరాల్లోనే ఉండేవారు. జవహర్ బాబు ఢిల్లీ లో ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేస్తూ, సూర్యలంక ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు అప్పటికి. తను ఢిల్లీలో వర్క్ చేసేటప్పుడు ఓ రోజు మెయిల్ చేసాడు. నేను పలానా అని.. గుర్తు చేస్తూ. తను చిన్నప్పటి నుండి ఎక్కువగా ఎవరితో మాట్లాడేవాడు కాదు. బాగా చదివేవాడు. మేము అవనిగడ్డలో మెుదట్లో ఉన్నప్పుడు వీళ్ళింటికి దగ్గరలోనే ఉండేవాళ్ళం. వీళ్ళ అక్క, తమ్ముడు, చెల్లి, అందరం కలిసే స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. మనకేమెా నోటి మీద మూత ఉండేది కాదాయే. ఎంతసేపూ అల్లరి, ఆటలే. అవన్నీ గుర్తు వచ్చి, ఆ మెయిల్ చూసి చాలా సర్ప్రయిజ్ అయ్యాను అప్పుడు. అవనిగడ్డలో చిన్నప్పటి నేస్తాలను, గురువులను కలవడం మరపురాని మధురానుభూతే ఇప్పటికీ. 
    అప్పటికే మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కోసం ఫ్రీ వెబ్ సైట్స్ గురించి వెదుకుతూ, బ్లాగ్ అయితే బావుంటుందన్న కొందరి సలహాతో ట్రస్ట్ పేరుతో బ్లాగు ఓపెన్ చేసాను. తర్వాత నా రాతల కోసమన్నట్టుగా మరో బ్లాగు ఓపెన్ చేసాను. " నాలో నేను " అని పేరు పెడదామంటే అప్పటికే ఎవరిదో ఉందని చెప్పడంతో " కబుర్లు కాకరకాయలు " అని నామకరణం చేసేసాను. " సలహాలు చిట్కాలు " అన్న మరో బ్లాగు కూడా ఉంది. కాకపోతే " కబుర్లు కాకరకాయలు " మాత్రం ఇప్పటికి జీవించే ఉంది నా రాతలతో. అలా చిన్న చిన్న రాతలతో మెుదలైన నా రాతల వ్యాపకమే ఈరోజిలా మీ అందరి అభిమానం నాకందించింది. 

" కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తు చేసుకున్నా బావుంటాయి. " ఎందుకో మరి మీకూ తెలుసు కదా.

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner