4, ఆగస్టు 2021, బుధవారం
మనిషి - బాధ...!!
నేస్తం,
మనలో బాధ, భయం, అసహనం, కోపం ఇలా ఎన్నో రకాల భావాలుంటాయి. అన్ని చోట్లా అన్నింటిని చూపలేం. ఎదుటివారు మనల్ని బాధ పెట్టినప్పుడూ మనమే బాధ పడతాం. మన మూలంగా వారు బాధ పడుతున్నారని తెలిసినా మనమే బాధ పడతాం. దీనంతటికి కారణం మనసు. అది లేకపోతే ఏ గోలా లేదు.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టుగా, మన బాధలకూ బోలెడు కారణాలు. మహా భారతంలో శ్రీకృష్ణుడు చాలా తేలికగా బాధను త్యజించమని చెప్తాడు. ఎదుటివారి తప్పులను క్షమించమంటాడు. మనం క్షమించడమే వారి పతనానికి తొలిమెట్టు అని చెప్తాడు. చెప్పినంత సుళువు కాదుగా వదిలేయడం. పడేవాళ్ళకు తెలుస్తుంది. ఒడ్డున ఉండి రాళ్ళేయడమేముంది. పడినవాళ్ళను లేపడమే కష్టం.
సమస్యకు లొంగిపోవడం అనేది మన ఓటమి. గెలుపోటముల సంగతి పక్కనబెట్టి సమస్యతో పోరాడటం మన నైతిక విజయం. బాధ మనకే, శిక్ష మనకే అంటే ఎలా? బాధ పెట్టినవారికి ఆ బాధను తెలియజేయాలి. అంతే కాని మనమే బాధను భరిస్తూ ఉండకూడదు. శాంతి ప్రవచనాలకు, అనుభవాలకు చాలా తేడా ఉంటుంది. బాధ ఏ మనిషికైనా, మనసుకైనా ఒకటేనని ఎందుకు తెలుసుకోలేక పోతున్నాం? మనం వంద మాటలన్నప్పుడు ఎదుటివారు మాట అనగానే మనకు బాధ, కోపం వచ్చినప్పుడు, అదే పరిస్థితి ఎదుటివారికి వస్తుందని మర్చిపోతే ఎలా! వేలెత్తి చూపడం చాలా తేలిక. మిగతా నాలుగు వేళ్ళు మనల్నే చూపిస్తాయని మర్చిపోతాం. మనుష్యులం కదా, ఇది మన నైజం. మాట అనే ముందు ఆలోచించాలి. పడతూ ఉన్నారని పదే పదే అంటే...సమాధానం చెప్పడం చేతకాక కాదు, ఎదుటివారు మీకిచ్చిన విలువని గుర్తించండి. అహం, అధికారం మన ఆస్తులనుకుంటే, రేపటి రోజున కనీసం మంచినీళ్ళకు కూడా దిక్కు లేకుండా పోతుంది. ఇంటివారిని మానసికంగా, శారీరకంగా హింసించి, వారి ఆక్రోశానికి కారణమైన ఎవరూ బాగుపడరు.
" మన ప్రవర్తన గురించి మనం కాదు చెప్పుకోవాల్సింది. ప్రపంచం ఇచ్చే కితాబులకన్నా ఇంటి మనుష్యులు సంతోష పడితే సిరులన్నీ నీవే."
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి