30, ఆగస్టు 2021, సోమవారం

కాలం వెంబడి కలం... 69


    ఓ రోజు అనుకోకుండా ఈయన పని మీద బజారుకి వెళ్ళి వస్తూ, రాజేంద్రనగర్ లో విశ్వభారతి స్కూల్ కి దగ్గరలో ఓ ఇల్లు రెంట్ బోర్డు పెట్టి ఉంటే, చూసి ఓ 500 అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు. ఇంటికి వచ్చి విషయం చెప్పి, కిచెన్ చాలా చిన్నది మనకి చాలేమెా, ఓసారి చూసిరండని చెప్తే, ఎలాగూ అడ్వాన్స్ ఇచ్చేసారు కదా అని మారిపోదామన్నాము. ఇంటివాళ్ళకు చెప్తే కాస్త బాధ పడ్డారు. రాజేంద్రనగర్ లో అందరు తేడానేనని తర్వాత తెలిసింది. గుడివాడలో దోమలు బాగా ఎక్కువ. రోజూ బాట్ తో వాటితో యుద్ధమే. సామాన్లు సర్దుతూ, మంచం ఎక్కి దోమలు చంపుతుంటే కాలు జారి, నుదురు గోడకు కొట్టుకుని, గోడ మీద అచ్చు పడటం, నాకు తల దిమ్మ దిరగడం జరిగింది. దెబ్బ బాగా గట్టిగానే తగిలింది. గోడ గట్టిదనం, నా నుదురు గట్టిదనం బాగా తెలిసింది. కొత్త ఇంటికి మారేటప్పుడే సూచనలు కనబడినా మనం అంత లెక్క చేయలేదు. ఈ ఇల్లు బయటికి చూడటానికి బావుంది, కాని లోపల కన్వీనెంట్ గా లేదు. డ్యూప్లెక్స్ టైప్ లో కట్టుకున్నారు. తర్వాత వాళ్ళు పైనుంటూ కింద రెండు పోర్షన్లు చేసారు. మాకు పైన ఓ రూమ్, కింద ఓ రూమ్, హాల్ సగం మాకు, సగం పక్క వాళ్ళకి.  
              ఈ ఇంటికి దగ్గరలోనే మా ఊరి వాళ్ళు స్రవంతి, శిరీష కూడా ఉన్నారు. స్రవంతి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు హెల్ప్ చేసింది కూడా. ఇంటి వాళ్ళు మేం వచ్చాక వాళ్ళ రెండో అమ్మాయి అమెరికాలో ఉంటే, తన దగ్గరకి వెళ్ళారు డెలివరీ టైమ్ కి. అమ్మమ్మతో చలిమిడి చేయించుకుని వెళ్ళారు. మెుదట్లో చాలా బాగా మాట్లాడేది ఆవిడ. ఈ ఇంట్లోకి రాగానే చిన్నోడు శౌర్య స్కూల్ కి సైకిల్ మీద వెళుతూ, పడిపోయి పన్ను విరగ్గొట్టుకున్నాడు. అప్పటికప్పుడు ఆటోలో హాస్పిటల్ కి తీసుకువెళ్ళాం అమ్మా నేను. ఇంటివాళ్ళు 6 నెలలు లేకపోతే వాళ్ళ కరంట్ బిల్లులు కూడా నేనే కట్టేదాన్ని. వాళ్ళ పెద్దమ్మాయి లండన్ లో ఉండేది. ప్రతి సంవత్సరం 6 నెలలు వాళ్ళు వెళుతూ ఉండేవారు. మెాటర్ వేయాలన్నా పంపు బాగా కొట్టి మెాటర్ వేయాలి. బయట బోలెడు ప్లేస్ ఊడవడానికి. వర్షాకాలం ఎప్పుడూ పనే. ఇంట్లోకి నీళ్ళు వచ్చేసేవి. ఇంటివాళ్ళ కార్ బయటికి తీస్తే, అదంతా కడగాలి.  ఇలా చాలా పనే ఉండేది. ఇది చాలక పక్కింటి వాళ్ళ వేపచెట్టు ఆకులు, కాయలు, పండ్లు అన్నీ మాకే. ఏ కాస్త గాలి వేసినా బయట గచ్చంతా ఇసకే. వేసవి కాలంలో రోజుకు పది, పదిహేను సార్లు ఊడ్చేదాన్ని. 
          పక్క పోర్షన్ లో విశ్వభారతిలో పని చేసే టీచర్, వాళ్ళ పిల్లలు ఇద్దరు, అత్తగారు, మామగారు ఉండేవారు. తర్వాత కొన్ని రోజులకు అత్తగారు, మామగారు వాళ్ళ సొంత ఊరు వెళిపోయారు. మా ఊరి పిల్లలు బాగా దగ్గరగా ఉండేవారు. మా పిన్ని వాళ్ళమ్మాయి కూడా కొన్ని రోజులు బాబుతో మా ఇంటికి దగ్గరలోనే ఉండేది అమ్మమ్మ తాతయ్యలతో. 
     నేను హైదరాబాదు లో వర్క్ చేసేటప్పుడే మా అపార్ట్మెంట్ రెండోది అమ్మడం నాకు ఇష్టం లేకపోయినా ఓ దిక్కుమాలిన వాడి మాయలో పడి, బలవంతంగా అమ్మించి, ఆ డబ్బులు మెుత్తం బిల్డర్ కి ఇచ్చేసాడు. అంతకు ముందు నుండే  తన ఫ్రెండ్ కోసం కొన్ని సైట్లు అమ్మేయడం, వడ్డీలకు తెచ్చి డబ్బులు ఇవ్వడం చేసాడు. ఇంటి లోన్ కడతానని అది కట్టకపోవడంతో, మరో సైట్ అమ్మి ఇంటి లోన్ కట్టేసాము. అమ్మావాళ్ళు ఇచ్చిన బంగారమంతా బాంక్ లో పెట్టి మరొకరికి డబ్బులు కట్టాము. వీళ్ళుగా పెట్టిన బంగారం గొలుసు తప్ప మరేం లేదు. దానికే లక్షన్నర్ర అప్పని చెప్పి మూడున్నర్ర లక్షలు తీసుకున్నారు. ఇవి కాక మిగతా లెక్కలు చెల్లి, తమ్ముడు, చిన్నా చితకా చాలా అయ్యాయి అంతకు ముందే. మరో అక్క కొడుకు స్కూల్ ఫీజ్ ఓ సంవత్సరం కట్టడం ఇవన్నీ అమెరికాలో ఉన్నప్పటి లెక్కలు. అవి చాలక వచ్చిన దగ్గర నుండి వక్కలగడ్డ జనాలను ఉద్దరించాడు మాకు తెలిసి ఓ పాతిక లక్షల వరకు. తెలియకుండా ఇంకెన్నో మరి. డబ్బులిచ్చి ఆ బిల్డర్ చుట్టూ ఓ 8 ఏళ్ళు హైదరాబాదు చుట్టూ తిరిగి అసలు తెచ్చానని చెప్పాడు. 
         అప్పటికే అమెరికాలో నా ఫ్రెండ్ మధు దగ్గర ఈయన నాకు తెలియకుండా, వాళ్ళతో ఏదో చెప్పి 5 లక్షలు తీసుకున్నాడు. తర్వాత వాళ్ళు నాకు చెప్పడం, ఈయన వాళ్ళకు సమాధానం సరిగా చెప్పకపోవడం, నేను కొన్ని నెలలు వాళ్ళ కార్డ్ బిల్ 2 లక్షల వరకు వడ్డీ కట్టడం, తర్వాత మా మామయ్య దగ్గర వడ్డీకి తీసుకుని మధు వాళ్ళకు కట్టేసాను. అపార్ట్మెంట్ అమ్మినప్పుడు ఈ అప్పు, ఇంటి లోన్ కట్టేద్దామన్నా వినకుండా, ఇంటి లోన్ తో సహా మెుత్తం నేను చూసుకుంటానని చెప్పి, రెండు నెలల తర్వాత చేతులెత్తేసాడు. 
                పోని అసలైనా వచ్చాయి కదా ఇప్పుడన్నా ఆ అప్పులు కట్టేయమంటే వినకుండా కార్ కొన్నాడు. అంతకు ముందు స్కార్పియెా ఉండేది కదా. అమ్మకు ఆపరేషన్ ముందు బయాప్సి చేయించడానికి NRI హాస్పిటల్ కి వెళుతుంటే మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఈయన అంతకు ముందే మా ఊరిలో ఎవరో చనిపోతే వెళ్ళి దినం అయ్యాకా బయలుదేరి ఆ రోజే వస్తున్నాడు ఊరి నుండి. మాకు తెలియదు వస్తాడో రాడో. మేము డ్రైవర్ దిలీప్ ని తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరాం. ఏంటో ఆరోజు నేను ముందు సీట్ లో కూర్చున్నా. అమ్మ వెనుక  కూర్చుంది. దిలీప్ ని ఆయిల్ కొట్టించమంటే, దాటేసాం కదా అవతల కొట్టిద్దామని, కాస్త స్పీడ్ గానే డ్రైవ్ చేస్తున్నాడు. అప్పటికే అన్నాను కాస్త స్పీడ్ తగ్గించమని. హైవే రోడ్డు మీద మధ్యలో KLU బస్ ఆగి ఉంది. పక్కన ఖాళీ నుండి వెళిపోవచ్చని స్పీడ్ తగ్గించలేదు. బస్ దగ్గరికి వచ్చాక కాని తెలియలేదు. కాస్త పక్కన ముందు మరో బస్ ఆపుకుని ఇద్దరు మాట్లాడుకుంటున్నారని. KLU బస్ కి మాకు దూరం లేదు. దిలీప్ బ్రేక్ వెయ్యి అంటే సడన్ గా వేసాడు. అప్పటికే కార్ ఎగిరిపడి ముందు బస్ ని గుద్దేసింది. బస్ కి ఏమి కాలేదు కాని కార్ బాగా పాడయి పోయింది. కాస్త దూరంలో పెట్రోల్ బంక్ దగ్గర కార్ ఆపి చూసాడు ఏమైందోనని. నేను కార్ షెడ్ కి తీసుకు వెళిపో, మేము ఆటోలో వెళతామని చెప్పాను. కాదని దింపుతానని హాస్పిటల్ దగ్గర దింపాడు. ఈ కార్ హాస్పిటల్ వాళ్ళకి తెలుసు, కార్ చూసి ఏమైందోనని హడావిడిగా అందరూ కార్ దగ్గరకి వచ్చారు. మాకేం కాలేదని చెప్పి, దిలీప్ ని పంపేసాను ఓ 1000 ఇచ్చి. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా మాకేం కాలేదు కాని అమ్మకు మెాకాలు కొద్దిగా కొట్టుకుపోయిందంతే. కార్ కి ఎంత డామేజ్ అయ్యిందన్న ఆలోచన కూడా నాకు లేదప్పుడు. 9 కంతా హాస్పిటల్ లో ఉండమన్నారు, అమ్మకి ఏమౌతుందో అన్న ఆలోచనే నాదంతా. కనీసం కార్ వంక కూడా చూడలేదు. ఈయనకు ఫోన్ చేసి చెప్పి, కార్ షెడ్ కి పంపేసాను. ఆరోజే మౌర్యని గుడివాడ నుండి తీసుకురావాలి. ఈయనను అటు వెళ్ళమని, బయాప్సి అయ్యాక సాయంత్రం ఆటోలో అమ్మని తీసుకుని ఇంటికి వచ్చానప్పుడు. 

    " భగవంతుడు మన ద్వారా ఏమైనా చేయించాలనుకున్నా, లేదా మనం పడాల్సినవేమైనా మిగిలున్నా ప్రాణం పోనివ్వడు ఎంత ఆపద ఎదురైనా. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner