26, ఆగస్టు 2021, గురువారం

కాలం వెంబడి కలం...68


       
 
      గుడివాడలో ఇల్లు చూడటానికి వెళ్ళినప్పుడు, రాఘవేంద్రకు తెలిసిన వాళ్ళింటికి వెళ్ళాము. వాళ్ళింట్లో లిఫ్ట్ ఉంది. వాళ్ళింటికి దగ్గరలో ఓ ఇల్లు చూసాం, కాని నచ్చలేదు. తిరిగి విజయవాడ వచ్చేస్తూ స్కూల్ కి దగ్గరలో ఓ ఇల్లుంటే చూసి, అడ్వాన్స్ ఇచ్చేసాము. నేను, మా బేబి ఓ మంచిరోజు చూసి వెళ్ళి పాలు పొంగించి వచ్చాము. తర్వాత  విజయవాడ నుండి అవసరమైన సామానుతో మాత్రమే గుడివాడ వెళ్ళాము. ఆంటీ, బుజ్జి, రాజు(కుక్క) పైన ఉండేవారు. మేము కింద పోర్షన్ లో ఉండేవాళ్ళం. మెుదట్లో కాస్త భయపడ్డాం కాని తర్వాత తర్వాత వాళ్ళు చాలా బావుండేవారు.  తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, పిల్లలు, మేము అందరం అక్కడే ఉండేవాళ్ళం.
           అప్పుడప్పుడూ విజయవాడ వచ్చి, ఇల్లు క్లీన్ చేసి వెళుతుండేదాన్ని. తర్వాత ఓ రూమ్ లో మా సామాన్లు అన్నీ సర్దేసాం. డబల్ బెడ్ రూమ్ గా రెంట్ కి మా క్రిందింటి భారతి గారు మాట్లాడారు. ఒకావిడే ఉంటారని చెప్పారు. టాయ్లెట్ వెస్ట్రన్ స్టైల్ గా మార్చమంటే మార్చి, మెుత్తం ఇల్లంతా క్లీన్ చేయించి, లైట్స్ అన్నీ పెట్టించి ఇస్తూ, నాకు మళ్ళీ ఇలాగే మా ఇల్లు అప్పజెప్పండి అని అద్దెకు వచ్చే ఆవిడ కూతురికి, భారతి గారి ముందే చెప్పాను. సరేనని చెప్పింది ఆవిడ. కాని పేరుకి మాత్రమే ఒకావిడ. కూతురు కాపురమంతా ఇక్కడే. కొడుకు అమెరికా అమ్మాయిని చేసుకుని అక్కడే ఉంటాడు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కనీసం ముందు చెప్పకుండా, బాత్ రూమ్ లో, బయట లైట్లతో సహా పీక్కుని పోయారు. బయట మెుక్కలు పెట్టి మార్బుల్ అంతా పాడుచేసారు. చాలా చోట్ల టైల్స్ పగలగొట్టేసారు. వాష్ ఏరియాలో చెప్పుల స్టాండ్ పై రాయితో సహా పగలగొట్టేసారు. పోయే ముందు కనీసం మెంటెనెస్స్, కరంట్ బిల్ కూడా కట్టలేదు. ఉన్న మూడేళ్ళలో కరంట్ మీటర్ కూడ కాల్చేసారు. మేం గుడివాడ నుండి విజయవాడ వచ్చాక ఇల్లంతా రిపేర్లు, రంగులు  వేయించడానికి ఓ లక్ష పైనే అయ్యింది. ఇదీ మనం ఇల్లు అద్దెకిస్తే పరిస్థితి.
  ఇక గుడివాడలో ఉన్నప్పుడు అప్పుడప్పుడూ అమ్మావాళ్ళు మా ఊరు వెళ్ళినా ఇంటి ఆంటీ అమ్మా మంజూ సాయం చేయనా అని అడిగేవారు. మా పక్కింట్లో ఆవిడ కూడా గోడ మీద నుండి పలకరించేవారు. వారి పాప కూడా మా పిల్లల స్కూల్ లోనే చదివేది. చిన్నోడికి పుల్కాలు బాగా ఇష్టం. ఆవిడ ఓరోజు చాలా చేసి పంపారు కూడా. ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఇంజనీరింగ్ తర్వాత కలవని రఘు ఫోన్లో కలిసాడు. జొన్నవలసలో మాతో చదువుకున్న సాధూరావు తన ఫ్రెండ్స్ తో వచ్చి కలిసివెళ్ళాడు. జవహర్ బాబు కొడుకుని కూడా మౌర్యతో పాటే కె కె ఆర్ లో జాయిన్ చేసాడు. వాడు మౌర్యకన్నా ఓ సంవత్సరం ముందు. బాబుని చూడటానికి వచ్చినప్పుడు ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళాడు కూడా. బ్లాగు ద్వారా పరిచయమైన శివ కూడా వచ్చివెళ్ళాడు. అమ్మని చూడటానికి రాణి అక్కా, నాగభూషణం మామయ్య కూడ వచ్చెళ్ళారు. అప్పుడే మామయ్య అమ్మాయ్ ఓసారి అమెరికా వెళ్ళొద్దామంటే ఈ అమెరికా వాడు వీసా ఇచ్చి ఛావడం లేదన్నాడు. తర్వాత మేం విజయవాడ వచ్చేసాక రాణక్కా, మామయ్య అమెరికా వెళ్ళారు,  కాని మామయ్య ప్రాణాలతో తిరిగిరాలేదు. తను పని చేసే సిద్దార్ధ కాలేజ్ వాళ్ళు సెలవు ఇవ్వమన్నా పోట్లాడి మరీ, సంతోషంగా అమెరికా వెళ్ళిన మామయ్య తిరిగిరాని లోకాలకు వెళిపోయాడు. మా మధ్యన చుట్టరికం లేకున్నా, విలువైన స్నేహానుబంధం ఇప్పటికీ ఉంది. అయినవాళ్ళ పలకరింతలకు నోచుకోకున్నా ఆత్మీయంగా అక్క అప్పుడప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది ఇప్పటికి. మామయ్య ఇచ్చిన చిన్న మనీప్లాంట్ పెద్దదై ఇప్పటికీ మా ఇంట్లో ఉంది.

 " మనుష్యులు లేకున్నా కొందరి జ్ఞాపకాలు మనతోనే ఉండిపోతాయిలా. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...              

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner