13, ఆగస్టు 2021, శుక్రవారం

ఏక్ తారలు..!!

1.  సడలని ఆత్మవిశ్వాసమది_విరిగి పడుతున్నా లేవాలన్న అల ప్రయత్నంలో..!! 
2.  ఆనందం పంచినట్లుంది_అనంతాన్ని అక్షరాల్లో దాచేసినందుకు..!!
3.  అనుబంధం అల్లుకుంది_గతజన్మ పరిచయాన్ని గుర్తుజేస్తూ..!!
4.  అన్నీ ధన సంబంధాలే_బుుణానుబంధ రూపేణ..!!
5.  గతంతో ముడిబడిన గురుతులే ఇవన్నీ_ఇలా అక్షరాల్లో కనబడుతూ..!!
6.  మౌనమే మన మధ్యన బంధం_మాటల గారడీలకు స్వస్తి పలుకుతూ..!!
7.  మనసు భారమంతా కాగితానిదైయ్యింది_అబద్ధపు బతుకులతో వేగలేక..!!
8.   సంకటం వీడిపోయింది_మనసు బంధం గట్టిదనుకుంటా మరి..!!
9.   చిగురించే ఆశలకు రూపాలివి_చెదరిన కలలను సమాధానపరుస్తూ..!!
10.  నిట్టూర్పు దినచర్యలో భాగమే_వీడ్కోలు పలకడం రాని మదికి..!!
11.  అపనమ్మకమసలే లేదు_మనసు తెలిసిన అక్షరంపై..!!
12.  గురుతు చెరగనీయకుంది_మరపు తెలియని మనసు..!!
13.   మనిషి చాటు మనసుని నేను_బదులు పలుకని మౌనం నువ్వైనప్పుడు...!!
14.   మనసు పడ్డ హృదయమిది_నీ నిర్లక్ష్యాన్ని సహిస్తూ...!!
15.   అనుభవం సర్దిచెబుతోంది_మన తన తెలుసుకుని మసలుకొమ్మంటూ..!!
16.  అక్షరం మనసు వెలితిని మాయం చేస్తుంది_కడగండ్లకు కావ్యరూపమిస్తూ..!!
17.   అక్షరాలకు వెనకడుగు పడితే ఎలా?_అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలిగాని..!!
18.  మనసు మాయమైపోతోంది_అడుగంటుతున్న అనుబంధపు లెక్కలతో తూగలేక..!!
19.  ఓ జీవితకాలం సరిపోయింది_గుప్పెడు గుండెలో నిండిన జ్ఞాపక పరిమళంతో..!!
20.   ఆశలంతే_తీరకుండా మిగిలిపోతూ..!!
21.  ఆశయాలు అంతే_లక్ష్యాన్ని ఛేదించే దిశగా సాగిపొమ్మంటూ..!!
22.   సాధన సాంగత్యం అవసరం_విజయ రహస్యం తెలియాలంటే..!!
23.   తీర్చుకోవాల్సిన బాధ్యతలున్నాయి_ఎగతాళికి ఎదురు నిలువమంటూ..!!
24.  చెలిమిని పంచుకున్న భావాలవి_అక్షరాల అనుబంధానికి గుర్తుగా..!!
25.  ఆశ్చర్యం ఆరంగేట్రం చేసింది_అక్షరం క(కా)లంలో చేరిపోయిందని..!!
26.   ముగిసింది మాటలేగా_మనసెప్పడూ మమతలకు నెలవే...!!
27.   ఏ వాసనా తెలియడం లేదు_చీకటి మాత్రమే కనిపిస్తోందెందుకో...!!
28.   మనసు మనుగడ మరుగైంది_అవసరాల ఆటలో ఈ లోకంలో...!!
29.   స్వార్థానికి చేరువైంది ధనం_అనుబంధాన్ని ఆమడ దూరం నెట్టేస్తూ..!!
30.   ఎన్ని ఆటుపోట్లో మనసుకు_వదలక వేధిస్తూ..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner