18, నవంబర్ 2021, గురువారం
రెక్కలు
16, నవంబర్ 2021, మంగళవారం
అగాధపు అంచుల్లో..!!
14, నవంబర్ 2021, ఆదివారం
చీకటి సంతకం..!!
ఈ సువిశాల ప్రపంచంలో
ఏ దారెటు పోతుందో తెలియని
అమాయకపు అస్తిత్వానికి
ఆత్మాభిమానం కూడదంటూ
అన్నింటా ఆంక్షల పర్వాలను
అనాది నుండి లిఖించేసి
మనుగడకు మరో దారి లేదన్నప్పుడు
నొసటిరాతను తిరగ రాయడానికి
ఒంటరి పయనం తప్పదని
ఓటమి పాఠం రుచినెరిగి
గెలుపు తలుపు తట్టాలన్న
ప్రయత్నానికి నాందిగా
అలుపెరగని అక్షర పోరాటంలో
అడ్డుగోడలెన్ని ఎదురైనా
కదలికలను ఆపలేని కలం
కాలాన్ని వడిసి పట్టేసి
నిన్నలను దాటేయాలనుకుంటూ
ఈరోజును ఆసరా చేసుకోవాలని
ఆత్ర పడుతున్న మనసును
వేగిరపాటు వద్దని గదమాయిస్తూనే
గగనానికి ఎగరాలనుకున్న
బతుకు బావుటాను చిదిమేస్తూ
రాలిపడుతున్న వెలుతురుపూలపై
రాసిన చీకటి సంతకాలెన్నో..!!
11, నవంబర్ 2021, గురువారం
నే చెప్పేదేటంటే..!!
9, నవంబర్ 2021, మంగళవారం
జీవన మంజూష డిసెంబర్
నేస్తం,
ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేసింది నిజమే కాని దీని మూలంగా మనమేంటన్నది కూడా తెలిసిందన్నది సత్యం. ఓ చెడు మరో మంచికన్నట్టుగా కొందరి నిజ స్వరూపాలను బయటేసింది కరోనా. డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరమన్నది కాదనలేని వాస్తవం. ఇప్పుడు రక్తసంబంధాలను, అనుబంధాలను కూడా కాలరాసే కిరాతకమైనది కూడ ఈ ధనమే అయినందుకు సంతోషపడాలో, బాధపడాలో తెలియని పరిస్థితి.
ఏ తల్లి తన బిడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి ఇష్టపడదు. కొన్ని అనివార్య కారణాలతో బిడ్డకు తల్లి, తల్లికి బిడ్డ దూరమవడం విధి నిర్ణయం. మన పెద్దలు చెప్పిన మాట అసలుకన్నా వడ్డీ ముద్దు ఒకప్పుడు. ఇప్పుడు అన్నింటికన్నా డబ్బే ముద్దు. ఈ భూమ్మీద జ్ఞాపకాలను, గురుతులను మనిషికి మాత్రమే దేవుడు వరంగానో, శాపంగానో ఇచ్చాడు. వదులుకోలేని బంధాలకు, బంధుత్వాలకు తిలోదకాలిచ్చేస్తున్నాం డబ్బు బంధానికి చిక్కుబడిపోయి. మనిషి సృష్టించిన ధనమాయలోనే జీవితాలు వెళ్ళదీసేస్తున్నాం.
బిడ్డ దూరమైనా ఆ బిడ్డనే కాదు, బిడ్డ జ్ఞాపకాలను కూడా ఏ తల్లీ మర్చిపోదు. అలాంటిది ఈనాడు మనం చూస్తున్న సమాజంలో డబ్బు కోసం పసిగుడ్డును కూడా రోడ్డు మీద వదిలేస్తున్న వికృత మనస్తత్వాలు ఎన్నో కనబడుతున్నాయి. బిడ్డ చనిపోతే ఆ బిడ్డ బిడ్డను కూడా గాలికి వదిలేయడం నేటి సంస్కారమైపోయింది. కనీసం జంతువులు, పక్షులకున్నంత బాధ్యత కూడా మనలో కరువైపోయింది. మన విజ్ఞానం మనకేం నేర్పిందన్నది ప్రశ్నార్థకమై మిగిలిపోయింది.
ఈ ప్రకృతిలో మరే ఇతర ప్రాణులకు ఇవ్వని ఎన్నో అవకాశాలను దేవుడు మనిషికి ఇచ్చాడు. కాని మనిషి రానురానూ మానవత్వాన్నే మరిచిపోతున్నాడు. చుట్టాలకు, బయటివారికి సహాయం చేయడం మాట పక్కనుంచితే, రక్తసంబంధాలనే కాసుల కోసం కాదనుకునే అనాగరికతను ఆవాహన చేసుకుంటున్నాం. పద్మశ్రీ పురస్కారాలు, డాక్టరేట్ పట్టాలు మనకు డబ్బును, గౌరవాన్ని సంపాదించి పెట్టవచ్చు. కాని ఆత్మీయతలను, అనుబంధాలను దగ్గరకి చేర్చలేవు. వస్తూ ఏమీ తీసుకురాము. పోతూ ఏమీ తీసుకుపోము. బతికిన ఈ నాలుగు రోజులు అవసరాలకు డబ్బులు కాని అవసరమే డబ్బుగా మారిపోయిన సమాజం మనదైనందుకు గర్వపడటం మినహా మరేం చేయలేం. ప్రకృతి విలయాలు మనకు ఎన్ని పాఠాలు నేర్పినా మారని మన నైజాలకు నివాళులర్పించేయాలని వుంది. ఓ మనిషితనమా నీ చిరునామా కాస్త చెప్పవూ..అంటూ ఎలుగెత్తి పిలవాలని వుంది.