ఈ సువిశాల ప్రపంచంలో
ఏ దారెటు పోతుందో తెలియని
అమాయకపు అస్తిత్వానికి
ఆత్మాభిమానం కూడదంటూ
అన్నింటా ఆంక్షల పర్వాలను
అనాది నుండి లిఖించేసి
మనుగడకు మరో దారి లేదన్నప్పుడు
నొసటిరాతను తిరగ రాయడానికి
ఒంటరి పయనం తప్పదని
ఓటమి పాఠం రుచినెరిగి
గెలుపు తలుపు తట్టాలన్న
ప్రయత్నానికి నాందిగా
అలుపెరగని అక్షర పోరాటంలో
అడ్డుగోడలెన్ని ఎదురైనా
కదలికలను ఆపలేని కలం
కాలాన్ని వడిసి పట్టేసి
నిన్నలను దాటేయాలనుకుంటూ
ఈరోజును ఆసరా చేసుకోవాలని
ఆత్ర పడుతున్న మనసును
వేగిరపాటు వద్దని గదమాయిస్తూనే
గగనానికి ఎగరాలనుకున్న
బతుకు బావుటాను చిదిమేస్తూ
రాలిపడుతున్న వెలుతురుపూలపై
రాసిన చీకటి సంతకాలెన్నో..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి